శ్రీ రామచంద్రుడు - Sri Ramachandra |
శ్రీ రామచంద్రుడు భారత ప్రజల ముందు ఆదర్శమానవుడిగా, మర్యాదా పురుషోత్తముడుగా ఆవిష్కృతుడయ్యాడు. రామాయణ కావ్యకర్త వాల్మీకి ఆయనను మానవాతీతుడు, అలౌకికుడు, దైవిక శక్తులు గల అవతారమూర్తిగా కాకుండా మానవుని సుగుణాలు, అనురాగాలు, శక్తియుక్తులతోనే వర్ణించాడు.
శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు, బుద్ధ భగవానుడు… వీరంతా మానవునికి మార్గదర్శకులైన అవతారపురుషులు, కాని ప్రజల బలహీనతవల్ల వారి పేర్లను నిరర్థకంగా వల్లిస్తూ కూర్చుంటున్నారు. శివాజీ, లోకమాన్య తిలక్, మహాత్మాగాంధీని కూడ ప్రజలు ఆవతార పురుషులను చేసేశారు. వారిని నిర్జీవమైన పూజావిగ్రహాలుగా చేసేశారు. శ్రీరాముడిని గుణాలు కలిగిన మానవుడుగా మన ముందుంచాడు. ఆయన పితృభక్తి, భ్రాతృవాత్సల్యం, భార్య పట్ల గాఢానురక్తి స్వచ్ఛమైన, హృదయవు లోతులను కదిలించివేసి ఆయనను అందరికీ ఆప్తుణ్ణి చేస్తాయి. మానవుని దైనందిన జీవితంలోని పరమ రమణీయంగా వర్ణితమైన ఈ గుణాలు సామాన్యులు సయితం తమను తాము సరిదిద్దుకోవడానికి, బాగుపరచుకోవడానికి స్ఫూర్తినిస్తాయి. ఆయన పడిన బాధలు, తల్లిదండ్రులను వదలినప్పుడు, ఆ తర్వాత సీతావియోగం సంభవించినప్పుడు చూపిన మనోనిగ్రహం, చివరకు వినాశకరశక్తుల పైన సాధించిన విజయం.. ఇవన్నీ మన అశలను చిగురింపచేస్తాయి. మనలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని పూరిస్తాయి. మానవునికి ముఖ్యంగా నాయకునికి ప్రజల బాధ్యత ఉంది. దేశ కాలపరిస్థితులను బట్టి ఈ సామాజిక బాధ్యత నాయకుడిని ఒక ప్రవక్తగానో, ఒక మత సంస్కర్తగానో, సాంఘిక సంస్కర్తగానో, ఒక రాజనీతివేత్తగానో మలుస్తుంది. వాల్మీకి కీర్తించిన రామచరితంలో శ్రీరామచంద్రుడిలో ఈ లక్షణాలన్నీ ప్రకటితములయ్యాయి.
రామరాజ్యానికి కేంద్రం ధర్మం
రామరాజ్యంలో శాంతి వెల్లివిరిసింది. ప్రజలు ధర్మాన్ని అనుసరించారు; సుఖసంపన్నం, వైభవ సంపన్న జీవనాన్ని గడిపారు. పరిస్థితిని ఆకళింపు చేసుకోవడంలోని ఆయన సామర్థ్యం, నిశిత రాజకీయ దృష్టి, రాజనీతి నేతృత్వం, వ్యక్తిగతమైన త్యాగాలను ప్రజాసేవకు, దుష్ట సంహారానికి, సాధుసంరక్షణకు వినియోగించారు. ధర్మాన్ని రక్షించడంలో ఆయన కృషి విజయవంతమైంది (ధర్మమంటే సమాజాన్ని కలిపి ఉంచేది. వికారాలన్నిటినీ తొలగించి, విభేదాలను సమన్వయపరచి, పరస్పర వైమనస్యాన్ని రూపుమాపి, సుసంపన్నమైన వైవిధ్యంలో నిహితమై ఉన్న ప్రజల మౌలిక ఏకత్వాన్ని గుర్తింపజేసేది). శ్రీరామచంద్రుని జీవితంలోని ఈ అంశాలను, నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను జాగ్రత్తగా అధ్యయనం చేయవలసి ఉంది. మన దేశంలో రామరాజ్యాన్ని స్థాపించాలంటే ఆయనలోని విశిష్టాంశాల ఉపదేశాలను జీర్ణించుకోవాలి, అనుసరించాలి.
