Krishna |
శ్రీకృష్ణావతరణము - ఆసాంతము
శ్రీకృష్ణావతారము (శ్రీకృష్ణ జననము కాదు)
రచన - చెరకు మోహనరావు
ఇది మాకు తెలిసినదే కదా! మళ్ళీ ఎందుకు సోది అని తలచి అసలు ఈ ప్రచురణను చూడకుండానే ఉండిపోయేవారు అధికముగా వుంటారు అని తలచి కూడా నిరుత్సాహపడి నీరుకారిపోక యధాశక్తి చదువరులకు తెలియని కొన్ని విషయములతో కూడిన ఈ 'శ్రీకృష్ణావతరణము' అన్న భాగవత దశమస్కంధ ఖండమును క్లుప్తముగా మీ ముందుంచుచున్నాను. ముందుగా ఒకమాట అక్షరములకు సంబంధించి తెలుపుకొంటాను.
ఋ,ఋా, ఌ, ఌా అన్న అక్షరాలలో ఌ, ఌా లు లుప్తమయిపోయినాయి. నేను పైన వ్రాసిన 'క్లుప్తముగా' అన్న పాదములో 'క్లు' అన్న అక్షరము 'క కు ఌ వత్తు ఇవ్వవలెను. కానీ మనకు క్లు వ్రాయుట వాడుకయైపోయినది. అదేవిధముగా 'కృష్ణ' అన్న పదములో 'ఋ' వత్తే ఇవ్వాలి అంటే 'కృ' అనే వ్రాయవలె. 'క్రి' అనిగానీ ' క్రు' అనిగానీ వ్రాయరాదు.
ఎందుకంటే ఈ 'ఋ' అన్న అక్షరమును గానీ 'ఌ' అన్న అక్షరమును గానీ ఉచ్చరించునపుడు మన దవడలు లేక చెంపలు కదిలించకుండా ఆయా శబ్దములను పలుకవలెను. అప్పుడది అటు 'క్రి' కాకుండా ఇటు 'క్రె' కాకుండా పలుకవలసి వస్తుంది. 'క్రు' అన్న ప్రస్తాపనే రాదు.. అది శుద్ధ తప్పు. అందుకే ఛందస్సులో కూడా 'ఇ, ఈ, ఎ, ఏ, ఋ' లకు యతి మైత్రి కలదు. 'ఌ' వాడకము భాషలోనే తక్కువ కాబట్టి అది కాలాంతరములో లుప్తమై పోయినది. కనీసము 'ఋ' నన్నా మిగిలించుకొందాము. అక్షరాలూ ఎక్కువయ్యేకొద్దీ పదమును స్పుటముగా పలుకుటకు వీలవుతుంది. ప్రపంచ భాషలలో ఆ సౌలభ్యము తెలుగునకు మాత్రమే వుంది.
రెండవది 'శ్రీకృష్ణ అవతరణ' మెందుకు? జననము ఎందుకు కాదు? కృష్ణ మాయ అన్న పదము మనము వింటూనే ఉంటాము. కావున ఆయన పుట్టుట గిట్టుట అంతా మాయే. ఆయన మనవలె బ్రహ్మచేత సృజింపబడలేదు. అట్లు సృజింపబడితేనే అది పుట్టుక. పుట్టుక వుంటే చావు తప్పదు. కావున ఆయన బోయ శిలీ ముఖముచే (అంటే బాణపు ములికి తో) తనువూ చాలించినాడు అంటే తిరిగి తన లోకమునకు జనినాడు. ఆ విధముగా ఆయన జనన మరణములకు అతీతుడు కాబట్టి ఆయనది 'అవతరణము' లేక 'అవతారము'. మరియొక ముఖ్యమైన విషయము ఏమిటంటే కృష్ణుడు ఉన్నాడు అంటే వేమ్బవేమ్బడి మాయ ఉన్నది అనియే అర్థము.
భాగవత దశమస్కంధమునకు సమీపించుటకు మునుపు యాదవుడు అన్న విషయమును కాస్త తెలుసుకొని సాగుదాము.
చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||
అన్నాడు పరమాత్మ భగవద్గీతలో.నేనిపుడు దీని విశ్లేషణ చేయుటలేదు. ఒక్క మాట మాత్రము చెబుతాను. శాస్త్రము ప్రకారము వైశ్య వర్ణమునకు వ్యవసాయము వాణిజ్యము నిర్దేశింపబడినది. వ్యవసాయము అంటే పాడి పంట. ఈ విషయమును జ్ఞాపకము వుంచుకొంటూ నందుని గూర్చి మరియు చంద్రవంశపు రాజవంశాములగు యాదవ, పురు వంశాములను గూర్చి తెలుసుకొందాము.. ఆ విషయాలను గూర్చి తెలుసుకొంటే కృష్ణుడు ఎందుకు రాజ్యాభిషేకము చేసుకోలేదో తెలిసివస్తుంది.
కార్త వీర్యార్జనుడు చంద్రవంశమువాడు. కామధేను వంశాంకురమైన కామిత దాత యగు ధేనువును, పరశురాముని తండ్రి జమదగ్నిని హింసించి తీసుకుపోగా పరశురాముడు ఆతనిని వధించి ధేనువును తిరిగి తెస్తాడు. జమదగ్నిని, పరశురాముడు లేనిసమయములో కార్తవీర్యార్జనుని కుమారులు సంహరించగా, ఆయన శవముపై బడి ఆయన భార్య యగు రేణుక ఇరువదియుక్కమారులు గుండె బాదుకొన్నదట. అందుకు గానూ ఇరవైఒక్క మార్లు దండయాత్రలు జేసి దుష్ట భూపతులనందరినీ దునుమాడినాడు. అసలు విష్ణువు యొక్క ఈ ఆరవ అవతార కారణమే అది. అట్లయి కూడా కొందరు రాజులు తప్పించుకోనగలిగినారు. వారిలో కార్తవీర్యార్జనుని సంతతివారిలో ఒక ఐదుమంది, శ్రీరాముని తండ్రి దశరథుడు మొదలుగాగలిగిన మరికొందరు రాజులు తప్పించుకొన గలిగినారు.
ఆవిధముగా తప్పించుకొన్న కార్తవీర్యార్జనుని వారసులగు చంద్రవంశపు రాజులలో యయాతి చక్రవర్తి శుక్రాచార్యులవారి కూతురగు దేవయానిని పెళ్లాడుతాడు. పిల్లలను కూడా కన్న తరువాత, ఆమెకు తెలియకుండా ఆమె స్నేహితురాలైన శర్మిష్ఠ ద్వారా కూడా పిల్లలను కంటాడు. ఈ విషయము తెలిసిన దేవయాని బాధా హృదయముతో వెళ్లి తండ్రి చెబుతుంది . ఆయనకు ఆగ్రహోదగ్రుడై నీకు తక్షణం వార్ధక్యం దాపురించుగాక' అని శపించుతాడు. యయాతి వృద్ధుడై పోయినాడు, కానీ ఆవేశము తగ్గిన పిదప తన పొరబాటుకు చింతించినాడు శుక్రాచార్యుడు. యయాతి కూడా తన బలహీనతకు బాధపడినాడు. శుక్రాచార్యుని కాళ్ళపైబడినాడు తనను క్షమించమంటూ. 'అల్లుడు ముసలివాడైతే తన కూతురి సంగతేమిటి' అన్న ఆలోచన స్పురణకు వచ్చింది. ఆయన అప్పుడు ఈ వార్ధక్యాన్ని నీకు సహజమగు ముసలితనము వచ్చు వరకు నీ పుత్రులలో ఎవరైనా స్వీకరించి వారి యవ్వనమును నీకు యిస్తే వెంటనే నీకు యవ్వనము సిద్ధిస్తుంది. నీవు దేవయానీ శర్మిష్ఠలతో సుఖించవచ్చు. ఆ తరువాత యవ్వనాన్ని నీకప్పగించిన కుమారునికి తిరిగీ ఇచ్చివేసి, నీ వార్ధక్యమును నీవు పొందవచ్చు.' అని శాపవిమోచన మార్గమును తెలిపినాడు.
యయాతి కొంతకాలము ఆ అకాల వార్ధక్యమును అనుభవించి కుమారులు యౌవనావస్థకు వచ్చిన పిదప సిగ్గు విడిచి వారిని ఒక్కొక్కరిగా అడిగినాడు. 'వెయ్యి సంవత్సరాల తర్వాత నీ యౌవనం తిరిగి నీకు యిస్తాను. ఇంకా వరాలు కూడా ఇస్తాను.' అని దేవయాని జేష్ఠపుత్రుని మొదట అడిగినాడు. అతని పెద్ద కొడుకగు యదువు ‘ఇది శాస్త్ర విరుద్ధము కావున నేను అధర్మ మార్గమును అంగీకరించలేను’ అన్నాడు. దానితో యయాతి నీ వంశస్తులకు ఎన్నటికీ రాజ్యార్హత వుండదు. మీరంతా గోరక్షకులై బ్రతకండి.'' అని శాసించినాడు. అలాగే తన మాట కాదన్న తక్కిన కొడుకులను కూడా శపించినాడు. చివరకు అతనికున్న ఐదుగురు కొడుకుల్లో శర్మిష్ఠకు పుట్టిన పురువు అనేవాడు తన తండ్రి మాటకు సమ్మతించినాడు. అందుచే అతనికి వేయి సంవత్సరాల తర్వాత యయాతి తదనంతరం రాజ్యం దక్కింది. కురుపాండవులు అతని వారసులే. పెద్ద కొడుకైనా యదువుకు దక్కలేదు.
