ఇండోనేషియా లోని హిందూ ధర్మం |
ఇండోనేషియా లోని హిందూ మతం పరిఢవిల్లడానికి గల కారణాలు ఏమిటి? ఎప్పటి నుంచి అక్కడ హిందూ మతం స్థానంలోకి ఇస్లాం వచ్చింది? ఇస్లాం అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటి?
నేటి ఇండోనేషియా ప్రపంచంలో అత్యధికంగా మహమ్మదీయుల జనసంఖ్య కలిగిన దేశం. అయితే విచిత్రం ఏమంటే అక్కడ మహమ్మదీయమతం ఇతరదేశాల, ముఖ్యంగా అరబ్బు దేశాల్లో కనిపించే సాంప్రదాయ మహమ్మదీయమతానికి కొంత భిన్నంగా ఉంటారు.
అక్కడి ప్రజల పేర్లలో కానీ, సాంస్కృతిక వ్యవహారాల్లో కానీ, భోజనాదికాల్లో కానీ ఈ పోకడ గమనించవచ్చు. లలిత కళారూపాల్లో కూడా భారతీయ స్పర్శ, స్థానిక ఫ్లేవర్ తో కలిసి కనిపిస్తుంది. ఇండోనేషియన్ భాష పేరు బహసా-ఇండోనేషియా. ఈ భాషకు లిపి లేదు. (ఇంగ్లీష్ లోనే వ్రాస్తారు). ఇందులో సంస్కృత ప్రాకృతశబ్దాలు బోలెడు. ఉదా: చండ్ర, జయ, పుత్ర, ధర్మ ఇత్యాది.
- దేశం అంతా 15000 పైబడిన ద్వీపాల సముదాయం. ముఖ్యపట్టణం జకార్త (జయ-కృత) జావా ద్వీపంలో ఉంటుంది. పట్టణం నడిబొడ్డున ప్రధానకూడలిలో భగవద్గీత తాలూకు శిల్పం ఉంటుంది. ఇంత పెద్ద బొమ్మ భారతదేశపు నగరాల్లో కూడా ఉండదు.
- దేశపు ప్రధాన స్థానిక విమానసంస్థ పేరు గరుడ.
- ఈ దేశంలో ప్రస్తుత హిందూ జనాభా 2 %. వీరంతా ప్రధానంగా బాలి ద్వీపవాసులు.
- క్రీ. శ. 13 వ శతాబ్దంలో ఇండోనేషియాలో అడుగుపెట్టింది. తదనంతరం క్రమేణా అక్కడ మహమ్మదీయమతం పాదుకుంది.
- అయితే అంతకు మునుపు ఈ దేశంలో ఉన్నది హిందూ ధర్మము, స్థానిక మతాలూనూ.
- ఇండోనేషియాలోని యోగ్యకార్త అన్న చోట బోరోబుదుర్ అనే క్రీ. శ. 5 వ శతాబ్దం నాటి బౌద్ధదేవాలయాన్ని కనుక్కుని పునరుద్ధరించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం.
- ఇది నిర్మించింది భారతీయులని వేరుగా చెప్పనక్కర్లేదు. ఈ దేవాలయ నిర్మాణం పైన్నుండి చూస్తే శ్రీ చక్రం ఆకృతి లో ఉంటుందని కొందరంటారు. మన అమరావతి శిల్పకళ ఛాయలూ బోరోబుదుర్ లో కనిపిస్తాయని పరిశీలకులు. (బోరోబుదుర్ పై విశ్వకవి రవీంద్రుడు గొప్ప కవిత చెప్పాడు)
పరంబనన్ ఆలయం - అదే యోగ్యకార్త లో మరొక చోట పరంబనన్ అన్న విస్తారమైన శైవ దేవాలయం ఉంది. ఇది కొంత శిథిలమయింది. దీన్ని క్రీ.శ. 9 వ శతాబ్దం నాటిదని గుర్తించారు.
- అంతే కాదు ఇండోనేషియన్ బహసా లో స్థానిక ఛందస్సులో వ్రాసి ఉన్న రామాయణం కూడా ఉంది. ఇప్పటికి ఇది దొరుకుతుంది.
- ఈ ఆనవాళ్ళను బట్టి క్రీ.శ. 2 వ శతాబ్దం నాటికే హిందూమతం అక్కడ వ్యాపించినట్లు గమనించవచ్చు. ఇంకా పూర్వమే అయినా ఆశ్చర్యం లేదు.
- భారతదేశ సార్థవాహులు నౌకాయానం చేస్తూ అక్కడి ద్వీపాలను చేరుకొని ఉండవచ్చు. కొందరు అక్కడ స్థిరని ఆవాసం ఏర్పరచుకొని ఉండవచ్చు. వారి మూలంగానే భారతీయమతం, కళారూపాలు, కావ్యాలు అక్కడ పరిఢవిల్లి ఉండాలి.
- మన కథాసరిత్సాగరం (బృహత్కథ) లో సువర్ణద్వీపం బహుశా ఇండోనేషియానే కావచ్చు.
అప్పట్నుంచే సాంస్కృతిక ఆదానప్రదానాలు ఈ దేశాల మధ్య ఉన్నాయి. మనదేశంలో ఇప్పుడు మనం తీసుకునే అల్పాహారం ఇడ్లీ ఇండోనేషియాదట. అట్లాగే అక్కడ బాండుంగ్ జిల్లాలోని ఒక అగ్నిపర్వతం (తంక్యుబన్ పెరహు) కథ మన పురాణకథలకు దగ్గరగా ఉంటుంది. అయితే నేటి ఇండోనేషియా వేరు. అక్కడ హిందూమతం ఛాయామాత్రం అవుతూ ఉంది.
బాలి ద్వీపంలో కనిపించే హిందూ మతం కూడా కేవలయం కొన్ని మతవిధానాలకు, రిచువల్స్ కూ పరిమితమై పోయింది. ఇది విశాలమూ, ఔన్నత్యపూర్వకమైన వైదిక భావాలకు దూరంగా జరిగింది. ఇది బాలిలో ప్రదర్శించే "కిచకిచ" డాన్స్. (వ్యాసకర్త ఉద్యోగరీత్యా జకార్తలో పర్యటించి తెలుసుకున్న నేపథ్యంతో)