Krishna |
కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి 2024
పుడమిపై అధర్మం రాజ్యమేలునపుడు, అహింసతో అరాచకాలు పుడమిని గాడితప్పిస్తున్నపుడు దేవాదిదేవుడు ఆ శ్రీమహావిష్ణువు మానవ రూపం ధరించి మానవాళికి ధర్మాన్ని ప్రభోదించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించి పుడమిపై శాంతి నెలకొల్పటానికి అవతరిస్తుంటారని పురాణాలు తెలియజేస్తున్నాయి.
దేవాది దేవుడు ఆ శ్రీమహావిష్ణువు ఎత్తిన ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణపరమాత్ముడు. శ్రీ మహావిష్ణువు దేవకీవసుదేవులకు శ్రావణమాసము కృష్ణపక్షం అష్టమి తిధినాడు శ్రీకృష్ణునిగా కంసుని చెరసాలలో జన్మించారు. శ్రీకృష్ణుడు నీలి రూపంలో ఎంతో సుందరంగా జన్మించారు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయాన లోకమంతా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం వెలసింది. శ్రీకృష్ణుని జన్మదినాన్ని హిందువులు కృష్ణాష్టమి అని జన్మాష్టమి అని గోకులాష్టమి అని పర్వదినంగా జరుపుకొంటున్నారు.
2024 శ్రీకృష్ణాష్టమి :
ఈ సంవత్సరం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు హిందూమతం శ్రీఆదిశంకరాచార్యులు ప్రవచించిన "అద్వైత సిద్ధాంతం" అనుసరించే స్మార్తులు ఆచరించే "స్మార్త" సాంప్రదాయం ప్రకారం ఆగష్టు నెల 26వ తారీఖున మరియు "శ్రీకృష్ణ పరమాత్మను మాత్రమే ఆరాధించే "ఇస్కాన్" సంస్థ పద్దతి ప్రకారం ఆగష్టు నెల 26వ తారీఖున దేశవిదేశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి" వేడుకలను జరుపుకొన నిశ్చయించినారు. ఐతే ప్రపంచవ్యాప్తంగా కొరోనా మహమ్మారి ప్రత్యేకపరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం జరుపుకొనే అవకాశములు ఉన్నవి. భక్తులు కొరోనా జాగ్రత్తలు పాటించవలసినదిగా "దివ్యక్షేత్రం" విజ్ఞప్తి చేయుచున్నది.
కృష్ణాష్టమి పండుగ విధానం
కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయం సమయంలో శ్రావణ మాసం దొరికే అన్ని రకాల పండ్లు, అటుకులు, వెన్న, పెరుగు మరియు మీగడ స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఉయ్యాలలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పడుకోబెట్టి రకరకాల కీర్తనలతో భజనలు చేస్తారు. నగర వీధుల్లో ఎత్తుగా ఉట్టెలు కట్టి పిరమిడ్ ఆకారంలో ఒకరిపై ఒకరు ఎక్కి పోటిపడుతూ ఉట్టెను కొట్టే ప్రయత్నం చేస్తూ చూపరులకు కనువిందు చేస్తుంటారు. ఈ కృష్ణాష్టమినాడు యువత కేరింతలతో శ్రీకృష్ణునిపై తమకున్న భక్తిభావాన్ని ప్రదర్శిస్తుంటారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' అని పిలుస్తారు.
మానవుడు తననితాను తెలుసుకొనే ఎన్నో ధర్మాలగురించి విశ్లేషించిన భగవద్గీతని అందించిన శ్రీకృష్ణ భగావనుడు అంటే హిందూ యువతి యువకులకు అచంచల భక్తి మరియు ప్రేమ. అందుకే శ్రీకృష్ణాష్టమి అంటే యువతలో విశేషమైన ఆదరణ. శ్రీకృష్ణ ప్రమాత్మున్ని ఆరాధించే భారతావనికి కృష్ణాష్టమి పర్వదినంగా పేర్గాన్చింది. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది.
కృష్ణాష్టమి పర్వదినాన్ని ఒక్కో రాష్టంలో ఒకలా ఎంతో కోలాహలంతో జరుపుకుంటారు. ఐతే గుజరాత్ లో యువత చేసే దాండియా నృత్యాలు, వీధుల్లో పిరమిడ్లులా ఏర్పడి ఉట్టె ను కొట్టే సంబరాలు దేశమంతా ఆసక్తితో చూస్తుంది. వీరు కృష్ణునిపై చూపించే అచంచల భక్తిభావం ఆదర్శనీయం. గుజరాతీలు కృష్ణాష్టమి ని జగదాష్టమిగా పిలుస్తారు. యాదవులు ఈ పండగని ఎంతో భక్తిశ్రద్దలతో ముందు రోజు సాయంకాలంతోనే ప్రారంభిస్తారు. కృష్ణాష్టమి రోజు తమ పిల్లలకి బాలక్రిష్ణునిగా, గోపికలుగా అలంకరిస్తారు. కృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో ఉంచి పాలు, పెరుగు, వెన్నతో పాటు వివిధ రకాల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. కృష్ణుని జన్మదిన వేడుక అనంతరం ఉట్టె కొట్టే పండగని జరుపుకొని తదుపరి సహపంక్తి భోజనాలు చేస్తారు. యాదవులు కృష్ణాష్టమి పండగని మిక్కిలి భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు.
తిరుమల శ్రీవారి ఆస్థానం
తిరుమల ఆలయంలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూర్తి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువుదీరుతారు. ఈ కొలువును 'గోకులాష్టమీ ఆస్థానం' అని వ్యవహరిస్తారు. సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో శిక్యోత్సవం (ఉట్ల పండుగ) కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా క్రీ.శ.1545 సంవత్సరంలో తాళ్ళపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.