హాలో ఎర్త్ - అగార్తా - హిందూ పురాణేతిహాసాల సమన్వయం - వైజ్ఞానిక విశ్లేషణ
సంకలనం : భట్టాచార్య
భూ ఉపరితలం క్రింద, ఏదైనా నాగరికత ఉందా? లేక కేవలం ఘన పదార్ధంగానే భూమి ఉందా? నికెల్, ఇనుము, తదితర లోహాలు, మట్టి, రాళ్ళు రప్పలతోనే భూమి యొక్క ఉపరి భాగం తర్వాత పొరలు ఉన్నాయా? లేక ఏవైనా భూగర్భ నాగరికతలు ఉన్నాయా? ఈ ప్రశ్న జిజ్ఞాసువైన ప్రతి ఒక్కరికీ వస్తుంది. అయితే భూమి గూర్చి, భూస్వరూపాల గూర్చి మనిషికి తెలిసినది తక్కువే. తెలుసుకోవలసినది చాలా ఉంది.
ఈ నేపథ్యంలో "హాలో ఎర్త్" (Hollow Earth) సిద్ధాంతం ప్రకారం....భూమి క్రింద గల"అగార్తా" (Aghartha), .....గూర్చి తెలుసుకోవడం, కొంతైనా జిజ్ఞాసా పూర్వకంగా ఉంటుంది!
అయితే "అగార్తా" .....హిందూ పురాణాల్లో చెప్పబడ్డ పాతాళ లోకమా? పరిశీలిద్దాం.
"అగార్తా" ఒక ప్రాచీన, మార్మిక నగరం. ఈ నగరం భూమి లోపలి పొరల్లో కలదు. చాలా సార్లు ఈ "అగార్తా"...."శంబల" నగరానికి సన్నిహితంగా ఉన్నట్లు కథనాలు చెబుతున్నాయి. శంబల ప్రస్తావన, విష్ణు పురాణం నందు మనం కాంచవచ్చును.
శంబల- కల్కి భగవానుడు-కలి యుగాంతం-పోతులూరి వీరబ్రహ్మం గారి కాల జ్ఞాన తత్వాలు-వీటిలో కలి యుగాంత ప్రస్తావన....అలాగే భవిష్య పురాణంలో కూడా కలియుగాంత ప్రస్తావన....ఇదంతా....చదువరులందరికీ తెలిసిన విషయమే.
ఆధ్యాత్మిక జిజ్ఞాసువులైన చాలామందిలో....కొంత మందికైనా "శంబల" గూర్చి తెలుసు. (గతంలో నేనే శంబల గూర్చి కొన్ని వ్యాసాలు ఇచ్చాను. ఆసక్తి కలవారు చదువగలరు.)
మానవ పరిణామ క్రమంలో...మన కంటే ముందున్న బుద్ధి జీవుల నివాసమే "శంబల". శంబల వాసులు, తపస్వులు. నిరంతరం ఊర్థ్వ చైతన్యంతో సంబంధం కలిగి ఉంటారు. శంబల వాసులు ....నిరంతరం ఉన్నత తలాలతో (డైమన్షన్స్) సంబంధం కలిగి ఉంటారు. శంబలను జంగమ దేవరల నివాస స్థలంగాను, విస్మృత దైవీక రాజ్యం గానూ, శ్వేత-జలాల భూమి గానూ, జీవించే అగ్ని గల భూమి గానూ కూడా "శంబలను" గుర్తిస్తారు.
ఇక "అగార్తా" విషయానికొద్దాం. చాలామంది పరిశోధకుల ప్రకారం "అగార్తా" అన్న భూగర్భ నగరానికి వెళ్ళడానికి కొన్ని దారులున్నాయి. Kentucky Mammoth Cave - USA, బెర్ముడా ట్రయాంగిల్, భారత్-టిబెట్ సరిహద్దు హిమాలయాలు, భూమి యొక్క ధృవ ప్రాంతాలలోని గుహ్యమైన మార్గాలు....వీటి ద్వారా "అగార్తా"కు వెళ్ళే మార్గాలున్నాయని చెబుతున్నారు. అయితే భారత-టిబెట్ దేశాలలో మాత్రం ....ఆయా మార్మిక దారులన్నీ, శక్తివంతులైన హిందూ-బౌద్ధ యోగులచే కాపాడబడుతున్నాయి. అర్హులకు మాత్రమే ఆ రహస్యాలు అందజేయబడుతున్నాయి.
ప్రాచీన చరిత్రలు ఏం చెబుతున్నాయంటే, లక్షల సంవత్సరాల క్రిందట, అనేక కారణాల వలన, బుద్ధి జీవులైన కొందరు ప్రజలు భూగర్భంలో గల నగరానికి వలస వెళిపోయారు. వారు తమ స్వంతదైన అనుకూల పరిస్థితులతోనూ, పర్యావరణ అనుకూల పరిస్థితులతోనూ, తమకు గల మార్మిక, ఆధ్యాత్మిక అవగాహనతోనూ....తమ నివాసం అయిన "అగార్తా" నగరాన్ని నిర్మించుకున్నారు.
