Vasista Maharshi |
వశిష్ఠ జయంతి ప్రత్యేకం - 17న వశిష్ఠ జయంతి
వశిష్ఠ మహర్షి హిందూ పురాణాలలో ఒక గొప్ప ఋషి. మహాతపస్సంపన్నుడు. సప్త ఋషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకడు. వేదముల ప్రకారం ఇతను మిత్ర మహర్షి, వరుణా దంపతుల కుమారుడు .
మొదట్లో బ్రహ్మ మానస పుత్రుడై ఉండి నిమి శాపము వల్ల ఆ శరీరము లేకుండా పోవడముతో మరల మిత్రావరుణులకి జన్మించాడు ఒకప్పుడు మిత్రావరుణులకు ఊర్వశిని చూచి రేతస్సు స్ఖలితము అయి అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి వసిష్ఠుఁడును, అగస్త్యుఁడును పుట్టిరి. కనుక వీరు ఇరువురును కుంభజులు అనఁబడుదురు. ఈయన సూర్యవంశానికి రాజపురోహితుడు. వైవస్వత మన్వంతరమున సప్తర్షులలో ఒకఁడు.
ఇంద్రుడు వశిష్ట మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి కామధేనువు పుత్రిక అయిన శబల అనే గోవుని ఇస్తాడు. ఇది కామధేనువు లాగా తన యజమానికి ఏది కోరితే అది ఇవ్వగలదు. అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత, పతిభక్తి పరాయణురాలైన అరుంధతితో వివాహమైంది. హిందూ వివాహాలలో సాంప్రదాయం ప్రకారం వివాహానంతరం వధూవరులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయిస్తారు వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి మహర్షి జేష్టుడు. శక్తి మహర్షి పుత్రుడే పరాశరుడు ఈ పరాశర మహర్షి పుత్రుడే వేద వ్యాసుడు వశిష్టడు గొప్ప మహర్షి.
మహాతపశ్శక్తి సంపన్నుడు. త్రేతాయుగం నుండి వశిష్టుని గురించి మనకు వివరాలున్నాయి. అయోధ్యానగరాని రాజైన దశరధ మహారాజుయొక్క రాజగురువు. వశిష్టుని దగ్గరే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు విద్య నేర్చుకొంటారు. సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విధ్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడట. అందువల్ల వశిష్టునికి కులపతి అని పేరు వచ్చింది. ఈతఁడు దక్షప్రజాపతి కూఁతురు అగు ఊర్జను వివాహమాడి ఆమెయందు రజుఁడు, గోత్రుఁడు, ఊర్ధ్వబాహువు, సవనుఁడు, అనఘుఁడు, సుతపుఁడు, శుక్రుఁడు అని ఏడుగురు పుత్రులను పొందెను. వారు స్వాయంభువ మన్వంతరమున సప్తర్షులుగ ఉండిరి.
రాజగురువుగా అన్నింటికీ మించి ఇక్ష్వాకుల కులగురువుగా రామచంద్రమూర్తిని న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపంగా తీర్చిదిద్దిన రాజగురువు వశిష్ఠుడు. బ్రహ్మజ్ఞానం తెలుసుకుని జీవితాన్ని యోగమయంగా, తపోమయంగా, జ్ఞాన మయంగా ఆచరించి జీవించిన మహనీయుడాయన. ‘మనిషిలోని వికారాలను సాధ్యమైనన్ని వదిలి వేసి, అసాధ్యమైతే అవసరాల మేరకు నియంత్రించి ఆదర్శప్రాయంగా జీవించే మనిషే గురువు’ అనే వ్యాఖ్యానానికి నిలువెత్తు నిదర్శనం వశిష్ఠుడు. వశిష్ఠుడు త్యాగి, నిష్కాముకుడు, స్వతంత్ర ప్రజ్ఞాశాలి. ఆధ్యాత్మిక, యోగ జ్ఞానాలతో రాజనీతిని సమన్వయం చేసి ఇక్ష్వాకుల వంశాన్ని వశిష్ఠుడు ప్రభావితం చేశాడు. వశిష్టుని దగ్గరే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు విద్య నేర్చుకొంటారు.
అయితే శత్రువుల రాకపోకలు, వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయటం, అదుపు చేయటంలో రాజర్షి విశ్వామిత్రుడు తనకంటే ప్రావీణ్యం గలవాడని వశిష్ఠుడు గుర్తించాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు రాజర్షి కాబట్టి. అందుకే తాను చెప్పలేని కొన్ని విద్యలను రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద నేర్చుకునేందుకు పరోక్ష కారకుడవుతాడు అది ఎలాగంటే. నునూగు మీసాల పసిపిల్లలైన రామలక్ష్మణులను తన యాగరక్షణ కోసం పంపాలని విశ్వామిత్రుడు దశరథుడిని కోరుతాడు. తనకు లేకలేక కలిగిన పిల్లలు, అత్యంత సుకుమారులు, అల్లారుముద్దుగా పెంచుకొనే తన పిల్లలను అరణ్యాలకు పంపడానికి దశరథుడు తటపటాయిస్తాడు ‘అవసరమైతే తాను, బలగాలు వస్తామని’ బతిమాలుతాడు.
