Siva Naivedyam - Nirmalya, Prasada Sveekaram |
శివనైవేద్యము - నిర్మాల్య/ ప్రసాద స్వీకారము
శ్రీ శివమహాపురాణము, విద్వేశ్వర సంహితా ద్వావింశోఽధ్యాయః
ఋషుల సందేహములకు సూతమహాముని చెప్పుచున్న వివరము.
ఋషయ ఊచుః !
అగ్రాహ్యం శివనైవేద్యమితి పూర్వం శ్రుతం వచః !
బ్రూహి తన్నిర్ణయం బిల్వమహాత్మ్యమపి సన్మునే!! 1
ఋషులిట్లు పలికిరి -
శివనైవేద్యమును స్వీకరించరాదని పూర్వము వినయుంటిమి. దాని నిర్ణయమును చెప్పుము. ఓగొప్ప మహర్షీ! బిల్వమహిమను కూడ చెప్పుము (1).
సూత ఉవాచ !
శృణుధ్వం మునయస్సర్వే సావధానతయాధునా !
సర్వం వదామి సంప్రీత్యా ధన్యా యూయం శివవ్రతాః !! 2
శివ భక్త శ్శుచి శ్శుద్ధ స్సద్ర్వతీ దృఢనిశ్చయః !
భక్షయేచ్ఛివనైవేద్యం త్యజేద గ్రాహ్య భావనామ్ !! 3
దృష్ట్వాపి శివనైవేద్యం యాంతి పాపాని దురతః !
భుక్తే తు శివనైవేద్యే పుణ్యాన్యాయంతి కోటిశః !! 4
అలం యాగసహస్రేణాప్యలం యాగార్బుదైరపి !
భక్షితే శివనైవేద్యే శివసాయుజ్యమాప్నుయాత్ !! 5
సూతుడిట్లు పలికెను -
ఓ మునులారా! మీరందరు ఇపుడు సావధానముగా వినుడు. సర్వమును ప్రేమతో చెప్పెదను. శివవ్రతులగు మీరు ధన్యులు. బాహ్యాంతరమందు శుచి గలవాడు, దృఢనిశ్చయుడు, ధృఢవ్రతుడు ఐన శివభక్తుడు "*శివ నిర్మాల్యమును మహాప్రసాదముగా తీసుకోరాదేమో*" అనే భావన వదిలి శివనైవేద్యమును భక్షించవలెను. శివ నైవేద్యమును చూచిన వెంటనే పాపములు దూరముగా తొలగిపోవును. శివ నైవేద్యమును భక్షించిన అనంత కోటి పుణ్యములు కలుగును. వేలాది, లక్షలాది యాగములను చేసినదానికన్నా శివనైవేద్యమును భక్షించిన వ్యక్తి శివసాయుజ్యమును పొందగలుగును.
యద్గృహే శివనైవేద్య ప్రచారోఽపి ప్రజాయతే !
తద్గృహం పావనం సర్వ మన్యపావన కారణమ్ !! 6
ఆగతం శివనైవేద్యం గృహీత్వా శిరసా ముదా !
భక్షణీయం ప్రయత్నేన శివస్మరణ పూర్వకమ్ !! 7
ఆగతం శివనైవేద్యమన్యదా గ్రాహ్యమిత్యపి !
విలంబే పాపసంబంధో భవత్యేవ హి మానవే !! 8
న యస్య శివనైవేద్య గ్రహణేచ్ఛా ప్రజాయతే !
స పాపిష్ఠో గరిష్ఠ స్స్యాన్నరకం యాత్యపి ధ్రువమ్ !! 9
ఏ ఇంటిలో శివనైవేద్యమును భక్షించి, ఇతరులకు పంచెదరో, ఆ ఇల్లు పవిత్రము. ఆ ఇంటిలోని వారిని, ఆ ఇంటికి వచ్చిన వారిని కూడా అది పవిత్రముచేయును. భక్తుడు తనకు లభ్యమైన మహాశివనైవేద్యమును ఆనందముతో వినయపూర్వకముగ తీసుకొని, ఆ శివ భగవానుని స్మరిస్తూ శ్రద్ధగా తినవలెను. మహా శివనైవేద్యము లభించినప్పుడు, మరోసారెప్పుడో తీసుకొనవచ్చులే అనే భావనతో ఆలస్యము చేసిన మానవునకు తప్పక పాపమును కలుగును. శివనైవేద్యమును తీసుకొనవలెననే కోరిక ఎవరికి కలుగదో, వాడు మహాపాపి, నిశ్చయముగా నరకమును పొందును.
హృదయే చంద్రకాంతే చ స్వర్ణరూప్యాది నిర్మితే !
శివదీక్షావతా భక్తేఽఽనేదం భక్ష్యమితీర్యతే !! 10
శివదీక్షాన్వితో భక్తో మహాప్రసాద సంజ్ఞకమ్ !
సర్వేషామపి లింగానాం నైవేద్యం భక్షయేచ్ఛు భమ్ !! 11
అన్యదీక్షా యుజాం నృణాం శివభక్తి రతాత్మనామ్ !
