– చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
“నా ఆశ, శ్వాస, పోరాటం భరత మాత దాస్య శృంఖలాలు తెంపటమే. సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రపంచంలొ నేను ఎక్కడ ఉన్నా ఎవరితో కలిసినా. ఈ విషయంలో నేను ఎవ్వరికీ సంజాయిషీ ఇచ్చే అవసరం లేదు. నా దేశప్రజలకి ఈ విషయం బాగా తెలుసు”….. ఇది ఒక ప్రజా నాయకుడు, ప్రజలు గౌరవంగా” నేతాజి ” అని పిలుచుకునే సుభాష్ చంద్ర బోస్ తన పై మూర్ఖపు ఆరోపణ చేస్తున్న” ఎర్ర మేధావుల” కి ఇచ్చిన సమాధానం.
శాంతి, సహనం నిండిన సుదీర్ఘమైన విఫల పోరాటం చేసి చేసి అలసి పోయిన భారత ప్రజల మనస్సుల్లో సుడులు తిరుగుతున్న స్వాతంత్య్ర కాంక్ష ఒక ఉప్పెనలా బయటకు పోంగి బ్రిటిష్ వారిని ముంచి పడేసి హడావిడి గా స్వతంత్రం ఇచ్చారంటే దానికి ఖచ్చితమైన కారణం నేతాజీయేననే విషయం నిర్వివాదం. ఆయన నడిపిన ఇండియన్ నేషనల్ ఆర్మీ దెబ్బకు బ్రిటిష్ సామ్రాజ్యం లో రవి అస్తమించాడు. నిజానికి ఇండియన్ నేషనల్ ఆర్మీ అప్పటికి పెద్ద విజయాలు ఏమీ నమోదు చేయలేదు. అయినా బ్రిటిష్ వారు ఎందుకు భయపడ్డారు? ఎందుకు హడావిడిగా స్వతంత్రం ప్రకటించారు??….. ఈ ప్రశ్నలకు సమాధానం నేతాజీ జీవితాన్ని చూస్తే మనకు అర్థం అయిపోతుంది.
ఆయన జీవితం మొత్తం పోరాటమే. ప్రపంచ స్థాయి నాయకుల సరసన ఎన్న తగ్గ నాయకుడు. ఎటువంటి అధికార లాంచనాలు లేకున్నా, ఏ విదేశం వెళ్లినా, దేశాధిపతి స్థాయి లో గౌరవం అందుకున్న ఏకైక నాయకుడు.
కాలేజీ విద్యార్థిగా “ఒటెన్ ను” ఎదిరించి న సందర్భం
బోస్ కాలేజీ లో చదువుతున్న సమయం లో ఒటెన్ అన్న పేరుగల చరిత్ర బోధించే ఆచార్యుడు భారతీయుల గురించి ఆవాకులు చవాకులు వాగేవాడు. అది ఒప్పుకోని విద్యార్థులు నిరసన తెలియచేశారు, అయినా ‘ఒటెన్’ తన పద్దతి మార్చుకోలేదు. కొందరు విద్యార్ధులు ఆయన పై భౌతిక దాడి చేశారు. కేవలం అక్కడ వున్నాడు అని బోస్ పై నింద మోపి కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ వయస్సు వారు అప్పుడు బెంబేలు పడి పోతారు. అయితే నేతాజీ మాత్రం పోరాడి మరీ తన కాలేజీ చదువును పూర్తి చేశారు.
ప్రతిష్టాత్మక ICS పరీక్షలో 4 వ ర్యాంక్ పొంది కూడా …
బ్రిటిష్ వారు విశాల భారతదేశంపై అజమాయిషీ కోసం ఇప్పుడు మనం ఐఏఎస్ అని పిలుస్తున్న దేశవ్యాప్త సర్వీసు ఐసిఎస్ కోసం ఇంగ్లండ్ లో ఒక పరీక్ష పెట్టేవారు. అలాంటి కఠినమైన పరీక్షను కేవలం ఎనిమిది నెలల లపాటు చదివి అలవోకగా నాలుగోవ ర్యాంకర్ గా నిలిచారు. కానీ విదేశీయుల క్రింద పనిచేయదమేమిటనిపించి మంచి జీతం , హోదా ఉండే అటువంటి అవకాశాన్ని వదులుకున్నారు. మా పాలన మేము చేసుకుంటామని ప్రకటించారు. అప్పటినుంచి ఆయనపై గూడచర్యం మొదలైంది.
