అయోధ్య రామ |
– ఆకారపు కేశవరాజు
దేశంలో ఒక ఆలయ నిర్మాణం కోసం ఇంత పెద్దఎత్తున ప్రజలు ఉద్యమం జరపడం ఆశ్చర్యకరం. దేశంలోని పండితుల నుండి పామరుల వరకు శ్రీరాముడిని ఆదర్శంగా భావించారు, ఆయన పట్ల అచంచలమైన గౌరవాన్ని విశ్వాసాన్ని నింపుకున్న వీరు తమ ఆరాధ్య దైవం జన్మస్థానం కోసం తరతరాలుగా సంఘర్షణ చేయవలసి రావడం కూడా ఆశ్చర్యకరమే. ఈ పోరాటం 1528 నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రజలు జరిపిన సుదీర్ఘ పోరాటం ఈ దేశ ఆత్మగౌరవానికి ప్రజల యొక్క రాష్ట్రీయ లేదా జాతీయ భావానికి నాంది పలికింది.
ఇదే విషయాన్ని పఖ్యాతి చెందిన అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ వేద మరియు జ్యోతిషశాస్త్ర విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసిన ‘శ్రీడేవిడ్ ఫ్రాలే’ గారు ఇలా చెప్పారు. “అయోధ్య శ్రీరామజన్మభూమి ఉద్యమం కేవలం మందిరం కోసం మాత్రమే కాదు, ఈ ఆందోళన భారతదేశం యొక్క జాతీయ, సాంస్కృతిక వైభవ పునరుత్థానానికి ప్రారంభ సూచిక”.
ఆత్మగౌరవం కోసం దేశ ప్రజల ఉద్యమం:
అయోధ్య ఆలయం కోసం 80 సార్లు యుద్ధాలు జరిగి నాలుగు లక్షల మంది ప్రజలు బలిదానమైన తర్వాత స్వాతంత్ర్య భారతంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పోరాటంలో విజయం సాధించిన అనంతరం 2020 ఆగస్టు 5న అయోధ్యలో భూమిపూజ జరిగింది ఇది కేవలం ఆలయ నిర్మాణానికి నాంది మాత్రమే కాదు, దేశ ప్రజల యొక్క జాతీయ భావజాలానికీ నాంది. మన దేశంలో శ్రీరాముడి ఆలయాలకు కొరత లేదు. ప్రతి ఊరిలోనూ ఉన్నాయి, కనుక కేవలం గుడికోసం పోరాటం అని చెబితే సరిపోదు . ఈ పోరాటం మతపరమైనదీ కాదు, ప్రాంతీయమైనది కాదు, ఏ ప్రత్యేక వర్గానిదీ కాదు, రాజకీయం కాదు ఈ పోరాటం మన జాతి యొక్క స్పృహను మేల్కొల్పడానికి సంబంధించినది. ఇది మతపరమైనదైతే, ఈ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు, లక్షలాది కరసేవకులు అయోధ్యకు వెళుతుండగా, వారి మార్గంలో హైందవేతరుల ప్రార్థనా స్థలాలు అనేకం ఉన్నాయి, చాలా మంది వాటి ముందు నుండి వాటి మధ్య నుండి కూడా వెళ్ళారు…., కానీ ఏ కరసేవకుడూ ఏ హైందవేతరుడికి లేదా అతని ప్రార్థనాస్థలికి హాని కలిగించలేదు. అందుకే, ఈ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకంగా జరిగిందికాదు.
అయోధ్య శ్రీరామజన్మభూమి ఉద్యమం మనదేశం మరియు హిందూ సమాజం యొక్క ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం, హిందూ జాతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం జరిగిన పోరాటం, విదేశీ ఆక్రమణకారుల చేతిలో విధ్వంసమైన ఈ దేశపు అస్తిత్వం కాపాడుకోవడం కోసం చేసిన పోరాటం, ప్రాచీన కాలం నాటి పరంపరను ఆచారాలను జీవన విధానాన్ని పునః స్థాపించడం కోసం జరిగిన పోరాటం, దేశ ప్రజలు ఐక్యంగా నిలిచి చేసిన ఈ పోరాటాల వలన మన జాతికి దేశానికి గొప్ప బలం సమకూరింది, ఈ బలమే దేశం యొక్క గౌరవాన్ని మరియు ప్రతిష్టనూ పెంచుతుంది కూడా.
ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం:
ప్రజల భాగస్వామ్యం కోసం ప్రతి ఊరు నుండి ఒక ఇటుకను అయోధ్యకు పంపితే, ఈ దేవాలయం మనదనే భావన బలపడుతుంది, ఆలయం ఐకమత్యానికి చిహ్నంగా బాసిల్లుతుంది, పరాజయం పాలైన మనదేశం మరియు హిందూ సమాజం యొక్క విజయానికి చిహ్నంగా ఉంటుంది. ఈ భావనయే 495 సంవత్సరాలుగా శ్రీరామజన్మభూమి ఆందోళన నిర్వహించడానికి ప్రేరణనిచ్చింది. అప్పట్లో శ్రీరామశిల పూజల తర్వాత ఆందోళనకయ్యే ఖర్చులకు డబ్బులు తామే ఇవ్వాలని ఆందోళనకారులను కోరాం, కోటి కుటుంబాల నుండి ఇంటికి రూ.1.25 ఇస్తే మీరే కాదు యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అప్పటినుండి శ్రీరామ కార్యానికి, ఆలయ నిర్మాణానికి భక్తులే ఆర్థిక సహాయం చేస్తున్నందున ఎప్పుడూ డబ్బుకు కొరత ఏర్పడలేదు, 2020 సంలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల 13 వేల పైచిలుకు గ్రామాలకు నుండి 14 కోట్ల కుటుంబాల వారు ఇచ్చిన సమర్పణలు 4 వేల కోట్ల రూపాయలకు పైనే సమకూరింది, ఆ ధనంతోనే ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్నది.
ఆలయ నిర్మాణం దేశ నిర్మాణమే:
ఈ ఆలయం కేవలం గొప్ప భవనంగా నిర్మించాలనే ఉద్దేశ్యంతో చేయడం లేదు, దేశ ప్రజలందరూ ఇది నా ఆలయం, నా పూర్వికులు గౌరవప్రదంగా రక్షించుకుంటూ వచ్చిన ప్రార్థనా స్థలం అని ప్రతి సామాన్యుడు తనకు తానుగా భావించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆందోళన నిర్వహించాము, బహుశా భవిష్యత్తులో ఆందోళనలు అవసరం లేదనుకుంటాను. దేశంలోని సాధారణ రామభక్తుడు సైతం శ్రీరాముడి పైన మనదేశం పైన విశ్వాసం కలిగి ఉంటాడు, ఏ దేశానికైనా ఇటువంటి విశ్వాసమే గొప్పబలం., ఈ కోణంలో “అయోధ్య శ్రీ రామ మందిరం నిర్మాణం ప్రత్యక్షంగా దేశ నిర్మాణమే”. ఇది దేశ ప్రయోజనాలకు, జాతి విశ్వాసానికి సంబంధించినదే కదా.
అయోధ్య ఆలయంలో బాలరాముడి అందమైన విగ్రహం ఏర్పాటు చేయడం, అక్కడ హారతి, భజన జరగడం, ఇవి మాత్రమే కాదు, శ్రీరాముడి జీవితాదర్శాలను మన జీవితంలో కూడా ఆచరించాలి, ఆయన జీవితంలో స్వయంగా ఆచరించిన మార్గాన్ని మనం అనుసరించాలి, వివక్షతను పాటించకపోవడం రాక్షసశక్తులను అణిచివేయడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, సామాజిక విలువలకు, కుటుంబ నియమాలకు ప్రాధాన్యత నివ్వడం, ప్రజలకున్న నియమాలనే పాలకులు సైతం పాటించడం వంటి అనేక సద్గుణాలు ప్రస్తుత మన దేశ ప్రజలు పాటించేటట్లుగా ఉంటుంది. ఈ ఆలయం ‘లోక సంస్కారశాల’గా విలసిల్లుతుంది. అవును ఒక ప్రభావవంతమైన ఆలయముంటే 100 పోలీస్ స్టేషన్ ల ఏర్పాటును తగ్గిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
శ్రీరామరాజ్యం ఆదర్శ వ్యవస్థ:
నేటికీ ఆదర్శవంతమైన వ్యవస్థ గురించి మాట్లాడితే అది శ్రీ రామరాజ్యమే అవుతుంది. దేశంలో రామరాజ్యం రావాలని మహాత్మాగాంధీ కూడా అనేక ప్రసంగాల్లో వ్యక్తం చేశారు. సామాన్యుడయినా, విద్యావంతుడయినా, ధనవంతుడయినా, ఏ పార్టీ అయినా, మన భారత రాజ్యాంగమైనా, ఇంకెవరైనా రామరాజ్యం రావాలనే అందరూ కోరుకుంటారు. వ్యవస్థలు మారుతూనే ఉంటాయి, కాలానుగుణంగా కొత్తవి సృష్టించబడుతూ ఉంటాయి. అయితే ప్రామాణికమైన విలువలతో జీవించే విషయంలో ప్రజలందరూ రాజీపడకుండా ఉండగలగడం, మరియు సమృద్ధవంతమైన పురోగామి భావనలున్న రాజ్య వ్యవస్థను కలిగి ఉన్న దేశాన్ని రామరాజ్యం అంటారు. ఆ విధంగా రామరాజ్యం ఒక ఆదర్శ వ్యవస్థ యొక్క భావనయే.
