Ayurveda |
ముఖ్యమైన ఔషధ మొక్కలు
బృహతి పత్రం
బృహతి పత్రం |
చేదు రుచిని గల్గు శ్రీ గణపతి పత్రి
జ్వరము, కఫము కట్టు వాంతులున్ను
వాకుడాకు పేర వర్ధిల్లు బృహతియే
ఏకదంతుని కిది మోకరిల్లె ||
ఏకదంతాయ నమః బృహతీపత్రం పూజయామి అని పూజించే ద్వితీయ పత్రానికే వాకుడాకు అని పేరు. ఇది కూడా ఔషధమే. జ్వరం, కఫం, వాంతులు మొదలగు వ్యాధులకు ఔషధం. పురుషుల వంధ్యత్వానికి కూడా మంచి మందు.
బిల్వ పత్రం
బిల్వ పత్రం |
శివకేశవులకు ప్రీతిగ
నవలీలగ వేడి మాన్పె డమృత తరువిదే
శివ పుత్రుడు కపిలుండై
వివరముగా పూజలందు బిల్వమన నిదే ||
ఓం కపిలాయ నమః బిల్వపత్రం పూజయామి అని పూజించే బిల్వ పత్రానికి మరొక పేరు మారేడు. ఈ మారేడు శివునికి, విష్ణువుకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. అలాగే వినాయకునికి కూడా… ఇంక ఔషధ గుణాల విషయానికి వస్తే, మారేడు ఆకులు వేసి, పది నిమిషాలు ఉంచిన నీటిని తాగితే కఫం దూరమవుతుంది. మారేడు పండు గుజ్జు షర్బట్ చేసుకుని తాగితే మండువేసవిలో ఎండదెబ్బ నుండి ఉపశమనం పొందవచ్చు. ఇంకా ఈ మారేడు దళాలను ఒకసారి పూజించిన తర్వాత మరల నీటితో కడిగితే, మరొకసారి కూడా పూజకు ఉపయోగించుకోవచ్చునట.
అపామార్గ పత్రం
అపామార్గ పత్రం |
ఉత్తరేణి పేర నుత్తమౌషధమిది
పంటి గట్టిదనము పట్టు పెంచు
పాపల వరదాయి వంధ్యత్వ నాశిని
పల్లెటూళ్ల నెరుగు బల, హితకరి ||
ఓం గజ కర్ణికాయ నమః అపామార్గ పత్రం పూజయామి అని ప్రార్ధిస్తూ వేసే నాల్గవ పత్రం ఈ ఉత్తరేణి. పల్లెల్లో కుచ్చిన పుల్లలు అంటారు. వీటి ప్రయోజనం పల్లె ప్రజలకు బాగా తెలుసు. పసి పిల్లలకు బలం చేకూర్చడం, అన్న హితవు కలిగించడం తో పాటు… ఇంకా ఎన్నో వ్యాధులకు ఈ ఉత్తరేణి మందు. ఈ మొక్కను సమూలంగా (వేళ్ళు కూడా తెగకుండా) తీసి బాగా ఇసుక, మట్టి లేకుండా కడిగి, నీడను ఆరబెట్టాలి (ఎండబెట్టకూడదు). బాగా ఆరిన తర్వాత కాల్చి మసి చేసి ఆ పొడితో పళ్ళు తోముకోవాలి. లేదా ఆ పుల్లలనే పళ్ళు తోమే కుంచెగా ఉపయోగించవచ్చు. పళ్ళు వజ్రాల మాదిరి గట్టిగా తయారవుతాయి. పుచ్చుపళ్ళు మచ్చుకైనా కనిపించవు. ఇంక ఈ గింజలను పాలతో వాడితే పురుషులలో వంధ్యత్వం పోయి ఆ ఇల్లు పిల్లా పాపలతో కళకళ లాడుతుందట. (ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది).
కరవీర పత్రం
కరవీర పత్రం |
చేలకు పట్టిన చీడల
కాలాంతక మౌను పత్రి కరవీరమునన్
తూలించు వ్రణములన్నియు
మాలల కనువైన పూలు మరకత మణులై ||
శ్రీ గణేశ పూజలో ఉపయోగించే కరవీర పత్రమునే గన్నేరు అంటారు. ఆకులు, కాయలలోని విత్తనములు కషాయం కాచి పైర్ల పై పిచికారి చేస్తే చీడపీడలు మాయం అవుతాయి. అలాగే వేరు, పై పట్ట నూరి లేపనం లా రాస్తే ఎటువంటి మొండి గడ్డలైన, వ్రణము లైనా ఇట్టే తగ్గిపోతాయి. పచ్చని మణుల్లా మెరిసే ఈ పువ్వులు దేవుని పూజకు, మాలకు ఎంతో శ్రేష్ఠము.
