Seven-footed Gangamma |
ఏడు పాయల గంగమ్మ
సగరుని యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ బయల్దేరిన అతని అరవైవేల మంది పుత్రులు కపిలమహర్షి కోపానికి భస్మమయ్యారు. వారికి స్వర్గప్రాప్తి కలిగించేందుకు దివిలో ఉన్న గంగను భూమికి పంపమని కోరుతూ ఘోర తపస్సు చేశాడు భగీరథుడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. ఉధృతంగా ప్రవహించే గంగను ఆపగల శక్తి శివుడికి మాత్రమే ఉంది- అనడంతో మహాశివుణ్ణి కూడా తపస్సుతో మెప్పించాడు భగీరథుడు.
పరమశివుడి అనుగ్రహంతో సర్వలోకాలకు పూజ్యురాలైన గంగ ఆకాశం నుంచి శివుడి శిరస్సుపైకి దూకింది. ధరింప శక్యం కాని గంగాదేవి తన ఉధ]ృత ప్రవాహంతో శంకరుణ్ణి పాతాళానికి తీసుకు వెళ్దామనుకుంది. అది గ్రహించిన శంకరుడు- గంగమ్మ గర్వాన్ని అణచి వేయాలనుకున్నాడు. హిమవత్ పర్వతంతో సమానమైంది, జటా మండలం అనే గుహలతో నిండి ఉన్నది అయిన శివుడి శిరస్సు చేరిన గంగ.. ఎంత ప్రయత్నించినా అక్కడ నుంచి భూమి మీదికి వెళ్లలేక శివుని జటాజూటంలోనే బందీ అయ్యింది. దీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
గంగాదేవి ఉనికిని తెలుసుకోలేక మళ్లీ శివుడి కోసం తపస్సు చేశాడు భగీరథుడు. అప్పుడు కరుణించిన శివుడు గంగను హిమవత్పర్వతం మీద ఉన్న బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరంలో విడిచిపెట్టాడు. ఆ గంగా ప్రవాహం 7 పాయలుగా మారింది. హ్లాదిని, పావని, నళిని అనే 3 గంగలు తూర్పుదిశగా, సుచక్షువు, సీత, సింధువు అనే 3 మహా నదులు పశ్చిమదిశగా ప్రవహించాయి. ఏడోదైన గంగ.. భగీరథ మహారాజు దివ్య రథం అధిరోహించి ముందు వెళ్తుండగా అతణ్ణి అనుసరించింది. ఆ ఏడు పాయల జలాలతో తన ముత్తాతలకు స్వర్గప్రాప్తి కలిగించాడు భగీరథుడు.