శ్రీరామజన్మభూమి ఉద్యమంలో, కుల, మత, భాష, ప్రాంత, సామాజిక స్థితిగతులు, పేద, ధనిక, విద్యావంతులు, చదువుకోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో చేరి, ఒక పెద్ద శక్తిగా నిలబడగా, ప్రపంచం మొత్తం ఆ శక్తిని చూసింది. ఆ సమయంలో అయోధ్యలో జరిగిన పోరాటాన్ని విశ్లేషిస్తూ హిందూ సమాజం అంతరించిపోయిందని తథాకథిత మేధావులు చెప్పిన మాటలు అసత్యాలని, ఈ సమాజానికి చావు లేదని ఈ ఉద్యమం చాటి చెప్పింది. ఈ సమాజం బహుశా కొంతకాలం నిద్రాణస్థితికి మాత్రమే చేరుకుంది. హిందూ సమాజం మేల్కొన్నప్పుడు ఏ రూపంలో ఉంటుందో ఈ ఉద్యమం చూపించింది.
లోక కళ్యాణానికి ప్రేరణ:
ప్రస్తుతం ఈ ఉద్యమం ద్వారా ప్రాచీనవైభవం సాధించాలని మనదేశం విశ్వగురువు కావాలని, మన దేశక్షేమమే కాకుండా లోకకళ్యాణం సాధించడం కూడా భారతదేశం బాధ్యతేనని కోరుకోగా, అది కేవలం రాజ్యాధికారం ద్వారా మాత్రమే సిద్ధించేది కాదు, ఇక్కడి సామాన్యుడు కూడా మనజాతి కోసం విశ్వాసంతో నిలబడి పనిచేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది, అప్పుడు మాత్రమే మనదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదు.
ఏ మానవ సమూహానికి ముప్పు కలగకూడదు:
అనైతిక శక్తుల నుండి సామాన్య ప్రజలను రక్షించడం,. ప్రపంచంలోని ప్రతి మానవుడు సగౌరవంగా జీవించేందుకు సహకరించడం. సంఖ్యాబలం లేదా ఆయుధ బలం ఆధారంగా ఎవరూ ఏ మానవ సమూహానికి ముప్పు కలిగించకుండా ఉండాలి, దీని కోసం ఒక ప్రబలమైన శక్తి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ పని భారతదేశం మాత్రమే చేయాలనీ విధి నిర్ణయించింది. ఈ పనిని సాధించడానికి ఈ దేశ ప్రజల స్ఫూర్తిని, వారి భావాలను మరియు వారి విశ్వాసాలను ఒకచోటికి చేర్చడం అవసరం. ఈ కోణంలో ఈ అయోధ్య ఆలయం భవిష్యత్తులో శక్తినిచ్చే స్ఫూర్తికేంద్రంగా మారబోతోంది.
అందువల్ల, ఆలయాన్ని దర్శించుకునే ప్రతి వ్యక్తి భగవంతుని పైన ఉండే విశ్వాసం దేశం పైన విశ్వాసంగా మరియు తన యొక్క జాతి అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు దృఢ నిశ్చయంతో అక్కడికి వెళ్తారని నేను భావిస్తున్నాను.
ఈ దేశంలోని పల్లెటూరిలో నివసించే సామాన్యుడైనా, మురికివాడల్లోనూ, మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనుడైన, అంటే ఇరుగుపొరుగున నివసించే విద్యావంతుడు, తెలివైనవాడు, ధైర్యవంతుడు, ఎవరైనా ఈ దేశంకోసం శ్రమించేవాడై ఉండాలి. వారందరి సహకారం ఈ దేశానికి ఉండాలి. ఈ పని ప్రభుత్వం, సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా చేయాలి, ఇలా చేయడం ద్వారానే సామూహిక శక్తి మేల్కొంటుంది.
