దానం, త్యాగం |
దానం, త్యాగం - Dhyana, Tyagam
త్యాగానికి, దానానికి తేడా ఏమిటో పురాణాలు తెలియజేశాయి. మన అవసరాలు తీరిపోయాక ఇచ్చేది దానం. మనకన్నా ఎదుటి వారి అవసరం ఎక్కువని భావించి ఇవ్వడం త్యాగం.
కొందరు పాతబట్టలు, పాత్రలు, రాత్రి తినగా మిగిలిన ఆహార పదార్థాలు లాంటివి పేదలకు ఇస్తారు. నిజానికి అది దానం కాదు. అన్ని మతాల్లోనూ దానానికి పెద్ద పీట వేశారు. దాన్ని దైవ సేవగానే పరిగణించారు. దానం మూడు విధాలన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రత్యుపకారం చేసే శక్తి లేనివారికి, సందర్భోచితంగా చేసే దానం సాత్వికం. అంటే ఫలాపేక్ష లేకుండా సమయం, సందర్భం, ఔచిత్యాలను బట్టి చేసే దానం సాత్విక దానం. ఏదో ఒక ప్రత్యుపకారాన్నీ, ప్రతిఫలాపేక్షనూ ఆశించి.. కష్టం అనిపించినా సరే చేసే దానం రాజసికం. అవతలి వారివి నిజమైన అవసరాలు అవునో కాదో గుర్తించకుండా నిర్లక్ష్యంతో ఔచిత్యంలేని దానం చేస్తే అది తామసం.
త్యాగం గురించి తెలియడానికి విద్యతో పనిలేదు. స్పందించే మనసుంటే చాలు. శిబిచక్రవర్తి త్యాగం అత్యున్నత మైనదిగా కీర్తించాయి ఇతిహాసాలు. పేరు ప్రతిష్ఠలకోసం చేసేది త్యాగం కాదు. నిజమైన త్యాగశీలులు ప్రత్యేకించి గౌరవాన్ని కోరుకోరు. త్యాగశీలత గురించి భర్తృహరి ‘త్యాగం అనేది నేర్చుకుంటే వచ్చే గుణంకాదు. స్వతహాగా ఉండే సద్గుణం. ఇది అత్యుత్తమ, అత్యున్నత భావన. ‘నేను త్యాగం చేస్తున్నాను’ అనే ఆలోచన లేకుండా చేసేది ఉత్తమ త్యాగం’ అన్నాడు. మహర్షులు పూజ, జప, తప, దాన, హోమాదులు చేసిన తర్వాత వాటికి సంబంధించిన ఫలం పరమేశ్వరుడికి చెందాలని ‘ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు’ అంటూ అర్పించేవారు. ఇది అన్నింటికంటే ఉత్కృష్టమైన త్యాగంగా పురాణాలు అభివర్ణించాయి.