ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో వేటికి అవి చాలా ప్రత్యేకం. అలాంటి వాటిలో దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి. విశేష ఖ్యాతి, పురాణ ప్రసిద్ధిగల పర్యాటక ప్రాంతంగా ఈ ఆలయానికి ఎంతో పేరుంది. దీన్ని తిరుమలకు తొలి గడపగా భావిస్తారు. తిరుమల క్షేత్ర పాలకుడు వరహస్వామి అయితే, ఈ క్షేత్ర పాలకుడు హనుమంతుడు. ఎన్నో విశేషాలు గల ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 9వ తేదినుంచి ప్రారంభం కానున్నాయి.
దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి |
జనమే జయుని ప్రతిష్ట
దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ మూల విరాట్‌ను సాక్షాత్తు జనమే జయుడు ప్రతిష్టించాడని కడప కై ఫీయత్తులో ఉంది. ఇందులోని సమాచారం ప్రకారం ఈ ప్రాంతానికి మొదట దేవుని గడపగా పేరుండేది. కాలక్రమంలో గడప కడపగా మారింది. జనమే జయుడు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ తిరుమల వచ్చాడని, స్వామిని దర్శించుకుని ఆ రాత్రి అక్కడే నిద్ర చేశారని, కలలో శ్రీ వెంకటేశ్వరుడు కనిపించి తిరుమలలోని చెరువు కట్టపై తవ్వితే విగ్రహం కనిపిస్తుందని, దాన్ని ఫలానా చోట ప్రతిష్టించాలని సూచించినట్లు తెలుస్తోంది. తెల్లవారాక ఆయన చెరువుకట్టపై దాదాపు పూడిపోయి ఉన్న శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాన్ని గమనించి ప్రతిష్ట చేసేందుకు సరైన ప్రాంతం కోసం అన్వేషించాడు.తిరుమలకు వాయువ్యంగా పది ఆమడల (ఆమడ అంటే పది మైళ్లు) దూరాన పుష్కరిణి సహితంగా వాయు పుత్రుడైన ఆంజనేయుని క్షేత్రం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించడం మంచిదని భావించారు. ఇందుకు నిదర్శనంగా నేటికీ కడప రాయుని మూల విరాట్ వెనుక పది అడుగులకు పైగా ఎత్తుగల ఆంజనేయుని విగ్రహం ఉంది. తొలుత ఈ స్వామిని కడప వెంకటేశ్వర్లు అని పిలిచేవారు. ఆంజనేయుడు శివుని అంశ గనుక శ్రీవారి ఆలయంతోపాటు ఆ ప్రక్కనే శివాలయాన్ని కూడా నిర్మింపజేశారు.
పాలనా చరిత్ర
దేవునికడపలో ప్రస్తుతం గల రాజగోపురాన్ని, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురాన్ని ఒకేసారి నిర్మించినట్లు కై ఫీయత్తుల ద్వారా తెలుస్తోంది. ఆలయంలోని రాజగోపురంతోపాటు ముఖ మండపం, గర్భాలయం, అంతరాళం ప్రాకారం మట్లి అనంతరాజు నిర్మించాడు. తర్వాత వైదుంబులు, ఓరుగంటి రాజులు, వల్లూరు పాలకులు, సంబెట రాజులు, సాళువ, సంగమ, తుళువ వంశీకులు ఈ క్షేత్రం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయులు పలుమార్లు కడప రాయుడిని దర్శించుకుని మడిమాన్యాలు, ఆభరణాలు సమర్పించుకున్నారు. ప్రతిఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఆల య వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 2006లో ఈ ఆలయాన్ని టీటీడీ తమపరిధిలోకి తీసుకుంది. ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
నేడు అంకురార్పణ
తిరుపతి : దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుంచి 18వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈనెల 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణ జరుగనుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. 10న ఉదయం 10.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని…15న ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరగనుందన్నారు.రూ.300 చెల్లించి గృహస్థులు (ఇద్దరు) పాల్గొనవచ్చని తెలిపారు.
నేటి నుంచి దేవునికడప ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
తేదీ ఉదయం సేవలు రాత్రి వాహన సేవ
- 09.02.2024 అంకురార్పణ సేనాధిపతి ఉత్సవం,
- 10.02.2024 తిరుచ్చి ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం
- 11.02.2024 సూర్యప్రభ వాహనం పెద్దశేష వాహనం
- 12.02.2024 చిన్నశేష వాహనం సింహవాహనం
- 13.02.2024 కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
- 14.02.2024 ముత్యపుపందిరి గరుడ వాహనం
- 15.02.2024 కల్యాణోత్సవం గజవాహనం
- 16.02.2024 రథోత్సవం ధూళి ఉత్సవం
- 17.02.2024 సర్వభూపాల వాహనం అశ్వ వాహనం
- 18.02.2024 వసంతోత్సవం హంస వాహనం
- (చక్రస్నానం) ధ్వజావరోహణం
- 18.02.2024 –– పుష్పయాగం
దేవునికడపను తిరుమలకు తొలిగడపకు భావిస్తాం. ఉత్తర ప్రాంతాల ప్రజలు ఏ కారణంగానైనా తిరుమల వరకు వెళ్లలేకపోతే కడపలోని లక్ష్మి వెంకటేశ్వరుడిని దర్శించుకుంటే వారి మొక్కులు తిరుమలేశునికి చేరుతాయని విశ్వాసం. ఉత్తర ప్రాంతాల వారు తిరుపతికి వెళ్లేటపుడు దేవునికడప స్వామిని దర్శించుకుని వెళుతుంటారు.
Courtesy: vskandhra