27 Nakshatras |
_________
Ashwini Nakshatra |
1. అశ్విని నక్షత్రము గుణగణాలు - Ashwini Nakshatra :
అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్వినీదేవతలు. అశ్వినీ నక్షత్రజాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరికి పోటీ మనస్తత్వము అధికము. క్రీడల అందు ఆశక్తి అధికము. అశ్వినీదేవతలు శసత్రచికిత్స, ఆయుర్వేద వైద్యములో నిపుణులు కనుక అశ్వినీ నక్షత్రజాతకులు ఆయుర్వేదము వంటి వైద్యము అందు ఆశక్తి కలిగి ఉంటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు. రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్యసాహసాలు అధికం. ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు. ఓర్పు, నేర్పు, సామర్ధ్యంతో కార్యనిర్వహణ చేస్తారు.
ఉత్సాహవంతుతుగా ఉంటారు. పోటీ మనస్త్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు. వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయము తీసుకుంటారు. ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము, ధర్మము పాటించడములో ఆశక్తి కనపరుస్తారు. వీరు రుజువర్తనులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు. నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము, దైవోపాసనా, భక్తి వంటి లక్షణాలు వీరికి అధికము. కొంత అలసత్వము కలిగి ఉండడము సహజమే. తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే. ఇతరులకు లొంగి పనిచేయడం వీరికి నచ్చదు. అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వము కలిగి ఉంటారు. క్రీడాకారులుగా, వైద్యులుగా, సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు. ఇవి అశ్వినీ నక్షత్రజాతకుల సాధారణ గుణాలు అయినా జాతకచక్రము, లగ్నము, పుట్టినసమయము,
మాసముల వలన గుణగణాలలో మార్పులు ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకు 45 సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది. బాల్యము నుండి యుక్తవయస్కులు అయ్యే వరకు వీరికి జీవితము వీరికి ఆనందదాయకముగా జరుగుతుంది.
Bharani Nakshatra |
2. భరణినక్షత్రము గుణగణాలు - Bharani Nakshatra :
భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు.
ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు. వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధరణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.
Krittika nakshatra |
3. కృత్తికానక్షత్ర జాతకుల గుణగణాలు - Krittika nakshatra :
కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సుర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు.
బాల్యములో మంచి పోషణ, పపెంపుదల ఉంటుంది. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గదుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నెర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నం మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించ లేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. వీరికి మధుమెహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో అస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగుణము ఎక్కువ. అపాత్రా దానము చేస్తారు. మద్యవర్తిత్వం బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి బయటపడి సుఖజీవితము సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.
Rohini nakshatra |
4. రోహిణి నక్షత్ర గుణగణాలు - Rohini nakshatra :
రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్సిస్తారు. అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు మానసిక ధృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నదచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడలయందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత, అండదండలు ఉండడము వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. వీరి శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. మాతృవర్గం మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు. దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శ ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. అపనిందలు, ఆరోపణలు జీవితములో ఒక భాగము ఔతాయి. జీవితములో ఒడిదుడుకులు సహజము. వీరు హాస్యప్రియులు, కళా ప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్దులు పొందగలరు.
సంతానముతో విభేదిస్తారు. గురుమహర్ధశ, శని మహర్ధశ వీరికి కలసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలసి రావు. భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు. గజ ఈతగాళ్ళూ ఔతారు.తనకు తాను సుఖపడుతూనేతన వారిని సుఖపెదతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.
Mrigasira nakshatra |
5. మృగశిరా నక్షత్రము గుణగణాలు - Mrigasira nakshatra :
మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంస్థలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. అంతర్గతంగా స్త్రీలతో సంబంధాలు ఉంటాయి. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మముగా న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. సైనికపరమైన, ఆయుధ సంబందిత, విద్యాసంబంధిత ఉద్యోగావ్యపరాలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతంలో రాణిస్తారు. తల్లి తండ్రుల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానమందు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చేస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.
Arudra Nakshatra |
6. ఆరుద్ర నక్షత్రము గుణగణాలు - Arudra Nakshatra :
ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిగిఉంటారు. గొప్ప గమ్మత్తుగా మాట్లాడగలరు. మానవగణము కనుక లౌక్యంతో పనులు సాధించగలరు. రాశి అధిపతి బుధుడు నక్షత్ర అధిపతి రాహువు కనుక విద్యా వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. బాల్యం నుండి యవ్వనం వరకు సుఖసంతోషాలతో సాగుతున్న జీవితం వివాహానంతరం సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగం , వ్యాపారం వంటి వాటిలో త్వరగా స్థిరపడతారు. తగిన వయసులో వివాహం సులువుగా జరుగుతుంది. నటులుగా, కళాకారులుగా చక్కగా రాణిస్తారు. కళాత్మకమైన వ్రత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. డబ్బులకు చెందినట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయవచ్చును. తొందర పాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంటనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేటలు కనబరుస్తారు. తల్లిదండ్రులు, తోడబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిగియుంటారు. రాత్రి పూట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందరిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చినా కూడ ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతుకుతారు. సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మరల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి జీవితంలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.
