మంగళగౌరీ వ్రతము | Mangala Gowri Vratam
మన భారతీయ సంస్కృతిలో మహోన్నతమైనది వివాహసంస్కారం. అన్ని ఆశ్రమాలలోను గృహస్థాశ్రమము చాలా శ్రేష్ఠమైనదని మన వేదములు, స్మృతులు ఘోషిస్తున్నాయి. ఇందు భార్య, భర్త ఇరువురు ఒకరిపై నొకరు ప్రేమానురాగాలతో జీవించుటతోపాటుగా భర్థ ఏకపత్నీవ్రతుడుగా భార్య ప్రతివ్రతామ తల్లిగా వెలుగొందుతుంటారు. అట్టి గృహము ఎల్లప్పుడు నిత్యకళ్యాణము - పచ్చతోరణముతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈ గృహస్థాశ్రమ నిర్వహణకు మన మహర్షులు మంచి సంస్కారాలను ఏర్పరిచారు. అలా ఈ గృహస్థాశ్రమ నిర్వహణ ఆచరించుటకూడ ా ఒక మహాయజ్ఞముతో సమానమైనది అని ' మను ' మహర్షియొక్క అభిప్రాయం. అటువంటి గృహస్థాశ్రమమున సౌశీల్యవతియైన స్త్రీ గృహకృత్యములు, గృహస్థధర్మములు నిర్వహించుకుంటూ అనేక రూపాలలో ఇలా గృహస్థునకు తోడ్పడుతూ ఉంటుంది.
శ్లో|| కార్యేషు దాసీ కరణేషు మంత్రీ రూపేచ లక్ష్మీ క్షమయాధరిత్రి|
స్నేహేచ ( భోజ్యేషు ) మాతా శయనేచ రంభా షట్కర్మయుక్తా కులధర్మపత్నీ||
అనగా! గృహకార్య నిర్వహణలో దాసిగా, కుంటుంబ వ్యవహారాలలో ఆలోచనందు మంత్రిగా, రూపమందు మహాలక్ష్మీ స్వరూపంగా, స్నేహభావమందు తల్లిగా, శయనమునందు ' రంభను ' మరిపించేదిగా; ఈ ఆరు కర్మలయందు భర్తకు సహకరిస్తూ; కుల ధర్మపత్నిగా వెలుగొందుచుండును. అట్టి ఆదర్శవంతమైన మన భారతీయ స్త్రీలు పూర్వీకుల కాలమునుండి చక్కని సదాచారముగా భావించి ఆచరించునదియే ' ఈ మగళ గౌరీవ్రతం '. అలాభక్తులు కొలిచే ఆ మంగళగౌరి, ప్రజలను కన్నబిడ్డలవలే కాపాడుటలో ఎట్టి త్యాగానికైనా సిద్ధపడుతుంది అనుటకు ఒక చక్కని గాథను ఈ సందర్భంగా ఒక్కసారి మననం చేసుకుందాం.
శ్లో|| వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌవందే పార్వతీ పరమేశ్వరౌ||
ఈ సర్వజగత్తునకు తల్లిదండ్రులైన ఆ ఆది దంపతులను వాగార్థిములతో పోల్చాడు మహాకవి కాళిదాసు. సగం భాగం తన భార్యకి స్థానమిచ్చి అర్ధనారీశ్వరుడని పించుకున్నాడు పరమేశ్వరుడు.
పూర్వం కృతయుగంలో దేవతలు, రాక్షసులు కలిసి ' అమృతం ' కొరకై క్షీరసాగరమధనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది. దానిని చూచి భయకంపితులైన దేవదానవులు శరణు! శరణు! అంటూ పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించారు. ఆ తండ్రి మందహాసముతో చిరునవ్వు నవ్వి... ఇప్పుడు నేను ఏమి చెయ్యను? అన్నట్టు క్రీగంటితో పార్వతి వైపు చూచాడు.
మ్రింగెడు వాడు వుభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనే సర్వమంగళ మంగళ సూత్రమును నెంతమది నమ్మినదో
ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంత్యర్య మేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా మనభక్తులేకదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరము స్త్రీల సౌభాగ్య సందను కాపాడే ఆ సర్వమంగళ తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి; లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మ్రింగటకు అనుమతిని యిచ్చింది. చూశారా? ఆ మంగళగౌరీ దేవికి తనబిడ్డలపై గల ప్రేమ, మమకారం, " కరుణ " ఎట్టిదో! మరో మారు జ్ఞప్తికి తెచ్చుటకై ఈ గాథను వివరించాము. ఆట్టి కరుణాంతమూర్తి పార్వతీదేవిని " శ్రీలలితా సహస్రనామపారయణ " ప్రారంభంలోనే ఇలా ధ్యానిస్తారు.
