Amarnath Yatra |
అమర్నాథుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రావణ పూర్ణిమ రోజుతో యాత్రకు ముగింపు
ప్రకృతి పరమైన సవాళ్ళతో పాటు ఉగ్రవాదుల హెచ్చరికలు ఎదురైన అమర్నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. ముష్కరుల హెచ్చరికలను ఏ మాత్రం బేఖాతరు చేయకుండా హిమలింగ దర్శనం చేసుకుని పరమశివుడి అనుగ్రహం పొందారు. ప్రకృతి ప్రకోపం సవాళ్ళను అదిగమిస్తూ ‘హరహర మహాదేవ’ అంటూ పార్వతీపతిని సేవిస్తున్నారు.
ఈసారి 32 రోజుల్లో ఏకంగా 4.71 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. గతేడాది 4.45 లక్షల మంది మాత్రమే స్వామి కటాక్షం పొందగల్గారు. 1,654 మంది యాత్రికులతో కూడిన మరో బృందం నేడు అమర్నాథ్కు పయనమైంది. మంగళవారం నాడు 5 వేల మంది భక్తులు యాత్రలో భాగస్వాములయ్యారు. తెల్లవారుజామున 3.20 గంటలకు జమ్ము నుంచి రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లతో 1,654 మంది దర్శనానికి వెళ్ళారు.
48 కిలోమీటర్ల పొడవైన యాత్రా మార్గంలో అమరనాథుడి చెంతకు చేరేందుకు 4 నుంచి5 రోజుల సమయం పడుతుంది. 14 కిలోమీటర్ల పొడవైన బాల్టల్ గుహ ద్వారా స్వామిని దర్శించుకుని తిరిగి బేస్‌క్యాంపునకు చేరుకునేందుకు 24 గంటలు పడుతోంది. మొత్తం 52 రోజులపాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర ఆగస్ట్ 19న శ్రావణపూర్ణిమ రోజున ముగియనుంది.