గీతామకరంద ప్రకాశకులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు
(ఏప్రిల్ 13 – శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు జయంతి)
హిందూ సంస్కృతిని పునరుజ్జీవనం కల్పించేందుకు ఎందరో మహానుభావులు ఈ కర్మభూమిపై ఉద్భవించారు. సమాజంలో ధార్మిక, ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగించి అజ్ఞానాంధకారాన్ని, అసమానతలను తొలిగించారు. తమ బోధనల ద్వారా, ఆచరణ ద్వారా, రచనల ద్వారా కోట్లాది మందిని ప్రభావితం చేసి సమాజాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్య పథంలో నడిపించారు. అటువంటి మహనీయులలో ఒకరు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు. ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యం కల్పించడం, సమాజంలో పాతుకుపోయిన అంధ విశ్వాసాలను, అసమానతలను తొలిగించడం, పేదలకు విద్యా, వైద్యం, ఆహారం, వస్త్రాలు అందించడం, యావత్ సమాజోద్ధరణ కార్యమే తన కర్తవ్యంగా భావించి ఆజన్మాంతమూ ధర్మోద్ధరణ కార్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహించిన నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవకారులు ఆయన..
శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు ఆనంద నామ సంవత్సరం చైత్ర బహుళ తదియ నాడు అనగా 1914 ఏప్రిల్ 13న బందరులో రామస్వామి, సుశీలాదేవి దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు ఆనంద మోహన్. చిన్నతనంలోనే ఎంతో ప్రజ్ఞా ప్రాభవం ప్రదర్శించిన ఆనంద్ మోహన్ ఒకసారి వేటపాలెంలోని సారస్వతనికేతనంలో ఆనాటి ప్రభుత్వ ఆస్థాన కవి శ్రీ కాశీకృష్ణాచార్యుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేద ప్రతిపాదితాలైన బ్రహ్మచర్య ధర్మాల గురించి అనర్గళంగా తన వాక్పటిమతో సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉపన్యసించి సభలోని విద్వాంసులను పెద్దలను ఆశ్చర్యచికితుల్ని చేశారు. బ్రహ్మశ్రీ కాశీకృష్ణాచార్యులవారు ‘‘ఈ బాలబ్రహ్మచారి భవిష్యత్తులో గొప్ప యతీశ్వరుడు కాగలడు, ఇతని కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది,’’ అని ఆశీర్వదించారు.
ఆనంద మోహన్ చదువు అందరిలానే సర్వసాధారణంగానే సాగింది. మెట్రిక్యులేషన్ వరకు విజయవాడలోను తర్వాత డిగ్రీ మచిలీపట్నంలో పూర్తి చేశాడు. 1933లో బి.ఏ. పట్టా పుచ్చుకున్న ఆనందుడు ఉన్నత చదువుల కోసం వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. అక్కడే ‘కోవిద’ పరీక్ష పూర్తి చేశారు. ఒకసారి గంగానదిలో స్నానమాచరిస్తుండగా అతని చేతిలోకి తాళపత్రాల్లో లిఖించబడిన భగవద్గీత ప్రత్యక్షం అయింది. ఈ సంఘటనతో ఆయనకు కర్తవ్యం బోధపడింది. గీతా సారాన్ని అందరికీ చేరవేయాలని సంకల్పించారు. 1936 మే 17న ఆనందుడు ఆశ్రమ ప్రవేశం చేశాడు. శ్రీ సద్గురు మళయాళ స్వామి సారథ్యంలో తపోనిష్టతో కూడిన సాధనానుష్టానాలు ప్రారంభించారు. అపక్వాహారాన్ని స్వీకరిస్తూ గురు సన్నిధిలో 12 సంవత్సరాలు తపస్సాధనలో అనేక గ్రంథాలను రచించారు. ‘‘యోగవాసిష్ఠం’’ను అనువదించడమే కాక ‘‘ధర్మపథం’’ను ఆంధ్రానువాదం చేశారు. గురుదేవుల ఓంకార సత్రయాగంలో చెప్పిన దివ్యప్రబోధాలను గ్రంథ రూపంలో అందించారు. శిష్యుని పురోగతిని గమనించిన గురుదేవులు ఆయనకు పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి సన్యాస స్వీకారానికి ఏర్పాటు చేశారు. గిరి సంప్రదాయానుసారంగా ఆనందుడికి శ్రీ విద్యాప్రకాశనందగిరిగా నామకరణం చేశారు.