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుస్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం వయూఖై రహమిత్యేవ విభావయే భవానిమ్
అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను నూతనముగా వివాహితులైన స్త్రీలు ఈ " శ్రావణమాసం తొలిమంగళవారంతో " మంగళగౌరీవ్రతాన్ని ఆచరించి అనంతరం ఉద్యాపన కార్యక్రమాన్ని చేపడతారు. అలా! ఆచరించిన స్త్రీలపై " శ్రీమంగళగౌరీ " కటాక్షంతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతము సర్వ సౌఖ్యాలతో అలరారుచుందురు అని చెప్పబడినది. తొల్లి సూతులవారు నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మునులకు వివిధ పురాణగాథలు వివిధ వ్రతగాధలు వివరిస్తూ ఉండగా, వారి కోరికమేరకు " ఈ మంగళగౌరీవ్రతం " గురించి వివరించగా, నారద మునీంద్రుడు సావిత్రి మాతకు ఉపదేశించినాడు. ఈ వ్రతవిధానాన్ని శ్రీకృస్ణ పరమాత్మ " ద్రౌపదీదేవికి " వివరించి ఆమెచే చేయించినాడు. అటువంటి ఈ మంగళగౌరీవ్రత గాథ సారాంశమును ఒకసారి మననం చేసుకుందాం.
పూర్వం మాహిష్మతీనగరాన్ని జయపాలుడు అనురాజు పాలించేవాడు. ఆతడు ప్రజాభీష్టములను తరచూ తెలుసుకుంటూ ప్రజారంజకముగా పాలనచేస్తూ మన్ననలను పొందేవాడు. అట్టి మహారాజునకు సౌశీల్యవతియైన భార్య లభించింది. వారు ఇరువురు ఎంతో అన్యోన్య అనురాగములతో ఉంటూ అనునిత్యం దైవభక్తి పరాయణులై ఉండేవారు. కానివార్కి సంతానము తప్ప ఏ కొరత తెలియదు. అందులకై ఎన్నో నోములు వ్రతాలు చేస్తారు. లెక్కలేనన్ని దానధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవారు.
అటువంటి పుణ్యదంపతులపై ' పరమేశ్వర ' అనుగ్రహం కలిగింది. ఒక వృద్ధ సన్యాసి వేషముదాల్చి, అంతఃపురం బయట ద్వారము చెంతకు రోజూ మధ్యాహ్న సమయమందు వచ్చి 'భవతీ భిక్షాం దేహి ' అని పిలిచి క్షణకాలమైనా ఆగకుండా వెళ్ళిపోతుండేవాడు. ఆ విషయాన్ని మహారాణి జయపాలునకు చేప్పి దుఖించసాగింగింది. ఓ సద్గుణవతీ! ఇందులో నీవు చింతించవలసిన పనిలేదు. రోజు భిక్షువు వచ్చు సమయానికి ముందుగానే ద్వారము చెంత వేచియుండి ఆతనికి తృప్తిగా భిక్షవేయును అని సూచించాడు.
మహారాజు చెప్పినట్లుగా భిక్షువు వచ్చు సమయానికి ముందుగానే ద్వారము దగ్గరే వేచియుండి ఆ తేజోమూర్తియైన ఆ భిక్షువును భిక్ష స్వీకరించమని కోరుతుంది. ఆమె ముఖారవిందమును తేరిపార పరికించిన ఆ ఆదిభిక్షువు పుత్రపౌత్రులు లేని మీవంటి వారిదగ్గర నేను భిక్ష స్వీకరించను అని నిరాకరించి వెళ్ళిపోతుండగా ఆమె మహాత్మా! తేజోగుణసంపన్నులైన మీరు సామాన్యులుకారు దయవుంచి మాకు సంతానభాగ్యము కలుగు తరుణోపాయం సూచించి వెళ్ళమని పరిపరివిధాల వేడుకుంటుంది. ఆమె ఆవేదనను గ్రహించిన ఆ కపట సన్యాసి రూపధారి పరమేశ్వరుడు ఓనారీ శిరోమణీ ! నీవు చింతించవలదు. నే చెప్పిన పలుకుల తుచ తప్పకుండ నీ భర్తకు చెప్పి ఆచరించిన యెడల తప్పక సంతాన భాగ్యము కలుగుతుంది అని ఆ విషయాన్ని చెప్పి అదృశ్యమైనాడు.
