మహాశివరాత్రి జాతరకు ముస్తాబవుతున్న మేళ్లచెరువు |
మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని ఇష్టకామేశ్వరి సమేత, స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయం రాష్ట్రంలో దక్షిణకాశీగా విరాజిల్లుతోంది. మేళ్లచెరువు శివాలయంలో ఈ నెల 8వ తేదీ నుంచి మహా శివరాత్రి వేడుకలను ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు జరిగే జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు అధికార యంత్రం ఏర్పాట్లు చేసింది.
శివాలయంలో ప్రత్యేక పూజలు..
మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలూ, లింగోద్భవకాల అభిషేకాలూ, శివకల్యాణోత్సవాలను ఇక్కడ వైభవోపేతంగా జరుపుతారు. మేళ్లచెరువు జాతరకు గతేడాది సుమారు ఐదు లక్షల మంది హాజరు కాగా… ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. జాతరకొచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు, తాగునీటి వసతి, చలువ పందిళ్లు, పార్కింగ్ స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, బారీ కేడ్లు, సానిటేషన్, వైద్య శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు.
Courtesy - Tv9