మాచీ పత్రం
మాచీ పత్రం |
పసి పిల్లల సంజీవని
పసిపిల్లల జేజి పూజ ప్రారంభమిదే
కిసలయముల నూరి యలద
విసవిసమను వ్రణములన్ని పేరిదె మాచీ ||
ఒకప్పుడు ప్రతి ఇంటా గుబురుగా పెరిగి, నేడు కనుమరుగైన మొక్క మాసుపత్రి. దీనినే మాచీపత్రం అనికూడా అంటారు. ఇవి నేలకు జానెడు ఎత్తున మాత్రమే పెరుగుతాయి. పసిపిల్లల అన్నిరకాల అనారోగ్యాలకు చెప్పదగిన మందు. ఈ మొక్క చిగుళ్లను నూరి పెడితే ఎంతటి వ్రణమైనా (కురుపులు/ పుండ్లు) ఇట్టే తగ్గిపోతాయి. శ్రీ గణేశుని పూజలో తొలి పత్రి ఇదే.
దూర్వాయుగ్మ పత్రం
దూర్వాయుగ్మ పత్రం |
గరిక పోచ యనుచు కడు హీనముగ జూచు
జనుల మనములెల్ల ఝల్లు మనగ
ప్రీతి తోడ మెచ్చె విఘ్నేశ్వరుడు తాను
గరిక నిచ్చినంత గరిమ నిచ్చు ||
శ్రీ గణేశునికి చాలా ఇష్టమైన పత్రులలో మొదటిది గరిక అనబడే దూర్వాయుగ్మం . గడ్డి పోచ అని తక్కువ చేసి పలికే వీలు లేకుండా తనకు ఎంతో ఇష్టమైన ద్రవ్యంగా స్వీకరించారు స్వామి . ప్రేమగా గరికను సమర్పిస్తే చాలు కోరిన కోరికలు తీర్చేస్తారు.
అంచున గాజు పూత ( సిలికాన్) ఉన్న ఈ గరిక రక్తస్రావాన్ని అరికడుతుంది . పిల్లలకు ఆటలలో గాయాలు తగిలి రక్తం కారుతూ ఉంటే గరికను నీటితో కడిగి బాగా నలిపి పెట్టాలి. క్షణంలో రక్తం కారడం తగ్గిపోతుంది . గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని రూపు మాపడానికి అమ్మతం తెచ్చి దర్భలపై ఉంచి మళ్ళీ స్వర్గానికి చేర్చాడట. ఆ దర్భలు ఆనాటి నుండి పవిత్ర మయ్యాయి . వాటి సోదరే ఈ గరిక కూడా .
దత్తూరపత్రం
దత్తూరపత్రం |
దత్తూర మనెడి పేరిట
మత్తేభ ముఖుని కొలువగ మహి నిలచె నిదే
ఉత్తమ మౌ భ్రాంతుల కిది
విత్తులు విషమగు, పొసగవు పెరడుల పెంచన్ ||
శ్రీ విఘ్నేశ్వర పూజలో దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకులను కూడా ఉపయోగిస్తారు. తెల్లని పూవులు, ముండ్ల తో కూడిన కాయలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో నల్లని ఉమ్మెత్తను ఉపయోగిస్తారు. ఈ గింజలు విష తుల్యములు. కానీ ఆకుల రసము భ్రాంతి వంటి మానసిక రోగాలను అదుపు చేస్తుంది. జుట్టు పూర్తిగా తీసివేసి, ఆకుల రసాన్ని తలపై మర్దనా చేయాలి. కొన్ని పత్యాలు పాటించాలి. (స్వయంగా ఏవి ప్రయోగాలు చేయరాదు. వైద్య విధానము సంక్షిప్తం చేయబడుతుంది). ఆరుబయలు లో పెరగవలసిన మొక్కే కానీ, ఇంటి పెరటిలో పెంచదగినది కాదు.