యయాతి శాసనాన్ని యదువంశ వారసులు అందరూ పాటించలేదు. యదువు పెద్ద కొడుకైన సహస్రజిత్తు మనుమడు హేహయుడి నుండి హేహయ వంశం పుట్టింది. వారిది మాహిష్మతి రాజధాని. ఆ వంశంలో కార్యవీర్యార్జునుడు ప్రసిద్ధుడు. యదువు రెండో కొడుకు క్రోష్టువు వంశంలో విదర్భుడు ప్రసిద్ధుడు. యీతని వంశమునకు చెందినా భీష్మకుని కుమార్తెయే రుక్మిణి. క్రోష్టువు తక్కిన వారసుల ద్వారా భోజ వంశము, కుకుర వంశము, అంధక వంశము, వృష్ణి వంశము, సత్రాజిత్తు అంటే సత్యభామ తండ్రి ఈ వృష్ణి వంశమువాడే! చేది వంశము అంటే శిశుపాలునిది యీ వంశమే! కృష్ణుడి పితామహుడైన శూరుడు (శూరసేనుడు) సంప్రదాయాన్ని పక్కకు పెట్టి మధుర రాజ్యాన్ని పాలించినాడు. ఈతను కార్తవీర్యార్జనుని సంతతివారిలోని ఆ ఐదుమందిలో శూరసేనుడు మధురను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన సాగించుతూ ఉండేవాడు. అసలు ఆ మధుర ఎటువంటిదయ్యా అంటే “శ్రవణే మధురా నయనే మధురా పురతో మధురా పరతో మధురా మధురా మధురా మధురా మధురా” అని చెప్పబడింది. ఎందుకంత మధురము అంటే ‘యత్ర సన్నిహితో హరిః తత్ర మధురా మధురా’ హరికి అంత సన్నిహితమైనది కావున అది మధురముగాక వేరేమౌతుంది. అందుకే అది మధుర అతి మధుర అని పెద్దలు చెబుతారు. ఆ శూరసేనుని కుమారులలో ఒకరు వసుదేవుడు. కూతుళ్లలో ఒకరు పృథ. ఈ పృథను శూరుడి బావ అయిన కుంతిభోజునికి పిల్లలు లేకపోతే దత్తత ఇచ్చినారు. ఆమె అతని పేర కుంతిగా ప్రసిద్ధి కెక్కింది. పాండవులకు తల్లి అయి కృష్ణుడికి మేనత్త అయ్యింది. శూరుడి తర్వాత రాజ్యం చేసే అవకాశం వసుదేవుడికి వచ్చింది. కానీ అతను తమ పూర్వీకుడు యయాతి శాసనాన్ని మన్నించి రాజ్యం కాదన్నాడు. భోజవంశంలోని ఉగ్రసేనుడికి రాజ్యం ధారపోసినాడు. తను మంత్రిగా వున్నాడు. అందువల్ల శూరసేనుని రాజ్యమగు మధురను ఉగ్రసేనుడు పాలించుట జరిగినది.
భాగవతముననుసరించి వసుదేవునికి పదునాలుగు మంది భార్యలు. వారు
1) భోజవంశమున పుట్టిన దేవకుని కుమార్తెలు 7గురు 1. ధృతదేవి 2. శాంతిదేవి 3. ఉపదేవి 4. శ్రీదేవి 5. దేవరక్షిత 6. సహదేవి 7. దేవకీదేవి
మరియు
2) పురువంశమున పుట్టిన 7గురు
1. సారవి 2. రోహిణి 3. మధిరా 4. ఆది 5. వైశాఖి 6. భద్ర 7. సునామ్నీ
వారిలో రోహిణి పెద్దదిగా కొందరు చెబుతారు. నారదమహర్షి రోహిణికి 'నీ భర్త మారుమనువు చేసుకుని, నీ సవతికి బిడ్డలు పుట్టిన పిదప నీకు పిల్లలు పుడతారు.'అని చెబుతాడు. చివరకు ఆవిధముగానే వసుదేవుడు దేవకిని పెళ్ళియాడుట జరుగుతుంది.
దేవకీ వసుదేవుని చివరి భార్య. ఉగ్రసేనుని తమ్ముడగు దేవకుని కుమార్తె ఈమె. వసుదేవుని వల్ల రాజయిన కారణముగా తనకు కుమార్తెలు లేనందున, కృతజ్ఞతా పూర్వకముగా తన తమ్ముని కుమార్తెను వాసుదేవునకు మనువాడ నిచ్చియుండవచ్చు. ఆ సమయమున అతని కుమారుడు కంసుడు మధుర యువరాజు. అప్పుడు మగధను పాలిస్తున్న జరాసంధ చక్రవర్తి కూతుళ్లయిన అస్తి, ప్రాప్తిఅన్న కన్యలను తనకు సామంతరాజ్యమైనా కూడా కంసుని బలపరాక్రమములను గుర్తించి యిచ్చి పెళ్లిచేసినాడు.
ఇక భాగవత దశమస్కంధమున తిరిగీ కృష్ణ జననమునకు వస్తాము. భాగవతము గభీరమగు అర్థములు కలిగిన శబ్దములు అందు ప్రయోగింపబడినవి. అందుకే ‘భాగవతం శాస్త్రం’ అన్నారు. అంతవరకు, తొమ్మిది స్కంధములద్వారా అనేకులగు రాజుల చరిత్రలను శుకయోగీంద్రులవారు జరిగిన తొమ్మిది స్కందములలో కథల రూపములలో చెప్పిన అనేకానేక తత్త్వ రహస్యములను తదేకముగా విని ఆకళింపు చేసుకొన్న పరీక్షిత్తు, భక్తి జ్ఞాన వైరాగ్యములు పొంది, అత్యంత ఉత్సాహవంతుడై తన కోరికను అణచుకోలేక శుకయోగీంద్రులతో “ఇక రాజుల కథలు ఆపివేసి శ్రీ కృష్ణుని గూర్చి తెలుపండి అనుట సంస్కారవంతమగు మాట కాదు కావున ఎందఱో రాజకుల కథలను విన్ననాకు ‘అంశేనావదీర్ణస్య’ అన్న మాటను ప్రయోగించుట జరిగింది. ‘అంశేనుడు’ అన్న మాటను కాస్త విశ్లేషించుకొందాము. అంశేనుడు అంటే ‘అంశి’యై పుట్టినవాడు. మిగతా అవతారములు అంశలు మాత్రమె. భగవానుడు అంశి. అంటే ఇక్కడ ఆయన ‘అంశి’ గా నే పుట్టినాడు. ఈ విధముగా కాకుండా ఈ మాటకు ఇంకొక విధముగా కూడా అర్థము చెప్పుకోనవచ్చును. ఈ అవతారమున భువిపైకి వచ్చినవాడు ‘అంశలకు ఇనుడు అంటే సూర్యుడు’. ఎంత నిగూఢమగు అర్థము ఇమిడివుందో చూడండి. ఈ విధముగా వ్రాయుట సామాన్యులకు సాధ్యమా! ద్రష్టలకు మాత్రమే ఈ ఘనత దక్కుతుంది. కృష్ణ కథామృతమును గ్రోల అత్యంత ఆసక్తుడై, పరీక్షిత్తు “వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్ధధానాయ విస్తృతం” “ మహానుభావా శ్రీకృష్ణ కథామృతమును గ్రోల మిక్కిలి ఆసక్తితో కూడిన శ్రద్ధ కలిగియున్నాను. దయతో విస్తృతముగా తెలియజేయండి” అన్నాడు. మోక్షమును సంపాదించవలెనని ఎంతటి తపన, ఎంతటి ఆపేక్ష, ఎంతటి ఆతురత ఆమహానుభావునికి. ఇక్కడ ధ్యాస ధ్యానము ఒకటైనాయి. మోక్షము రాక వేరేమి రాగలదు. పరీక్షిత్తు జిజ్ఞాస చూసి నేను యీతడు కోరే విషయములనన్నింటిని సంతృప్తి కలుగు విధముగా చెప్పగలనా అన్న సందేహము పొడసూపినది శుకయోగీంద్రునికి. దానినట్లుంచి దయాపూర్ణ చిత్తుడగు శుకయోగీంద్రులవారు పరీక్షిత్తుతో నాయనా, నేను నీకు భాగవతము వినిపించబట్టి ఇది ఐదవరోజు. గత నాలుగు దినములుగా నీవు పచ్చిగంగ కూడా ముట్టకుండా కథా శ్రవణమును గావించుతూనే వున్నావు. గుక్కెడు మంచినీళ్ళయినా పుచ్చుకొమ్మని ఆప్యాయతతో అడిగినాడు. అందుకు పరీక్షిత్తు ‘కర్ణ రసాయనంబగు కృష్ణ కథ వినునట్టి శ్రోతకు ఆకలి దప్పులు ఉండవని మీకు తెలియనిదా మహానుభావా అంటూ ‘వినా పశుఘ్నాత్’ అన్న పదాన్ని వాడుతాడు.
