దత్త జయంతి | Dattatreya Jayanthi |
దత్తాత్రేయ స్వామి జయంతి
📌శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి (మంగళవారం, 26.12.2023)
దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది.ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
అతని సతీమణి అనఘాదేవి. అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ. దత్తుని రూపంలో అంతరార్థం: : శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే • మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
- నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.
- ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
- మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.
- త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
- చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
- డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
- కమండలము:సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.
దత్త తత్వం:
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు.
(ముత్యంపేట మల్లికార్జున్ గారి సౌజన్యంతో)