అశేష భక్తజనాన్ని చూసి వంశధార మురిసిపోయింది. పార్వతీ సమేత పరమేశ్వరుడికి స్వాగతం పలికింది.శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం స్వామి చక్రతీర్థస్నానం వేడుక వైభవంగా నిర్వహించారు.
వైభవంగా శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నాన మహోత్సవం |
శుద్ధ పాడ్యమి గడియల్లో అర్చకులు ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఎస్పీ జి.ఆర్.రాధిక, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను నంది వాహనంపై అలంకరించి దక్షిణ ముఖంగా ఊరేగించారు. వంశధార నదికి చేరుకున్న స్వామికి ఎల్ఎన్పేట మండలం మిరియాప్పల్లి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు స్వామి పుణ్యస్నానాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రాత్రి 8 గంటల సమయంలో లింగాభరణం కార్యక్రమంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. ఈవో పి.ప్రభాకరరావు, దేవాదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నాన మహోత్సవం |
అరకొర సదుపాయాలతో అవస్థలు..
చక్రతీర్థ స్నానానికి తరలివచ్చిన భక్తులు ఒకే సమయంలో తిరుగు ప్రయాణమవడంతో శ్రీముఖలింగం నుంచి అచ్యుతాపురం వరకు 2 కి.మీ. మేర గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. నది వద్ద తాగునీటి సదుపాయం లేక.. భక్తులు చలమల్లో నీటిని తాగి దాహం తీర్చుకున్నారు. పుణ్య స్నానం ఆచరించేందుకు వచ్చిన మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సరైన వసతుల్లేక అవస్థలు పడ్డారు. అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీ శ్రుతి నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.