Aadi Shankaracharya |
జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్య
మన భారతదేశంలో ఎంతోమంది మహనీయులు ఆదర్శబోధకులు జన్మించారు. జాతి నిద్రాణస్థితిలో వున్నపుడు గమ్యాన్ని చేరడానికి సతమత మవుతున్నపుడు వీరు యావత్ జాతిని
మేల్కొలిపి, ఉనికిని గుర్తు చేసి, గమ్యం వైపు నడిపించారు. ఆ అలుపెరుగని ఉద్యమంలో
తమ సమస్త శక్తులను ధారపోశారు. లోకకల్యాణమే వారి ఉద్దేశ్యం. సనాతన ధర్మ ప్రతిష్టాపనే
వారి ఊపిరి.
అటువంటి మహనీయులలో ప్రప్రధమంగా పేర్కొనవలసిన వారు శ్రీ శంకరాచార్య కేరళలోని “కాలడి” అనే గ్రామంలో శివగురువు, ఆర్యాంబ అనే పుణ్య దంపతులకు జన్మించారు. ఆయన జీవించినకాలము 32 సం॥రలు మాత్రమే. క్రీ॥శ. 788 నుండి 820 సం॥ వరకు.
చిన్న వయసులోనే విశ్వగురువుగా మన భారత వేదాంత చరిత్రలో తనదైన ముద్రను
శాశ్వతంగా నిలిపారు. అద్వైత వేదాంతం యొక్క ప్రాముఖ్యతను భారతదేశం లోని నాలుగు మూలల వరకు చేరేలా అవిశ్రాంతంగా కృషి చేశారు.
కన్యాకుమారి నుండి కాళశ్మీరువరకు, పూరి నుండి ద్వారక వరకు శ్రీశంకరులు అన్ని
పుణ్యక్షేత్రాలను దర్శించారు. భిన్న అభిప్రాయాలతో, వాద ప్రతివాదాలతో నిర్వీర్య మైపోతున్న
హిందూ మతాన్ని బోధకుడుగా సమన్వయకర్తగా ఒక రూపుదిద్ది మనందరం సనాతన ధర్మానికి
వారసులం అని జాతినంతా మేల్కొలిపిన శక్తి శ్రీశంకరులు. అందుకే వారిని జగద్గురువులుగా
పిలుస్తున్నారు.
శ్రీ శంకరులు ఇంతబ్బృహత్ కార్యాన్ని సాధించింది కేవలం 32 సం॥రల జీవనయానంలో అంటే చాలా ఆశ్చర్యంకలుగుతుంది. వారిని శివుని అవతారంగా భావిస్తారు. ఎందుకంటే మానవమాత్రునివల్ల సాధ్యంకాని పని ఆయన నిర్వహించారు.
సనాతనధర్మం ప్రస్థానత్రయం పై ఆధారపడి ఉంది. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, భగవధ్గీత, బ్రహ్మసూత్రాలు. వీటికి సరియైన వివరణలేక సమన్వయంచేసుకోలేక అవస్థపడడం ఆయన గమనించారు. తన అపార జ్ఞానాన్ని అద్భుతయోగశక్తిని కేంద్రీకరించి, ప్రస్థానత్రయానికి భాష్యాలను రచించారు. చిక్కుముడిలాగ, అగమ్య గోచరంగా ఉన్న ఈ వేదాంత శాస్త్రాలను సులభంగా అర్జమయ్యేలాగ వివరణలిచ్చారు.
శంకరులవ్యాఖ్యానాలు అద్భుతం అని అందరూ కీర్తించారు. పండితులకు ఈ విధమైన వివరణలిస్తూ, సామాన్య మానవులకు భక్తిరసపూరితమైన శ్లోకాలను సమకూర్చి పెట్టారు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈత్రిపుటిని ఆయన స్తోత్రాలలో నిక్షిప్తం చేశారు. అందువలననే ఆయన రచించిన స్తోత్రాలు ఇప్పటికీ మనందరినీ భక్తిరససాగరంలో
ఓలలాడిస్తున్నాయి.
ఎవరింటిలో శ్రీ శంకరుల స్తోత్రాలు వినిపిస్తుంటాయో ఆ ఇంటిలో అన్ని శుభాలు
నెలవుంటాయి అని పెద్దలు చెబుతారు. గణేశ వంచరత్నస్తోత్రం శివానందలవారి సౌందర్య లవారి, విష్ణుషట్పది, శివపంచాక్షరస్తోత్రము. మీనాక్షి పంచరత్న స్తోత్రం మహిషాసుర మర్గినీ స్తోత్రం. కాలభైరవాష్టకం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం జగన్నాధాష్టకం, అచ్యుతాష్టకం, శ్రీకృష్ణాష్టకం ఇంకా ఎన్నో-
ఇప్పటికీ అంటే 1200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కుచెదరక మనకి మానసిక ప్రశాంతతను కల్గిస్తున్నాయంటే కారణం ఒక్కటే అది శ్రీ శంకరులకు మనమీద ఉన్న అవ్యాజకరుణ.
