సంగీతం కేవలం ప్రతిభా ప్రదర్శనకో, ధన సంపాదనకో కాదు. సంగీతం కైవల్య సోపానమని త్రికరణశుద్ధిగా నమ్మి, ఆచరించి చూపిన వాగ్గేయకారుడు శ్రీసద్గురు త్యాగరాజ స్వామి. అందుకనే ఆయన గతించి వందల సంవత్సరాలు దాటుతున్నా నేటికీ మనకు ఆరాధ్యుడయ్యాడు.
సంగీతానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని త్యాగరాజు ప్రగాఢంగా నమ్మేవారు. భావావేశంతో పాడితేనే ఏ కచేరీ అయినా రక్తి కడుతుంది. శ్రోతల మనసుల్ని తాకుతుంది. ఇది జరగాలంటే కళాకారుడికి తాను పాడుతున్న కృతి ఏ భాషలో ఉందో ఆ భాష తప్పనిసరిగా రావాలి. సాహిత్యం అర్థం కాకపోతే ఆత్మానందం కలుగదు. ఇది లేకపోతే కచేరీలో తాదాత్మ్యత రాదు. తాదాత్మ్యత లేని కచేరీ రాణించదు. అందుకే సాహిత్యం అర్థం కాని సంగీతానికి విలువ లేదని త్యాగరాజు అంటుండేవారు. అందుకే తనవద్దకు సంగీతం నేర్చుకోవడానికివచ్చిన ప్రతివారికీ ముందుగా భాష నేర్పించే వారు. ఈ విషయాన్ని త్యాగరాజ స్వామి ముఖ్య శిష్యుడైన తంజావూరు రామారావు స్వయంగా చెప్పారు.
త్యాగరాజ స్వామి వద్ద సంగీత శిష్యరికం చేసినవాళ్ళు సుమారు 200మందికి పైనే ఉన్నారు. వీరందరిలో తంజావూరు రామారావు, మానాంబుచావడి వెంకట సుబ్బయ్యర్ – వీరిద్దరే తెలుగు వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ తమిళులే. ఇన్ని వందల మందికి స్వయంగా తెలుగు నేర్పించిన భాషోపాధ్యాయుడుగానూ త్యాగయ్య తనలోని మాతృభాషా పరిరక్షణ దీక్షను ప్రకటించారు.
సాధారణంగా సంగీత శిక్షణలో గీతమైన, వర్ణమైనా…మరేదైనా ముందుగా స్వరాలతో నేర్పిస్తారు. స్వర స్థానాలు చక్కగా వచ్చిన తర్వాత సాహిత్యంతో నేర్పిస్తారు. త్యాగరాజు ఇందుకు భిన్నంగా ఏ కృతినైనా ముందుగా సాహిత్యంతో నేర్పించేవారు.శిష్యుడు భావయుక్తంగా పాడుతున్నాడని అనిపిస్తే, అప్పుడు స్వరాలతో నేర్పించేవారు. ఇంతటి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే త్యాగరాజస్వామి పుణ్యమా అని నేటికీ కర్ణాటక సంగీతంలో భాషకు ప్రాధాన్యత దక్కుతోంది.
త్యాగరాజస్వామి కాలంలో తంజావూరు ప్రాంతంలో ఎన్నో భాషలు వాడుకలో ఉండేవి. తమిళదేశం కావటం వల్ల ప్రధానంగా తమిళం వాడుకలో ఉండేది. పండితభాషగా, రాజభాషగాసంస్కృతం ఉండేది. అక్కడక్కడా తెలుగు ఉండేది. వ్యావహారికంగా చాలాచోట్ల తెలుగు వాడుకలో ఉండేది.బ్రిటీషు పాలన కావటంతో ఆంగ్ల ప్రాబల్యమూ ఎక్కువగానే ఉండేది. మరోపక్క ముస్లిం పాలకుల దండయాత్రలు, దురాక్రమణల ఫలితంగా ఉర్దూ, పార్శీ భాషలూ తమ ఉనికిని చాటుకునేవి.
ఇన్ని భాషలు, సంస్కృతీ వైవిధ్యాల మధ్య తన మాతృభాషఅయిన తెలుగును, తెలుగు సంస్కృతిని, సాహిత్యాన్ని కాపాడుకోవడం కోసం త్యాగరాజు అజరామరమైన ప్రయత్నం చేశారు. వేలకొద్దీ కృతులను తెలుగులోనే రచించి తన అపారమైన తపశ్శక్తిని వాటికి ధారాదత్తం చేసి, తెలుగు భాష నేటికీ వెలుగులీనటానికి మూలకారణంగా నిలిచారు.పుట్టిందీ, పెరిగిందీ తమిళప్రాంతంలో అయినా, త్యాగరాజస్వామి ఒక్క కృతిని కూడా తమిళంలో రాయలేదు సరికదా కనీసం ఒక్క తమిళపదానికి కూడా తన కృతుల్లో చోటివ్వలేదు. ఈ ఒక్క నిరూపణ చాలు తెలుగు భాషా పరిరక్షణకు త్యాగరాజు చేసిన కృషి ఏమిటో చెప్పడానికి.
త్యాగరాజ కీర్తనలు మతమూఢత్వాన్ని పెంచే ‘స్తోత్రాలు’ కావు. కర్తవ్య నిష్ఠవైపు సమాజాన్ని ఉద్దీపనం చేసే చైతన్య దీపాలు. మనిషిని మనీషిగా తీర్చిదిద్దే ఉపనిషద్వాక్యాలు.
___vskteamap