Chollangi Amavasya | చొల్లంగి అమావాస్య
హిందూ పంచాంగం ప్రకారం పుష్య మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంధాలలో చెప్పబడింది. పితృదోషం తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం, పిండదానం, దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది చొల్లంగి అమావాస్య మాఘమాసంలో 9 ఫిబ్రవరి 2024న వస్తుంది. ఈ రోజున పురాణ గ్రంధాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృ దోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం. ఈ నేపథ్యంలో ఈ రోజు చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..
పితృపూజ |
చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు, నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులై తమ వారసులను ఆశీర్వదిస్తారు. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం. అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ఉపవాసం ఉండడం, పవిత్ర నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారట.
చొల్లంగి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు
- చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి.
- చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరి కాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది.