జగన్నాథ రథయాత్ర అనంతపురం వాసులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. ఇస్కాన్ అనంతపురం శాఖ ఆధ్వర్యంలో శనివారం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడిని రథంపై కొలువుదీర్చి నగర వీధులలో ఊరేగించారు. రథయాత్ర సాగే దారులను మహిళలు, యువతులు రంగవళ్లికలతో అలంకరించారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు రథం ముందు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. భక్తులు హరినామస్మరణ చేస్తూ, నృత్యాలు చేస్తూ ముందుకుసాగారు. రథోత్సవం ప్రారంభానికి ముందు కేఎస్ఆర్ కళాశాల వద్ద ఇస్కాన్ జాతీయ ప్రతినిధులు సత్యగోపీనాథ్‌దాస్, రాధామనోహర్‌దాస్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. భగవంతునికి, భక్తునికి మధ్య బంధానికి ప్రతీకలు ఇలాంటి రథయాత్రలు అని అన్నారు.
మనదేశంతోపాటు పాశ్చాత్య దేశాల్లోని నాలుగు వేల ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్నాథుడి రథయాత్రతో నగరం మరింత పవిత్రతను సంతరించుకుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. దైవ దర్శనానికి ఆలయాలకు వెళ్లడం పరిపాటి అని, కానీ జగన్నాథుడే భక్తుల చెంతకు వచ్చి అనుగ్రహించడం జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యమని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. పూణె నుంచి వచ్చిన కళాకారుల బృందానికి మాసినేని రామయ్య రూ.3.5 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. ముఖ్య అతిథులు బంగారు వర్ణపు చీపుర్లతో రోడ్లను ఊడ్చగా… వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివార్లకు పూజలు నిర్వహించి.. రథయాత్రను ప్రారంభించారు. కేఎ్‌సఆర్ కళాశాల వద్ద ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర.. సప్తగిరి సర్కిల్, క్లాక్ టవర్, రాజురోడ్డు, శ్రీకంఠం సర్కిల్, తిలక్‌రోడ్డు, గాంధీబజార్, పాతూరు, బసవన్నకట్ట, సప్తగిరి సర్కిల్ మీదుగా లలిత కళా పరిషత్ వరకూ సాగింది.