శ్రీ విఘ్నేశ్వర పూజలో దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకులను కూడా ఉపయోగిస్తారు. తెల్లని పూవులు, ముండ్ల తో కూడిన కాయలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో నల్లని ఉమ్మెత్తను ఉపయోగిస్తారు. ఈ గింజలు విష తుల్యములు. కానీ ఆకుల రసము భ్రాంతి వంటి మానసిక రోగాలను అదుపు చేస్తుంది. జుట్టు పూర్తిగా తీసివేసి, ఆకుల రసాన్ని తలపై మర్దనా చేయాలి. కొన్ని పత్యాలు పాటించాలి. (స్వయంగా ఏవి ప్రయోగాలు చేయరాదు. వైద్య విధానము సంక్షిప్తం చేయబడుతుంది). ఆరుబయలు లో పెరగవలసిన మొక్కే కానీ, ఇంటి పెరటిలో పెంచదగినది కాదు.
తులసి పత్రం
తులసి పత్రం |
తులసి పూజ సేయ తులతూగు భాగ్యాన
తులసి నెరుగని దెవ రిలను చూడ
కఫము కోయు మందు కడసారి తీర్థము
తులసి యున్న తావు దొరలు సిరులు ||
తులసి గురించి తెలియని దెవరికి? తులసిలో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, భూతులసి అని మూడురకాలున్నాయి. భూ తులసి గింజలనే సబ్జా గింజలు పేరుతో వేసవిలో చల్లదనానికి నీటిలో నానబెట్టి తాగుతారు.
పసిపిల్లల నుండి పండు ముదుసలి వరకు గొంతు సంబంధ వ్యాధులకు దివ్యౌషధం. దగ్గు, జలుబు, కఫం మొదలగునవి హరిస్తుంది. ఆఖరులో తులసి తీర్థం పోసేది అందుకే… చెప్పదలచుకున్న మాటలు ఎటువంటి ఆటంకం లేకుండా చెప్తారనే…
ఇకపోతే శంఖచూడుడు అనే రాక్షసుని భార్య బృంద. విష్ణువు మాయోపాయంతో శంఖ చూడుడు ను వధించగా, బృంద విష్ణువును శిలగా మారిపోమని శపిస్తుంది. అప్పుడు విష్ణువు బృందను మరు జన్మలో తాను గండకీ నదిలో సాలగ్రామం అవుతానని, బృంద తులసిగా పుట్టి తనను సేవించాలని చెప్తారు.
లక్ష్మీ సరస్వతీ అత్తా కోడళ్ళు అవడం చేత ఇద్దరూ ఒకే వ్యక్తిని కటాక్షించరు అని ప్రతీతి. (విద్య, ధనము లలో ఏదో ఒకటి మాత్రమే కలుగుతుందని..) శ్రీ గణేశుడు విద్యల నాధుడు అయిన పిదప లక్ష్మీదేవి వరం కోరుకోమని అంటే, లక్ష్మీదేవిని తన చెంత ఉండాలని తాను లక్ష్మీ గణపతి నవుతానని, తనని పూజించిన వారికి విద్య, ధనము రెండూ కలగాలని కోరుతారు గణపతి. లక్ష్మీదేవి సరేనంటారు. అలా ఒక్క వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడు విష్ణు స్వరూపం గా తులసి పూజలను అందుకుంటారు. మిగతా రోజుల్లో ఆయనకు తులసి పూజ నిషిద్దం. (శ్రీ గణేశ పురాణం ఆధారంగా) అలా 21 పత్రాల్లో తులసి కూడా చేరింది.
విష్ణు క్రాంత పత్రం
విష్ణు క్రాంత పత్రం |
చిట్టి నీలిపూలు శివుని వెన్నుని ప్రీతి
శ్రీ గణేశు పూజ చేయ నోచె
పూజ లెన్నియైన పూవులెన్నియు నైన
ఔషధమివి యనుచు నాదరించు ||
చిన్ని నీలిపువ్వులున్న ఈ విష్ణుక్రాంత పత్రం శ్రీ గణేశ పూజకు నోచుకున్నది. సంస్కృతంలో వీటిని శంఖపుష్పి అని ఆంగ్లంలో morning glory అని అంటారు. ఆయుర్వేదంలో విష్ణు క్రాంత మొక్క మొత్తం ఆకులు, పూవులు సహా ప్రాధాన్యం ఉంది. విఘ్నేశ్వరు నికే కాకుండా విష్ణువుకు, శివునకు కూడా ఈ పువ్వులు ప్రీతియైనవి. ఈ ఆకులు చెరువు నీటిలో వేసినపుడు , జలచరాలు ఆ ఆకులను తిని, వృద్ది చెంది నీటిని శుద్ధి చేస్తాయట.
