Muddugare Yashoda - ముద్దుగారే యశోద |
ఆడియో:
వీడియో..
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్నుడు
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్థనపు గోమేధికము
సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచే(టి)కమలాక్షుడు
కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు
muddugaarae yaSOda muMgiTa mutyamu veeDu
tiddaraani mahimala daevakee sutuDu
aMtaniMta golletala arachaeti maaNikyamu
paMtamaaDae kaMsuni paali vajramu
kaaMtula mooDu lOkaala garuDa pachcha poosa
cheMtala maalOnunna chinni kRshnuDu
ratikaeLi rukmiNiki raMgumOvi pagaDamu
miti gOvarthanapu gOmaedhikamu
satamai SaMkhuchakraala saMdula vaiDhooryamu
gatiyai mammu gaachae(Ti)kamalaakshuDu
kaaLiMguni talalapai kappina pushyaraagamu
aelaeTi SreevaeMkaTaadri yiMdraneelamu
paalajalanidhilOna paayani divya ratnamu
baaluni vale tirigae padmanaabhuDu
అన్నమాచార్యులు ఈకృతిలో శ్రీవేంకటేశ్వరుని నవరత్నములతోని మణులుగా భావించిరి.ప్రధానముగా ఇందు దేవకీ సుతుడు వర్ణింపబడినాడు. యశోద ముంగిట ముద్దులొలికిస్తూ నడయాడే మంచి ముత్యము వీడు. సరిదిద్ద రాని మహిమల వాడు. చిన్న చిన్న గోపికలకు అరజేత చిక్కిన మాణిక్యము. అనగా సులభుడు అని అర్ధము. పంతము లాడుచున్న కంసునికి వజ్రము. అదీ గాక రాక్షసులను వధించు ఇంద్రుని చేతిలోని వజ్రాయుధము కూడ. గరుడుడు మూడులోకాలు తిరుగగలవాడు. మూడులోకాలతోనూ అతనికి సంబంధమున్నది. కృష్ణుడు కుడా అట్టి వాడే. అందుచేత గరుడపచ్చమణి. రుక్మిణీ దేవి తో రతికేళి సలుపునప్పుడు కృష్ణుని పెదవి రుక్మిణికి పగడమైనది. గోవర్ధన పర్వతము మీద విహరించువాడు కదా, అందుచేత ఆపర్వతము మీది కృష్ణుడు గోమేధిక మణి.
కాళియుని పాగడలపై ఆడినాడు కృష్ణుడూ. సర్పము పడగలపైన రత్నములుండును. కృష్ణుని పాదములు ఎరుపు. పుష్యరాగము ఎరుపు. కాళియుడు నల్లత్రాచు. నల్లత్రాచు పడగల పైన నర్తించిన ఎర్రని పాదములు పుష్యరాగమణుల వలె ప్రకాశించినవి.
వేంకటగిరిపైన ఇంద్రనీలమణి. సముద్రమునకు రత్నాకరుదు(రత్నములు కలవాదు.) అని పేరు.
పాల సముద్రమున శయనించిన స్వామి ఒక దివ్య రత్నము.
ఈ విధముగా అన్నమయ్య స్వామిని నవరత్నాలతో పోల్చినారు.