ఇక "హాలో ఎర్త్" సిద్ధాంత నిరూపణలకొస్తే, గత మూడు, నాలుగు శతాబ్దాలుగా భూమి లోపలి నాగరికతలను పరిశోధించే పరిశోధనలు ఎక్కువయ్యాయి. భూమి కేవలం మట్టి, రాతి ముద్ద కాదు. శాస్త్ర వేత్తల ప్రకారం,వారి పరిశోధనల ప్రకారం భూమి కేంద్ర భాగంలో అతి వేడిగా ఉన్న మాగ్మా కలదు. కానీ "పాతాళావరణం " (hollow sphere) చుట్టూ దట్టమైన భూ ద్రవ్యరాశి (భూమి-భూ స్వరూపాలు) కలదు. ఉత్తర దక్షిణ ధృవాలలో తెరుచుకొనేటట్లుగానూ కూడా కలదు. ఈ భూమి లోపలి భాగంలో ఒక సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడని కూడా సిద్ధాంతాలు చెబుతున్నాయి. "హాలో ఎర్త్" సిద్ధాంతం ప్రకారం భూద్రవ్యరాశి వలయం సుమారు 600 నుండి 800 మైళ్ళ వ్యాసం తోనూ, ధృవాల వద్ద 100 నుండి 1400 మైళ్ళ వ్యాసం తోనూ ఉన్నాయి అని హాలో ఎర్త్ సిద్ధాంతం చెబుతోంది. ఈ రకంగా కేంద్రంలో 7000 మైళ్ళతోనూ , ఈ పాతాళం విస్తరించి ఉందట.
విచిత్రమైన విషయమేమిటంటే, భూమి-నీరు ఆవరించిన నిష్పత్తి పరిశీలిస్తే, భూమి ఉపరి భాగానికి, భూమి అంతర్భాగానికి (హాలో ఎర్త్) , పరస్పర విరుద్ధం గోచరిస్తోంది. భూమి పై భూభాగం,జల భాగముల నిష్పత్తి 1 : 4 అయితే, ఈ inner crust లో వీటి నిష్పత్తి 4 : 1 గా ఉంది. ఈ వైరుధ్యానికి కారణం భూమి పై భాగంలో ప్రవహించే జల స్వరూపాలైన సముద్రాలు,నదులు,సరస్సుల....వలన ఆ నిష్పత్తి 1 : 4 గా ఉంటే, ఆ జల స్వరూపాలు, వాటి క్రింద గల భూభాగంపైననే ఆధారపడి ఉన్నాయి కదా!
"హాలో ఎర్త్" సిద్ధాంతాన్ని ధృవీకరిస్తూ, మన పురాణ, ఐతిహ్యాలలో కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. కొన్ని చూద్దాం.
1. సగర పుత్రుల కథ - పాతాళ గంగ (బ్రహ్మాండ పురాణాంతర్గతం)...ఇతిహాసాలలో కూడా ఈ గాథ ఉందనుకోండి! ఆ కథ మరల ఒకసారి స్మరించుకుందాం.
సగర పుత్రుల కథ :
సగరుడు సత్య యుగానికి చెందిన గొప్ప చక్రవర్తి. సూర్య వంశం లేదా ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. రామాయణంలో దశరథ మహారాజు కి ఈయన పూర్వీకుడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భ రాజకుమారి. మరొకరు శైబ్య.
సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగధేనువును పాతాళంలో (పాతాళం అనగా హాలో ఎర్త్ అని అగార్తా అని బలమైన భావన) దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపస్సు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.
భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దివిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నుముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది. ఇది మనందరికీ చాలావరకు తెలిసిన కథయే. ఈ కథలో చెప్పబడ్డ పాతాళమే, నేటి "హాలో ఎర్త్ (Hollow Earth) కావచ్చందామంటారా? పరిశోధనార్హం.
2. మహా విష్ణువు యొక్క కల్క్యావతారం :
శ్రీమద్భాగవతంలో, ద్వాదశ స్కందంలో చెప్పబడ్డ శ్లోకం ప్రకారం .......కలియుగాంత కాలంలో, కల్కి భగవానుడు, ఈ శంబల నగరం నుండే ఉద్భవిస్తాడని, అతను భూమిపై అవతరించి "సత్య యుగ" స్థాపన చేస్తాడని చెప్పబడి ఉన్నది. ఈ విషయం పద్మ పురాణం, భవిష్య పురాణం లలో కూడా చెప్పబడినది. అయితే ఈ "శంబల" నగరం ఆనుపానులు ఇంకా, ఈ రోజుకీ తెలియ రాలేదు. రక రకాలుగా చెబుతున్నప్పటికీ అంతా మార్మికం !!! గూఢం !!! ఇలాగే ఉంటుంది. చాలా మంది పరిశోధకులు ఈ "శంబల" హాలో ఎర్త్ లేదా అగార్తా కు చెందిన నగరమే అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు టిబెట్ సాంప్రదాయాల ప్రకారం ఈ శంబల భూగర్భ నగరమే!