ఈ మాటకు ఎంత అర్థ గాంభీర్యము ఉన్నదో గమనించండి. వినా అంటే కాకుండా అంటే, అట్టివారు కాకుండా, మరి ఎట్టివారు అంటే పశుఘ్నాత్ పశువులను విషశనము చేసే వారు అంటే పశువులను చంపేవారు అంటే పశుబలి చేసేవారు అంటే యజ్ఞ యాగాది క్రతువులు చేసేవారు ఈ భక్తి జ్ఞాన మార్గమును అనుసరించనివారు ఆకలి దప్పులు కలిగియుంటారుఅని ఒక అర్థము. ఇంకొక అర్థము ఏమిటంటే ‘వినా+అపశుఘ్నాత్’. అపశుక్= న+పశుక్, అంటే దుఃఖము లేనిది అని అర్థము. అంటే సుఖదుఃఖాలకు అతీతమయినది ఆత్మయే కదా! ఆవిధముగా ద్వంద్వములకు అతీతమగు ఆత్మ కలిగినవాడు ‘అపశుక్కు’ అనబడుతాడు. అంటే అపశుక్కులు కానివారంతా ఆకలిదప్పులు కలిగియుంటారు. మీ శిష్యుని అయినట్టి నేను అపశుక్కునయిపోయినాను కావున నాకు ఆకలిదప్పులు అంటవు అని సవినయముగా మనవిచేసుకొన్నాడు. ఇంతటి సంస్కారవంతమగు మాటలు మాట్లాడుటకు పెద్దల, మహనీయుల సాహచర్యము లేనిదే సామాన్యునికి సాధ్యమా! ఎంతో పురాతనమగు సంస్కృతి కానిదే, ఎంతో సంస్కారమును పొందనిదే, ఇంతటి ప్రియభాషణము చేయుట సాధ్యమా!
యోగీంద్రా! పుట్టక మునుపే అసువులబాయవలసిన నన్ను కాపాడిన ఆ పరమాత్ముని గూర్చి వినుటకు తహతహలాడుచున్నాను. ఈ సమయమున శ్రీ కృష్ణ పరమాత్ముడు అచట చేరి, ఆయన శుకయోగీంద్రులవారి ఆత్మలో ప్రవేశించి అంతర్హితముగా శుకునికి మాత్రమే ఆత్మ బోధగా “నాయనా శుకా ఇంవరకు తొమ్మిది స్కందములను నీవే చెప్పుకొంటూ వచ్చినావు. ఈ దశమస్కందమును నీరూపములో నేనే తెలియజేస్తాను” అన్నాడట. ఆమాటను వ్యాస భాగవతములో మనము ఈ విధముగా వినవచ్చును.
వైయ్యాసకిస్సభగవాన్ అథ విష్ణురాతం ప్రత్యర్చ కృష్ణ చరితం కలి కల్మషఘ్నహంఅంటే వ్యాసకుమారుని రూపములో ఇప్పుడు పరమాత్ముడే కూర్చోనియున్నాడు. ఆయన విష్ణురాతునితో, అతని ప్రశ్నకు సమాధానముగా ఈ విధముగా అంటున్నాడు. “ వాసుదేవ కథాన్ ప్రశ్నః పురుషాన్ త్రీన్ పవే పునాతి |” “నాయన చాలా జిజ్ఞాసతో కృష్ణచరితమును వినగోరుచున్నావు. దీనిచే అడిగిన నీకు, చెప్పిన నాకు, ఈ సమావేశములో కూర్చొని వింటూవున్న సకల సభాసదులకూ కలిదోషము అంటక మొక్షార్హులగుదురు.” అని అంటున్నాడు.
కథ ప్రారంభించాబోతూ శుకమహర్షి ఈవిధముగా చెప్పుచున్నాడు. రాక్షస భారముచే మరియు రాక్షస భావముచే రాజులు ఇటు ప్రజలకు అటు పృథ్వికీ కంటక ప్రాయులై భూమిపై సృష్టించిన నరకమును సహించలేక దేవ గణముతో, భూమాత ధేనువు రూపములో బ్రహ్మను ఆశ్రయించి శరణు వేడింది. ఇందు మనకు వచ్చే సందేహమేమిటంటే గో రూపములోనే భూమి ఎందుకు బ్రహ్మ వద్దకు వెళ్ళినది. నిరుక్తము (నిఘంటువు, Dictionery) ప్రకారము భూమికి ‘గౌః,క్షమ, మహి, క్షమా, భూః, భూమిః, అవని, ధాత్రి..... ఇత్యాది 21 పేర్లున్నాయి. అందులో మొదటిది ‘గౌ’ శబ్దము. ఈ ‘గౌ’ శబ్దము నుండినే ఆంగ్లమున ‘Cow’ అన్న పేరు ఆవునకు కలిగింది. కానీ ఈ శబ్దమునకు సంస్కృతములో, భూమి, ఆవు అనియే కాక, వేదము అన్న అర్థము వున్నది. శ్రీకృష్ణుడు అసలు గోలోకవాసి అనికూడా పురాణ వచనము.
తిరిగీ విషయమునకు వస్తే ఆవునకు ఏ జీవికీ లేని ఒక ప్రత్యేకత వుంది. కొడితే ఏ జీవియైనా అరుస్తుంది, తిరగబడుతుంది. కానీ మిక్కిలి సాదు జంతువగు ఆవును ఎవడైనా దుర్మార్గుడు కొట్టినా అది ‘అంబా’ అని అరువదు, దెబ్బ సహించగలిగితే కదలదు, అట్లు కాకుంటే ఆచటినుండి పరుగెత్తి పోతుంది. లేదంటే కంట తడి పెట్టుకొంటుంది. ఇటువంటి క్షమాగుణము భూమికి కూడా ఉన్నందువల్ల భూమిని కూడా ‘గౌ’ అన్నారేమో! భారతములో కూడా వస్త్రాపహరణ సమయములో ద్రౌపది గోవు వలె విలపించిందట. ఈ విధముగా కూడా ఆవు మనకు ఆదర్శ ప్రాయము పూజనీయము అగుచున్నది.
ఆవిధముగా బ్రహ్మ వద్దకు వెళ్ళిన భూమాత దేవతలతో కలిసి బ్రహ్మదేవుడు శివుని వద్దకు వెళితే ఆయన కూడా వెంటరాగా ‘జగన్నాధుడు, దేవదేవుడు, వృషాకపి’ యగు విష్ణు మూర్తి వద్దకు వెళ్ళినారు. ఇక్కడ మూడు విశేషణాలను విష్ణువునకు వాడుట జరిగినది. మొదటిది జగన్నాథ అంటే ఈ ప్రపంచమునకు నాథుడు. ఈ పదము ఎందుకు అంటే ఇపుడు ఆ పరమాత్మ ముఖ్యముగా కాపాడవలసినది మానవాళిని, ప్రాణికోటిని. ‘దేవదేవ’ అన్నపదము ఎందుకంటే ఆయన సకలదేతలకు అధిపతి. పైగా రాక్షస బాధ వారుకూడా అనుభవించుచున్నారు. ఇది కాకుండా దేవతలకు దేవత అంటే ఈయన కూడా వారిలో ఒకడై వారికి అధిపతియై వున్నాడు అన్న అర్థమును ధ్వనిస్తుందేమోనని ‘వృషాకపి’ అన్న మాట వాడటం జరిగింది.
వృషాకపి అంటే ‘వర్షత్ అభీష్టమితి వర్షః’ కోరిన కోరికలు తీర్చేవాడు అని అర్థము ఇది కాక ‘క’ అంటే సుఖము, ‘ఆక’ అంటే ‘న+క’ అంటే దుఃఖము ప అంటే రక్షించేవాడు. కావున ‘వృషాకపి’ అంటే కోరికలను తీర్చేవాడు మరియు బాధలను పోగొట్టేవాడు. ఎంతటి నిగూఢార్థమున్నదో చూడండి. ఇది మహావిష్ణు స్వరూపుడగు వ్యాసులవారికి తప్ప అన్యులకు సాధ్యమా! బ్రహ్మాది దేవతలు భూదేవి ఋషి మునులతో కూడిన సమూహము పురుష సూక్త విదానముగా పరమాత్మను వాగ్రూపమున ప్రస్తుతించగా ఆయన కూడా వాగ్రూపముననే సృష్టికర్త యగు బ్రహ్మకు తన అభిప్రాయమును వివరించినాడు. ఆ సందేశమును బ్రహ్మ తనతో వచ్చిన వారికి వివరించినాడు.
గాం పౌరుషీం మే శృణుతామరాః
విదీయతామాసు తధైవమాచారం పురైవ పుంసామవధూతః
పురుషుడు అన్న మాటకు పరమాత్మ అన్న అర్థాంతరమున్నది, కావున బ్రహ్మ ‘స్వామీ ముందుగానే లీలామానుష విగ్రహుడు గోపాలుడై గోకులములో అటు గోవులను, ఇటు భూమిని ఆపై వేదములను తనయొక్క ఆర్తత్రాణ పరాయనత అన్న గోవులచే రక్షించుతాడు అని స్వామీ ఉపదేశమును సంగ్రహముగా చెబుతూ, మీరుకూడా మీ మీ సహకార భూమికలలో భూమిపై వెలయవలసియున్నది అని తెలియజేసినాడు. . ఇక్కడ పాఠకుడు ‘గౌ’ శబ్దమునకు ఆవు, భూమి, వేదము, కిరణము అన్న అర్థములు కలవని తెలుసుకోనవలసియున్నది. అల్ప పదములతోనే అనల్ప భావమును సృష్టించిన మహనీయులు నాటి రచయితలు ద్రష్టలు అగు ఋషివర్యులు..