శృణుధ్వం నిర్ణయం ప్రీత్యా శివనైవేద్యభక్షణే !! 12
శాలగ్రామోద్భవే లింగే రస లింగే తథా ద్విజాః !
పాషాణే రాజతే స్వర్ణే సుర సిద్ధ ప్రతిష్ఠితే !! 13
కేసరే స్ఫాటికే రాత్నే జ్యోతిర్లింగేషు సర్వశః !
చాంద్రాయణ సమం ప్రోక్తం శంభోర్నైవేద్య భక్షణమ్ !! 14
హృదయమునందు గాని, లేక చంద్రకాంతమణి, బంగారము, వెండి మొదలగు వాటితో నిర్మించిన లింగముల లోగాని విరాజిల్లే శివునకు నైవేద్యము సమర్పించి ఆ ప్రసాదమును శివదీక్షలో నున్న భక్తుడు భక్షించవలెను . శివదీక్షను పొందిన భక్తుడు మహాప్రసాదము అనబడే, శుభకరమగు, అన్ని లింగముల నైవేద్యమును భక్షించవలెను. ఇతరదీక్షలు గలవారు శివభక్తి యందు లగ్నమైన మనస్సు గల వారైనచో, వారు ప్రీతితో శివనైవేద్యమును భక్షించుట అను విషయములో గల నిర్ణయమును వినుము.
ఓ ద్విజులారా! *శాలగ్రామము నందు ఉద్భవించిన లింగము, రసలింగము, శిలాలింగము, వెండి లింగము, బంగారు లింగము, దేవతలచే మరియు సిద్ధులచే ప్రతిష్ఠింప చేసిన లింగములు, అన్ని జ్యోతిర్లింగములు అను వాటి యందు విరాజిల్లే శివుని నైవేద్యమును భక్షించిన భక్తునకు చాంద్రాయణ వ్రతము చేసిన ఫలము లభించును.*
బ్రహ్మహాపి శుచిర్భూత్వా నిర్మాల్యం యుస్తు ధారయేత్ !
భక్షయిత్వా ద్రుతం తస్య సర్వపాపం ప్రణశ్యతి !! 15
చండాధికారో యత్రాస్తి తద్భోక్తవ్యం న మానవైః !
చండాధికారో నో యత్ర భోక్తవ్యం తచ్చ భక్తితః !! 16
బాణ లింగే చ లౌహే చ సిద్ధే లింగే స్వయంభువి !
ప్రతిమాసు చ సర్వాసు న చండోధికృతో భవేత్ !! 17
స్నాపయిత్వా విధానేన యో లింగస్నపనోదకమ్ !
త్రిః పిబేత్ త్రివిధం పాపం తస్యేహాశు వినశ్యతి !! 18
ఎవరైతే శుచియై శివుని నిర్మాల్యమును ధరించి, ప్రసాదమును భక్షించునో, వాడు బ్రహ్మహత్యను చేసిన వాడైననూ, వాని పాపమంతయూ వెంటనే పూర్తిగా నశించును . చండీశ్వరుని అధికారము గల ప్రతిష్ఠలో మానవులు నైవేద్యమును భక్షించరాదు. చండీశ్వరాధి కారము లేని దేవళములో నైవేద్యమును భక్తితో భక్షించవలెను.
*బాణలింగము, లోహనిర్మితలింగము, సిద్ధ ప్రతిష్ఠిత లింగము, స్వయం భూలింగము, మరియు అన్ని రకముల శివప్రతిమల విషయములో చండీశ్వరునకు అధికారము ఉండదు.
ఎవరైతే లింగమునకు యథావిధిగా అభిషేకమును చేసి, ఆ తీర్థమును మూడుసార్లు స్వీకరించునో, వాని మూడు విధముల పాపములు వెను వెంటనే నశించును.
అగ్రాహ్యం శివనైవేద్యం పత్రం పుష్పం ఫలం జలమ్ !
శాలగ్రామ శిలా సంగాత్సర్వం యాతి పవిత్రతామ్ !! 19
లింగోపరి చ యద్ద్రవ్యం తద గ్రాహ్యం మునీశ్వరాః!
సుపవిత్రం తద్ జ్ఞేయం యల్లింగ స్వర్శ బాహ్యతః !! 20
నైవేద్య నిర్ణయః ప్రోక్త ఇత్థం వో ముని సత్తమాః !
శృణుధ్వం బిల్వ మహాత్మ్యం సావధానతయాssదరాత్ !! 21
గ్రహింపదగని శివనైవేద్యము, పత్రము, పుష్పము, ఫలము, జలము ఇత్యాది సర్వముల శాలగ్రామ శిలయొక్క స్పర్శ చేతపవిత్రతను పొందును. ఓ ముని శ్రేష్ఠులారా! లింగముపైన ఉంచబడిన ద్రవ్యమును గ్రహించరాదు. కాని, లింగస్పర్శకు బయట నున్న శివనైవేద్యము మిక్కిలి పవిత్రమని తెలియవలెను.