మహారాణి ద్వారా విషయమంతా తెలుసుకుని సమీప అరణ్యమందున్న భవాని మాత దేవాలయమును దర్శించి సేవించి పూజిస్తాడు జయపాలుడు. ఆతల్లి ప్రత్యక్షమై నీకు కోరినంత ధనము కావలెనా లేక సంతానము కావలెనా? అని ప్రశ్నిస్తుంది. తల్లీ, నాకు సంతానభాగ్యము కలిగించమని కోరతాడు. ఆమె అచిరకాలమందే వైధవ్యమును పొందు కుమార్తై కావలెనా? లేక సజ్జనసంపన్నుడు అల్పాయుష్మంతుడు అగు కుమారుడు కావలెనా? అని మరల ప్రశ్నిస్తుంది. ఓ జగజ్జననీ! మీ కృపతో కుమారుని ప్రసాదించమని వేడుకుంటాడు. అయిన యెడల ఈ గుడి వెనుక భాగమందుగల చూత వృక్ష ఫలమును ఒకటికోసి ఇచ్చి నీ భార్యను భుజియింపమను. నీ కోరిక ఫలియించగలదు, అని చెప్పి అంతర్ధానమయ్యింది భవానిమాత.
ఆ జయపాలలుడు అత్యాశతో చూత ఫలములన్ని కోసి మూటగట్టుచున్న రాజును గణపతి చూచి ఓరిమూర్ఖుడా! నీకు పుట్టబోవు కుమారుడు పదునారవ ఏటను సర్పము కరచి మరణించును అని శపించెను. చివరకు ఆ మూటలో ఒక ఫలము మిగిలినది. ఆ పండును మహారాణికి ఇచ్చి భుజింయింపమనెను.
అలా! భవాని అనుగ్రహముతో మహారాణి గర్భముదాల్చి చక్కని తేజోవంతుడైన కుమారునకు జన్మనిస్తుంది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునివలె దినదిన ప్రవర్థమాన మగుచు సకలవిద్యలు అభ్యసిస్తాడు. క్రమేపీ ఆ కుమారునకు వివాహ వయస్సు సమీపించుచున్నది అని గ్రహించి వివాహము చేసిన యడల తనకుమారునకు ' ఆయుర్దాయము ' పెరగలదని విశ్వసించి భర్తతో ఆ విషయాన్ని చెబుతుంది రాణి. అందువలన మహారాజు అంగీకరించి అయితే మన కుమారుడు ' శివుడు ' మేనమామతో కలిసి కాశీయాత్ర పూర్తిచేసుకుని వచ్చిన పిదప వివాహము చేద్దాము అని బదులు పలుకుతాడు.
ఇలా ఉండగా! మేనమామతో కలిసి కాశీయాత్రకు వెళుతూ ' శివుడు ' ప్రతిస్ఠానపురము ప్రాంతమందు మార్గమధ్యములో బస చేస్తారు ఇద్దరూ. అచ్చట కొందరు కన్యలు ఆటలు ఆడుచూ పాటలు పాడుచూ చివరకు దెబ్బలాటలకు దిగి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. అందులో ఒకపిల్ల ' ముండలు రండలు ' అని తిడుతుంది. ఆ పిల్లలలో ' సుశీల ' అన ుకన్య ఆ పిల్లను వారిస్తుంది ఇదిగో అటువంటి మాటలాడకు. నా తల్లి భవానిమాత భక్తురాలు కావున మా ఇంటిలో ' ముండలు రండలు ' ఉండరు అని బదులు పలుకుతుంది. వారి వాదనలు మేనమామ, ' శివుడు ' వింటూ ఉంటారు.
కొద్దిసేపటికి సుశీల, తండ్రితో కూడి పారవతి పరమేశ్వరుల దర్శనానికి ఆలయానికి వస్తారు. సుశీల తండ్రి ఆవేదనతో తన కుమార్తెకు వివాహ వయస్సు సమీపించినదని, సరియగు వరుని ప్రసాదించమని వేడుకుంటాడు. ఆమాటలు విన్న మేనమామ ఆలయము వెనుక భాగానికి ఎవరు చూడకుండా వెళ్ళి అచ్చట నుండి " నీ కుమార్తెకు సరియగు వరుడు ' శివుడు ' అను పేరుతో బాటసారిగా ఇచ్చటనే ఉన్నాడు. ఆతడే సుశీలకు తగినభర్త " అని పలుకుతాడు. దానితో అతడు " శివుడిని " గుర్తించి దైవ నిర్ణయంగా భావించి తన కుమార్తెను ఇచ్చి వైభవంగా వివాహం చేస్తారు. ఆ రోజు రాత్రి దంపతులు నిదురిస్తున్న సమయాన నూతన వధువు సుశీల కలలో " మంగళగౌరీ " కనిపించి నీభర్త అల్పాయుష్కుడు; నేటితో ఆతని ఆయువు మూడింది. కొద్ది క్ష్ణాల తర్వాత ఒక కృస్ణ సర్పం వచ్చి కాటు వేయబోతుంది. నీవు ఏమాత్రము భయపడకుండా, ఒక పాలకుండను దానిముందు ఉంచు. పాలు త్రాగుతూ అందులో ప్రవేశించగానే దాని పై గుడ్డను వేసి కుండమూతిని గట్టిగా కట్టి మరుసటి రోజు ఉదయమే నీతల్లికి వాయనంగా ఇమ్ము. నీభర్త గండము గట్టెక్కుతుంది " అని సూచిస్తుంది.
