మృత్యువు |
మృత్యువు పట్ల ఎరుక ( శ్మశానం లో ధ్యానం ఎందుకు? )
మరణ సతి అనే పేరు అంటే మృత్యువు మీద ధ్యానం ఒక ప్రత్యేకమైన సాధనంగా చెప్పచ్చు.. సాధకుడు అనిచ్చ ( అనిత్యత) దుఃఖ, దృష్టిని కలిగి ఉంటూ దీన్ని ఈ ధ్యానాన్ని పెంచుకోవాలి.
వితర్కచరితుడు లేక చింత కలిగిన వ్యక్తి అయితే అత్యంత అనుకూలమైన నాలుగు ముఖ్యమైన విషయాలుగా దీనిని గురించి చెబుతారు. మరణ ధ్యానం లేక మరణానుస్మృతి భావన అంటునప్పటికి మరణ సతిగానే చెప్పబడింది.
ఇక్కడ మరణం అంటే జీవనాంగం తెగిపోవడం అన్నారు. కనుక ఈ పదం ఈ క్రింది మృత్యువులలో దేన్నీ సూచించదు.
అవి...
- అర్హతల ఆఖరి మరణమైన సముఛ్ఛెదమరణ లేక సంపూర్ణ మరణం. ఇది అనిత్య ప్రపంచంలో అస్తిత్వం ఆగిపోవడం.
- క్షణిక మరణం. ఇది నామ రూపాల క్షణిక మరణం.
- సంవృత్తి మరణం. ఇది జడ వస్తుసంబంధమైనది . దీన్ని మృత క్షణం, మృత లోహం లాంటివి ఉదాహరణలు.
ఇక్కడ మనం చెబుతున్న మరణం రెండు రకాలు. అవి కాల మరణ, అకాల మరణాలు. మొదటిది అయిన కాల మరణం మళ్ళీ మూడు విధాలు.
1. పుణ్య క్షయం వలన కలిగేది.
2. ఆయుక్షయం వలన కలిగేది.
3. పుణ్యమూ ఆయువు రెండూ క్షీణించడం వలన కలిగేది. జనకర్మ, ఆయువు ఇంకా మిగిలి ఉండగానే సంభవించేది అకాల మరణం. ప్రమాదం, రోగం, ఆత్మ హత్య వలన కలిగేవి అకాల మరణాలు. కాల, అకాల మరణాలు రెండింటిని ఆ యొక్క జీవి ఇంద్రియ ఉపఛ్ఛేదం సూచిస్తుంది. దీని స్మరణమే మరణ ధ్యానం. అలాగే దీని వలన ఉత్పన్నం అయ్యే ఉపచార జ్ఞానాన్ని మరణ ధ్యానం అన్నారు.
దీనిని సాధన చేయాలి అంటే ఆ సాధకుడు దూరంగా ఏకాంతం గా వెళ్లి తన మనసుని ఈ ఆలోచనకు అర్పించాలి. "మరణం అనేది సంభవిస్తుంది,జీవితేంద్రియం తెగిపోతుంది " అని గానీ లేక మరీ సరళంగా"మరణం, మరణం అని గానీ మనసులో మరణం గురించి ధ్యానం చేయండి. వీటిలో ఏది చేసినా అది కేవలం ఒక ప్రాథమిక సాధన మాత్రమే అవుతుంది. ఈ సాధన కనుక సరిగా సక్రమంగా అంటే పూర్తి ధ్యాన స్థితిలో... ఎరుక స్థితిలో దానికి సంబంధించిన భావం తోనూ ధ్యానం చేయాలి. పూర్తి సాక్షి భావంతో సాధన చేయాలి. ఇది శ్మశాన వైరాగ్యం కోసం కాదు...మరణం పట్ల పూర్తి ఎరుకను కలగడం కోసం. ఈ మరణ ధ్యానం ఎటువంటి అంతరాయాలు లేకుండా సాగితే ఈ మరణ ధ్యానం స్థిరమై ఏకాగ్రత పెరిగి సమాధి స్థితి చేరుతుంది.
అలా జరగకపోతే,
అతను మరణాన్ని 8 విధాలుగా స్మరించాలి.
