Bonalu |
- ఆషాడమాసంలో గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం గ్రామ ప్రజల మధ్య విస్తృతంగా కనబడుతుంది.
- హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలోను మరియు తెలంగాణా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోను నివసించే హిందువుల అతిపెద్ద పండుగ ‘బోనాలు’ పండుగ.
ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర ప్రజలు అతిగొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని ‘ఆషాఢంజాతర’ అని కూడా అంటారు. వర్షాలు మొదలయ్యే సమయంలో జంటనగరాలలో మాత్రమే కాకుండా తెలంగాణాలోని ఇతర ప్రాంతాలలోను ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాల జాతర జరుపబడుతుంది. ఇది అమ్మవారికి ప్రజలు తమ మొక్కును చెల్లించుకునే తరుణం. 1869లో జంట నగరాలలో ప్లేగువ్యాధి వ్యాపించినప్పుడు, గ్రామ ప్రజలు దైవ ఆగ్రహానికి గురి అయ్యాము అని తలచి భయభక్తుతో అమ్మవారిని శాంతిపచేయడానికి ఈ పండుగను ప్రారంభించినట్లు తెలుస్తోంది. గ్రామదేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకామ్మ, మారమ్మ, మహాంకాళి మొదలైన పలుపేర్లతో కొలవబడుతున్నారు.
‘బోనాలు’ అంటే ‘భోజనాలు’ అని అర్థం. ఆలయాలలో దేవుళ్ళకు మనం సమర్పించే నైవేద్యమే బోనాలు.
ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళీ దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీలోని ‘షాలిబండ’లో కొలువై ఉన్న అక్కన-మాదన్న మహంకాళీ దేవాయం, ‘లాల్దర్వాజ’ లోని మహాంకాళీ అమ్మవారి దేవాలయం`మొదలైన పలు ప్రధాన దేవాలయాలలో వరుసగా కనుల పండుగగా జరుగుతుంది.
అక్కన్న`మాదన్న మహంకాళీ దేవాలయం, గోల్కొండను పాలించిన తానీషా కాలములో అక్కన్న-మాదన్న అనబడే సోదరుల వల్ల కట్టబడింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయం 1815లో కట్టబడింది.
బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో సుమారు పదహారు రోజులు జరుపబడుతుంది.
ఈ ఏడాది బోనాల ఉత్సవం హైదరాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో జూలై 7న ఆదివారం ప్రారంభమై ఆ తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజ బోనాల జాతరతో ముగుస్తాయి. ఇది తెలంగాణా ప్రజల అసలైన తెలుగు పండుగ. ఆషాఢమాసంలో వచ్చే ఆదివారాలో తెలంగాణా ఆలయాలలో బోనాలు జరుపుతారు. జంటనగరాల ప్రజలు మాత్రమే కాకుండా ప్రక్కన ఉన్న తెలంగాణా ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వేరు వేరు ప్రాంతాలనుండి వచ్చేవారు రకరకాలైన ఉయ్యాలలను తయారుచేసి తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు.
అమ్మ రూపం |
మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం TELUGUBHAARATH ఆండ్రాయిడ్ APP డౌన్లోడ్ చేసుకోండి.
బోనాల పండుగఘటం, బోనాలు, వేపాకు సమర్పించుట, ఫలహారంబండి, పోతురాజు విన్యాసం, రంగం, బలి, సాగనంపుట అని ఎనిమిది అంగాలతో కూడినది.
- ఘటోత్సవం: ప్రత్యేకమైన కలశంలో అమ్మవారిని ఆవాహనచేసి, నగరవీధులగుండా ఉరేగింపుగా తీసుకెళతారు. బోనాల ఉత్సవం ప్రారంభించిన మొదటి రోజునుండి పదునాల్గవ రోజుదాకా ప్రతిరోజు ప్రొద్దున, సాయంకాలం అమ్మవారు కలశంలో సూక్ష్మరూపంగా ఆసీనురాలై, నగర, గ్రామ వీధులో ఊరేగి, భక్తుల పూజలను స్వీకరిస్తుంది. ‘ఘటం’ అంటే ‘కలశం’. అమ్మవారి రూపం కలశం మీద గీయబడుతుంది. ఆ ఘటం అమ్మవారిలాగే అలంకరించబడుతుంది. ఆలయ పూజారి శరీరమంతా పసుపు పూసుకుని ఘటాన్ని మోసుకెళతాడు.
- బోనాలు: శక్తి స్వరూపిణియైన మహంకాళికి భక్తితో సమర్పించే అన్నమే ‘బోనాలు’. ఎవరివారు ఏఏ రకంగా వండి నైవేద్యం పెడతామని మ్రొక్కుకున్నారో, ఆవిధంగా వండి సమర్పించి తమ కృతజ్ఞతను తెలుపుకోవటం ఆచారంగా ఉన్నది. చక్కెరపొంగలి, బెల్లపు పొంగలి, కట్టెపొంగలి, పసుపుఅన్నం, అని పలురకాలుగా బోనాలు అన్నం ఉంటుంది.ఆషాఢ జాతరలో పదిహేనవరోజు, స్త్రీలు తమ ఇళ్ళను కడిగి శుభ్రపరచి, తలంటుకుని సాన్నంచేసి, శుభ్రమైన కొత్తబట్టలు ధరించి, వ్రతం ఆచరించి నైవేద్యం తయారు చేస్తారు. చక్కగా అలంకరించిన ఒకపాత్రలో అన్నాన్ని ఉంచి, వేపాకులతో చుట్టూకట్టి, దానిమీద మూతపెట్టి, మూతమీద పవిత్రంగా దీపం వెలిగించి, తలమీద పెట్టుకునివచ్చి లక్షలాది మంది ఆడవారు వరుసగా అమ్మవారికి భక్తితో బోనం సమర్పించి తమ మ్రొక్కులను తీర్చుకుంటారు. ఆ రోజు ఆడవారు ముఖంనిండా పసుపు రాసుకుని తడిబట్టలతో రావడం పురాతన ఆచారం. మహిళలు బోనాలను నెత్తిమీద పెట్టుకుని, భేరీ, తప్పెట, కొమ్ము వాద్యాలు మ్రోగుతుండగా ఊరేగింపుగా రావడాన్ని చూడటానికి రెండుకన్నులు సరిపోవు. దీనికంటూ ప్రభుత్వం ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే ప్రణాళికగా అమలు పరుస్తుంది.