బదరీ పత్రం
పూజలందు మనుచు పొసగి వేడె
బదరి మనెడి పేరు పరిఢ విల్లెద వీవు
కాచుపిల్లల ననె గౌరి సుతుడు ||
బదరి లేదా రేగు, ఇది చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధుల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు ఆకులను ప్రతిరోజూ ఒకటి లేదా రెండు పూటలు తినిపిస్తే వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. (ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది).వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు కూడా బదరీ పత్రం పేరుతో ఉంది. ఈ పత్రి గురించి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.
చూత పత్రం
చూత పత్రం |
చూత పత్రమేది? చూడగ తెలియునా?
మామిడదియె కాద మంగళమ్ము
తోరణమున, చేరు తొలి పూజ దేవుని
ఔషధముగ నాకు లమరియుండు ||
శ్రీ గణేశ పూజా పత్రాలలో చూత పత్రం ఒకటి. మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి.
శరీరం కాలినప్పుడు : మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసి ఈ భస్మాన్ని కాలిన గాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది. దంతాలు గట్టిగా ఉండాలంటే : మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటేకూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు.
దాడిమీ పత్రం
దాడిమీ పత్రం |
దాడిమి యను పేర దానిమ్మ పత్రిని
గణపతికిడి మొక్కు ఘనము గాను
పత్రి ఫలము బెరడు బహు గుణముల జూపు
స్వీయ వైద్యమెపుడు చేటు దెచ్చు ||
దానిమ్మ లేదా దాడిమి. విఘ్నేశ్వర పూజలో మరొక పత్రి. ఈ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దానిలో తగినంత చక్కెర కలిపి సేవిస్తే.. ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘ రోగాలే కాక, దగ్గు, వడదెబ్బ, నీరసం నుండి ఉపశమనం కలుగుతుంది. కాళ్ళ వాపులకు ఈ ఆకును వాపు ఉన్న చోట కడితే.. తగ్గుతాయి. ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది కుష్టు వ్యాధికి, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. (కషాయముల వంటివి లోనికి తీసుకునే టప్పుడు వైద్యుని సలహా తీసుకోవాలి. సొంతవైద్యం పనికి రాదు. ఒక్కోసారి వికటిస్తాయి).
దేవదారు పత్రం
దేవదారు పత్రం |
హిమనగముల దొరకు ద్రుమరాజ మీ మాను
దేవదారు యనెడి దేవ తరువు
పుణ్య తీర్ధ వాసి పుణ్య జల విలాసి
అమ్మ పెంచు పత్రులమరె నిచట ||
బహు పుణ్యప్రదమైన హిమాలయాలలో పరమ పావని గంగానది కాలుపెట్టిన చోట పుట్టిన చెట్లు ఈ దేవదారు వృక్షాలు. పార్వతీదేవి పుట్టినింట పుట్టిన చెట్లు అంటే ఆమెకు ఎంత ఇష్టమో చెప్పనవసరం లేదు. ఆ చెట్టు బెరడు ఔషధం. నిలువెత్తున పెరిగే ఆ చెట్ల సొగసు ఎవరూ పాడుచేయకుండా సింహాలను కాపువుంచినదట హైమవతి. మరి ఆమె ముద్దుల తనయుని పూజించడానికి కావలసిన పత్రులలో చేరడానికి ఇంతకంటే ఏం కావాలి? దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు ,కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.
(ఎవరైనా హిమాలయాలకు వెళితే పార్వతీదేవికి, చెట్టు పెంపకందారుకు, ముఖ్యంగా దేవదారు చెట్టుకు క్షమాపణ చెప్పుకుని పిడికెడు ఆకులు కోసుకుని తెమ్మని చెప్పండి. ఆ ఆకుల్ని నీరు, పసుపు, కుంకుమ, గంధము, పాలతో అభిషేకించి, పూజించి, మళ్ళీ అపరాధ నమస్కారం చేసి, transparent పొలిథిన్ కవర్ లో సీల్ చేసి ఉంచి, ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరునికి ఒకసారి వినాయక చవితినాడు చూపించండి. ఏం చేస్తాం? మన ప్రాంతంలో లభించదు కదా)
మరువక పత్రం
మరువక పత్రం |
మరువకమని పిలుచు మరువం మనసెరుగు
మల్లె కాగడాల మధ్య చేర్చి
కలిపి కట్ట నెర్ర కనకాంబరాలకు
సరియగు జత నౌదు సరసులార ||
శ్రీగణేశు పూజలో మరొక దివ్య పత్రం మరువక పత్రం. దీనికే మరొక పేరు మరువం. మగువల పాలిటి మరులు తీగ… మరువానికే మాటలు వస్తే, “మల్లెలు, కాగడా మల్లెలు, కనకాంబరాలతో నన్ను చేర్చి కట్టండి, మీ జడలో పెట్టండి, ఎంత అందమో చూడండి” అనదా?