మాండలే జైలులో దుర్గా పూజ కోసం పోరాటం
మాండలే జైలులో ఆయనను బంధించినప్పుడు , హిందువుల పూజ చేసుకునే హక్కుకై పోరాడారు. దుర్గా పూజను ఒక హక్కుగా, ఒక అధికారంగా ఆయన పేర్కొన్నారు. దుర్గా పూజ అంటే అమ్మను పూజించినట్టు, మాతృభూమిని పూజించినట్టు అంటూ ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెసు అధ్యక్ష పదవికి మెజారిటీ తో ఎన్నకైనా…
కాంగ్రెస్ అధ్యక్షునిగా రెండవసారి పోటీ చేసినప్పుడు గాంధీజీ మద్దతు ఇవ్వలేదు. పోటీ నుంచి తప్పుకోమని ఒత్తిడి తెచ్చారు. అయినా అత్యధిక మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు నేతాజీ. కొంగ్రెస్ దశ, దిశ మార్చే ప్రయత్నం చేశారు నేతాజీ.
103డిగ్రీ ల జ్వరంతో కాంగ్రెసు సభ కు అద్యక్షత
నేతాజీ కాంగ్రెస్ ను సమూలంగా మారుద్దామనే ప్రయత్నంలో ఉంటే , పదవీ వ్యామోహంతో కొందరు పెద్దలు ఆయనను ఇబ్బంది పెట్టటానికి అన్నీ ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయన ఆరోగ్యం బాగోలేదని తెలిసీ సమావేశం జరపాలి అంటూ పట్టుబట్టారు. అప్పుడు కూడా 103 డిగ్రీల జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా సమావేశాన్ని నిర్వహించి వారిని ఆశ్చర్యపరచారు.
బ్రిటిష్ యంత్రాంగం కళ్ళు కప్పి కలకత్తా నుంచి బెర్లిన్..
ఇంటి బయట ఇరవైనాలుగు గంటల నిఘా ఉండగా అందరినీ ఆశ్చర్యపరస్తూ ఎక్కడో బెర్లిన్ లో ప్రత్యక్షం కావడం, ప్రపంచ చరిత్రలోనే ఒక అద్బుతమైన ఘట్టం. దాదాపు పదిరోజుల పాటు నేతాజీ ఇంట్లోనే ఉన్నారనే భ్రమ కలిగించి బ్రిటిష్ అధికారుల కళ్ళల్లో కారంకొట్టడం ఆయన వ్యూహ రచనాపటిమకు మంచి ఉదాహరణ.
ప్రవాసంలో ఉంటూ రేడియో ప్రసంగాలతో దిశానిర్దేశం
రేడియో ఉపయోగాన్ని గుర్తించి, రేడియో ప్రసంగాల ద్వారా ఆయన దిశానిర్దేశం చేసేవారు. నిజానికి ఇప్పటి సోషల్ మీడియా ఏ విధంగా మన గడపలో సమాచారాన్ని అందిస్తోందో, అలాగే ఆ రోజుల్లో సమాచార విప్లవానికి కారణం రేడియో. అలాంటి సాధనాన్ని చక్కగా ఉపయోగించుకున్న దార్శనికుడు నేతాజీ.
ఇండియన్ నేషనల్ ఆర్మీ
స్వాతంత్ర్యం ఒకరు ఇచ్చే బిక్ష కాదు, అది యుద్దం చేసి సాధించుకోవాల్సిన హక్కు అని ఎలుగెత్తి చాటిన నాయకుడు నేతాజీ. భారతీయుల సైన్యం ఆజాద్ హిందూ ఫౌజ్ – ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి, శిక్షణ ఇచ్చి, “జై హింద్“ అనే ఉత్తేజపూరితమైన నినాదాన్ని, మొట్టమొదటి స్వాతంత్ర్య భారత ప్రభుత్వాన్ని అండమాన్ లో ఏర్పాటుచేసిన ఘనత నేతాజీదే.
యావత్ భారతావనిలో బ్రిటిష్ వారు నిరంతరం భయపడింది నేతాజీ గురించే. గూడచర్యం చేసింది ఆయన మీదే. దొంగకేసులు వేసి, మోసపూరితంగా ఆయనను నిర్భంధించి, జైలుపాలు చేసి ఆయనకు చెడ్డ పేరు తేవాలని ఆనాటి బ్రిటిష్ వారు, స్వాతంత్ర్య భారతంలో పాలకులు ఎంతగా ప్రయత్నించినా, భూమిని చీల్చుకు వచ్చే వెదురు మొక్కలాగా పెద్ద వృక్షమై ఎందరో దేశభక్తులకు ఆదర్శంగా నిలిచారు, స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు నేతాజీ. మాతృభూమి దాస్యశృంఖలాలను తుత్తునియలు చేసిన వీరఖడ్గం నేతాజీ . “నేతాజీ వల్లనే, ఇండియన్ నేషనల్ ఆర్మీ పోరాటం వల్లనే, వారి విజయాలవల్లనే బ్రిటిష్ వారి వెన్ను వణికి, స్వాతంత్ర్య ప్రకటన చేశారు“ అని డా. అంబేద్కర్ అన్నారు. ఇది నిర్వివాదాంశం.
Courtesy : vskteam