మంత్ర స్వరూపం :
మంత్రం ఏకాక్షర మంత్రంగా ఉండవచ్చు. రెండు బీజముల మంత్రంగా ఉండవచ్చు. మూడు, నాలుగు, ఐదు నుంచి తొమ్మిది అక్షరాల వరకు ఉన్న మంత్రాలు ఉంటాయి. తొమ్మిది కంటే ఎక్కువ అక్షరాలు ఉన్న మంత్రాన్ని మాలా మంత్రం అని అంటారు. ఇంకా పదహారు, ఇరవై ఎనిమిది అక్షరాల కంటే పైకి వెళ్ళేటప్పటికి దానిని మహ మాలా మంత్రం అంటారు.
ఇంక మంత్ర స్వరూపం ఎలా ఉంటుంది అనేది మంత్రాలు అన్ని ఏకాక్షర మంత్రములు అయితే "నమః" మొదలైనవి ఉండవు. ఏకాక్షర మంత్రానికి ఉదాహరణకు "ఓం,ఓం, అన్న బీజమే ఒక మహా మంత్రం.
మంత్ర మాతృక. బీజములు ఎంత తక్కువగా ఉంటే అది అంత శక్తి కలిగిన మంత్రం అని మననం చేసే వారికి, అది చేయించే గురువులకు తెలియాలి. మహ మంత్రాలు అన్న పేరుతో 108 అక్షరాల మంత్రాన్ని చెబితే ఒక సారి అనడంలోనే ఎక్కడైనా పొరపాటు జరిగితే మంత్రం యొక్క శక్తి రాకపోగా మంత్రాపచారము చేసినట్లు అవుతుంది. కాబట్టి సద్గురువులైన వారు మొట్టమొదటగా ఏకాక్షర మంత్రం అయిన ప్రణవాన్ని (ఓంకారం) జపం చేయాలి అని చెబుతారు. ఇంక రెండు అక్షరాల మంత్రం "రామ" " కృష్ణ" మొదలైనవి. లేకపోతే "ఓం,హ్రీం" ఇకపోతే బీజముతో కూడిన కొన్ని మంత్రాలు ఉంటాయి. బీజము తో పాటు ఇష్ట దేవత యొక్క పేరు ఆ తర్వాత నమః అని లేకపోతే "స్వాహా" అని ఉంటాయి. కొన్ని మంత్రములు నామాంతములు. అంటే "రామాయ నమః" "కృష్ణాయ నమః" "గోవిందాయ నమః" ప్రణవాద్యములుగా కూడా కొన్ని ఉంటాయి. అంటే "ఓం కృష్ణాయ నమః" "ఓం గోవిందాయ నమః" అని ! ఇంకా దానిలో విశేషం ఏమిటంటే "కృష్ణ" అన్న నామంలోని "కృ" అన్న వర్ణానికి దాని బీజమును కూడా "ఓం" ప్రక్కనే పెట్టాలి. అప్పుడు "ఓం క్లీం కృష్ణాయ నమః" "ఓం గం గణపతయే నమః" " ఓం రం రామాయ నమః" అవుతాయి. మొదటిది కేవలం ప్రణవాద్యము.
ఇష్ట దేవత యొక్క చతుర్థి అంతము కృష్ణాయ,రామాయ. ఇది నాల్గవ విభక్తి. చతుర్థంతము అంటారు. ముందుగా మనం సంస్కృత మంత్రాలను చేసిన తర్వాత మిగిలిన మంత్రాలను చేస్తాం కాబట్టి చతుర్థి అంతమున వారి వరకు నమస్కారం చేస్తున్నామని అర్థం. చతుర్థి అంతముగా ఇష్ట దేవతను చెప్పుకొని అంటే "రామాయ" అనేది చతుర్థ్యంతము. చతుర్థి విభక్తి అంతముగా కలది అని అర్థం. ఇప్పుడు మంత్రాన్ని ఇంకా పటిష్టంగా చేయడానికి ప్రణవం (ఓంకారం) ఒక్కటే సరిపోదు. ఎందుకు అంటే ప్రణవం ఆకాశమంత విశాలమైంది. ఉద్దిష్టమైన ప్రయోజనం కలగాలి అంటే మంత్రానికి శక్తి కావాలి. కృష్ణ, గోవింద అని వట్టి నామముతో పిలిచే కంటే మూల శక్తి అయినటువంటి బీజాన్ని కూడా కలిపితే "ఓం క్లీం కృష్ణాయ నమః" అవుతుంది.
