Kanwar Yatra |
సనాతన ధర్మంలో ప్రతి నెలకు ఒక విశిష్టత ఉంది. అదే విధంగా శ్రావణ మాసం పూజలు, పండగలు, శుభకార్యాలు జరుపుకునే మాసం. అంతేకాదు ఈ మాసంలో దక్షిణాది వారు వరలక్ష్మివ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి పండగలను జరుపుకుంటే ఉత్తరాదివారు శివుడిని ఆరాధిస్తారు.
పరమశివుని ఆశీర్వాదం కోసం అత్యంత ఫలవంతమైనది మాసం శ్రావణ మాసంగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్షలాది మంది కన్వరియాలు గంగా నది నుండి నీటిని తీసుకుని తమ గ్రామ సమీపంలోని శివాలయాలలో శివలింగానికి జలాభిషేకం చేస్తారు. నీటితో కూడిన కావిడిని తీసుకువచ్చే భక్తులను కన్వరియాలని.. భోలా అని పిలుస్తారు. గంగాజలాన్ని సేకరించేందుకు కన్వారియాలు కొందరు కాలినడకన, కొందరు వాహనాల్లో ప్రయాణిస్తారు. ప్రతి సంవత్సరం కన్వర్ యాత్ర శ్రావణ మాసంలో ప్రారంభమవుతుంది. శ్రావణ మాసంలోని త్రయోదశి రోజున శివునికి నీటిని సమర్పిస్తారు.
కన్వర్ యాత్ర
శ్రావణ మాసంలో కావితో నీటిని తీసుకొచ్చి శివలింగానికి జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని మత విశ్వాసం. ఈ కావిడి యాత్ర సమయంలో.. గంగానది తీర ప్రాంతాల గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో కన్వాడీలు హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చి.. శ్రావణ మాసంలోని మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి జలాభిషేకం చేస్తారు.
శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసం ఆదిదంపతులైన శివపార్వతుల ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో భోలేనాథ్ను పూజిస్తే త్వరగా సంతోషించి అనుగ్రహిస్తాడని భక్తులు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడని నమ్మకం. శ్రవణ మాసంలో చేసే ఈ కావిడి యాత్ర సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. ఈ సమయంలో శివ భక్తుల్లో చాలా ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది.
ఉత్తరాదివారికి శ్రావణ మాసం ప్రారంభం
వైదిక క్యాలెండర్ ప్రకారం ఉత్తరాది వారు పౌర్ణమి నుంచి పౌర్ణమిని ఒక మాసంగా భావిస్తారు. ఈ నేపధ్యంలో ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత రోజుని శ్రావణ మాసం మొదటి రోజుగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాడ పౌర్ణమి జూలై 21వ తేదీన వచ్చింది. కనుక మర్నాడు నుంచి అంటే జూలై 22 నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం 19 ఆగస్టు 2024న ముగుస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉన్నాయి.
2024లో కన్వర్ యాత్ర(కావిడి యాత్ర) ఎప్పుడు?
ఈ సంవత్సరం 2024లో కన్వర్ యాత్ర జూలై 22 నుండి ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. రాఖీ పండగను 19 ఆగస్టు 2024న మాత్రమే జరుపుకుంటారు. కన్వర్ యాత్ర జూలై 22 నుండి ప్రారంభమై శ్రావణ మాస శివరాత్రికి ముగుస్తుంది. ఈ నెలలో త్రయోదశి తిధి అంటే మాస శివరాత్రి ఆగస్టు 2వ తేదీన వస్తోంది. ఈ రోజున కన్వరియాలందరూ నీటిని తీసుకొచ్చి శివలింగానికి సమర్పిస్తారు. శివరాత్రి రోజున కన్వరియాలు తమ కావిడితో తెచ్చిన నీటిని శివలింగానికి సమర్పించి తాము కోరుకున్న కోర్కెలు తీరాలని ప్రార్థిస్తారు.
గంగా నది నుంచి నీటిని తెచ్చే కావిడిని భుజంపై మోస్తారు. నేలపై ఉంచరు. అయితే కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా కన్వర్ యాత్రలో కావిడిని మోసే పద్ధతులు కూడా అభివృద్ధి చేయబడ్డాయి. సోమవారం శివునికి అంకితం చేయబడింది.. అందుకే శ్రావణ సోమవారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివుడిని ఆరాధించడం, ఉపవాసం ఉండటం వల్ల కోరుకున్న వరుడు లభిస్తాడని.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని మత విశ్వాసం.
సావన్ సోమవార వ్రతం 2024 (సావన్ సోమవార వ్రతం తేదీ 2024) సోమవారం 22 జూలై – మొదటి సోమవారం జూలై 29 సోమవారం – రెండవ సోమవారం సోమవారం 05 ఆగస్టు- మూడవ సోమవారం సోమవారం 12 ఆగస్టు – నాల్గవ సోమవారం సోమవారం 19 ఆగస్టు – ఐదవ సోమవారం
శివ అభిషేక మంత్రం
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
మహామృత్యుంజయ మంత్రం
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||