చుచితిరా! ఆ తల్లి తన భక్తులను రక్షించుకోడానికి ఎంత అప్రమత్తమవుతుందో! ఆ కలకు తొట్రుపాటుతో మెలుకువ తెచ్చుకున్న సుశీల కనులు తెరువగానే! కృష్ణసర్పము భర్తవైపునకు వస్తున్నట్లు చూస్తుంది. ఆ మంగళగౌరీ చెప్పిన విధముగా, దాన్ని కుండలో బంధిస్తుంది. ఆ రాత్రి కొద్ది సేపటికి భర్తమేల్కొని ఆకలిగా ఉన్నది అంటాడు. సుశీల తన భర్తకు అప్యాంగా అల్పాహారం తినిపిస్తుంది. ' శివుడు ' ప్రేమతో తనచేతి ఉంగరాన్ని సుశీలకు తొడిగి మరలా నిద్రిస్తాడు. తెల్లవారగనే మేల్కొని, సుశీలని లేపకుండా ఆమెతో చెప్పకుండా తనమేనమామతో కాశీయాత్రకు వెళ్ళిపోతాడు. గౌరీదేవి చెప్పినట్లు సుశీల ఆ కుండను తల్లికి వాయన మీయగా! అందులో ముత్యాలహారము ఉంటుంది. దానిని తిరిగి తల్లి సుశీలకు ఇస్తుంది.
అలా వెళ్ళి భర్తకోసం వేయి కనులతో ఎదురుచూస్తూ తన తండ్రిని అచ్చట ఒక సత్రము కట్టించమని కోరి ఆ బాటసారులకు చక్కని అతిత్యమిచ్చి అన్నదానము, వస్త్రదానము, తాంబూలదానము చేస్తూ; కాశీ నుండి తన భర్త తిరిగివచ్చి తనను ఏలుకుంటాడని విశ్వాసముతో ఉంటుంది.
ఇలా ఉండగా ' శివుడు ' తన మేనమామతో కలిసి కాశీనుండి తిరుగుప్రయాణమవుతూ మార్గమధ్యమందు కలగంటాడు. ఆకలలో తాను చనిపోతున్నట్లు. అప్పుడు మంగళ గౌరీ దేవి ఆ విషయమై యుద్ధమొనర్చినట్లు... కలగంటాడు. చివరకు ప్రెష్టానపురము నందు ' సుశీల ' ఉన్న సత్రమునకు వారు చేరుకుంటారు. సుశీల యధావిధిగా ఆ బాట సారులకు పాదప్రక్షాళనచేసి తన భర్త ' శివుడిని ' గుర్తిస్తుంది. సుశీల చేతి ఉంగరాన్ని చూచి శివుడు గుర్తించి సుశీలను అప్యాయంగా దగ్గరకు తీసుకుంటాడు. అనంతరం సుశీల తల్లి దండ్రులవద్దకు వారిని తీసుకుని వెళుతుంది. ఆ తల్లి దండ్రులు ఆ మంగళగౌరీ దేవిని వేయినోళ్ల కొనియాడుతూ కుమార్తెచే " మంగళగౌరీవ్రతం " చేయించి సంప్రదాయ సిద్ధంగా కుమార్తెను అత్తవారింటికి పంపుతారు.
గండముగల వయస్సులను అధిగమించి వస్తున్న కుమారుని; వెంటవస్తున్న సుశీలని చూచి! రాజదంపతుల ఆనందానికి అవధులులేవు. మేనమామ ద్వారా మార్గమధ్యమందు జరిగిన సంఘటనలు తెలుసుకొని వారిని తోడ్కొని " భవానిమాత " ఆలయానికి వెళ్ళి ఆ చల్లని తల్లి దీవనలు అందుకుని కోడలి చేత యధావిధిగా " మంగళగౌరీవ్రతం " చేయించి దేశ ప్రజలందరికీ ఆ వ్రతమహాత్యాన్ని వివరించి వారిచే కూడా ఈ వ్రతాన్ని చేయిస్తారు.
పూర్వకాలమునాటి మాట ఇది ! త్రిపురాసురుని సంహరించుటకు పరమేశ్వరుడు సర్వశక్తి సంపన్నురాలైన ఈ " గౌరీదేవిని " పూజించి విజయుడైనాడు. ఆ తల్లిని పూజించి ' కుజుడు ' మంగళగౌరి నూతనముగా వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఈ వ్రతమాచరించి సర్వసౌభాగ్యములు పొందుదురుగాక!