- చేతిలో కత్తిని ధరించిన హంతకుడు ' నిన్ను చంపేస్తా " అని మీదకు వచ్చినట్టు గా మరణం కూడా జీవితాలను భయపెడుతుంది. దీనిని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
- ఇలా చేయండి... ఈ ప్రపంచంలోని భోగ భాగ్యాలు సాధించింది అన్నీ నష్టమయ్యేటట్లుగా భాగ్యవంతమైన జీవితం కూడా ఖచ్చితంగా మరణంతోనే ఆఖరి అవుతుంది. అందుకే ఇలా చెప్పారు కూడా.. { జరామరణాలు జీవులపైకి దోర్లుకుంటూ వస్తాయి, క్షత్రియులు, వైశ్యులు శూద్రులు బ్రాహ్మణులు ఎవరూ దీని నుంచి తప్పించుకోలేరు. అందరూ వెళ్ళాల్సిన వారే, అక్కడ ఏనుగులకు,రథాలకూ పదాతి దళానికి స్థానం లేదు. అక్కడ దర్పంతో ధనంతో పోరాడి గెలవగలినినవాడు లేడు. }
- ఇతరుల మరణాలను బట్టి తన మరణం కూడా తథ్యమేనని భావన చేయడం వలన మరణ ధ్యానం చేయండి. గతంలో గర్వం తెలివీ బలమూ శక్తీ విద్వత్తూ ఉన్న అందరూ మరణించారు. పారమార్థిక ఆధ్యాత్మిక శిఖరాలకు చేరిన వారు కూడా అందరూ మరణించారు. ఈ గొప్ప వారిలాగనే నేను కూడా మరణించక తప్పదు. ఇలా ఈ విధంగా మీ ధ్యానం చేయండి.
- జరిగే వాటి అన్నింటిలోనూ మరణమే తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు అంటే, ఈ శరీరమే వందలకొద్దీ రోగాలకు బాహ్య ప్రమాదాలకి అన్ని మృత్యు కారణాలకి అలవాలం. ఏ క్షణంలో అయినా వీటిలో ఏవో దాడి చేసి ఈ శరీరాన్ని నాశనం చేయవచ్చు. దీన్ని గురించి ఇలా అన్నారు... నా మరణానికి ఎన్నో అవకాశాలు. నన్ను పాము కరవచ్చు, విష జంతువు దాడి చేయవచ్చు లెక ఏదో ఒకటి నన్ను కుట్టవచ్చు దాని వలన మరణం రావచ్చు. ఇలా ప్రమాదం రావచ్చు. లేకపోతే నేను కాలు జారి పడిపోవడం జరగవచ్చు. నేను తీసుకున్న ఆహారం నన్ను ఇబ్బంది పెట్టవచ్చు. లేక శరీరంలోని పైత్య, కఫాలు ప్రకోపం చేయవచ్చు. వీటి వలన నేను మరణించడమో లేక అపాయానికి గురి కావడం జరగవచ్చు. ఇలా శరీర స్వభావాన్ని బట్టి దానికి ఉన్న ప్రమాదాలను బట్టి ఈ మరణ ధ్యానం చేయవచ్చు.
- మనుషుల జీవితం శ్వాస ప్రశ్వాలకూ శారీరక భంగిమలకు శీతోష్ణాలకు, నాలుగు ధాతువు లకూ ఆహారానికి బధ్ధమైనది. ఊపిరి నడుస్తున్నంతవరకు జీవితం, ఆగితే మరణం. నాలుగు ( నడిచే, నిలబడే, కూర్చునే, పడుకునే) భంగిమలు ఉపయోగిస్తున్నంత వరకు జీవితం నడుస్తుంది. ఏది ఎక్కువ అయినా ప్రాణశక్తి తక్కువ అవుతుంది. శరీరానికి సమశీతోష్ణాలు అవసరం, ఏది మీరినా అపాయం. నాలుగు ధాతువులూ సమతూకం లో ఉన్నంత వరకే జీవితం, అది తప్పితే మరణం. అలాగే ఆహరం అందినంత వరకే జీవితం, అందకపోతే మరణం. ఇలా జీవితం లోని బలహీనతలని దాని అన్యాశ్రయత్వాన్నీ గుర్తించడం ద్వారా మరణ ధ్యానం సాధన చేయాలి.
- ఈ ప్రపంచంలో జీవితం అనిత్యం. దేశాలు, కాలాలు, కారణాలు, గమ్యాలు ఆధారంగా నిర్థారించలేం.
ఒక వ్యక్తి ఎక్కువ గానీ తక్కువ గానీ కాకుండా ఇంత కాలం బ్రతికి ఉండాలి " అని నిశ్చయించడానికి వీలు కాదు కాబట్టి జీవితం"చిహ్నం " లేనిది. జీవితం ఏ దశలో అయినా పోవచ్చు. మొదటి పిండ దశలోనో రెండవ బాల్య దశలోనో మూడవ యవ్వన దశలోనో లేక ఏ సమయంలో అయినా... ఎప్పుడైనా పోవచ్చు.