లోకశ్రేయస్సుకోసం - మానవులను ఉన్నతవ్యక్తులుగా తీర్చిదిద్దడంకోసం - అలౌకికమైన
దివ్యఆనందాన్ని మనకి అందించడంకోసం అహరహం శ్రమించిన శంకరుల వంటి గురువును
మనం మానవచరిత్రలో ఎక్కడా చూడలేము. శంకరుల గొప్పతనమేమిటంటే ఏ స్థాయివారికి ఆస్థాయికితగ్గ మార్గాలను సుగమం చేశారు. అన్ని మార్గాల గమ్యం అద్వైతమే అని మేలుకొలిపారు. శైవులని, వైష్ణవులని, గాణాపత్యులని, శాక్తేయులని వివిధ వర్గాలుగా చీలిపోయినజాతిని, ఒకే బాటపై నడిపించారు. అన్ని మార్గాలగమ్యం ఒకటే అని స్పష్టపరచారు.
సర్వదేవతామూర్తులపై స్తోత్రాలు రచించారు . తత్త్వబోధ, వివేకచూడామణి వాక్యవృత్తి ఆత్మబోధ అనే ప్రకరణ గ్రంధాల ద్వారా సర్వవేదాంత సిద్ధాంతాలను తెలియజేశారు. భాష్యాలను రచించారు.
రచనలు, బోధనలనేకాకుండా యావత్ భారతదేశాన్ని కాలినడకన పర్యటించారు. 1200
సం॥ల క్రితం, ఏవిధమైన వాహనాలు, రహదారులు, లేనిసమయంలో తక్కువ సమయంలో
కేవలం 32 సం॥ల ఆయుఃప్రమాణంలో ఒక వ్యక్తి ఈ కార్యాలన్నీ చేశారంటే - ఆశ్చర్యం -
అద్భుతం. అందుకే ఆచార్యులలో వారిది ఉన్నతస్థానం. సదాశివ సమారంభాం శంకరాచార్య
మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరం పరామ్. గురు పరంపరల వలనే
భారతజాతి తన ఉనికిని కాపాడుకుంటుంది.
తన శిష్యులను ఉద్దండులుగా తీర్చి దిద్దారు. తాను స్వయంగా పరమపూజ్య శ్రీ
గోవిందభగత్పాదులశిష్యునిగా కీర్తించబడ్డారు. శ్రీసురేశ్వరాచార్య, శ్రీపద్మపాద, శ్రీహస్తామలక, శ్రీతోటకాచార్య వీరు నలుగురు శ్రీ శంకరాచార్యుల శిష్యులు.
నాలుగు వేదాలకు ప్రతీకలుగా నాలుగు పీఠాలను దేశం నాలుగుమూలల ప్రతిష్టించి సనాతన వైదిక ధర్మం చిరస్థాయిగా ఉండేలా చేశారు. బదరీనాధ్, పూరీ, ద్వారక, శృంగేరి
పీఠాలు ఇప్పటికీ అధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లు తున్నాయి.
శరీరమే నేను, ఇంద్రియవ్యాపారాలే నా జీవితం అని మాయలో పడిన మనిషిని తట్టిలేపి ఆత్మతత్వాన్ని బోధచేసి అద్వైత మకరందం నీ సొత్తు అని మనందరినీ చైతన్య పరచిన జగద్గురువు శంకరులను మనం ప్రతిరోజు ఉదయాన్నే స్మరించవలసిన బాధ్యత ఉంది. వారు మనకు ఇచ్చిన స్తోత్రాలలో కొన్ని అయినా మనం చదివి, మన పిల్లలతో చదివించడమే వారికి మన కృతజ్ఞతను తెలియచేయడం.
TELUGUBHARATH.COM వారు మనందరికి శ్రీశంకరుల స్తోత్రాలు రచనలను అందుబాటులో
ఉంచుతున్నారు.
మనదైనందిక జీవితం అనేక ఒడుదుడుకులకు లోనవుతుంటుంది. మానసిక ఒత్తిడి
"పెరుగుతుంది. వీటినుంచి బయట పడాలంటే శ్రీ శంకరుల స్తోత్రాలు అద్భుతమైన ఔషధం. భక్తి నమ్మకంతో ప్రయత్నించండి ఫలితం తథ్యం.
రచన : బి. నాగేశ్వర సింగ్