ఈ విధంగా మంత్రానికి బలాన్ని ఇవ్వడం కోసం మంత్ర శాస్త్ర ద్రష్టలు , మహానుభావులు, ఆ మంత్రంలో సిద్దిని పొందిన ఋషి సత్తములు ఇష్ట దేవతకు సంబంధించిన బీజం మొత్తం, మంత్ర మాతృకలన్నింటికీ బీజమైన ఓంకారం, ఇష్ట దైవం యొక్క పేరు చతుర్థీ విభక్తి అంతముతో చేసి, అక్కడకు అక్కడికీ అర్థం పూర్తి కావడం లేదు అని "నమః" అన్నారు. ఒక్కోసారి వీటిని తీసి ధారపోస్తాము. అంటే ఒక లక్ష లేకపోతే రెండు లక్షలో జపం చేస్తాం అనుకుంటే ఆ లక్ష లేక రెండు లక్షలు చేశాక ఆ జపం యొక్క ఉధ్యాపనగా చేస్తున్న మంత్రానికి వెనుక "స్వాహా" చేర్చి ఆజ్యమును అగ్నిలో సమర్పిస్తారు. అలా సమర్పించేటప్పుడు ఈ మంత్రానికి "స్వాహా" చేరుస్తారు. అప్పుడు "నమః" అనరు. ఇలా "స్వాహా" ను చేసే మంత్రమును "దశాంశ హోమం" అంటారు. అంటే " ఓం క్లీం కృష్ణాయ నమః" అని ఒక లక్షో రెండు లక్షల జపమో చేశాక "ఓం క్లీం కృష్ణాయ స్వాహా" అని చేస్తారు. అప్పుడే మంత్రం సిద్ది. మంత్ర సిద్ధి అయిన తర్వాత అష్ట దిగ్భంధనం అని ఉంది. ఎదుటి వారు మనకి అపకారం చేయకుండా కట్టడి చేయడానికి ఆ మంత్రానికి "హుం ఫట్" చేర్చాలి. అప్పుడు "ఓం క్లీం కృష్ణాయ హుం ఫట్" అని చేయాలి. అంటే తనకు అపకారం జరుగుతుందని అనుకున్నప్పుడు తనకు తాను కాపాడుకోవడానికి "హుం ఫట్" అనేది చేస్తారు.
ఇంక రజోగుణం కలవారు తమకు అపకారం చేసిన వారిని కొంత ఇబ్బంది పెడితే బాగుంటుంది, అప్పుడే మన ప్రతాపం వారికి తెస్తుంది అని మంత్రమునకు చివర "వషట్" లేక "ఔషట్" అని చేరుస్తారు. ఇది అవతలి వారి పై మంత్రాన్ని ప్రయోగించే లక్షణం. ముందుగా "ఓం క్లీం కృష్ణాయ నమః" అనే మంత్రాన్ని లక్షో, రెండు లక్షల జపం చేసిన తర్వాత దానికి దశాంశ హోమం చేసేటప్పుడు "నమః" కి బదులు "స్వాహా" తగిలించాలి. ఆ తర్వాత ఎదుటి వారిని వారు ఉన్నచోటే ఉంచి మనకు అపకారం చేయకుండా "అష్ట దిగ్బంధనం" చేయాలి అంటే "హుం ఫట్" అనాలి. అష్ట దిక్కభంధనం చేసేటప్పుడు కూడా మంత్రాన్ని ఇన్ని వేలు అని జపం చేసి అప్పుడు మళ్ళీ దశాంశ హోమం చేయడానికి "హుం ఫట్ స్వాహా" అని అక్కడ మళ్లీ స్వాహా పెట్టాలి. ఈ విధంగా మంత్రం ఒక ఆయుధం లాంటిది.
ఈ ఆయుధాన్ని వాడి మన మెడ కోసుకోవచ్చు. లేక అవతలి వారిని ... ఒక్కో సారి తమో గుణం తో ఉన్న "స్వ" ని మాత్రమే కోరేవారు,ఈ మంత్రాన్ని ఉపయోగించి అవతలి వారిని అవస్థలు పెట్టడం కూడా చేస్తారు. "ఓం క్లీం కృష్ణాయ నమః" అనేది మొట్టమొదటి శ్రేణి మంత్రం. దాని దశాంశ హోమం నందు అదే మంత్రం "ఓం క్లీం కృష్ణాయ స్వాహా" . ఎదుటి వారు వ్యతిరేకంగా ఉన్నారు. వారిని అక్కడే అణిచి వేసేందుకు, అంటే " ఓం క్లీం కృష్ణాయ హుం ఫట్" . అంటే వారు మన దగ్గర దాక రాకుండా,ఇంక మన మీదకు దండెత్తి వస్తున్నాడు అంటే " హుం ఫట్ స్వాహా" అన్నటువంటి మంత్రంతో దశాంశ హోమం కూడా చేయాలి. మన శక్తిని చూపాలి అంటే "వషట్" లేక "జౌషట్" అంటే "ఓం క్లీం కృష్ణాయ వషట్" లేక జౌషట్" రెండూ కూడా రూపాంతరాలు. అది ప్రయోగ మంత్రం. అంతకు ముందు వరకు నివారణ మంత్రాలు, కామనా సిద్ది మంత్రాలు. ఆత్మ సిద్ది,మనో సిద్ది, స్వయం రక్షణ, శతృ బంధనం మొదలైన అన్ని కూడా ఒకే మంత్రం లో ఉంటాయి. దాని యొక్క అంతం వేరేగా మనం జపం చేయాలి. అలాగే అన్ని మంత్రాలకు కూడా. అన్ని మంత్రాలకు ఇదే పద్దతి.