తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు గాంచిన కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహ స్వామి దివ్య కల్యాణ మహోత్సవాలకు దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. కళ్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు ఆలయ అధికారులు. ఉమ్మడి జిల్లా నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవానికి తరలిరానున్నారు భక్తులు. స్వామి వారిని దర్శించుకునే విఐపిల నుండి సామాన్యుడి వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవాలతో పాటు రథోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి రథాన్ని అన్నవరం దేవస్థానం అధికారులు సిద్దం చేస్తున్నారు. రథోత్సవం సమయంలో వేలాదిగా భక్తులు పాల్గొంటారని, ఆ సమయంలో పాల్గొనే భక్తులకు కోరుకొండ పురవీధుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు, దేవాదాయ, రెవెన్యూ శాఖాధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రాజానగరంలోని ప్రజాప్రతినిధులకు పుట్టిల్లుగా చెబుతారు. రాజకీయంగా ఎవరు ఎదగాలన్నా ఖచ్చితంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం లక్ష్మీ నారసింహుడుని దర్శించకుండా వెళ్లిన దాఖలాలూ లేవని పండితులు చెబుతున్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా 5 రోజులపాటు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిరవహిస్తామని అధికారులు, ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.