గురువు మళయాళ స్వామి శ్రీ వ్యాసాశ్రమం స్థాపిస్తే ఆయన శిష్యుడైన విద్యాప్రకాశనందగిరివారు వ్యాసుని కుమారుడైన శుకముని పేరు మీదుగా 1950వ సంవత్సరంలో శ్రీ శుక బ్రహ్మ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమం చిత్తూరు జిల్లా ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో సువర్ణముఖీ నదీ తీరాన ఉంది. 1956 సంవత్సరం నుండి శ్రీ సనాతన వేదాంత సభలకు శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు అధ్యక్ష స్థానం వహించారు. శ్రీమలయాళ స్వాములవారి అనుజ్ఞ, ఆశీస్సులతో విద్యాప్రకాశనందగిరి స్వాములవారు గీతాజ్ఞాన యజ్ఞాలను 1957లో ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో మొదటి గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించగా హైదరాబాదులో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో నూరవ గీతాయజ్ఞాన్ని ఆయన పూర్తి చేశారు.
శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరుల వారి ప్రవచనాలను పండితులు, పామరులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలకులు తన్మయులై శ్రద్ధగా వినేవారు. వేదాంతభేరి అనే ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించి వేదాంతపరమైన అనేక విషయాలపై వివరణ ఇచ్చారు. అనేక కథల ద్వారా ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించారు. అదే సమయంలో గీతామకరందం అనే గ్రంథాన్ని వెలువరించారు. ఆయన తన గురువులు మాదిరే జ్ఞానపుష్పం, వివేకానంద సింహనాదం, మోక్ష సాధన రహస్యము, తత్వసారము, మానసబోధ, అమృత బింధువులు, ఆత్మ తత్వ విచారణ, ఉపనిషద్రత్నాకరము, రామాయణ రత్నాకరము, పాండవగీత, వాసిష్ఠ మహా రామాయణము, ఆత్మానుసంధానము ఇలా పలు రచనలు చేశారు.
విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు వేదాంత కార్యక్రమాలతో పాటు మానవసేవయే మాధవ సేవగా భావించి విద్యాలయాలను, ఉచిత కంటి వైద్యశాలను నిర్మించారు. విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు ప్రధానంగా ఐదు సందేశాలు ఇచ్చారు. వాటినే పంచామృతాలు అంటారు. హిందూ ధర్మం పట్ల సరైన అవగాహన లేకపోవడం వలనే మత మార్పిడులు జరుగుతున్నాయని, హిందూ ధర్మాన్ని తెలియజేసి తగిన సదుపాయాలు కలిగిస్తే మతం మారాల్సిన అవసరమే రాదని సందేశం ఇచ్చారు. ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను జనసమూహంలోకి తీసుకువెళ్లి ప్రచారం చేస్తే ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందని దిశానిర్దేశం చేశారు. తన శిష్యుడైన విద్యా స్వరూపానంద స్వామిని తన వారసుడిగా ప్రకటించి విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు చైత్ర శుద్ధ చతుర్దశి నాడు అనగా 1998 ఏప్రిల్ 10న మహాసమాధి పొందారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన వెలిగించిన ఆధ్యాత్మిక జ్యోతులు నిత్యం మన జీవితాలకు వెలుగులను ప్రసాదిస్తూ ఉంటాయి. విద్యాప్రకాశనందగిరి స్వాములు చూపిన మార్గంలో పయనించడమే మనం ఆయనకు ఇచ్చే నివాళులు.