Holi festival with ashes |
కానీ, శ్మశానంలో శవదహనాల తర్వాత వచ్చే చితాభస్మంతో హోలీ పండుగ జరుపుకునే ప్రదేశం ఒకటి మన దేశంలో ఉంది. అదెక్కడో తెలుసా? పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కాశీ పుణ్యక్షేత్రంలో. అక్కడ కూడా గంగానది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ మణికర్ణికా ఘాట్‌లోనే ఈ రకమైన విచిత్రమైన హోలీ జరుపుకోవడం ఆనవాయితీ.
హిందీలో శ్మశానాన్ని మసాన్ అంటారు. అందుకే ఈ హోలీని ‘మసాన్ హోలీ’ అని కూడా పిలుస్తారు. మరి దాని ప్రత్యేకతలేంటో చూద్దామా…
లయకారకుడైన పరమేశ్వరుడి నివాసస్థానం కాశీ పుణ్యక్షేత్రం. అక్కడ ఈ చితాభస్మంతో హోలీ పండుగ జరుపుకునే సంప్రదాయానికి ఒక కథ ఉంది. పార్వతీ దేవితో వివాహం అనంతరం పరమశివుడు ఆమెను ఏకాదశి పుణ్యతిథి నాడు కాశీ తీసుకుని వచ్చాడట. శివుడు భూతగణాధిపతి కదా. ఆయన వివాహం జరిగిందన్న ఉత్సాహంలో శివుడి ప్రమథ గణాలు, భూతప్రేతాలూ కలిసి మణికర్ణికా ఘట్టంలో చితాభస్మంతో హోలీ ఉత్సవం జరుపుకున్నాయట. ఆ ఉత్సవంలో స్వయంగా శివభగవానుడు కూడా పాల్గొన్నాడట. అప్పటినుంచీ ప్రతీయేటా వారణాసిలోని మణికర్ణికాఘట్టంలో ‘మసాన్ హోలీ’ ఆడడం సంప్రదాయంగా మారింది. ఆ రోజు భూతనాథుడైన పరమేశ్వరుడు స్వయంగా రహస్యరూపంలో శ్మశానానికి వస్తాడట. ఈ యేడాది మసాన్ హోలీ పండుగ ఇవాళ, అంటే గురువారం మార్చి 21న వచ్చింది.
కాశీలోని మణికర్ణికా ఘాట్ అత్యంత ప్రాచీనమైన నదీఘట్టం. ఎన్నో ధార్మిక గ్రంథాల్లో ఆ ఘట్టం గురించిన వర్ణనలు ఉన్నాయి. పురాణాల ప్రకారం… ఒకసారి పార్వతీదేవి కర్ణపుష్పాలు (చెవికి ధరించే ఆభరణాలు) అక్కడ ఒక కుండంలో పడిపోయాయట. వాటిని పరమశివుడు వెతికి తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చాడట. పార్వతీదేవి కర్ణాభరణాలు పడిపోయిన చోటు కాబట్టి ఆ ఘట్టానికి మణికర్ణికాఘాట్ అనే పేరు వచ్చిందట. ఆ ఘాట్‌కు మరో విశేషం కూడా ఉంది. మహాదేవుడు సతీదేవి కళేబరానికి అగ్నిసంస్కారం చేసిన చోటు కూడా అదే. అందుకే ఆ ప్రదేశాన్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు.
కాశీలోని మణికర్ణికాఘాట్ వద్ద చితాభస్మంతో హోలీ ఆడే సంప్రదాయం వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. ధార్మిక గ్రంథాల ప్రకారం… ఈ ప్రపంచం నశ్వరమైనది, అంటే నశించిపోయే లక్షణం ఉన్నది. ఈ ప్రపంచం ఏదో ఒకరోజు భస్మంగా మారిపోక తప్పదు. ఈ భూమి మీద నివసించే ప్రతీ ప్రాణికీ అదే గతి పడుతుంది. అందుకే ఈ నశ్వరమైన ప్రపంచం మీద, మన జీవితం మీద ఎక్కువ మోహం పెంచుకోకూడదు అన్నదే ఈ ‘మసాన్ హోలీ’ మనకిచ్చే సందేశం.