Kedarnath |
Surya Kala
పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ ధామ్‌లో శివుడు ‘లింగ’ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. కేదార్నాథ్ ఆలయ తలుపులు ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలల్లో తెరుచుకుంటాయి. కేదార్నాథ్ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఇక్కడ శివుడు ధరించిన గేదె రూపంలోని వెనుక భాగాన్ని పూజిస్తారని చెబుతారు. స్కంద పురాణంలోని కేథర అధ్యాయంలో కేదార్నాథ్ ధామ్ గురించి ప్రస్తావించబడింది. దీని ప్రకారం కేదార్నాథ్ అనేది శివుడు తన శిగ నుంచి పవిత్రమైన గంగను విడిపించే ప్రదేశం.
పాండవులతో కేదార్నాథ్ ధామ్‌కు ఉన్న సంబంధం
కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన పౌరాణిక కథనం ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ కౌరవ సోదరులను, ఇతర రక్త సంబంధీకులందరినీ చంపిన పాపం నుంచి విముక్తి పొందాలని కోరుకున్నారు. తమ పాప విముక్తి కోసం పాండవులు శివుడిని వెతుకుతూ హిమాలయాల వైపు వెళ్లారు. తనవైపు వస్తున్న పాండవులను చూసి శివుడు అదృశ్యమై కేదార్లో స్థిరపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న పాండవులు కూడా శివుడిని వెంబడించి కేదార పర్వతానికి చేరుకున్నారు.
పరమశివుడు గేదె రూపాన్ని ధరించాడు
పాండవులు కూడా కేదార పర్వతానికి చేరుకున్నప్పుడు వారిని చూసి శివుడు గేదె రూపాన్ని ధరించి జంతువుల మధ్యకు వెళ్ళాడు. పాండవులు శివుని దర్శనం కోసం ఒక పథకం వేశారు. ఆ తర్వాత భీముడు భారీ రూపాన్ని ధరించి తన రెండు కాళ్లను కేదార్ పర్వతానికి ఇరువైపులా చాచాడు. అన్ని జంతువులు భీముని పాదాల మధ్యకు వెళ్ళాయి. కాని గేదె రూపంలో ఉన్న శివుడు అతని పాదాల క్రింద నుండి బయటపడటానికి ప్రయత్నించినప్పుడు. భీముడు అతనిని గుర్తించాడు.
శివుడిని గుర్తించిన భీముడు గేదెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు..అప్పుడు గేదె భూమిలో వెళ్ళిపోవడం మొదలు పెట్టింది.. అప్పుడు భీముడు గేదె వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. శివుడు పాండవుల భక్తికి సంతసించి వారికి ప్రత్యక్షమై పాపాలనుండి విముక్తులను చేశాడు. అప్పటి నుంచి ఇక్కడ శివుడు గేదె రూపంలో కొలువై ఉంటాడని చెబుతారు. ఈ గేదె తల నేపాల్‌లో ఉద్భవించిందని నమ్ముతారు. అక్కడ శివుడు పశుపతినాథ్ రూపంలో పూజింపబడుతున్నాడు.
నరనారాయణుడు తపస్సు చేసిన ప్రాంతం
పురాణాల ప్రకారం శ్రీ హరి విష్ణువు అవతారమైన గొప్ప సన్యాసి నరనారాయణ ఋషి హిమాలయాలలోని కేదార్ శిఖరంపై తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. నారాయణుడు ప్రార్థనను మన్నించి జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా నివసించమని అది వరంగా ఇవ్వమని శివయ్యను కోరాడు. ఈ ప్రదేశం కేదార్నాథ్ హిమాలయ పర్వత శ్రేణులలో కేదార్ అనే శిఖరంపై ఉంది.
ఆలయం వెనుక శివైక్యం పొందిన శ్రీ ఆదిశంకరాచార్యుల:
కేదార్నాథ్ ఆలయాన్ని పునరుద్ధరించిన ఘనత కూడా ఆదిశంకరాచార్యకే దక్కింది. అతని సమాధి ఆలయ సముదాయం వెనుక ఉంది. ఇక్కడ శంకరాచార్యులు స్వయంగా మరణాన్ని ఆహ్వానించినట్లు ప్రతీతి. ఇక్కడ ఆదిశంకరాచార్య తన అనుచరుల కోసం ఒక వేడి నీటి చెరువును నిర్మించారని, తద్వారా వారు చల్లని వాతావరణం నుండి తమను తాము రక్షించుకున్నారని కూడా నమ్ముతారు.