రామరాజ్యం నేటికీ స్ఫూర్తిప్రదం
అధునాతన యుగంలో మానవుడు అధికారికంగా రాజకీయ జీవి అవుతున్నాడు. రాజకీయ ఆశయాలు ప్రబలంగా ఉన్న ఈ రోజులలో కూడా బ్రిటిషుపాలకులను పారద్రోలడానికి శ్రీరామచంద్రుడు ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాడు. మరాఠీ పత్రిక ‘కాల్’ సంపాదకుడు స్వర్గీయ శివరామ్ మహాదేవ వరంజపే రాక్షస సంహారకుడైన కోదండరాముని సాహసకృత్యాలను గుర్తుచేశారు. అలా విదేశీ ఆధిపత్యాన్ని ప్రతిఘటించడానికి దృఢ నిశ్చయాన్ని ప్రజలలో ప్రజ్వలింపజేయడానికి కృషి చేశారు. తమను తాము బాగుపరచుకోవడానికి, ఆర్థికంగా ఉన్నతిని సాధించడానికి ప్రజలకు స్ఫూర్తి ఇచ్చేందుకు మహాత్మాగాంధీ ఆ ‘రామరాజ్యాన్ని’ వారిదృష్టికి తెచ్చాడు.
విశుద్ధమైన వ్యక్తిగత శీలం, ప్రజల కష్టాలతో మమేకం కావడం, నిరాడంబర జీవితం, అజేయమైన సైనికశక్తితోను, రణకౌశలంతోను, దురాక్రమణ శక్తులను నిర్జించడం ద్వారా కష్టాలను తొలగించడం, సత్యం పట్ల ప్రేమ, మాట నిలుపుకునేందుకు ఎంతటి త్యాగానికికైనా సిద్ధపడాలన్న సంకల్పం, ప్రజాభ్యున్నతి కోసం సంపూర్ణంగా అత్మార్పణ చేయడం వంటివి రామరాజ్య స్థాపనకు నాయకులకు ఉండవలసిన లక్షణాలు.
దేశమంతా నిరాశా, నిస్పృహలలో మునిగి ఉన్నట్లు కనపడుతూన్న ఈ తరుణంలో, నాయకత్వం వహించేవారికి రామచంద్రుని ఈ గుణగణాలు ఆశారేఖలు కాగలవు, తరతరాలుగా ప్రజలకు అడుగడుగున తోడునీడగా, అండగా, శక్తి శ్రోతస్సుగా, దివ్యజ్యోతిగా ఉన్న శ్రీరామచంద్రుడు, శబరి అందించిన అడవి పండ్లను స్వీకరించినట్లుగా ఆయన దివ్యస్మృతికి అంకితం చేసిన ఈ భావ ప్రసూనాలను స్వీకరించునుగాక! మన కృషిద్వారా మన భరతభూమిలో రామరాజ్య స్థాపనకు ఆయన మనకు సన్మార్గాన్ని ప్రసాదించునుగాక!
రుషి, ద్రష్ట అయిన వాల్మీకి తానా మహాకావ్యాన్ని ఎవరికోసం రాస్తున్నాడో ఆ ప్రజల మానసిక ప్రవృత్తిని సరిగా ఆకళింపు చేసుకున్నాడు. అవతార పురుషుల జీవితాలు పురుషకారంలేని భక్తితో జపించదగినవి మాత్రమేననీ, అనుసరించడానికీ, ఆచరణలో పెట్టడానికి కావనే బలహీనత ప్రజలలో ఉన్నదని ఆయన గుర్తించాడు. ఈ బలహీనత ప్రజలను తిరోగమనవాదులుగాను, అలసులుగాను, ఆ కారణాన పతనోన్ముఖులుగాను మాత్రమే చేస్తుంది. తన్ను సంస్కరించుకోవాలనీ, స్వర్గంలోని జగత్పిత వలెనే సర్వసమగ్రుడను కావాలనీ, గతిశీలమైన కర్తృత్వం ద్వారా ఈ ప్రపంచంలో విశుద్ధము, వైభవయుశము అయిన జీవనాన్ని నిర్మించాలనీ, అవతారంలో ప్రకటితమైన సత్యాన్ని, మానవుని నిజధర్మాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలనే ఆకాంక్ష అణచివేయబడుతుంది. దాని స్థానాన్ని అవనతికి, విచ్ఛిత్తికి, చివరకు వినాశనానికీ దారితీసే భక్తి అని పిలిచే ఆకర్మణ్యత ఆక్రమిస్తుంది. నేడు కూడా ఈ బలహీనత ప్రకటితమవుతోంది. వివిధ పరిస్థితులలో, కష్టాలలో, సుఖాలలో మన ప్రజలు ఈ మహా వ్యక్తిత్వం నుండి స్ఫూర్తిని పొందారు; విజయప్రాప్తికై తమ మార్గాన్ని తీర్చిదిద్దుకున్నారు.
శ్రీ గురూజీ - Madhav Sadashivrao Golwalkar |
(శ్రీ వై.యస్. జమార్ రచన ‘శ్రీరామచంద్రుని రాజనీతి’ ఆంగ్ల గ్రంథానికి 1949 డిసెంబరులో పూజ్య శ్రీ గురూజీ వ్రాసిన ప్రస్తావన నుండి) - జాగృతి సౌజన్యంతో…