 |
Kamadahanam |
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్ధశిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థానం అధికారులు కామదహన కార్యక్రమాన్ని శాస్త్రోక్తకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి.. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని మనోహరగుండం ఎదురుగా వేదిక ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు. ఆ తరువాత కర్పూరహారతులిచ్చి ఉత్సవమూర్తులకు పల్లకీసేవ నిర్వహించారు.
ఈపల్లకీసేవలోనే ఉత్సవమూర్తులను ఆలయం ఎదురుగల గంగాధర మండపము వద్దకు తీసుకొని వచ్చి శాస్త్రోక్తకంగా గడ్డితో చేసిన మన్మథ రూపాన్ని దహనం చేశారు. చివరగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వలన శివకటాక్షం లభిస్తుందని ప్రతీతి. ఈ పూజకైకర్యాలలో ఆలయ ఏఈవో హరిదాస్,అర్చకులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.