Nayana Manoharanga Varaha Lakshminrisimhaswamy Kalyanotsavam |
వరాహ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం
సింహాచలం సింహగిరి కల్యాణ సిరిని సంతరించుకుంది. చైత్రశుద్ధ ఏకాదశి వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి నయనానందకరంగా జరిగింది. శ్రీ మహా విష్ణువు అవతారమైన వరాహ లక్ష్మీ నృసింహస్వామిని పెళ్లి కుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా దర్శించిన భక్తులు తన్మయులయ్యారు.
కొట్నాల ఉత్సవంతో శ్రీకారం
పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కల్యాణోత్సవ ఘట్టాలను ఆలయ అర్చకులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. తొలుత ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువలు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని పలు కుతూ అలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగరవేసి ధ్వజారోహణ నిర్వహించారు.
రసవత్తరంగా ఎదురు సన్నాహోత్సవం
స్వామి వారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారురంగు పల్లకీలో.. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో కొలువుదీర్చారు. ఈ పల్లకీలను సింహగిరి మాడవీధుల్లో చెరొకవైపు తీసుకెళ్లి పశ్చిమ మాడ వీధిలో జోడు భద్రాల వద్ద ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికలపై అధిష్టింపజేశారు. స్వామివారు, అమ్మవార్ల వైభవాన్ని, గొప్పతనాన్ని చాటిచెబుతూ జరిగిన ఎదురు సన్నాహోత్సవం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఆలయ అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఎదురు సన్నాహోత్సవాన్ని రక్తి కట్టించారు. వ్యాఖ్యాతలుగా రావులపాలే నికి చెందిన కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, కందుకూరి సత్య సూర్యనారాయణమూర్తి వ్యవహరించారు.
నేత్రపర్వం..రథోత్సవం
సింహగిరి మాడ వీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహించారు. రథంలో ఉన్న స్వామివారిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథిగా నిలిచి రథ కదలికలను సూచిస్తుండగా, లక్ష్మీదేవి అమ్మవారి బంధువులుగా జాలర్లు రథం నడిపే బాధ్యతలు చేపట్టారు. అశేష భక్తజన సందోహం రథాన్ని తాళ్లతో లాగి పరవశించారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యులు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్‌రాజ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు.
కనులపండువగా కల్యాణోత్సవం
సింహగిరిపై ఉన్న నృసింహ మండపంలో రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణోత్సవం జరిపించారు. స్వామివారిని, అమ్మవార్లను నృసింహ మండపంలోకి తీసుకొచ్చి, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై కొలువుదీర్చి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తదుపరి భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీసీపీ సత్తిబాబు, నార్త్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.