ఈ మాట చెబుతూ బ్రహ్మ ఇంకొక మాటగూడా అన్నాడు.‘వాసుదేవ కలానంతః సహస్ర వదనః స్వరాట్’ అంటే వాసుదేవుని కళ అంటే ఒక అంశ అయినటువంటి అనంతుడుకూడా అక్కడ ఆవిర్భవిస్తాడు. ఇంకొక అర్థమును చూడండి. వాసుదేవ అంటే వాసుదేవునకు ‘క’ అంటే సుఖమును ‘ల’ తెచ్చునట్టి ఆదిశేషుడగు అనంతుడు ‘అగ్రతో భవిత’ పరమాత్మునకు అగ్రజునిగా అక్కడ ఆవిర్భవిస్తాడు, అని బ్రహ్మ చెప్పినాడు. ఇవిగాక ఇంకా యోగమాయ కూడా ఆవిర్భవించనుంది. ఈవిధముగా భూదేవికి చెప్పి ఆమెకు ఆశ్వాసమును కలిగించినాడు.. ఈ మాటను శ్రీ కృష్ణుడు బలపరచుటకు ఈవిధముగా చేసినాడా అన్నట్లు, బాల్యమున పరమాత్మ దోగాడే వయసులో తన ఎడమ చేతిని భూమికి ఆనించి కుడిచేయి పైకి ఎత్తినాడట అంటే భూమిని తాకి ధైర్యము చెబుతూ ‘నేను వచ్చినాను, ఇకనీకు భయములేదు’ అని అభయమిచ్చినాడట. ఈ భంగిమలో మా కాలములో calendars కూడా అచ్చొత్తించేవారు.
ఈ కంసుడి చెల్లెలు దేవకిని మనువాడి వసుదేవుడు స్వగృహమునకు జను సమయంబున కంసుని ఆకాశవాణి అష్టమగర్భం గురించి హెచ్చరించడం జరిగిన విషయము పాఠకులకు తెలిసిందే కావున ఆ విషయమును విస్తరించకుండా ఒక మాట తెలియజేస్తాను. కంసుడు తక్షణమే దేవకిని వధింప బూనుకొంటాడు.
ఇందులో గల దేవరహస్యమును నేను చదివినదానినిబట్టి అర్థము చేసుకొన్నది తెలియజేస్తాను. ఎప్పుడయితే అమితమగు ఆనందముతో చెల్లెలిని బావతో సహా అత్తగారింటికి తీసుకుపోతున్నాడో దేవతలకు పెద్ద సందేహము వచ్చినది. ఈ దుష్టుడు ఈ విధముగా ఆ దంపతులపై అభిమానము చూపిస్తే పరమాత్మ జన్మించు సమయమునకు వైరమేర్పడదుగదా అని వారిలోవారు తర్కించుకొని అశరీరముగా ఒకే కంఠమై వినిపించురీతిగా ‘ఏ దంపతుల అష్టమ గర్భ జనితుడు నీకు ప్రాణాంతకుడౌతాడు’ అని చేబుతారు. తక్షణము, కోపము భయము, విస్మయము పెనకొనగా దేవకి జుట్టుపట్టుకొని లాగుతాడు. అన్న అంటే ప్రేమ, గౌరవము, భయములను కలబోతగా గలిగిన దేవకీ మౌనముగా ఆ అకృత్యమును సహిస్తుంది. కానీ వసుదేవుడు కంసుని ఎన్నోవిధముల ఆపని అధర్మమని చెబుతూ ఈ విధంగా ప్రార్థించుతాడు ‘ఏషా తవ అనుజ బాల కృపణ పుత్రకోపమా’ ఈమె నీ చెల్లెలు, పసిపిల్ల, అతి దైన్యమును వహించియుంది, ఈమె నీకు పుత్రికతో సమానము’.
అట్లు చేయుట తగదని ప్రార్థిస్తూ ‘దీన వత్సలా’ అని సంబోధిస్తాడు. దీనుల పాలిట వాత్సల్యమును జూపువాడా అని అర్థము చేసుకొని వదిలి వేస్తాడన్నది పైకి కనిపించే అర్థము. ఆంతరంగికముగా ‘దీన’ అంటే దీనమైనట్టి ‘వత్స’ శిశువులను ‘ల’ అంటే గ్రహించేవాడా లేక అపహరించేవాడా అని అర్థము. రచన అంటే ఇది కదా! భగవాన్ వేదవ్యాసునికిదే సాష్టాంగ దండప్రమాణము. ఈ అంతరార్థమును మనకు తెలియజేసిన మాన్యవరుడు వంశీధర శర్మ అను మహానుభావుడు.
ఎనిమిదవ గర్భమును విచ్చిక్తి చేసినా, గర్భజనితుని చంపినా సరిపోతుందిలే అనుకొని వసుదేవ దంపతులను చెరసాలలో బంధించి ఉంచుతాడు. వసుదేవుడు ఆపదను గుర్తించి తన భార్యలగు రోహిణిని మొదలగు వారిని వ్రేపల్లెలోని నందగోకులమునకు పంపుతాడు. నారదుడు లోకహితము కోరినవాడై కంసుని వద్దకు వచ్చి దేవకీ అష్టమగర్భము వల్ల హాని యని ఆశరీరవాణి తెల్పినది కానీ ఈ ఎనిమిదిని ఎంచుట కుడినుండి ఎడమకా ఎడమనుండి కుడివైపుకా అన్న విషయము చెప్పలేదు. అంతేకాక ఎనిమిది శిశువులనూ ఒక వలయముగానేర్పరచితే ఎవరయినా ఎనిమిది కావచ్చు. అందువల్ల అసలు ఏ ఆపదా రాకుండా గర్భాజాతులనందరినీ మట్టుపెట్టమని సలహా ఇస్తాడు. దుష్టుడు శిశుహత్యా పాతకమును కూడా కట్టుకోవలేనన్నది అసలు ఉద్దేశ్యము. ఆవిధంగా కంసుని కత్తికి ఆరుమంది బలియైపోయినారు. ఆ దుష్టుడు అంతటితో ఆగక తండ్రి ఉగ్రసేనుని చెరలో బంధించి తననే రాజుగా ప్రకటించుకొన్నాడు. తనకు ఆప్తులయినట్టి ప్రలంబ, చాణూర ముష్టిక, శల తోశల, ధేనుక తృణావర్త, పూతన లను రాబిలచి వారితో ఈ అష్టమ గర్భబాధా నివృత్తి ఎట్లు చేసుకొనవలెనని సంప్రదిచినాడు. తానెప్పుడు కబురంపినా తక్షణమే వచ్చు రీతిగా వారికి ఆదేశములను అందజేసినాడు.
ఇక దేవకీ దేవి యొక్క ఏడవ గర్భమును గూర్చి తెలుసుకొందాము. దేవకి అన్న మాటకు వ్యుత్పత్తి ఏమిటంటే ‘దేవానాం, ఖంసుఖం యయా సదేవకి’ దేవతలకు అనిర్వచనీయమగు ఆనందమును కలిగించేది దేవకి. ఎట్లంటే దేవతలకు మానవులవలె స్వయంకృతమైన శారీరిక మానసిక బాధలు వుండవు, ఏ రాక్షసులవల్లనో కలిగితే తప్ప. ఆ కష్టాలను కూడా తీర్చుటకు పరమాత్ముని తల్లియగుటకు భూమోపై అవతరించినది దేవకి. ప్రహ్లాదుని వంటి భక్తులు పుడితే దానిని శోభన కాలము అంటారు. అదే పరమాత్ముడే పుడితే మహాశోభన కాలము అంటారు. ఆతల్లి ఆ మహాశోభన కాలమునకు ఆలవాలమైనది.
ఇది ఇట్లుండగా ఆరుగురు శిశువులను హతమార్చిన పిమ్మట దేవకి సప్తమ గర్భమును దాల్చినది. పరమాత్మను యోగమాయ ఎప్పుడూ అనుసరించియే వుంటుంది. ఆయన ఆజ్ఞానువర్తియై నడచుకొంటుంది. మరి మాయ వేరు యోగమాయవేరు అని తలువవలెనా అన్న సందేహము మన మస్తిష్కములో మెదలుతుంది. అవును ఆ రెండూ వేరు అన్నదే జవాబు. మాయ వున్నది లేనట్లుగా లేనిదీ ఉన్నట్లుగా స్ఫురింపజేస్తుంది. కానీ యోగమాయ, ఉన్నదానిని ఉన్నట్లే ఉంచి దానిని అదికాదు ఇది అని తలపింపజేస్తుంది. ఇపుడు ఈ ఏడవ గర్భము యొక్క ఉదంతమునే తీసుకొందాము. పరమాత్మ చేత ఆజ్ఞాపింపబడి యోగమాయ దేవకీ దేవి గర్భస్త శిశువును తీసుకొని నందగోకులములోని వసుదేవుని భార్య యగు దేవకీ గర్భములో ఉంచింది. కానీ ఈ యోగమాయా ప్రభావముచే అసలు రోహిణి ఏ విధముగా గర్భవతి అయినది అనిగానీ అందుకు సంబంధించిన ఇతర విషయములపై గానీ ఎటువంటి సందేహములూ గోకులములోని ఎవరికీ కలుగనేలేదు, ఇటు గర్భాస్రావమెట్లు జరిగింది అని కారాగారపు కాపలాదారులకు కూడా సంశయము రాలేదు.
యోజన చేసే లక్షణము అంటే ఏవిధముగా కూర్చబడినది అన్న స్పృహ ఎదుటి వారియందు కలుగనీక చక్కగా కూర్చు గుణము కలిగినది కాబట్టి యోగమాయ అన్నారు. యోజనము అంటే Planning లేక ప్రణాళిక అన్న అర్థము మనకు తెలిసినదేకదా! దేవకీ దేవి గర్భమునుండి ఆకర్షించి రోహిణీ దేవి గర్భమునందు ఉంచుట చేత అంటే గర్భ సంకర్షణము జరుగుటచే రోహిణీ గర్భస్త శిశువునకు ‘సంకర్షణుడు’ అన్న పేరు వచ్చినది. ఈయన జన మానస రంజకుడౌతాడు కాబట్టి ‘రాము’నిగా వ్యవహరిపబడుతాడు. బలవంతుడగుటచే ‘బలుడు’ అని కూడా పిలువబడుతాడు.