శ్రీమద్రామాయణం ప్రకారం...భూమి లోపల కూడా జీవనం ఉంది అని తెలియడానికి తగు ఆధారాలున్నాయి.
సీతామాత, రావణునిచే అపహరించబడిన తరువాత, రావణుణ్ణి తాను వెంటాడి వేటాడతానని, భూమిలోపలి చీకటి గుహల పర్యంతం....తాను వెంట తరుముతానని, ఆయా ప్రాంతాల నుండి సీతమ్మను విడిపించి, వెనుకకు తీసుకువస్తానని, శ్రీరామునితో...లక్ష్మణుడు అంటాడు. దీనిని బట్టి ఆనాటికే , భూమిలో గల రహస్య ప్రాంతాలు తెలుసునని ఈ సంఘటన చెబుతోంది. రామాయణ కాలం నాటికే ఈ రోజు మనం చెప్పుకొనే అగార్తా, హాలో ఎర్త్....తెలుసును అందామా? ఆ అగార్తాయే పాతాళమా?
ఇక రామాయణమందలి కిష్కింద కాండలో, వాలిని చంపడానికి...తన బలాన్ని నిరూపించుకొనే ప్రయత్నంలో శ్రీరాముడు...7 తాళ వృక్షముల ద్వారా తన నిశితమైన శరాన్ని సంధిస్తే, ఆ శరం, ఆ తాళ వృక్షములను ఖండిస్తూ...ఒక కఠిన మైన రాతిని చీల్చుతూ, పాతాళాన్ని స్పృశిస్తూ...తిరిగి తన అమ్ముల పొదిలోకి చేరుతుంది.
బౌద్ధులు ఈ అగార్తా వాసులను, వీరు నివసించే అగార్తాను, అగార్తా గల పాతాళాన్ని (హాలో ఎర్త్)....ఎటువంటి సంకోచం లేకుండా విశ్వసిస్తారు......ఈ అగార్తాలో లక్షలాది మంది ప్రజలు నివసిస్తూ ఉంటారని, వారిలో గొప్ప లామాలతో , ఈ అగార్తా వాసులు...సంభాషిస్తూ ఉంటారని....బౌద్ధులు చెబుతూంటారు. దలైలామా, భూమి మీద గల ఆ రహస్య ప్రపంచానికి ప్రతినిధి అని నమ్మూతూంటారు....కొన్ని వేల సంవత్సరాల నుండి అగార్తా వాసుల,శంబల వాసుల సందేశాలు....తమ లామాలకు ప్రసారం చేయబడుతున్నాయని , బౌద్ధుల గాఢ విశ్వాసం. అనేక భూగోళ ప్రళయాల నుండి తట్టుకుని........ఈ భూ అంతర్భాగంలో నివసిస్తున్న ఈ అతి మానవ జాతి గొప్ప మేధో సంపత్తి కలది....!
రష్యన్ చిత్రకారుడు, తాత్వికుడు....నికోలాస్ రోరిక్ ఇలా చెబుతాడు. టిబెట్ రాజధాని లాసా , శంబలకు వెళ్ళే ఒకానొక రహస్య మార్గంతో కనెక్టు చేయబడిందని....తనకు ఒక సిద్ధుడైన,తాపసి అయిన లామా చెప్పాడని చెబుతాడు.
అయితే ఈ అగార్తా వాసులు, మన మానవ జాతి కంటే కూడా హెచ్చు వయస్సు కలవారని, మార్మికులు చెబుతూ ఉంటారు. వారికి, ఒక్కొక్కరికీ కొన్ని వేల సంవత్సరాలు....భట్టాచార్య....ఉన్నప్పటికీ , ఒక్కొక్కరూ విచిత్రంగా 35-40 సంవత్సరాల వయస్కులుగా ఉంటారట. వారు ఇచ్ఛా శరీరధారులు కూడా! వారికి "రాత్రి" తెలియదుట. పొగ చూరిన సూర్యుడు లేదా మబ్బుపట్టిన సూర్యుని వెలుతురు....ఈ అగార్తా కేంద్రకంలో భాసిస్తూ ఉంటుందట. మనం భూమ్యాకర్షణ శక్తికి లోనై ఉంటాము కదా! కానీ ఈ అగార్తాలో ఈ భూమ్యాకర్షణ శక్తి చాలా తక్కువ ఉంటుంది. లేదా ఆ శక్తి ఇక్కడ ప్రభావం చూపడం తక్కువ...... ఫలితంగా ఇక్కడి జీవుల శరీరాలు తేలికగా ఉంటాయి. ఈ అగార్త పరిశోధకులు చెప్పినదాని ప్రకారం అగార్తా లో ఎప్పుడూ 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, ఇక్కడ gravitational force తక్కువగా ఉండడం వలన ఇక్కడ మనుజులు, చాలా తక్కువ బరువును కలిగి యున్నట్లు భావిస్తారు.