- వేపాకు సమర్పించుట: వేపాకులను పసుపునీటిలో ముంచి అమ్మవారికి సమర్పించే ఆచారం ముఖ్యమైన క్రియగా భావించబడుతుంది. వర్షాకాలం ప్రారంభమయినప్పుడు సోకే కలరా, మశూచివంటి వ్యాధులను తరిమికొట్టే క్రిమినాశినిగా వేపాకు ఉండటం వల్లనూ, అమ్మవారికి ప్రియమైన వృక్షంగా ఉండటం వల్లనూ వేపాకులను అమ్మవారికి సమర్పించి ఆనందిస్తారు స్త్రీలు.
- ఫలహారంబండి: ‘బోనాలు’ జరుపుకునేరోజు భక్తులు తమ ఇళ్ళల్లోనుండి శుభ్రంగా, నియమనిష్ఠలతో తయారుచేసి తెచ్చిన నైవేద్యాలను బండ్లలోపెట్టి ఆలయానికి ప్రదక్షిణం చేయటాన్నే ‘ఫలహారంబండి’ అనే ఉత్సవంగా జరుపుకుంటారు.
- పోతురాజు వీరంగం: అమ్మవారి సోదరుడుగా పోతురాజును భావిస్తారు. బోనాలు పండుగ పదిహేనవరోజు తెలంగాణా ప్రాంతంలోని ప్రతి బస్తీనించీ పోతురాజు అమ్మవారి ఆలయానికి లక్షల సంఖ్యలో వీరధీర విన్యాసాలు ప్రదర్శిస్తూ వరదగా తరలివస్తారు. వీరు కాళ్ళకి గజ్జలుకట్టి, ఒళ్ళంతా పసుపు పూసుకుని, పసుపు నీటిలో తడిపిన ఎరుపు వస్త్రం ధరించి, కంటికి కాటుక, నుదుటి మీద కుంకుమ బొట్టుతో, నడుముకు వేపాకులు కట్టి, చేతిలో పసుపు రంగు కొరడా ఝుళిపించి నాట్యంచేస్తూ ఫలహారం బండికి ముందుగా నడచి వెళ్ళడం బోనాలు పండుగయొక్క విశేష ఆకర్షణీయ అంశం.
- రంగం: ఇది చివరి రోజున జరిగే ముఖ్యఘట్టం. బోనాలు నైవేద్యం ఆదివారం జరుగుతుంది. సోమవారం త్లెవారుఝామున అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా వివాహంకాని ఒక స్త్రీ వచ్చి ఒకమట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీనినే ‘రంగం’ అంటారు. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ ఆ రోజు అమ్మవారు ఆ స్త్రీల ద్వారా తెలుపుతుంది. ‘రంగం’పలికే ఆ స్త్రీ, ఒక కత్తికి మాంగ్యం కట్టి, తన జీవితాంతం వివాహం చేసుకోకుండానే ఉండటం ఆనవాయితీ.
- బలి: రంగం ముగిశాక సోమవారం పోతురాజులు ప్రొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో వీర తాండవం చేస్తూ మైమరచి భక్తి పారవశ్యంతో ఆలయ ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి సన్నిధికి ఎదురుగా వారు ఆడే నృత్యం, మనను భక్తిపారవశ్యంలో ముంచుతుంది. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయవంటి కూరగాయల్ని పగుల గొట్టి అమ్మవారికి బలి ఇస్తారు. ఇది వరకు ఎద్దు, మేక, కోళ్లను బలిఇచ్చే వారట. ఇప్పుడు మృగబలి నిషేధం కాబట్టి కూరగాయలను పగులగొట్టి పండుగను పూర్తిచేస్తున్నారు.
- సాగనంపుట: బలిఇచ్చే కార్యక్రమం పూర్తిఅయ్యాక, సోమవారం ప్రొద్దున పదిగంటల సమయంలో అమ్మవారి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించి కలశాలతోపాటు ఏనుగుమీద ఎక్కించి, మంగళ వాద్యాల ధ్వనులమధ్య వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్ళి భక్తులు అమ్మవారిని సాగనంపుతారు.చివరిగా ‘ఘటాన్ని’ నయాపూల్ ప్రాంతంలో ప్రవహించే మూసీనదిలో నిమజ్జనం చేసి, పండుగను పూర్తి చేస్తారు.
శ్రీమతి రాజీరఘునాథన్ - ఋషిపీఠం సౌజన్యంతో…