ఇది పరమాత్మ యోగమాయకు చెప్పిన మాట కాబట్టి గోకులములో రోహిణికి సంబంధించిన వారి మనసులో ఈ మాటలు నాటునట్లు యోగమాయ చేసింది.
ఈ సందర్భములో యశోదా-నందుల గూర్చి కాస్త తెలుపవలసివుంటుంది.
యశోదా నందులు పూర్వజన్మలో ధరా ద్రోణులనే పుణ్యదంపతులు. భర్త శాస్త్ర పారంగతుడు. బ్రాహ్మీ ముహూర్తమున నిద్రనుండి లేచి తన నిత్యానుష్ఠానములను పూర్తిచేసుకొని సమీపములోని పట్టణమునకు వెళ్లి, భిక్షాటన చేసి, ఆవచ్సిన దానిని అతిథి అభ్యాగతులకు నివేదించిన పిమ్మట మిగిలిన దానిని మాత్రమే ఆదంపతులు ప్రసాదముగా స్వీకరించేవారు. మిగులనినాడు కేవలం జలముతో బ్రతికేవారు. ఒకనాడు వారి ఆశ్రమమునకు వారిని పరీక్షించుటకు, పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతులవలె, శ్రీహరి వారి పుత్రునివలే రూపములను ధరించి వచ్చినారు. తల్లిదండ్రులకు ఆకలితో శోష వస్తున్నదని చెప్పి ఆబాలకుడు మూర్చతో పడిపోయినాడు. అప్పటికి భర్త తిరిగిరాలేదు. వారికి ఇచ్చుటకు తమ వద్ద ఏమీలేదు. ఎప్పుడూ బయటకు వెళ్ళని ధరాదేవి పట్టణములోని అంగటికి సరకులు తెచ్చుటకు వెళ్తుంది. తన వద్ద మాంగల్యము తప్ప ధనమువేరేలేదనీ, ముగ్గురు అతిథులకు సరిపడ దినుసులు ఇమ్మని దుకాణదారుని ప్రార్థించుతుంది. అతడు వారుచేసేది వ్యాపారమని, సరుకులకు బదులుగా ధనమునుకాని, లేకున్న దానికి తగ్గట్టుగా అంగడి యజమాని కోరినది ఇవ్వవలెనని చెబుతూ ఆమె అందమును అడుగుతాడు, ఆమె వక్షస్థలమువైపు ఆశగా చూసిన ఆ దుర్మార్గునికి అప్పుడామె అక్కడ ఉన్న ఒక కత్తిని తీసుకొని తన స్తనమును కోసి వానివైపు పడవేసి రక్త ధారలతో ఇంటికిచేరి అతిథుల పాదాలపై ప్రాణావశిష్ట స్థితి లో పడుతుంది. వచ్చిన వారు తమనిజ స్వరూపాలతో ఆమెకు ప్రత్యక్షమై ఆమెకు పూర్వస్థితిని ప్రాప్తింపజేస్తారు. శ్రీహరి ఆమె రక్తధారకు బదులుగా అపారమైనక్షీరధారను ఇస్తానని తానే శిశువుగా అదిస్వీకరిస్తాననీ చెబుతాడు. ఆ దంపతులే యశోదానందులుగా ద్వాపరంలో జన్మిస్తారు.
యదువంశజుడగు మథురానగరపు రాజు 'దేవమీఢుఢు' అను అతనికి ఇద్దరు భార్యలుండిరి. వారిలో ఒకరు క్షత్రియవంశమునకు చెందగా మరియొకరు వైశ్యవనిత. క్షత్రియవనితకు శూరసేనుడు, వైశ్యస్త్రీకి పర్జన్యుడు జన్మించుతారు. పర్జన్యుడు తనమాతృ (వైశ్య) వంశ ప్రభావమును అనుసరించి, గోపాలకుడుగా ఉండిపోదలచుతాడు. అతడు యమునానదికి ఆవలితీరమున ఒక వనమునందు స్థిరనివాసమును ఏర్పరుచుకొంటాడు.
మథురామండలమునందలి గోసంపదకు ఇతడు సర్వాధికారిగా ఉంటాడు. నందుడు ఈపర్జన్యుని కుమారుడు. శూరసేనుని కుమారుడు వసుదేవుడు. ఆ విధముగా వారు అన్నదమ్ముల పిల్లలగుటచే వారిది అన్నదమ్ముల అనుబంధము. వారు అత్యంత ఆత్మీయతతో మెలగేవారు. తొమ్మిది లక్షలు, అంతకన్నా మించిన గోసంపదను గలిగిన వారిని నందుడు అంటారు. అంత ఆత్మీయత, ఆప్యాయత అనురాగము ఉండుటచేతనే రోహిణి మొదలగు తన సతీమణులను వాసుదేవుడు నందగోకులమునకు పంపుతాడు. ఈ విషయము ముందుగానే తెలిపినాను.
ఇక శ్రీ క్రిష్ణావతరనమును గూర్చి మాట్లాడుకొందాము. స్వాయంభువ మన్వంతరంలో దేవకీ వసుదేవులు ప్రజాపతి యగు సుతపుడు. ఆయన ధర్మపత్ని పృశ్ని. వీరిద్దరూ ఆకులములు తింటూ 12వేల దివ్య సంవత్సరములు విష్ణువును గూర్చి తపస్సు చేయాగా స్వామి ప్రత్యక్షమయి ఏమి వలయునని అడిగితే “నీలాంటి కొడుకు కావాలి” అన్నారు. అప్పుడు భగవానుడు నాలాంటి వాడు నేను తప్ప ఇంకొకడు వుండడు. మీకు నేను మూడు మార్లు కొడుకుగా పుడతాను. ఒకమారు నేను మీకు పృశ్నిగర్భునిగా, రెండవ మారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా, ఇంద్రునికి అనుజునిగా, మూడవ జన్మలో కృష్ణభగవానునిగా పుడతానని చెప్పినాడు ఆ మహావిష్ణువు.
తాము చేసిన పూర్వపుణ్యకర్మల ఫలముగా, సుతప పృశ్ని దంపతులు దేవకీ వసుదేవులు కాగా, దేవకి గర్భాశయంలో ఆపరాత్పరుడు ప్రవేశించి ఆమెకు అఖండమైన అనుభూతిని ప్రసాదించినాడు. దివ్యమగు తేజస్సుతో దేవకి దినకర ప్రభాభాసమానయై ప్రకాశించినది. కంసుని యంతటివాడు చెరసాలలో దేవకీ దేవిని గమనించి ఈమె స్త్రీ, నాకు సోదరి, గర్భవతి అని అనుకొన్నాడు. ఈమెను ఇపుడు చంపకూడదు అని తలచినాడు. అప్పుడేమో ఇవేమాటలు వాసుదేవుడు చెబితే తనను శాంతింపజేయుటము జరిగినది. ,ఇప్పుడు తానే చెప్పుకొంటున్నాడు. పుట్టబోయే వాడు పరమాత్ముడే అని తెలుసుకోనుటయేకాదు దేవకీ వసుదేవులకన్నా పరమాత్ముని పుట్టుకకు ఆతురతగా ఎదురు చూస్తూవున్నాడు. ఇది ఆ పరాత్పరుని లీలావిలాసము. ఆయన కల్పించిన యోగమాయా ప్రభావము. శత్రువునకే దురాలోచనలు దూరముచేసిన, దేవకీగర్భములో ఉన్న దేవదేవుని త్రిశతిదేవతలు, త్రిమూర్తులు అదేపనిగా వచ్చి చూసి తన్మయులై స్తోత్రం చేసినారు.
‘ఏకాయనోతు, ద్విఫలః, త్రిమూలః, చతూరసః, పంచవిధః, షడాత్మ, సప్తత్వపు, అష్టవిధపః, నవాని కరణ, దశ చ్చదః. వ్యాసులవారు వ్రాసిన ఈ శ్లోకమునకు తెలుగులో మహాత్ముడగు పోతన గారు ఈ విధముగా అనువాదము చేసినారు. (ఈ పద్యమును భావార్థమును యథాతథముగా భాగవత గణనాధ్యాయి గారి ‘పోతన తెలుగు భాగవతము’ నుండి గ్రహించినాను. వారి కృషికిదే నమస్కారములు.)
ప్రకృతి యొక్కటి పాదు; ఫలములు సుఖదుఃఖ;
ములు రెండు; గుణములు మూఁడు వేళ్ళు;
తగు రసంబులు నాల్గు ధర్మార్థ ముఖరంబు;
లెఱిగెడి విధములై దింద్రియంబు;
లాఱు స్వభావంబు లా శోక మోహాదు;
లూర్ములు; ధాతువులొక్క యేడు;
పైపొరలెనిమిది ప్రంగలు; భూతంబు;
లైదు బుద్ధియు మనోహంకృతులును;
రంధ్రములు తొమ్మిదియుఁ గోటరములు; ప్రాణ
పత్త్రదశకంబు; జీవేశ పక్షియుగముఁ
గలుగు సంసారవృక్షంబు గలుగఁ జేయఁ
గావ నడఁగింప రాజ వొక్కరుఁడ వీవ.
భావము:
జీవులందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారం అనే వృక్షం ఒకటుంది.
