కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో శ్రీసిద్ధేంద్రయోగి నాట్యకళావేదికపై బుధవారం సాయంత్రం కూచిపూడి నాట్యోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి.
ముందుగా కూచిపూడి ఎస్బీఐ శాఖ మేనేజర్ పాలలోచనాచారి జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. నాట్యాచార్యుల ఇలవేల్పు శ్రీరామలింగేశ్వరస్వామి సమేత శ్రీబాలాత్రిపురసుందరిదేవి కల్యాణమహోత్సవాలలో భాగంగా తొలిరోజు ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు ప్రేక్షకులను సమ్మోహనం చేశాయి. తొలుత ప్రార్థనాగీతంతో ప్రారంభించిన అనంతరం ఓలేటి శ్రీరేఖ(హైదరాబాదు) బృందం శివపార్వతి లాస్యతాండవం, అమ్మనీరాజనం ప్రదర్శించారు.
ఎస్.కె.ఎన్.కళాక్షేత్రం (హైదరాబాదు)డాక్టర్ ఎన్.సి.కృష్ణకుమారి శిష్యబృందం తొలుత ‘పలుకే బంగారమాయే…’ అంటూ ఆనందభైరవి రాగంలో, బ్రహ్మాంజలిని రాగమాలిక రాగంలో ప్రదర్శించారు. శ్రీరాధాకృష్ణ కూచిపూడి నృత్యాలయం (హైదరాబాదు) నిర్వాహకురాలు మాదల కృష్ణప్రియ శిష్యబృందం ‘ధన్య కైలాసం…’ అంటూ హంసనందిని రాగంలో నర్తించారు. కూచిపూడి శ్రీసిద్ధేంద్రయోగి నాట్యకళాపీఠం ప్రిన్సిపల్ డాక్టర్ వేదాంతం రామలింగశాస్త్రి శిష్యబృందం డాక్టర్ వెంపటి చినసత్యం నృత్యదర్శకత్వంలో ‘తిల్లానా’ను హిందూళరాగంలో ప్రదర్శించారు. నాట్యాచార్య సప్పా శివకుమార్ శిష్యురాలు హేమలత డాక్టర్ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వంలో శివాష్టకం మోహనరాగంలో అద్భుతంగా నర్తించింది. శ్రీసిద్ధేంద్రయోగి కళానిలయం(విశాఖపట్నం)కు చెందిన సత్యభాను శిష్యరాలు యామిని నాట్యాచార్య హరిరామ్మూర్తి నృత్య దర్శకత్వంలో ప్రదర్శించారు. నాట్యాచార్య వేదాంతం రాధేశ్యామ్ నిర్వహణలో జరిగిన ఉత్సవాలలో నాట్యాచార్యులు పసుమర్తి రత్తయ్యశర్మ, దేవాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కావూరి భానుమూర్తి, పసుమర్తి నారాయణమూర్తి, యేలేశ్వరపు హనుమంతరావు తదితరులు పాల్గొని కళాకారులను జ్ఞాపికలతో సత్కరించారు.
__vskandhra