ఆప్పుడు వశిష్ఠ మహర్షి ‘మహారాజా! విశ్వామిత్రుడు శత్రువులను సంహరించగల సమర్థుడే. మీ పిల్లలకు అనుభవంతో ప్రావీణ్యం పెరిగి, భయం తొలగి హితం కలగుతుంది. నిరభ్యంతరంగా పంపండి’ అని ప్రోత్సహిస్తాడు. దీనివల్ల దశరథుని మాట దక్కుతుంది. విశ్వామిత్రుని లక్ష్యం నెరవేరుతుంది. రామలక్ష్మణులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది రాజనీతి లక్షణం. కొన్ని గాథలను బట్టి వశిష్ట విశ్వామిత్రులు పరస్పర శత్రువులని మనం అపోహ పడతాం. నిజానికి వారిద్దరూ మిత్రులే. ఒకరి మనసును మరొకరు ఎరిగిన వారు. ఒకరి శక్తి సామర్థ్యాలను, విద్యలను మరొకరు బాగా తెలిసున్న వారు.
అందుకే విశ్వామిత్రుని కోరిక మేరకు ‘యోగ వాశిష్ఠం’ వేదాంత గ్రంథం రాసి వశిష్ఠుడు శ్రీరామునికి చెప్పాడు. వాస్తు గురించి వివరించాడు. అదేవిధంగా ఒక సందర్భంలో నిండు కొలువులో విశ్వామిత్రుడు ‘రాముని సత్యధర్మ పరాక్రమాలు నాకంటే వశిష్ఠునికే ఎక్కువ తెలుసునని’ నిజాయతీగా చెబుతాడు. సకల సంపదలతో తులతూగే మాంధాత చక్రవర్తి వసిష్ఠుని బంగారు సింహాసనము పై కూర్చో బెట్టి సత్కరించి తనకు జ్ఞానాన్ని తెలియజేసి మోక్షాన్ని పొందేలా చేయమని ప్రార్ధిస్తాడు అప్పుడు వశిష్ఠుడు ఆయనకు కర్మ స్వరూపాన్ని, బ్రహ్మ స్వరూపాన్ని , వేద వేదాంత పురాణం స్వరూపాన్ని భక్తిస్వరూపాన్ని మొదలైన అంశాలను వివరిస్తాడు. వశిష్ఠుడు రచించిన వశిష్ఠ కల్పం, తంత్రం, పురాణం, శిక్ష, శ్రద్ధాకల్పం, వశిష్ఠ వ్రతం, వశిష్ఠ హోమం, లింగపురాణం వంటివి యోగవాశిష్ఠంతో ప్రభావితమయ్యాయి. వశిష్ట స్మృతిలో ముప్పై అధ్యయాలు ఉన్నాయి.
రాజనీతిజ్ఞుడు: అయోధ్యలో చిన్న రాజ్యాధిపతి సత్యవ్రతుడు భ్రష్ఠుడై దేవరాజనే రాజపురోహితుని సూచనతో వశిష్ఠుడు రాజ్యభారం మోయాల్సి వస్తుంది. ఎటువంటి శాసనాలు లేకుండా నోటిమాటతోనే రాజ్యమంతా ఒక కుటుంబం వలె కఠిన స్వీయ నియంత్రణతో మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లే విధంగా వశిష్ఠుడు పాలన చేస్తాడు. అప్పుడు పొరుగు రాజ్యాధికారి రాజర్షి విశ్వామిత్రునికి అసూయ కలిగి, అతనిపై దాడికి వస్తాడు. వశిష్ఠుడు సాదరంగా ఆహ్వానించి విశ్వామిత్రునికి అతిథ్యమిస్తాడు. ఆశ్రమంలో ఉండే నందినిని ఇవ్వమని విశ్వామిత్రుడు కోరతాడు. వశిష్ఠుడు నిరాకరిస్తాడు.
బలవంతంగా తీసుకుపోతానంటాడు విశ్వామిత్రుడు. ‘రాజబలం ముందు నేనెంత? తీసుకు వెళ్ళ’మంటాడు వశిష్ఠుడు. నందిని ఎదురు తిరుగుతుంది. దాంతో విశ్వామిత్రుడు, అతడి సైన్యం వెనుదిరగాల్సి వస్తుంది. కేవలం వశిష్ఠుని మీద పైచేయి సాధించేందుకే విశ్వామిత్రుడు తపస్సు చేసి, రాజర్షి అవుతాడు. అయినా సంతృప్తి చెందక, వశిష్ఠుడి చేతనే తనను బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉబలాటపడతాడు. జన్మతః రాజైనందువల్ల అతడిలోని అహంకార మమకారాలు చావలేదని గ్రహించిన వశిష్ఠుడు, అతడికి అనేక పరీక్షలు పెట్టి ఆ లక్షణాలన్నీ తొలగినాయని తెలుసుకున్న తర్వాతనే విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా సంబోధించి సంభోదిస్తాడు దాంతో విశ్వామిత్రుడు అమితానందపడిపోయి, వశిష్ఠునికి మిత్రుడవుతాడు. ‘విశ్వామిత్రుని భుజబలం, వశిష్ఠుని బుద్ధిబలం’ రాముని రాజ్యం కళకళలాడేందుకు కారణమవుతాయి. అందుకే, వశిష్ఠుడు సాధారణ గురువు, పురోహితుడు కాదు, రాజనీతిజ్ఞుడు. అన్నీ తానై రాజ్య క్షేమం కోసం మార్గదర్శనం చేసిన గురువు. వశిష్ఠ మహర్షి పేరు మీదుగానే వశిష్ఠ గోత్రం ఏర్పడింది.