Ananta Trayodasi |
అనంగ త్రయోదశి - Ananta Trayodasi
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలెంతో విశిష్టమైనవి. ప్రపంచ దేశాలకే ఆదర్శమైనవి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నోవ్రతాలు, నోములు, పూజలున్నాయి. ఇవి అనాదిగా ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్ఠంగానూ, సుఖ మయంగా గడపేందుకు ఎంతో దోహదపడుతున్నాయి. చైత్రమాసంలో వచ్చే అనంగత్రయోదశి రోజు శివుణ్ని పూజిస్తే సంవత్సరంలో ప్రతి రోజూ శివుడిని పూజించిన ఫలం లబిస్తుందని శాస్త్ర వచనం. అదేవిధంగా ఈ రోజు మన్మధుని పూజిస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి చెందుతుంది.
భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- 'అనంగత్రయోదశీ వ్రతం'. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి. అనంగుడు అంటే 'మన్మధుడు' అని అర్థం. మన్మధుడు బ్రహ్మచేత, శివుని చేత అనంగు నిగా (అదృశ్యునిగా) చేయబడినట్లు పురాణ కథలు మనకు చెబుతున్నాయి.
మన్మథుని వాహనం చిలుక. అరవిందాది పుష్పాలు అతని బాణాలు. అతడు ప్రేమాధి దేవత. మంచిరూపం కలవాడు. తారకాసురుడనే రాక్షసుడు వరగర్వంతో సకలలోకాల్ని కష్టాలపాలు చేయసాగాడు. దీనితో వాణ్నలా చంపాలని దేవతలంతా రకరకాల ఆలోచనలుచేసి, చివరకు బ్రహ్మదేవుడి సలహా తీసుకుంటారు.
అందుకు శివుడి కుమారుడే తారకాసురుణ్ని అంతమొందిస్తాడని సమాధానమిస్తాడు బ్రహ్మ. అప్పటికి శివుడు తపస్సులో ఉండటంతో, శివుడు తపస్సు మాని పార్వతీ దేవిని వివాహం చేసుకునేలా బాధ్యతను ఇంద్రుడు మన్మధుడికి అప్పగించాడు.
దీంతో మన్మథుడు తన బాణాన్ని శివుడిపై ప్రయోగించాడు. శివుడి మనస్సు చలించింది. తన మనస్సుకు చలింప చేసింది ఎవరు? అని శివుడు మూడవ కన్ను తెరవడంతో మన్మథుడు భస్మమై 'అనంగుడయ్యాడు'. ఈ విషయం తెలిసి రతీదేవి విలపించి, శివుడిని ప్రార్థించింది. దీంతో శివుడు మన్మథుడిని బ్రతికించి కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేటట్లు వరం ప్రసాదించాడు.
ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే 'అనంగ'త్రయోదశి. గంగాసరయూ నదీ సంగమ ప్రాంతం ఒకప్పుడు అంగదేశంగా మన్మథుడి పేర ప్రసిద్ధిగాంచింది. ఈరోజూ పరమేశ్వరునితో పాటు రతీమన్మథులను పూజిస్తే అన్యోన్యమైన దాంపత్యసిద్ధి కలుగుతుందని ధర్మసింధు కూడా స్పష్టీకరిస్తోంది.
అనంగ గాయత్రి జపం:
కామదేవాయ విద్మహే| పుష్పబాణాయ ధీమహి| తన్నో అనంగ ప్రచోదయాత్||
అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ రతీమన్మథులను పూజించాలి. భారతీయులు గృహస్థాశ్రమానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అది మిగతా బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు ఆధారశిల. అందుకే దాంపత్య అన్యోన్యతను పెంచేందుకు అనంగవ్రతాది పూజలను ఏర్పరచారు. కామదేవుడన్నా, అనంగుడన్నా, పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే, కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి. సకల ఐశ్వర్య, ఆనంద ప్రధాన సర్వేశ్వరుడే కదా!