ఇటీవల కోయంబత్తూరు దగ్గర మదురతామలై వద్ద జరిగిన సంఘటన వంటి సంఘటనలు సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. దినేష్‌కుమార్ అనే విద్యార్ధి, తన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత తనను బెదిరించి, హింసించి తనను క్రైస్తవమతంలోకి మారాలంటూ బలవంతపెట్టారని ఆరోపించాడు. దినేష్ ఇటీవలే దివ్య అనే వ్యక్తి ఇంట్లో పనికి చేరాడు. అక్కడ తనను క్రైస్తవమతంలోకి మారాలంటూ బలవంతపెట్టారనీ, దానికి ఒప్పుకోకపోవడంతో శారీరకంగా, మానసికంగా హింసించారనీ అతను చెప్పుకొచ్చాడు. ఉన్నత విద్యాభ్యాసానికి డబ్బులు సమకూర్చుకోవడం కోసమే ఉద్యోగంలో చేరిన దినేష్ దగ్గర నుంచి ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు సైతం తీసేసుకున్నారని వెల్లడించాడు.
కాంచీపురం సమీపంలోని ఓ గ్రామంలో అపోస్టలిక్ క్రిస్టియన్ చర్చ్‌కు చెందిన 50మంది వ్యక్తులు స్థానిక హిందూ దేవాలయం దగ్గర మతమార్పిడి కార్యక్రమాలు చేపట్టారు. అయితే స్థానిక ప్రజలు, హిందూ మున్నని కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. కాంచీపురం జిల్లా పురిసై గ్రామంలో మిషనరీలు, స్థానిక ప్రజలను మతం మార్చే ఉద్దేశంతో, ఇంటింటికీ వెళ్ళి కరపత్రాలు పంచుతున్నారు. ఆ ప్రయత్నాల గురించి తెలిసిన హిందూ మున్నని సభ్యులు, స్థానిక ప్రజల సాయంతో వారిని అడ్డుకున్నారు. గ్రామస్తులను మతం మార్చడానికి వారు చేస్తున్న ప్రయత్నాలను నిలువరించారు. ఆ మిషనరీలను ఆ ప్రాంతంనుంచి తరిమికొట్టారు. స్థానికులను ప్రభావితం చేసి వారి మత విశ్వాసాలను మార్చే పనిని అడ్డుకున్నారు.
కన్నడిపుత్తూర్ కళాశాలలో బీఎస్సీ గణితం చదువుతున్న ఒక విద్యార్ధి తనను బలవంతంగా మతం మార్చారని వెల్లడించాడు. తన ఇంటిపక్కన కొత్తగా కట్టిన భవనంలో ఉద్యోగం ఇస్తామనడంతో అతను ఆ ఉద్యోగంలో చేరాడు. భవనం అంతా శుభ్రం చేయడం, తోటపని, పెంపుడుజంతువులను చూసుకోవడం వంటి ఇంటిపనులన్నీ చేయించుకున్నారు. ఆ యువకుడు రెండు నెలలు పనిచేసాక జీతం ఇవ్వమని అడిగాడు. అయితే ఆ ఇంటివారు తనను బెదిరించి, కొట్టి, హింసించారు తప్ప జీతం మాత్రం ఇవ్వలేదని ఆ విద్యార్ధి వివరించాడు. పైగా, జీతం ఇవ్వాలంటే ఆ అబ్బాయి క్రైస్తవంలోకి మతం మారాలని డిమాండ్ చేసారు. అతన్ని శారీరకంగా హింసించారు. దొంగతనం వంటి తప్పుడు ఆరోపణలు చేసారు, బలవంతంగా ఒప్పించారు. ఆఖరికి పండుగ సందర్భాల్లో సైతం తన కుటుంబాన్ని చూడడానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు.
మరో సంఘటనలో ఏకంగా ఒక గ్రామం మొత్తాన్ని మతం మార్చడానికి ఒక ఎవాంజెలికల్ గ్రూప్ ప్రయత్నించింది. కాంచీపురం సమీపంలోని ఆ గ్రామాన్ని మతం మార్చడానికి చేసిన ప్రయత్నాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఊరిలోని గుడి దగ్గరే గ్రామస్తులను మతం మార్చడానికి క్రైస్తవులు ప్రయత్నించారు. ఆ సంఘటనను కొంతమంది వీడియో తీసారు. ఆ వీడియోను హిందూ మున్నని సంస్థ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఆ వీడియోలో ఒక గ్రామస్తుడు మతమార్పిడి ముఠాని ఇలా ప్రాథేయపడుతున్నాడు ‘‘సర్, దయచేసి మా గుడి ముందు ఇలాంటి పనులు చేయకండి. ఇది ఒక గుడి. మీకు గుడిలా కనిపించడం లేదా?’’ అయితే ఆ మిషనరీ మనిషి ఆ యువకుడి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ‘‘ఎమ్మాన్యుయెల్ని పిలు. నీలాంటి వారిని ఎంతోమందిని చూసాంలే’’ అంటూ ఆ ఘర్షణని చిత్రీకరించారు,
ఆ ఉద్రిక్త పరిస్థితులు స్థానిక ప్రజల్లో మిషనరీల కార్యకలాపాల పట్ల అవిశ్వాసం పెరుగుతుండడాన్ని ప్రతిఫలించాయి. అలాంటి ఘటనలు తమిళనాడు అంతటా చోటు చేసుకున్నాయి. హిందూ మున్నని సంస్థ బలవంతపు చెమతమార్పిడులకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలుగజేస్తోంది.
ఐతే చాలాసార్లు సమస్య ఏంటంటే ఇటువంటి విషయాల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. మతపరమైన కార్యక్రమాలు చేసుకోడానికి రాజ్యాంగం హక్కు ఇచ్చిందన్న కారణం చూపి ఏమీ చేయకుండా ఊరుకుంటున్నారు. మిషనరీ గ్రూపులు తాము రాజ్యాంగ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని చెబుతూనే తమ కరపత్రాలను ఇంటింటికీ పంచిపెడుతున్నాయి. కొన్ని కేసుల్లో టీచర్లు విద్యార్థులతో పాటు తిరుగుతుంటారు, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి తమ విశ్వాసాన్ని ప్రచారం చేస్తున్నారు.
చదువుకుంటున్న విద్యార్ధులను బలవంతంగా క్రైస్తవమతంలోకి మార్పిడులు చేస్తున్న ఘటనలను ఒక టెలివిజన్ ఛానెల్ బైటపెట్టింది. దాంతో బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్ (ఎన్సిపిసిఆర్) తమిళనాడు డీజీపీకి నోటీసులు సైతం జారీ చేసింది. కన్యాకుమారిలో 6వ తరగతి చదువుతున్న ఒక బాలిక తల్లిదండ్రులు 2022 ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేసారు. అందులో, ఆ బాలిక చదువుకుంటున్న పాఠశాలలోని ఉపాధ్యాయిని, హిందూ దేవతలను దూషిస్తూ, పిల్లలను క్రైస్తవ ప్రార్థనలు చేయాల్సిందిగా బలవంతపెడుతోంది.
చెన్నైలోని సీఎస్ఐ మోనహన్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో జరుగుతున్న వ్యవహారాలపై విచారణ జరిపించాలని తమిళనాడు ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి బాలల సంరక్షణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఆ హాస్టల్‌కు చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్‌గా రిజిస్ట్రేషన్ లేదు. పేద కుటుంబాల నుంచి వచ్చి హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలను అక్కడ బలవంతంగా మతం మారుస్తున్నారు.
జనవరి 2023లో చోటు చేసుకున్న ఒక సంఘటనలో ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న ఓ హిందూ బాలిక, ఒక లెక్క సరిగ్గా చేయనందుకు శిక్షగా తమ గణిత ఉపాధ్యాయుడు తమను అల్లా పేరిట ప్రార్థనలు చేయాలని బలవంతపెడుతున్నాడని వెల్లడించింది. ఆ దృశ్యాలను చిత్రీకరించి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టింది.
2022లో తిరుపూరులోని జైవాబాయి కార్పొరేషన్ గరల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో కూడా ఒక ఉపాధ్యాయుడు విద్యార్ధులను క్రైస్తవంలోకి మతం మారాలని బలవంతపెడుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇలాంటి సంఘటనలు విద్యాసంస్థల్లో లౌకిక, సంఘటిత వాతావరణాన్ని పరిరక్షించడానికి కావలసిన సున్నితమైన సమతూకపు అవసరాన్ని తెలియజేస్తున్నాయి.
అక్టోబర్ 2023లో మరో వివాదం చెలరేగింది. తమిళ హిందువులు అర్చించుకునే కుమారస్వామి ఆలయం ఉన్న గుట్ట ‘చెన్నిమలై’ పేరును ‘ఏసుమలై’గా మార్చాలంటూ క్రిస్టియన్ మున్నని సంస్థ అధిపతి శరవణన్ జోసెఫ్ ప్రతిపాదించాడు. అయితే హిందూమున్నని, బీజేపీ, ఇతర హిందూ సంస్థలు ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలూ చేపట్టాయి. ఫలితంగా జోసెఫ్ అరెస్టయ్యాడు. ఆ సంఘటన ప్రజల సాంస్కృతిక, ధార్మిక మనోభావాలను గౌరవించాల్సిన అవసరంపై చర్చను సమాజంలో లేవనెత్తింది.
2022 మార్చిలో కృష్ణగిరి జిల్లా వేలాంపట్టిలోని ఓ ప్రైవేటు పాఠశాల ముందు క్రైస్తవ మిషనరీలు ఒక ప్రేయర్ హాల్ ఏర్పాటు చేసి అక్కడి విద్యార్థులను మతం మార్చడానికి ముమ్మర ప్రయత్నాలు చేసారు. స్థానిక ప్రజలు, హిందూ మున్నని సంస్థ కార్యకర్తలతో కలిసి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. అవాంఛిత మతమార్పిడులకు తమ వ్యతిరేకతను బలంగా ప్రకటించారు.
2021 అక్టోబర్‌లో క్రైస్తవ మిషనరీలు తిరువళ్ళూరు జిల్లాలోని ఒక గ్రామంలో బలవంతపు మతమార్పిడులు చేస్తుంటే, హిందూ మున్నని కార్యకర్తలు అడ్డుకున్నారు. తేని జిల్లా గుడలూరు ప్రాంతంలో కూడా ఒక క్రైస్తవ మహిళ బలవంతంగా మతమార్పిడులు చేస్తుంటే హిందూ మున్నని సభ్యులు ఆమెను నిలువరించారు. తద్వారా ఆ ప్రాంతంలోని ధార్మిక వాతావరణాన్ని యథాతథంగా ఉండేలా చేయగలిగారు.
2021 డిసెంబర్లో సేలం జిల్లా శీలనాయకన్‌పట్టి గ్రామంలో శక్తి కలియమ్మన్ గుడి ముందు క్రైస్తవులు ‘గ్రేస్ అసెంబ్లీ హాల్’ పేరుతో క్రైస్తవుల ప్రార్థనాస్థలాన్ని కట్టడానికి ప్రయత్నించారు. హిందూ మున్నని కార్యకర్తలు ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకోగలిగారు. అలాగే, తిరుపూరు జిల్లాలో సుగ్రీశ్వరర్ ఆలయం దగ్గర చట్టవిరుద్ధంగా క్రైస్తవుల ప్రేయర్ హాల్ కట్టడానికి ప్రయత్నాలు చేసారు. హిందూ మున్నని సంస్థ సకాలంలో స్పందించి జోక్యం చేసుకోడంతో ఆ నిర్మాణం ఆగిపోయింది.
జావూరు జిల్లాలో ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. లావణ్య అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. అది మామూలు ఆత్మహత్యే అంటూ స్థానిక పోలీసులు తీసిపడేసారు. అయితే, మతం మారాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చినందునే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయాన్ని స్థానిక బీజేపీ కార్యకర్తలు బైటపెట్టారు. దాంతో ఆ సంఘటనపై సీబీఐ దర్యాప్తు ఆదేశించవలసి వచ్చింది.
ఈ సంఘటనలన్నింటినీ చూస్తుంటే… మతసామరస్యాన్ని కొనసాగించడంలో, వ్యక్తుల హక్కులను రక్షించడంలో, సమాజంలోని భిన్నవర్గాల విశ్వాసాలను గౌరవించడంలో తమిళనాడు సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ళు అర్ధమవుతాయి. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు హిందూ సంస్థల క్రియాశీలక పాత్ర, అధికార వర్గాల సకాల స్పందన ఉంటేనే సంఘటిత, సహనశీల సమాజం మనుగడ సాధ్యమవుతోంది.