"ఫలానా రోగం వల్లనే మనుషులు మరణించాలి గాక, ఇతర విషయాల ద్వారా మరణం రాకూడదు గాక " అని రోగాన్ని కూడా నిర్థారించడం వీలు కాదు. ఎందుకు అంటే, ఏ రోగం వల్లన అయినా మనుషులు మరణించే అవకాశం ఉంది. ఒకడు ఈ సమయంలో మాత్రమే ( పగలు రాత్రి) మరణించాలి, ఇతరా సమయాల్లో మరణించకూడదు అని నిర్థారించడం కూడా వీలు కాదు. కాబట్టి మరణ సమయం కూడా అజ్ఞాతమే. జీవులు ఉదయమో, మధ్యాహ్నం పూట, సాయంత్రం రాత్రి మరణం కలుగవచ్చు.మరణం ఫలానా ఈ స్థలంలోనే జరగాలి వేరే ఎక్కడా చావను అని నిర్ధారణకు కూడా వీలు కాదు. కాబట్టి మరణ స్థలం కూడా అజ్ఞాతమే. ఒకడు ఈ లోకం నుంచి కాలం చేసి ఫలానా లోకంలోనే పుట్టాలి అని నిర్ణయించడానికి కూడా వీలు కాదు.. కాబట్టి గమ్యం కూడా అజ్ఞాతమే. ఎందుకు అంటే దేవ లోకం నుంచి చ్యుతులైనవారు మానవ లోకంలో పుడుతుంటారు. మానవ లోకం నుంచి చ్యుతులైనవారు దేవ లోకంలోనో లేక మరే ఇతరా లోకంలోనో పుడుతుంటారు. ఇలా ఈ విధంగా మరణ ధ్యానం చేయండి.
7. ఆయువు అతి స్వల్పం. ఇంకా కొంత మంది వంద సంవత్సరాలు...150 ఎక్కువో జీవిస్తారు.. ఇలా స్వల్ప కాలం జీవితం పరిమితం అని గుర్తు చేసుకుంటూ మరణ ధ్యానం చేయండి.
8. ఈ ధర్మం ప్రకారం మనసు యొక్క పరంపర సాగినంత కాలం వరకే జీవిత పరంపర నడుస్తుంది.ఒక ప్రత్యేకమైన జీవిలో మనసు పని చేయడం ఆగగానే జీవితం కూడా ఆగిపోతుంది. దీన్ని మరణం అంటారు. ఇలా జీవితపు క్షణభంగురతను గుర్తు చేసుకుంటూ మరణ ధ్యానం చేయండి.
ఈ విధంగా ఒక సాధకుడు ఈ 8 పద్దతులలో మరణ ధ్యానం సాధన చేయడం వలన, నిరంతర సాధన వలన మనసు అలవాటును రూపొందించుకుంటుంది. మరణం గురించి పూర్తి ఎరుక వస్తుంది. సరైన పద్ధతి ప్రకారం.. సరైన ఎరుకతో ఈ సాధన క్షణకాలం చేసినా అది చాలా గొప్ప లాభం అవుతుంది అని అన్నారు.
ఒక నిజమైన సాధకుడు... శ్వాసను విడిచాక మళ్ళి తీసుకున్న కాలం మాత్రమే, శ్వాసను తీసుకున్నాక మళ్ళీ విడిచినంత కాలం మాత్రమే అయినా నేను ధర్మాన్ని అవలంబిస్తూ జీవిస్తే చాలు. నేను చాలా చేసినట్టే అనుకుంటూ మరణ ధ్యానం పట్ల ఎరుక పెంచుకోవడం జరుగుతుంది. ఈ సాధకుడిని అప్రమత్త జీవితాన్ని గడిపేవాడు అనవచ్చు.
ఈ సాధన లో పరిపూర్ణమైన స్థాయిలో ఎరుక సాధించిన సాధకుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. ఈ కనిపించే భౌతిక ప్రపంచపు రాగాన్ని కలిగి ఉండడు. జీవితం పట్ల ఉండే కోరికను వదిలేస్తాడు. పాపపు పనులు చేయడు. జీవితం యొక్క ఆవశ్యకతను కలిగి ఉండడు. అతని వైరాగ్యం స్థిరంగా ఉంటుంది. దీని వల్ల అతను ప్రపంచం యొక్క దుఃఖ స్వభావాన్ని దాని యొక్క అవాస్తవం రూపాన్ని తెలుసుకుంటాడు. మరణ సమయం లో భయం పొందక ఎరుకతో ఆత్మస్థైర్యం తో ఉంటాడు. ఒక వేళ ఈ వర్తమాన జీవితం లోనే అమృతాన్ని అందుకోవడం లో విఫలం అయితే, అతని మరణం తర్వాత సద్గతినే పొందుతాడు. కాబట్టి ఈ మరణ ధ్యానం ఏకాంత ప్రదేశంలో చేయండి...