- దానికి ప్రకృతి పాదు.
- సుఖదుఃఖాలనేవి రెండూ ఫలాలు.
- సత్త్వరజస్తమస్సు అనే గుణాలు మూడూ దానికి వేళ్ళు.
- ధర్మమూ, అర్థమూ, కామమూ, మోక్షమూ అనే నాలుగు పురుషార్ధాలూ రసాలు.
- దానికి శబ్దం, స్పర్శం, రూపం, రుచి, వాసన అనే ఐదూ ఇంద్రియాలు గ్రహించే విధానాలు.
- కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే ఆరూ స్వభావాలూ
- ఆరు ఊర్ములు ఆకలి, దప్పిక, శోకమూ, మోహమూ, ముసలితనమూ, మరణమూ అనేవి.
- రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము అనే ఏడు ధాతువులూ ఆ వృక్షానికి గల ఏడు పొరలు అయి ఉంటాయి. ఇంత తెలిసి తొట్రుపాటు పడడమెందుకు.
- పంచభూతాలు, బుధ్ది, మనస్సు, అహంకారం అనే ఎనిమిది ఆ వృక్షానికి కొమ్మలు.
- కన్నులు, చెవులు, ముక్కుపుటాలు, నోరు, మల మూత్రాద్వారాలు అనే తొమ్మిదీ ఆ వృక్షానికి గల తొమ్మిది రంధ్రాలు.
- ప్రాణమూ, అపానమూ, వ్యానమూ, ఉదానమూ, సమానమూ అనే పంచప్రాణాలూ నాగమూ, కూర్మమూ, కృకరమూ, దేవదత్తము, ధనంజయం అనే ఐదు ఉపప్రాణాలు మొత్తం పది ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది ఆ సంసార వృక్షం.
- జీవుడు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఆవృక్షంపై నివసిస్తుంటాయి. ఇటువంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి రక్షించడానికీ మళ్లీ లయం చేయడానికీ ప్రభువా! నీవు ఒక్కడివే. అంబుజాక్షుడై, నీలమేఘశ్యాముడై, దివ్య, అనన్య లావణ్య, సౌందర్య విభ్రాజమానమైన ముఖ వర్చస్సుతో పీతాంబర,ధారియై, గదను, శంఖ, చక్రములను ధరించి చతుర్భుజుడై స్వాయంభువ మన్వంతరంలో దర్శనమిచ్చిన రూపంతోనే తిరిగి దర్శనమిస్తాడు ప్రసవసమయములో దేవకీ వసుదేవులకు. వారికి పూర్వజన్మ స్మృతి కలిగింది. వెంటనే వారికి ప్రాకృతికంగా పుట్టిన శిశువు వలే మారిపోయాడు. ,వీటి అన్నిటి వెనుక యోగమాయ విభూతి ఉన్నది. కృష్ణలీలలన్నిటి వెనుక సూత్రరూపంలో యోగమాయ పాత్ర ఉంటుంది. ఆ చెట్టుపై జీవేశ్వరులు రెండు పక్షులుగా ప్రభవించి వుంటారు. వీటి అన్నింటికీ మూలము నీవు. నీది అద్వైత స్వరూపము అన్న తాత్పర్యమును ఇచ్చట గ్రహించవలసియుంటుంది.
ఇన్ని కష్టాలను, కడగళ్ళను అనుభవించిన ఆయాసము దరిజేరకుండా ‘త్వత్పాదపోతేన మహాత్కృతేన కుర్వన్తి గోవత్స పదం భావాబ్ధిం’ నీ పాదము అన్న నావను మాకు అందజేస్తే చాలు, ఈ భవ సాగరము ఆవుగిట్టను బోలిన ప్రవాహమును జేసి అంటే అంత చిన్నదిగా చేస్తాడు ఆ పరమాత్ముడు అన్న మాట. మమ్ము అవలీలగా ఆవలి ఒడ్డుకు చేర్చెదవు’ అని వేడుకొంటారు. ఇది నిజానికి మనకొరకు ఇవ్వబడిన సలహా. భాగవతము వినునపుడు లేక చదువునపుడు ఏకాగ్ర చిత్తము ఎంతయో అవసరము అన్నది సర్వదా మననము గుర్తుంచుకొనవలెను.
ఇక ఒక మాట పరమాత్మునికి ఆప్తులైన వారి మనసులలో ఏమున్నదో గమనించుదాము.
బ్రహ్మదేవుడు పరమాత్ముని ఈ విధముగా ప్రార్థించుచున్నాడు. ఇంతకాలానికి నాసృష్టి యగు మానవలోకములో జన్మింపబోవుచున్నావు. శ్రీరామునిగా పునర్వసు నక్షత్రములో భూమిపైకి వచ్చినావు. ఈసారయినా నా జన్మ నక్షత్రమగు ‘రోహిణి’ లో నీవు జన్మించాకూదడా! అనుకొన్నాడు. చంద్రుడు,”స్వామీ రామునిగా సూర్య వంశములో జన్మించినావు. ఇప్పుడు నీవు నాదగు చంద్రవంశములో జన్మింపబోవుచున్నావు. నాకు ఇష్టమగు భార్య రోహిణి అని నీకు తెలుసు కదా! నీవెందుకు ‘రోహిణి’ నక్షత్రములో పుట్టి మాకు ప్రసన్నత చేకూర్చ కూడదు అని అనుకొన్నాడట. ఇక బలరాముని గర్భమున దాల్చిన రోహిణి జగన్నాథుని అంశ అయితే నా గర్భమున వున్నది కానీ జగన్నాధుడు లేడే అని చింతించినదై, పోనీ కనీసము తాను నా పేరుగలిగిన నక్షత్రములో ఉదయించ గూడదా అని తలపోసినదట. పరమాత్మ అందరి కోరికలూ తీరుస్తూ రోహిణీ నక్షత్రములో పుట్టినాడట.
ఇక స్వామితల్లి గర్భమునుండి బయలుపడునపుడు, ఆ తల్లికి, తానుప్రసవింప బోవుచున్నాను అన్న స్పృహ లేదట. సాయంసమయమున తూర్పునుండి చంద్రుడు ఏచడీచప్పుడు లేకుండా బయల్పడుతాడో అంత సులభముగా ఉద్భావించినాడట దేవకీ దేవికి ఆ పురుషోత్తముడు. ఆయన అవతరించబోవు సమయమున భూదేవి తన కుమారుడైన మంగళుని చంకనబెట్టుకొని ఎదురు వచ్చిందట. (ఇక్కడ రెండు మాటలు చెప్పుకోవాలి. గృహస్తు పొరుగు వూరికి వెళ్ళునపుడు ఇల్లాలు బిడ్డను ఎత్తుకొని ఎదురు వచ్చుట శుభసూచకము. అంగారక గ్రహమునకు మంగళ, భూమిపుత్ర అన్న పేర్లున్నాయి. సైన్సు పరముగా కూడా అగారక గ్రహము ఎప్పుడో విడిపోయిన భూమి శకలమే అని చెప్పినారు. దీనిని Symbolic గా తీసుకోవాలి కానీ అన్యథా కాదు. ఇంకొక అంతరార్థము ఏమిటంటే పరమాత్మ ఆగమన సమయములో భూమి మంగళకరముగా, మంగళమయమై, మంగళయుతముగా ఒప్పారుచున్నది అని గ్రహించవలెను). తమ తీరమున విహరించబోతున్నాడని, యమునాది నదులన్నీ ఉత్సాహముతో ఉరకలు వేస్తున్నాయట. దేవ దుందుభులు మ్రోగగా, మేఘములు ‘భగవాన్’ ‘ఆవిర్భవ’ ‘ఆవిర్భవ’ ‘ఆవిర్భవ’ అని అతి మందముగా గర్జన చేస్తూవున్నవట. ఇటువంటి ఆహ్లాద సమయములో అర్ధరాత్రి సమయములో ‘సమవద్భూతే జాయమానే జనార్దనే’ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయుటకు దైవ స్వరూపిణియైన దేవకీ దేవి గర్భము ద్వారా భూమి పై వెలసినాడు స్వామి. అందుకే భూమిపై శ్రీకృష్ణ పరమాత్మ వెలయుటకు ‘ఆవిరాశీత్’ అంటే ఆవిర్భవించినాడు అన్న పదాన్ని వాడుతారు వ్యాసులవారు.
తమద్భుతం బాలకం అంబుజేక్షణం
చతుర్భుజం శంఖగాదాయుదాయుధం
శ్రీ వత్స లక్ష్మం గళ శోభి కౌస్తుభం
పీతాంబరం సాంద్ర పయోద సౌభగం
మహార్హ వైఢూర్య కిరీట కుండలా
త్విషా పరిష్వక్త సహస్ర కుంతలం
ఉద్దామ కాన్చ్యంగద కంకణాదిభిః
విరోచామానం వసుదేవ ఐక్షత - (వ్యాస భాగవతము)
జలధరదేహు నాజానుచతుర్బాహు;
సరసీరుహాక్షు విశాలవక్షుఁ
జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ;
గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ
గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు;
శ్రీవత్సలాంఛనాంచిత విహారు
నురుకుండలప్రభాయుత కుంతలలలాటు;
వైడూర్యమణిగణ వరకిరీటు
బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక
పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్య మంది
యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె. (పోతన తెలుగు భాగవతము)
భగవానుడు ‘ఆవిరాశీత్’ అనంటే ఆవిర్భావించినాడు అని చెప్పుకున్నాము. ఆవిర్భావము వుంటే తిరోభావము వుంటుంది. అంటే అనుకున్నచోట వెలయుట, తిరిగీ ఎక్కడనుండి వచ్చినాడో అక్కడికే పోవుట. జననము జరిగితే మరణము ఉంటుంది. ‘పునరపి జననం పునరపి మరణము’ ఆవిర్భావము అటువంటిది కాదు.