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. చర్మవ్యాధులను తగ్గిస్తుంది. హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది. కాబట్టి వేడినీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే శరీర దుర్వాసన మాయమవుతుంది.
సింధువార పత్రం
సింధువార పత్రం |
సింధువార పత్రి శ్రీగణేశు కొలిచె
వావిలాకు పేర వాడుకగను
వాత పట్లు తొలగు బాలింతలకు పూయ
చూడ బిల్వమట్లు చూపుకట్టె ||
సింధువార పత్రం పేరిట శ్రీ వినాయకుని కొలిచే మరొక పత్రం వావిలాకు. బాలింతలకు 11 వ రోజున చేయించే శుద్ధి స్నానమునకు వేడినీటిలో ఈ వావిలాకులు వేస్తారు. వాతపట్లు హరిస్తుంది. చూడటానికి బిల్వపత్రాల్లా అనిపిస్తాయి. మారేడు వృక్షంలా ఎదుగుతుంది కానీ వావిలి చిన్న మొక్క మాత్రమే.
తాటి పత్రం
తాటి పత్రం |
తాళ పత్రమనుచు దాచె గుట్టుల నెన్నొ
కప్పు వేయనగును కమ్మలిట్టె
నీర, ముంజె, రసము మారె నౌషధముగ
కనగ పేదవాని కల్పతరువు ||
తాళము అనే పేరిట తాటి చెట్టు ప్రఖ్యాతి పొందింది. తాటియాకులపై ఎన్నో మహాగ్రంధాలు రాయబడ్డాయి. నీర (సూర్యోదయం అవక పూర్వపు తాటికల్లు) అమృతంతో సమానం. (ఆలస్యం అమృతం విషం సామెత ఇలా పుట్టిందే) తాటి ముంజెలు చలువ చేస్తాయి. తాటిపండ్ల రసంతో చేసిన తాటిబెల్లం ఆయుర్వేద ఔషధం. ఆకులు పైకప్పుగా, మాను వాసాలుగా, బోదెలుగా పనికి వస్తాయి. పీచును తడపలు అంటారు. తాళ్ళు నేస్తారు. వంటచెరకుగా కూడా తాటిచెట్టు పనికివస్తుంది. ఒక విధంగా పేదవాని పాలిటి కల్పవృక్షం ఈ తాటిచెట్టు.
జామ
జామ |
పెరటి చెట్టు జామ పెంచు దంత పటిమ
తెలుపెరుపుల జామ విలువ హెచ్చు
గుణములందు జామ కొండంత మేలిచ్చు
నాకు బెరడు పండు నౌషధములె ||
జామపండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటి పెరడులో జామచెట్టు సర్వసామాన్యం. జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. జామపండ్లు ఎరుపు, తెలుపు రంగులలో లభించినా, గుణాలలో రెండు ఒకటే.
మందార
మందార |
నల్లని తలకట్టు నిలువ
చల్లని మందార చాలు జల్లను కురులున్
కొల్లలుగ వన్నె కూర్చుకు
నుల్లము దోచు సుమమిది శుభోదయ వేళన్. ||
మందార.. కుంకుడు కాయలతో కలిసి శిరోజాలకు చక్కని నల్లని రంగును, పట్టులాంటి మృదుత్వాన్ని ఇస్తుంది. కానీ సాంప్రదాయకమైన ఈ అలవాటును మాని మందార, కుంకుడు ఉన్న షాంపూలు వాడి ఉన్న జుట్టు ఊడగొట్టుకుంటున్నాం. రకరకాలైన మందారపూలతో దేవుడికి పూజ చేస్తే ఆ తృప్తే వేరు.