శ్రీరామజన్మభూమి ఉద్యమం పేరుతో జరిగిన ప్రయత్నం వలన భారతదేశ ప్రజల ఐక్యత పెరిగి, అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుంది…, ఇది విద్యతో ప్రారంభం కావాలి, ఆర్థిక వ్యవస్థతో ప్రారంభం కావాలి, వ్యవసాయం, ప్రాథమిక అవసరాలను తీర్చే వ్యవస్థలతో, పౌరులలో ఆరోగ్యకర పోటీతో పారిశ్రామిక రంగంలో పురోగతి సాధించాలి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం సర్ కార్యవాహ శ్రీభయ్యాజీ జోషి గారు చెప్పినట్లు తాము పని చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా శ్రీరాముడి యొక్క ‘రామత్వ’ భావన తో చేయాలి.
శ్రీరాముని భావనయే దేశంయొక్క భావన, ఇది చాలా తీవ్రమైనది. ఈ కోణంలో శ్రీరామమందిరం అన్ని సామాజిక రంగాలను ప్రభావితం చేస్తుంది. అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ కేంద్రం భక్తులకే కాదు, మరెవరికైనా ఏవైనా సంకల్పాలు కోరికలు మరియు ఏదైనా సాధించాలనే పట్టుదల భావం కలిగి ఉన్నా, వారందరికీ వారి అంతఃకరణలో ప్రఖరమైన భావాన్ని నిర్మాణం చేయగలిగి వారి సామర్థ్యాన్ని పెంపొందించే శక్తి కేంద్రం అవుతుంది. ఆ కేంద్రానికి 1989లో అనేక తరాలు నిరాదరణకు గురైన సామాజిక వర్గంలో జన్మించిన శ్రీకామేశ్వర్ చౌపాల్ గారు మొదటి పునాదిరాయి వేయగా, 2020 ఆగస్టు 5 న భారత ప్రధాని మరియు పూజ్య మోహన్ భాగవత్ గారు పాల్గొనగా భూమిపూజ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల నుండి ప్రతినిధులు 5500 మంది స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వెయ్యి మంది రామభక్తులు, మరియు ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటుండగా 2023 జనవరి 22వ తేదీన ప్రారంభమవుతున్నది… అక్కడ ప్రేరణదాత శ్రీరామచంద్రుడు ‘బాలరాముడు’ గా కొలువుతీరనున్నాడు.
దేశం మౌలిక చిత్రాన్ని మార్చే పని మొదలైంది:
వేల సంవత్సరాల బానిస మనస్తత్వం నుండి బయటపడి విశ్వాసంతో మనదైన మార్గంలో నడవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, కానీ శ్రీరాముడిచ్చిన ఖచ్చితమైన మార్గం మన ముందు ఉండనే ఉంది, ఇన్ని ఉద్యమాలు నిర్వహించిన మన మనసులో దృఢమైన సంకల్పమున్నది, మనం కన్న కలలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రగతి పథంలో నడవడానికి కావలసిన శక్తి ఇటువంటి ‘శక్తి కేంద్రాల’ నుండి లభిస్తాయి. అనేక మంది మార్గదర్శకులు, సామాజిక చింతన కలిగిన మరియు వ్యవస్థ-నిర్మాణ సామర్థ్యం కలిగిన వారు, సామాజిక- ధార్మిక సంస్థల సామూహిక ప్రయత్నాలతోనే భవిష్యత్ భారతదేశం ఉద్భవిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం కారణంగా, ప్రపంచ స్థాయిలో భారతదేశం నిర్వర్తించాల్సిన బాధ్యతను మనం ఖచ్చితంగా నిర్వర్తించగలమని ఈ మనందరి మనస్సులలో విశ్వాసాన్ని కలిగిస్తున్నది.
అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం దర్శనానికి అక్కడికి వెళ్లే ప్రతి వ్యక్తి ఈ భావనతోనే ప్రేరణ పొంది తన జీవిత దిశను నిర్ణయించుకుంటాడు. ఇది నా నమ్మకం, అందుకే భవిష్యత్ భారతదేశం ఉజ్వల భారతదేశం కాబోతోందని, ఇది ప్రపంచానికి సరైన దిశానిర్దేశం చేస్తుందని నేను భావిస్తున్నాను. దీని ఆధారంగా ప్రపంచంలో సమన్వయం మరియు శాంతి వాతావరణం ఏర్పడుతుంది. తరువాత ప్రపంచం యొక్క ప్రస్తుత ప్రయాణ మార్గం కన్నా సమున్నతమైన మరియు సమగ్రమైన మార్గంగా మారుతుంది, దీనికి సాధించటం కోసం మనమందరం కలిసి అయోధ్య శ్రీరామచంద్రుని సాక్షిగా సంకల్పం తీసుకోవాలనీ కోరుతున్నాను.
రచయిత – విశ్వహిందూ పరిషత్, కేరళ తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల సంస్థాగత కార్యదర్శి
Courtesy : vskteam