హిందూ ఆలయం |
విశేషాలెన్నో…
BAPS ఆలయం ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యూఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబాయ్‌లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే…
- ఇది దుబాయ్–అబుదాబి హైవే సమీపంలో వద్ద 27 ఎకరాల్లో నిర్మితమైంది.
- దీని నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చయింది. మొత్తం నిర్మాణం బాప్స్ సంస్థ కనుసన్నల్లో జరిగింది.
- 108 అడుగల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది.
- దీని నిర్మాణానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. రాజస్తాన్, గుజరాత్‌కు చెందిన 2 వేల మందికి పైగా కార్మికులు, నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు.
- ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏ మాత్రమూ వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు.
- ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్తాన్‌లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు.
- మందిర పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి.
- వీటిని మొత్తం 25 వేల పై చిలుకు విడి భాగాలుగా భారత్‌లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యూఈఏలో జోడించడం విశేషం!
- ఆలయ కాంప్లెక్సులో ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, థీమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లు, ఏకంగా 5,000 మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి.
- మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారికోసం ఆన్లైన్ రిజి్రస్టేషన్ పోర్టల్ ప్రారంభించారు. సోమవారం ఆలయంలో యజ్ఞం నిర్వహించారు.
ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా…
- ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈలోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దడం మరో విశేషం.
- రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు.
- ఆలయం బయటి గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చెక్కారు. తద్వారా ఈ ఆలయాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు.
- భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటైంది. దీన్ని అరేబియన్, ఇస్లామిక్ వాస్తు రీతుల్లో నిర్మించడం విశేషం.
ఇలా పురుడు పోసుకుంది…
- 2014లో మోదీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్దికాలానికే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. 2015లో మోదీ యూఏఈ పర్యటన అనంతరం వేగం పుంజుకుంది. 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఇప్పటిదాకా యూఏఈలో ఆరుసార్లు పర్యటించారాయన. తాజాగా ఏడో పర్యటనలో ఉన్నారు.
- 2015 పర్యటన సందర్భంగా యూఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో పలు అంశాలపై మోదీ లోతుగా చర్చలు జరిపారు.
- ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఈఏ సర్కారు నిర్ణయం తీసుకోవడమే గాక 13.5 ఎకరాల భూమి కూడా కేటాయించింది. అనంతరం 2019లో మత సహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాలు ప్రకటించింది. అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది.
- 2018లో మోదీ తన రెండో యూఏఈ పర్యటన సందర్భంగా బాప్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపెరా హౌజ్ నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు.