ధృతరాష్ట్రుడు |
పెద్దల మాట వినాలి
ఒకరోజు దుర్యోధనుని కొలువుకూటమునకు మైత్రేయుడు అను ముని వచ్చాడు. ధృతరాష్ట్రుడు అతడిని చాలా గౌరవించి భట్టారకా!మీరు ఎచటి నుండి వచ్చుచున్నారు?అని అడిగాడు.
"నేను దేశ సంచారము చేస్తూ పాండవుల దగ్గరికి వెళ్లి అక్కడినుండి ఇక్కడికి వస్తున్నాను.అన్నాడు ముని". . ధృతరాష్ట్రుడు పాండవులు క్షేమముగా వున్నారా? ధర్మముగా పరిపాలన చేస్తున్నారు గదా!అని అడిగాడు. దానికి మైత్రేయుడు "వారెప్పుడూ ధర్మ మార్గమును వీడి చరింపరు.వారెప్పుడూ అన్యాయ మార్గమున పోరు, నీ కుమారుడే అన్యాయమార్గమున చరిస్తున్నాడు" అని దుర్యోధనుని తో "పుత్రా నీవు వారితో విరోధము పెట్టుకోకు, వారితో స్నేహముగా వుండు, వారికి అండగా శ్రీకృష్ణుడు, ద్రుష్టద్యుమ్యుడు మొదలైనవారు వున్నారు. స్వయముగా వాళ్ళు కూడా బలసంపన్నులు, అన్ని విధముల నీవు వారితో స్నేహము చేసిననే నీకు మంచి జరుగును.నా మాట విని వారితో స్నేహముగా వుండు అన్నాడు" ముని.
దానికి దుర్యోధనుడు కాలి బొటనవేలితో నేలను రాస్తూ మీసములు దువ్వుతూ తొడలు చరిచాడు. మైత్రేయుడికి ఆ అవమానానికి కోపం వచ్చింది. పెద్దలను గౌరవించడం నీ వంటి అహంకారికి తెలియదు. నన్ను తొడలు కొట్టి అవమానించావు కాబట్టి యుద్ధములో భీముడు తన గదాఘాతము తో నీ తొడలు విరగగొట్టి చంపుగాక అని శపించాడు.
ధృతరాష్ట్రుడు నా కొడుకును క్షమించండి మునీంద్రా అని వేడుకున్నాడు. వీడు నేను చెప్పినట్టు పాండవులతో స్నేహం గా వుంటే నా శాపము ఫలించదు లేకుంటే వీడికి చావు తప్పదు అని చెప్పివెళ్ళిపోయాడు మైత్రేయుడు.
ధర్మమును గోరి పక్షపాతమ్ము వీడి
యలఘు గతి లోక శాంతి యె ఫలము గాగ
మెలగు పెద్దలు వస్య వాక్కులు తలంప
వారి కెదురాడ బోకు దౌర్భాగ్య మొదవు.
ధర్మము, లోక శాంతిని,నీ క్షేమము కోరి పెద్దలు చెప్పిన మాటలు వినకుంటే సర్వ నాశనము తప్పదు.