ఇక్కడ, వ్యాసులవారు వ్రాసిన శ్లోకము ‘తం’ తో మొదలవుతుంది. ఆ ‘తత్’ అన్నది బ్రహ్మ వాచకము. మరి ఆవిర్భావించినవాడు పరబ్రహ్మమే కదా!
ఆ బాలుని దివ్యరూపమును చూసిన అదృష్టము వసుదేవునికి దక్కినది. స్వామి ఎట్లున్నాడు అంటే, అతడు నీలమేఘమును బోలు దేహము కలిగి ఉన్నాడు; ఆజానుబాహువుడై నాలుగు చేతులలో గద శంఖం చక్రం పద్మములను కలిగి యున్నాడు. తామరరేకుల వంటి కళ్ళతో , విశాల వక్షము తో విరాజిల్లుచున్నాడు. కంఠ కౌస్తుభమణి కాంతులను వేదజక్కుతూ వుంది; అందమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు; శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది; కర్ణకుండలముల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి; వైడూర్య మణులు పొదగిన కిరీటం ధరించి ఉన్నాడు; పూర్ణచంద్రుని కాంతులీనుతున్నాడు.; అతడు భక్తులందరిని రక్షించే వాడు; సృష్టిలోని సుగుణాల పోగు; అత్యంత కరుణామయుడు; అట్టి పరమాత్మను గాంచి వసుదేవుడు ఉప్పొంగిపోయినాడు. ఆయన నోటినుండి ‘అద్భుతం బాలకం’ అన్న శబ్దము వచ్చింది.
మహనీయుడు, పండితశ్రేష్టుడునగు వంశీధర శర్మగారు సంస్కృతమున తమ భాగవత వ్యాఖ్యానమగు ‘శ్రీమద్భాగవతలీలా కల్పద్రుమములో’ ఈ విధముగా తెలుపుతారు. 'అత్' అన్న అవ్యమునకు ఆశ్చర్యము అన్నది అర్థము. భూతం అంటే నిండినది. ‘అదిత్ ఆశ్చర్యే ఇతి అద్భుతమ్’ అది అద్భుతం అన్న మాటకు అర్థము. ఇక ‘బాలకం’ అన్నమాటకు అర్థము చూస్తాము. ‘బాలకం’ అన్న మాటను యధాతధముగా తీసుకొంటే అద్భుతమైన బాలుడు పుట్టినాడు అని. మరి బాలురు పుడతారు గానీ వృద్ధులు పుట్టరుగదా అంటే వంశీధర శర్మ గారి జవాబు ఇది. ‘క’ అంటే బ్రహ్మ(ఏకాక్షర నిఘంటువు) ‘బాల’ బాలునిగా కల్గిన పరమాత్ముడు పుట్టినాడు అందుచేత అద్భుతము. ఇంకొక అర్థము, బాల అంటే గోపబాలురకు ‘కం’ అంటే సుఖము అంటే ఆనందము ఎవరివల్ల కలుగుతుందో ఆ బాలకుడు పుట్టినాడు. ‘బాలస్య కం సుఖం తస్మాత్...’ అంటే త్రేతాయుగములో పరమాత్మ అంశారూపమగు ఆది శేషుడు పరమాత్ముడగు శ్రీరామచంద్రునికి తమ్ముని రూపములో పుట్టినాడుకదా, తత్ ఋణ విముక్తి కొరకై ఇప్పుడు అదే ఆదిశేషుడు బలరాముడిగా వెలయగా ఆయనకు తమ్ముడి రూపములు ప్రభవించి తనకు జేష్ఠుడు అన్న ‘కం’ సుఖము నిచ్చి ఋణము తీర్చుకొన్నాడు, కావున ‘బాలకం’. ‘బాల’ అంటే గోపా బాలికలకు ‘కం’ సుఖమునిచ్చుటకు ఉద్భావించినాడు కసవున బాలకం’. ఇంకా ‘బా’ అంటే నర్మదా నదియందు సంచరించువాడగు పరమశివునకు సదా ఆనందమును కలిగించువాడు కావున ‘బాలకం’. ఇవన్నీ కాకుండా నాలుగు భుజములతోనూ, చేతులలో శంఖచక్రగదా పద్మములతోనూ, పీతాంబరమును ధరించియు అగుపించినాడు, మరి ఇది అద్భుతమే కదా! చూడండి మహా పురుషులకు మాత్రమే మహా పురుషుల రచనలు అంతరార్థముతో సహా అర్థమౌతాయి. ఏ రంగు కలిగిన శరీరము అంటే ‘సాంద్ర పయోద సౌభగం’ నీలమేఘశ్యాముడై అలరారుచున్నాడు. బ్రహ్మాండమగు జుట్టు, తలకు కిరీటము, వెల కట్టుటకు సాధ్యముగాని ఆభరణములు కలిగి ప్రకాశించు చున్నాడు.
మరి అద్భుతము గాక వేరేమిటి. ఆ సమయయములో వాసుదేవుడు తాను చెరసాలలో వున్నా మాటను గూడా మరచి బ్రాహ్మణునికి 10 వెల గోవులు దానమిచ్చునట్లు సంకల్పించుకొన్నాడట. ఆ సమయములో దేవకీదేవి స్పృహలోనికి వచ్చి బాలుని ఆపాద మస్తకమూ వీక్షించింది. ఇక్కడ ‘వీక్షత’ అన్న పదమును వ్యాస భగవానులు వాడుతారు. ‘విశేషేన ఈక్షణం కృత్వా’ అంటే ఎంతో శ్రద్ధతో పరికించి చూసిందట. అది తల్లికీ తండ్రికీ తేడా!
ఆ శిశువును తడిమి కాళ్ళుతాకి నమస్కరించ దలచిందట. కానీ ‘ కంసాత్ భీతా ...... శుచిస్మిత’ అంటారు వ్యాసులవారు. మొదట కంసుడు ఇంతటి భువనమోహనుని ఏమిచేస్తాద్ఫో అని భయపడిందట కానీ ఆయన నిర్మలమైన మోము చూసి ఈ కంసుడు నా బాలుని ఏమి చేస్తాడని తానూ చిరునవ్వు నవ్వుకొనిందట. పరిపరి విధముల ఆమె స్వామిని ధ్యానించి స్వామిని తమ పూర్వజన్మ వృత్తాంతమును, పరమాత్ముడే తనకు బిడ్డయైన విధమును అడిగిందట. అప్పుడు ఆయన దేవకీ మాతకు, ఆ దంపతుల పూర్వజన్మ వృత్తాంతమును ఈ విధముగా ఎరింగించినాడు. (telugubhaagavathamu.org – భాగవత గణనాధ్యాయి శ్రీయుతులు వులవపల్లి సాంబశివరావు గారి కృషిఫలము) అని యిట్లు దేవకీదేవి విన్నవించిన నీశ్వరుం డిట్లనియె; “నవ్వా! నీవు తొల్లి స్వాయంభువ మన్వంతరంబున పృశ్ని యను పరమపతివ్రతవు; వసుదేవుఁడు సుతపుఁ డను ప్రజాపతి; మీ రిరువురును సృష్టికాలంబున బ్రహ్మపంపునం, బెంపున నింద్రియంబులం జయించి తెంపున వాన గాలి యెండ మంచులకు సైరించి యేకలములై యాకలములు దిని యే కలంకంబును లేక వేండ్రంబుగఁ బండ్రెండువేల దివ్యవర్షంబులు తపంబులఁ జేసిన నెపంబున మీ రూపంబులు మెఱయ యోజనాజపంబులు జేసి, డాసి, పేర్చి, యర్చింప మీకు నాకుఁ గలరూపుఁ జూపి యేను "దిరంబులగు వరంబులు వేఁడుఁ" డనిన మీరు నా మాయం బాయని మోహంబున బిడ్డలు లేని దొడ్డయడ్డంబున దుర్దమం బగు నపవర్గంబుఁ గోరక నా యీడు కొడుకు నడిగిన మెచ్చి యట్ల వరం బిచ్చి మీ కేను "పృశ్నిగర్భుం" డను నర్భకుండ నయితి; మఱియును.
అదితియుఁ గశ్యపుఁ డనగా
విదితుల రగు మీకుఁ గుఱుచవేషంబున నే
నుదయించితి "వామనుఁ" డన
ద్రిదశేంద్రానుజుడనై ద్వితీయభవమునన్
ఇప్పుడు మూఁడవ బామున
దప్పక మీ కిరువురకునుఁ దనయుఁడ నైతిం
జెప్పితిఁ బూర్వము మీయం
దెప్పటికిని లేదు జన్మమిటపై నాకున్
అంటే పృశ్ని సుతపులుగానూ, అదితి కశ్యపులుగానూ, దేవకీ వసుదేవులు గానూ స్వామీ తల్లిదండ్రులాయి తమ కోర్కె తీర్చుకొన్నారట.
ఆమె పరమాత్మ తో స్వామీ నీ మాయాతీత విగ్రహమును ఉపసంహరించుకొని మా చర్మ చక్షువులకు సాధారణ బాలకునిగా కనిపించమని వేడుకొన్నదట. పరమాత్మ మాయను కల్పించి తాను సాధారణ బాలకుడై విరాజిల్లజొచ్చినాడు.