బ్రహ్మకమలం
బ్రహ్మకమలం |
మంచు కొండలందు మహనీయ పుష్పాలు
బ్రహ్మ కమలమనెడి రాచ విరుల
విచ్చుకొనిన పూల వీక్షణ స్వల్పము
స్వర్ణపుష్పమనుచు వాసికెక్క ||
హిమాలయాల్లో పెరిగే అరుదైన మొక్క ఈ బ్రహ్మకమలం. అర్ధరాత్రి ఎప్పుడో వికసించి, రెండుమూడు గంటలు మాత్రమే ఉంటుంది. అందుచేత వికసించి ఉండగా చూసిన వాళ్ళు తక్కువ. బ్రహ్మ పుట్టిన పువ్వు ఇదే అని, శివుడు ఏనుగు తలను బాలునికి అమర్చగా ఈ పువ్వు తాకించి బ్రహ్మ పునరుజ్జీవితుని చేశారని పురాణ గాథ. టిబెటన్లు ఈ మొక్క మొత్తంగా ఔషధంగా వివిధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
పారిజాతం
పారిజాతం |
హనుమ వాసముండు అందాల పూతర్వు
సత్య భామ కోరె స్వర్గ సుమము
కృష్ణ మూర్తి తెచ్చె వృక్ష రాజమ్మునే
శిరసు దాల్చరాదు నరుడు కోరి. ||
పారిజాతం అనగానే హనుమంతుడు నివాసం ఉంటారని, సత్యభామ కొరకు శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి తెచ్చి ఇచ్చారని చప్పున గుర్తుకు వస్తుంది. ఈ పువ్వులు దేవతా పుష్పాలు కాబట్టి మనుషులు ధరించరాదు అని ఒక నమ్మకం.
శరీరానికి వేడి చేసినపుడు ఆకులు , పువ్వులు కలిపి నూరి నుదుటిపై పట్టు వేస్తే 5 నిమిషాలలో ఆ ముద్ద వేడి ఎక్కిపోతుంది. తీసివేసి, మళ్ళీ మరొక ముద్దను పట్టుగా వేయాలి. ఇలా ముద్ద వేడెక్కనంత వరకు వేయాలి. ఒంట్లో వేడి తగ్గిపోతే ముద్ద కూడా చల్లగానే ఉంటుందట. ఇంట్లో (పెరటిలో) పారిజాతం పెంచుకోవచ్చు కానీ గొంగళిపురుగుల బాధ ఎక్కువ.
జాజి పత్రం
జాజి పత్రం |
కనులకు చలువను గూర్చుచు
మనముల హాయి కురిపించు మధు వీచికలన్
సన సన్నగ జాల్వార్చెడి
వినాయకుని పూజ పత్రి విను జాజి యిదే ||
జాజి పత్రి శ్రీ గణేశుని పూజా పత్రులలో ఒకటి. ఆకులు, పూవులు కూడా కళ్ళకు చలువను కూర్చుతాయి. ఆకులను నూరి కళ్ళు మూసికొని పై రెప్పలపై కాసేపు ఉంచినా, పువ్వులను యధాతధంగా కంటి రెప్పలపై పరచినా క్షణాల్లో అలసిన కనులు సేదతీరుతాయి. ఇక ఈ పూల సువాసన సంగతి చెప్పేదేముంది? ఇంటి ముందు కాసింత స్థలం ఉంటే జాజి తీగ పాకించని దెవరని???
గండకి పత్రం
గండకి పత్రం |
గండకి యను పేర నిలచి
గండములను తీర్చు సామి కాళ్లకు మొక్కన్
మెండుగ నిలిచిన పత్రిది
రండో విఘ్నేశ్వరునికి ప్రార్ధన సేయన్ ||
గండకీపత్రం దీనిని తీగగరిక అని కూడా పిలుస్తారు. దీని రసం అపస్మారక స్థితిని, పైత్య వికారాన్ని మూర్ఛలను తగ్గిస్తుంది. నులి పురుగుల్ని, వాటి వలన వచ్చే వ్యాధులను కూడా తగ్గిస్తుంది. శ్రీ గణేశుని పూజా పత్రాలతో గండకి పత్రం ఒకటి.
అశ్వత్థ పత్రం
అశ్వత్థ పత్రం |
మూల బ్రహ్మ, విష్ణుమూర్తి మధ్య చివర
శివుడు గల పవిత్ర చెట్టు రావి
విఘ్ననాయకునకు వినయంపు పత్రమై
పూజ సేయ వచ్చె రాజతరువు ||
విశ్వరూప సందర్శనంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు “వృక్షాల లోకెల్ల విశేషమైన అశ్వత్థ వృక్షమును అర్జునా నేను” అని తెలియజేసారు. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటపుడు “మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ, అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమః” అని శ్లోకం చదువుకోవడం కూడా పరిపాటి. అంత గొప్ప వృక్షం కూడా శ్రీ గణేశుని పూజలో పత్రమై వినయంగా ఒదిగిపోయింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నది రావి చెట్టు.
ఆయుర్వేదం లో శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో రావి ఆకులను, విత్తులను, మండలను (చిన్న , లేత కొమ్మలు) ఉపయోగిస్తారు.
