Ear Piercing |
చెవులు కుట్టడం వెనుక ధార్మిక మర్మం
హిందూ ధర్మంలో మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు 16 కర్మలు నిర్వహిస్తారు. ఈ 16 సంస్కారాల్లో కర్ణవేద సంస్కారం కూడా ఒకటి. బాలబాలికలకు కర్ణవేధ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. పూర్వకాలంలో కర్ణవేద సంస్కారాన్ని శుభ ముహూర్తంలో పిల్లల చెవుల్లో మంత్రాలు పఠిస్తూ చేసేవారు. చిన్నారుల చెవుల్లో మంత్రం పఠించిన అనంతరం ముందుగా బాలురకు కుడిచెవికి కుట్టి, తర్వాత ఎడమచెవికి కుట్టేవారు. అయితే అమ్మాయిల విషయంలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. అంటే అమ్మాయిల ఎడమ చెవిని ముందుగా కుట్టించి ఆ తర్వాత కుడి చెవికి కుడతారు. అప్పట్లో చెవులకు ఇలా చిన్న చిల్లులు పెట్టి.. తర్వాత బంగారు ఆభరణాలు పెట్టేవారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవులు కుట్టడం వలన రాహు, కేతు గ్రహాలకు సంబంధించిన చెడు ప్రభావాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా , దృడంగా ఉంటారు.
చెవులు కుట్టడం వెనుక శాస్త్రీయ కారణాలు
శాస్త్రీయ కోణంలో చెవులు కుట్టిన ప్రదేశంలో రెండు ముఖ్యమైన ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్ మాస్టర్ సెన్సరీ , రెండవ పాయింట్ మాస్టర్ సెరిబ్రల్. ఇవి వినే సామర్థ్యాన్ని పెంచడానికి పనిచేస్తాయి. కనుక చెవులు కుట్టినప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది. అయితే ఇలా చేయడం వలన ఆందోళన తగ్గుతుంది. అనేక రకాల మానసిక వ్యాధులు కూడా నయమవుతాయని ఆక్యుప్రెషర్ థెరపిస్ట్ చెప్పారు.
చెవులు కుట్టడం వల్ల మన కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నమ్మకం. ఎందుకంటే చెవి కింది భాగంలో ఒక పాయింట్ ఉంటుంది. దానిపై ఒత్తిడి ఉన్నప్పుడు.. ఈ ఒత్తిడి ప్రభావంతో కంటి చూపు ప్రకాశవంతంగా మారుతుంది.
ఆయుర్వేదం ప్రకారం చెవి కుట్లు అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో చెవి కింది భాగంలో ఒక బిందువు ఉంటుందని.. ఈ బిందువును కుట్టినప్పుడు అది మెదడుపై ప్రభావం చూపుతుందని, దీని కారణంగా మెదడులోని అనేక భాగాలు ఉత్తేజితం అవుతాయని నమ్మకం. అందుకే చిన్న వయసులోనే చెవులు కుట్టించే సంప్రదాయం మొదలై ఉంటుందని.. నేటికీ కొనసాగుతుందని చెబుతున్నారు.
Courtesy :tv9