అత్తరి, వసుదేవుడు అప్పుడే పుట్టిన శిశువును తీసుకొని వ్రేపల్లెకు బయలుదేరుతాడు. తనకు పరమాత్మ, కాబోయే భర్త అని తలచుకొంటూ యమునా వసుదేవునికి దారి ఇస్తుంది. యమునా నదికి యమునా అధిదేవత. వీరికి వయో పరిమితులుండవు. ఇక శ్రీకృష్ణుడు బాలకుని రూపమును ధరించినాడు అంతే కావున ఆయనకు వయసు కారణము కానేరదు. ఈ మొహావేశాలు అన్నీ మానవులమగు మనము మన పరిభాషలో అర్థమగుటకు చెప్పుకోనుచున్నాము. ఈ పెళ్ళిళ్ళు, ప్రియురాళ్ళు, గోపికలు అన్నీ సంకేతములే! ఆ పరమాత్మ మాయావిలాసములే! వ్రేపల్లెలో నందుని ఇంటికి వచ్చినప్పుడు యశోద ప్రసవ వేదనతో తనకు పుట్టిన శిశువు మగ పిల్లవాడో, ఆడ పిల్లో తెలియని స్థితిలో అచేతనంగా పడి ఉంటుంది. ఆ సమయములోనే వసుదేవుడు తన బిడ్డను అక్కడ ఉంచి యశోదకు పుట్టిన ఆడ పిల్లను తీసుకొని తిరిగి మధురకు వెళ్ళిపోతాడు. ఆమెకు స్పృహ వచ్చేసరికి నీలమేఘచాయతో అసమాన తేజస్సు తో మెరిసిపోతున్న బాలుడు కనుపిస్తాడు. ఆశిశువు ఏడుపు ఆమెకు ప్రణవనాదంలా వినిపిస్తుంది. పూర్వజన్మ స్మృతి వస్తుంది. ఆపాదాలు ఎన్నడో తాను చూచినవని తెలుస్తుంది. పాదాలకు నమస్కారం చేస్తుంది. మళ్ళీ యోగమాయలో పడి తనకు జన్మించిన శిశువే అని భావిస్తుంది. శ్రీ కృష్ణుని బాల్యలీలలన్నిటిలో ఈ యోగభూమిక స్పష్టంగా కనిపిస్తుంది.
నేను ఈ వ్యాసమును శ్రీకృష్ణావతరణముతో నిలుపుతున్నాను. ఇక అవతార విశేషములు మళ్ళీ భగవంతుని ప్రచోదనము జరిగితే చేపడతాను. నా శక్తికి ఇది కొన్ని నెలల శ్రమ. అయినా నా శక్తిలో ఎటువంటి లోపమూ నేను చేయలేదన్న సంతృప్తి. చదువరులకు భగవంతుడు సదా సర్వవిధముల కాపాదవలేనని వేడుకొంటూ కృష్ణాష్టకమును ధ్యాన పుష్పమును సమర్పించుకొంటున్నాను.
శ్రీ కృష్ణాష్టకం
వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితం
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం
కుటిలాలక సమ్యుక్తం పూర్ణ చంద్రభాననం
విలసత్కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం
మందార గంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హిపింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం
ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం
రుక్మిణీ కేళిసంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం
గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి
~ ఇతి శ్రీ కృష్ణావతరణం సంపూర్ణం ~
ఉపసంహారము:
యశోదకు పుట్టిన స్త్రీశిశువును వసుదేవుడు తీసుకొని వెళ్ళినా, వ్రేపల్లెలో, బృందావనంలో శ్రీకృష్ణుడెప్పుడూ యోగమాయా సమావృతుడయ్యే ఉన్నాడు. ఆయనను కొలిచిన గోపికలలో
వ్యత్యాసము వున్నా వారికి ఎరుక రాలేదు. కారణం వాళ్ళు యోగమాయా పరివ్రుతులవటమే! కృష్ణావతారంలో భగవంతుని సేవించిన జీవులలో మూడు రకాల జీవులున్నారు. త్రేతాయుగంలో మునులుగా జన్మించి, తపస్సులలో శ్రీరాముని దర్శించి, ఆయన సాన్నిహిత్యంకోరినవారు, ద్వాపరంలో గోపికలుగా జన్మించినారు. భగవంతుని తత్త్వము వేదములచేత తెలియబడుతుంది కాబట్టి శ్రుతులు గోపికలుగా అవతరించినాయి. అప్సరసలు క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు జన్మించినారు. అందుకే వారు లక్ష్మీదేవిని సోదరిగా భావిస్తారు. వారుకూడా భగవంతుని సేవించడానికి గోపికలుగా జన్మించినారు.
శ్రీకృష్ణుని వంశీనాదం ఊరిలోనున్నఈ మూడు రకముల గోపికలకు కూడా వినిపించింది. వారంతా యమునా తీరానికి చేరారు. చిత్తమంతా శ్రీకృష్ణునే నింపుకున్నవారికి సంసారబంధాలు అడ్దురాలేదు. ఒకేరాత్రి వారికి రాసలీల అనుభవం జరిగినది. శ్రీకృష్ణుడు వారికి తన బాల్యములో పదకొండు సంవత్సరాలు మధురరసాన్నీ, భక్తి రసాన్ని, వారి వారి పురాకృత పుణ్యవిశేషం కొద్దీ, వారి వారి తారతమ్యాలతో కూడిన ఉపాధుల ప్రకారం పంచి ఇచ్చినాడు. రాసలీల తరువాత కృష్ణుడు వాళ్ళ చిత్తములో స్థిరముగా ఉండిపోయినాడు. ఆయన మాత్రము బృందావనము వదలి వెళ్ళి పోయినాడు. ఆపై ఎన్నడూ తిరిగి రాలేదు.
భాగవతములోనే కాకుండా భారతములోకూడా శ్రీకృష్ణుడు మనకు కనిపిస్తాడు. ఈ రెంటినీ సమన్వయించుకొంటే కృష్ణుడు భగవంతునిగానే కాదు ఒక యోగిగా, ఒక గురువుగా(భగవద్గీత), ఒక యోధునిగా, ఒక సలహాదారునిగా, ఒక మిత్రునిగా, ఒక శ్రేయోభిలాషిగా దర్శనమిస్తాడు.
కృష్ణుడు కంసుణ్నీ చంపివేసి, చెరసాలకు వెళ్లి తలితండ్రులైన దేవకీ వసుదేవులను, మాతామహుడు, మాతామహి యగు ఉగ్రసేన పద్మావతి దంపతులను విడుదల చేసినాడు.
అప్పుడు ఉగ్రసేనుడు కృష్ణునికి రాజ్యమును కట్టబెడతానంటే ఆయన 'మా తండ్రిగారివలె నేనునూ సింహాసనానికి దూరంగా వుండదలిచినాను. మీరే పాలించండి' అని అటాడు కృష్ణుడు తాతగారితో. తాతగారిని సింహాసనం ఎక్కించినా రాజకీయ సుస్థిరత ఏర్పడు వరకూ మధురలోనే వుండి అచట కంసుని మూలముగా అస్తవ్యస్తమైన పాలనా వ్యవస్థను చక్కబరచి అక్కడే ఉండిపోవ నిశ్చయించుకుంటాడు కృష్ణుడు. కంససంహారం తర్వాత అతని భార్యలు తమ తండ్రి జరాసంధ చక్రవర్తి వద్దకు వెళ్లిపోతారు. అల్లుని చంపిరన్న కోపముతో జరాసంధుడు దండెత్తిరావచ్చు, సామంతరాజుల్లో కంసవిధేయులు వుండవచ్చు, అసలు అంతఃపుర భృత్యగణములోకూడా కంసుని మనుషులు వుండి తమ శత్రువులకు సహాయము చేయవచ్చు. ఈ ఇబ్బందులను చక్కబెట్టుటకు నందునికి నచ్చజెప్పి మధురలోనే వుండిపోతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు సింహాసనం మీద కూర్చుని రాజుగా పాలన చేయకపోయినా క్షాత్రధర్మాన్ని పాటిస్తూ యుద్ధాలు చేసినాడు. సినిమాల్లో కృష్ణుడు అనగానే వేణువుతో కనబడతాడు కాబట్టి, అది వాయించడం తప్ప అతనికి వేరే ఏదీ రాదని అనుకోకూడదు. కృష్ణుడు అనేక ఆయుధాలతో యుద్ధాలు చేసినాడు. జరాసంధుడితో అనేకమార్లు యుద్ధము చేసినాడు. అంతేకాదు ఖాండవవన దహన సమయంలో కూడా యుద్ధము చేసినాడు. అసలు శమంతకోపాఖ్యానంలో జాంబవంతుడితో అన్ని రకాల ఆయుధాలతో అలసిపోయేవరకూ యుద్ధము చేసినాడు. అర్జున, సుయోధనులతో 'కురుక్షేత్రంలో ఆయుధాలు చేపట్ట' నని చెప్పుటయే ఆయన మహాయోధుడని తెలియవస్తుంది.
స్వస్తి
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు - సర్వేషాం శాంతిర్భవతు
సర్వేషాం పూర్ణంభవతు - సర్వేషాం మంగళం భవతు
సర్వేసంతు సుఖినః - సర్వేసంతు నిరామయా
సర్వేభద్రాణి పశ్యంతు మాకశ్చిద్దుఃఖ భాగ్భవేత్
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు
సర్వేజనా స్సుఖినో భవంతు
సర్వం సమస్త సన్మంగళాని భవంతు ||
ఓం శాంతిః శాంతిః శాంతిః
Courtesy: Cheraku Mohan Rao