అర్క పత్రం
అర్క పత్రం |
హాలాహల బిందువొకటి
పాలకడలి నురుగుల బడ పాషాణమయెన్
లీలను అర్కంబుగ నా
నీలగ్రీవు తనయుండు నేలను చేర్చెన్ ||
పాలసముద్రాన్ని మధించి నపుడు హాలాహలం ఉద్భవించడం, శివుడు ఆ గరళాన్ని గ్రోలి తన కంఠాన దాల్చడం అందరూ ఎరిగినదే… ఆ గరళం లోని ఒక చుక్క పాలసముద్రంలో పడగా, చిలుకుతున్న నురుగులో కలిసి సముద్ర జీవులన్ని మరణిస్తున్నాయట. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆ నురుగను ఒడ్డుకు మళ్లించగా ఒక మొక్కగా రూపు దాల్చింది. (ఇప్పటికీ జిల్లేడు విత్తనం నీటి బొట్టు ఆకారంలో ఉండటం మనం గమనించవచ్చు). జీవులకు హాని చేయవద్దని దానికి చెప్పి, సూర్యకిరణాలతో ఆ విషాన్ని విరిచి, పూజార్హత కల్పించాడట గణేశుడు. అంతే కాకుండా వైద్యానికి పనికి వచ్చే విధంగానూ, ముదిరిన జిల్లేడు వేరులో తన రూపు వచ్చే విధంగానూ, తనకు నచ్చిన ఉండ్రాళ్ళను జిల్లేడు కాయల ఆకారంలో చేసి నైవేద్యం పెట్టే విధంగా అనుగ్రహించాడట. సూర్యుడు కూడా రధసప్తమి నాడు జిల్లేడు ఆకులు తలపై దాల్చి, స్నానం చేసిన వారికి ఆయురారోగ్యాలు సమకూరుతాయని వరమిచ్చాడట. ఆనాటి ఆ అర్కమే నేటి జిల్లేడు. (ఇంటి పరిసరాలలో జిల్లేడు మొక్క నలుపైనా, తెలుపైనా పెరిగితే, ఇంటికి అడ్డం అనిపిస్తే, సమూలం కొట్టివేయవద్దు. కొమ్మలు కత్తిరించి మొక్క పెద్దగా ఎదగనివ్వకుండా చూడండి. కొన్ని సంవత్సరాలు అలాగే చేయండి. దాదాపు పది/పదిహేను సంవత్సరాలు పోయిన తర్వాత తిథి, వార, నక్షత్రాలు చూసుకుని, ముందురోజు చెట్టు మొదట్లో పాలుపోసి నమస్కరించి, మర్నాడు కొట్టబోతున్నామని అనుమతి అడగండి. సూర్యోదయం కాగానే దోసెడు నీళ్లుపోసి పసుపు కుంకుమలతో పూజించి వేరుకు తగలకుండా జాగ్రత్తగా తవ్వి తీస్తే విఘ్నేశ్వరుని రూపు ఆ వేరుపై కనిపిస్తుంది. జాగ్రత్తగా కడిగి, నీడన ఆరబెట్టి పచ్చి పోయిన తర్వాత ఆకారం వరకు కత్తిరించి బీరువాలో భద్రపరచుకోవచ్చు. లేదా పూజస్థలంలో పెట్టుకోవచ్చు)
కరివేపాకు
కరివేపాకు |
వేపకాదిది కరివేప కమ్మని రుచి
తీసివేయ వద్దు తినగ ముద్దు
ఏ విటమిను నిచ్చు నేది సాటికి రాదు
పోపు ఘుమఘుమలను పోల్చి చూడు ||
పేరు లో మాత్రమే వేప. చేదు ఉండదు పైగా కమ్మని సువాసన, రుచి కూడా… అదేనండి కరివేపాకు. కూరల్లో వేస్తాము, కానీ తినేటప్పుడు తీసిపారేస్తాము. అలా చేయకూడదు. ఏ విటమిను అధికంగా ఉంటుంది. కంటికి, గోళ్లకు, జుట్టుకు చాలా మంచిది. చారుకు, పులిహారకు కరివేపాకు లేకుండా తాలింపు ఉహించగలమా? పచ్చడి చేసినా, పొడి చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నా… అబ్బో….
