టీటీడీ ఆలయాలను ప్రక్షాళన చేయాలి
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో హిందూ మతం నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వాటిపై చర్యలు తీసుకుని ప్రక్షాళన చేయాలని సాధు పరిషత్ ప్రతినిధి శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలలో మఠాల ముగుసులో జరుగుతున్న దోపిడీని అరికట్టి, మఠాల భవనాలను టీటీడీ స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాగే టీటీడీ అనుబంధమైన శ్రీగోవిందరాజస్వామి ఆలయం ప్రధాన గోపురం మార్గం ఆక్రమణలకు గురైందని, గోవిందుని పుష్కరిణి మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు.
పుష్కరిణిలో నీరు నింపలేని పరిస్థితిలో ఉండడం బాధాకరమన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల సమస్యలపై టీటీడీ ఈవో శ్యామలరావుకు తెలియజేశామని, ఈవో 15 రోజుల్లో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. ఆ గడువుకు మించి సమస్యలు పరిష్కరించని పక్షంలో సాధుపరిషత్ ఆధ్వర్యంలో ఆమరణ దీక్షకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సాధు పరిషత్ ప్రతినిధులు అట్టూరి నారాయణ, భైరవనంద, శ్రీనివాసనంద, శుభోదనంద, సాంబశివానంద, గణేష్ స్వామి, ఓంకార్ పాల్గొన్నారు.