ఇది భారత దేశ పునర్నిర్మాణానికి తొలి అడుగు..!!
అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కేవలం హిందువుల మతపరమైన కార్యక్రమమో లేదా రాజకీయ ఉద్దేశ్యంతో జరుగుతున్న కార్యక్రమమో కాదు, నిజానికి ఈ ఘట్టం ఈ దేశ అసలు ఆత్మను తిరిగి భారతీయుల్లో ప్రతిష్టించడం వంటిది.
వేల సంవత్సరాల పూర్వం నుండి ఈ దేశ యొక్క నిర్మాణం రామాయణ, మహాభారతం, భాగవతం ఇతిహాసాల ఆధారంగా, పురాణాల ఆధారంగా నిర్మితమైనది. వైధిక జీవనం, కుటుంబ బాంధవ్యాలు, సంస్కృతి సాంప్రదాయలు, దేశభక్తి, ధర్మపాలన వంటి నాగరిక జీవన పద్ధతులను నేర్పిన ఆ పౌరాణిక గాథల ఆధారంగానే అఖండ భారతీయ సమాజ నిర్మాణం అయ్యింది.
ఈ దేశంలో ప్రతీ తల్లీ తన కొడుకుని శ్రీరామచంద్రుడిలా అవ్వాలని భావిస్తుంది. భార్యా భర్తల బంధం సీతారాముల బంధంగా, అన్నదమ్ముల మధ్యనున్న అనుబంధం రామ లక్ష్మణుల బంధంగా భావిస్తారు. అంతేకాకుండా రాముడంతటి పాలకుడు, విశ్వామిత్రుడు అంతటి గురువు, ఆంజనేయుడు లాంటి భక్తుడు, రావణుడు లాంటి రాక్షసుడు అంటూ ఇలా ఈ దేశ సమాజంలో ఉన్న ఏ బంధమైన, ఏ వ్యక్తిత్వం అయినా రామాయణం ఆధారంగా మనం పోల్చి చూస్తాం.
ధర్మాన్ని ఆచరించడం అంటే దైవాన్ని పూజించడమో, వేదోపనిషత్తులను కంఠస్థం చేయడమో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమో లేదా కాషాయం ధరించి ధ్యాన సాధన చేస్తూ ఉండడమో కాదు కానీ సమాజంలో మన జీవనం అనేది అనుబంధాలు, ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను అలవర్చుకుని దైవం పై విశ్వాసం, పెద్దల పట్ల గౌరవం, కుటుంబం పట్ల శ్రద్ధ, సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల భక్తి, వీటి ఆధారంగా జీవించడమే ధర్మాన్ని ఆచరించడం. ఇలాంటి గొప్ప లక్షణాలను మన భారతీయ సమాజం అలవర్చుకోవడానికి రామాయణ ఇతిహాసమే కదా ముఖ్య కారణం!!
అయితే ఈ దేశం విదేశీ దురాక్రమణదారుల ఆధినంలోకి వెళ్లిన సమయంలో ఈ దేశ ప్రజల జీవన శైలిలో మార్పులు రావడం ప్రారంభం అయ్యింది. అధర్మీయుల ఆగడాల వల్ల కలిగిన నష్టం సమాజంలో వైధిక విజ్ఞానం కొరవడేలా చేసింది, మరియు సామాజిక రుగ్మతలను అలవాటు చేసింది, ముఖ్యంగా దేశం పట్ల, సమాజం పట్ల ఉండాల్సిన కనీస బాధ్యతను మరువడం వల్ల వేయి సంవత్సరాలు విదేశీయుల కింద బానిసలుగా బ్రతికాం. ఈ దేశం నాది అని గర్వంగా చెప్పుకోలేని స్థితికి దిగజారింది భారతీయ హిందు సమాజం. శతృవు పై కలిసికట్టుగా పోరాటం చేయలేని అనైక్యత, జయించలేము అనే నైరాశ్యం, ఇలా ఈ సమాజం తన అసలైన ఆత్మను కోల్పోయింది. అంతేకాకుండా నేటి సమాజంలో తల్లిదండ్రుల పట్ల గౌరవం లోపించడం, బంధుత్వాల నడుమ ప్రేమానురాగాలు కోల్పోవడం, దేశం పట్ల సమాజం పట్ల ప్రజలు బాధ్యతను విస్మరించడం, ఇలా ఒకనాడు ప్రపంచానికి నాగరికత నేర్పి విశ్వగురువుగా వెలుగొందిన భారత్ నేడు వెనుకబాటుకు గురైన దేశంగా, క్రమశిక్షణ లేని, ఐక్యత లోపించిన దేశంగా ప్రపంచం గుర్తించే స్థాయికి దిగజారింది. స్వాతంత్ర్యం సాధించాము అని చెప్పుకుంటున్న 70 ఏళ్లకు మనం విదేశీయుల పాలనలో కోల్పోయినది తిరిగి ఏం సాధించాము అంటే కనీసం మన స్వాభిమానాన్ని కూడా సాధించలేకపోయాం. ఈనాటికీ విదేశీయులు రాసిన చరిత్రను అనుసరించి పాఠాలు చదువుకునే స్థితిలో ఉన్నామంటే మనం నిజంగా విదేశీ పాలన నుంచి విముక్తి చెందామా లేక ఇంకా విదేశీ పాలనలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతుంది.
మన దేశంలో వందల సంవత్సరాల పూర్వం మన మందిరాలను విదేశీ ముష్కర మూకలు కూల్చి అక్కడ తమ మత కట్టడాలు నిర్మిస్తే స్వాతంత్ర్యం అనంతరం కూడా 70 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూ కళ్లముందు కనిపిస్తున్న సాక్ష్యాలను సమర్పించినా కూడా కోర్టులను మెప్పించలేక పోతున్నాం అంటే ఆలోచించండీ ఈ దేశం నిజంగా స్వాతంత్ర్యాన్ని సాధించిందా అనేది. అందుకే అయోధ్య రామాలయ నిర్మాణం అనేది ఈ దేశ పునర్నిర్మాణానికి ప్రతీకగా మనం బావించాలి. రేపటి శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అనేది భారతీయుల్లో తిరిగి భారతీయ తత్వాన్ని మేల్కొల్పడం వంటిది, రాముడి ఆత్మను ప్రతీ భారతీయుడి మనసులో ప్రతిష్టించడం వంటిది. రామాయణ మహాకావ్యం ఆధారంగా తిరిగి సమాజంలో ధార్మిక భావనను కలిగించడం వంటిది. అంతేకాకుండా రేపటి ఈ చారిత్రక ఘట్టం వేయి సంవత్సరాల విదేశీ పాలన మనస్తత్వం నుండి ఈ దేశ ప్రజలను విముక్తి చేయడం వంటిది, మరియు దేశం తన అస్తిత్వాన్ని కాపాడుకున్న క్షణం. కాబట్టి ఇది మతాలకు అతీతంగా ప్రతీ భారతీయుడు గర్వంగా జరుపుకోవాల్సిన పండుగ.
Karthik Reddy