కొత్తిమీర పత్రం
కొత్తిమీర పత్రం |
కొత్తిమీర చూడ ఘుమఘుమలు రుచియే
ధనియపాకు లివియె కనగ మంచి
కూర పచ్చడులకు కొండంత రుచినిచ్చు
కడుపు శుభ్రపరచు కాంతి పెంచు ||
నేల వేము
నేల వేము |
పేరు పోలికొకటి తీరు దానిని మించి
ఒక్క ఆకు చాలు మొక్క నుండి
చంటి పిల్లలకును సామాన్య రోగాల
అంతు చూచి వదలు అమృత పత్రి ||
పల్లెల్లో నివసించేవారు చిన్నతనం నుంచి శారీరక దృఢత్వం కోసం అనేక మందులు తినిపిస్తారు. వాటిలో ఒకటి ఈ నేలవేము. చూడటానికి చిన్న మొక్కలా ఉంటుంది. ఒక్క ఆకు తీసి నోట పెట్టుకుంటే భరించలేని చేదు. నేలవేము , పసుపు కలిపి నూరి ప్రతిశనివారం పిల్లలకి దాదాపు పది సంవత్సరాలు వయసు వచ్చేవరకు తాగిస్తారు. *చేదు* అంటారు. జీర్ణవ్యవస్థ లోని ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.
మునగ పత్రం
మునగ పత్రం |
మునగ ఔషధమ్ము మున్నూరు రోగాల
మునగ తినిన చాలు ముదిమి రాదు
మునగ కాయ, జిగురు పువ్వులు మందులే
మునగ నెక్కరాదు మూతి పగులు ||
మునగ ఆకులు చాలా బలమైన ఆహారం. వేర్లు, ఆకులు, కాయలు, జిగురు, విత్తనాలు వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా ఎరువుగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 శాతం వరకు పెరుగుతుంది
నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కంటిచూపు తగ్గినా, అల్జీమర్స్, ఎముకల, కీళ్ల నొప్పులు , స్త్రీల వ్యాధులు, రక్తహీనత ఇంకా ఎన్నో కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.
ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్ వెరైటీలూ కోఫ్తాలూ… అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో… ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ.
ఈ ఆషాఢ మాసంలో మునగాకు, తెలకపిండి (నువ్వుల నూనె గానుగలో ఆడగా వచ్చే పిండి) , వెల్లుల్లి కలిపి కూరగా చేసుకుని ఒక్కసారైనా తినాలంటారు. ఇన్ని విశేషాలు ఎందుకు… మునగ తింటే మూడు వందల రకాల జబ్బులు పరార్…మునగ విషయంలో చేయకూడనిది ఒక్కటే… మునగచెట్టు ఎక్కడం. చెట్టు పెళుసు. ఎక్కితే కొమ్మ విరిగి , మూతి పగలవచ్చు. ఇంకేదైనా కూడా అవవచ్చు.
రణపాల పత్రం
రణపాల పత్రం |
పర్ణబీజమనుచు ప్రఖ్యాతి నొందిన
పత్రమిదని తెలియ చిత్రమగును
బాహ్య వర్తనమున పరమౌషధ మిదియే
మందమగు దళములు సుందరమ్ము ||
-నాగమంజరి గుమ్మా-
రణపాల.. నామ సార్ధక్యము తెలియదు కాని, ఆకు చివరల నున్న కణుపుల నుండి కొత్త మొక్కలు పుడతాయి కనుక *పర్ణబీజ* మయ్యింది. ఇక లోపలికి కషాయం గా తీసుకుంటే మూత్రపిండాలలోని రాళ్లు కరుగుతాయి అన్న విషయానికి *ఆయుర్వేద నిరూపణ లేదు* కానీ సెగ గడ్డలు, పొత్తికడుపు నొప్పులకు మాత్రం ఆకును కాస్త వేడి చేసి, ఆముదం రాసి సెగ గడ్డపై లేదా పొత్తికడుపుపై వేసి కడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దళసరిఆకులు, ఎర్రని చిన్న పువ్వులు కలిగి అలంకరణ మొక్కలుగా కూడా బావుంటాయి. ఇంట్లో కుండీలో పెంచుకోదగిన మొక్కల్లో ఇది ఒకటి.
చింత
చింత |
లేత చింత చిగురు, పూత, కాయలు, పండు
మాను తదితరములు మంచి మందు
సీ విటమిను ప్రోవు చింతయే యెరుగుము
రోజు తీసుకున్న రోగముడుగు ||
రోగనిరోధక శక్తి కలిగించే సి విటమిన్ ఎక్కువగా కలిగింది చింత. లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడుతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.
గమనిక:
పై నుదహరించిన ఆరోగ్య సూత్రాలు మరియు చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.