Punarvasu nakshatra |
7. పునర్వసు నక్షత్రము గుణాగణాలు - Punarvasu nakshatra :
ఇది గురు గ్రహ నక్షత్రము, దేవగణ నక్షత్రము, రాశ్యాధిపతులు బుధుడు, చంద్రుడు, అధిదేవత అధితి, పురుషజాతి. ఈ నక్షత్ర జాతకులు ఇతరుల విషయాలలో జోక్యము చేసుకోరు. అవసర సమయంలొ ఇతరులను ఆదుకునే గుణము ఉంటుంది. సువర్ణము మీద ఆసక్తి ఉంటుంది. ధనుర్విద్య, తుపాకితో కాల్చడము వంటి అలసట కలిగించె విద్యల అందు ఆసక్తి అధికము. అభిప్రాయాలు, మాటలు స్పష్టముగా ఉంటాయి. పరపతి బాగా ఉంటుంది. సమాజంలో ఉన్నత వర్గానికి నాయకత్వము వహిస్తారు. పరపతి బాగా ఉపయోగపడుతుంది. పదిచయాలను కార్య సిద్ధికి ఉపయోగించుకుంటారు. స్వంత పనులకంటే ఇతరుల పనులకు సహాయపడడంలోనే ఆశక్తి అధికం కనబరుస్తారు.
వివాహజీవితములో తలెత్తిన భేదాభిప్రాయాలను ప్రాధమిక దశలోనే సర్ధుబాటు చెసుకోవడము వలన ప్రయోజనము ఉంటుంది. చెప్పినదె పదే పదే చెప్పడము, అతి జాగ్రత్తలు, ఇతరులను అధికముగా నమ్మి కార్యభారము అప్పగించ లేని స్థితి వీరిని పిరికి వారుగా భావించే అవకాశం ఉంది. ఇవి ఈ నక్షత్రజాతకులకు సాధారాణ ఫలితాలు. సువర్ణము, ఆయుర్వేదము, ఎగుమతి వ్యాపారాలు కలసి వస్తాయి. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపదతారు. సంతానానికి సంబంధించిన క్లేశము కొంతకాలము ఇబ్బంది పెడుతుంది.సమస్యలను పరిష్కరించ గలిగిన వ్యక్తిగా, వ్యక్తిత్వము కలిగిన వ్యక్తిగా, స్వయం శక్తి కలిగిన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు ఉంటుంది. బాల్యము సుఖవంతముగా జరిగినా తరువాత సమస్యల వలయములో చిక్కుకుంటారు. నలభై నుండి ఏభై సంవత్సరాల తరువాత సమస్యల నుండి బయట పడి సుఖజీవితము కొనసాగించే అవకాశము ఉంది.
Pushyami nakshatra |
8. పుష్యమి నక్షత్రము గుణగణాలు - Pushyami nakshatra :
పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడిపి ఒక స్థాయికి చేరుకుంటారు. తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. ప్రజాబాహుళ్యమును నియత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. యవ్వనం వచ్చిన తరువాత జీవితం అదృ ష్టానికి చేరువగా సాగుతుంది. వీరి ప్రజా సంబంధాలు, స్నేహసంబంధాలు పటిష్టంగా ఉంటాయి. ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. సౌమ్యంగా ఉంటారు. తప్పు చెసే వారిని సహించరు. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడతారు. దానస్వభావము కలిగి ఉంటారు. వీరికి మంచి సలహాదారులు లభిస్తారు.
ఒకరిద్దరు తప్పుడు సలహాదారుల వలన సమాజంలొ అప్రతిష్టకు లోనౌతారు. వారి సలహాల కారణంగా వ్యక్తిగత జీతంలోను, సామాజిక జీవితములోను అపసృతులు ఎదురౌతాయి. జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురౌతాయి. తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనౌతారు. నైతిక విలువలు లేని వైరివర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి ఔతారు. సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ నష్టాలకు గురి చేస్తాయి. దైవ భక్తి అధికము, అధ్యాత్మిక రంగంలో అభ్యున్నతి సాధిస్తారు. వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.
Ashlesha nakshatra |
9. ఆశ్లేష నక్షత్రము గుణగణాలు - Ashlesha nakshatra :
ఆశ్లేష నక్షత్రము యొక్క గణము రాక్షస గణము, అధిదేవత పాము, నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి చంద్రుడు. ఈ నక్షత్రజాతకులు వివిధరకాల సౌక్యాలు కోరుకుంటారు. ఏదోఒక లాగ తమ తమ కోరికలను తీర్చుకుంటారు. పట్టుదల, పగయును కలిగి ఉంటారు. రాజకీయాల వైపునకు మొగ్గు వీరిలో ఎక్కువగా నుండును. స్త్రీల వలన పెద్దల వలన జీవితములో ఇబ్బమ్దులకు గురి ఔతారు. అడ్డంకుల నడుమ వీరి చదువులు కొనసాగుతాయి, ఏది ఏమి అయిన సరే వీరు ఆయా అడ్డగింపులని దాటి పై చదువులను చదువుకొనగలుగుతారు.
వీరి పట్టుదల వీరిని ఉన్నత స్థితికి తీసికొనిపోతుంది. న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. వీరు ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణించగలరు. కష్ట పడి సుఖజీవితాన్ని అలవరచుకున్నా పొరపాటు అయిన ఊహల వలన సమస్యలు ఎదురౌతాయి. సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకము లేని వ్యక్తులతో సహజీవనము సాగిస్తారు. ఉద్యోగంలో నిపుణత సాధిస్తారు. వర్గరాజకీయాలను సమర్ధతతో నడపగలరు. యీనియన్లలో ప్రజా జీవితములో మంచి పేరు వస్తుంది. ఉన్నతాధికారుల వలన, ఉన్నత స్థాయిలో ఉన్న వారి వలన ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఓర్పు వహిస్తారు.
లక్ష్యసాధన కొరకు ఎంత కాలమైనా ఎదురు చూస్తారు. వయసు గదిచే కొద్దీ సుఖమయ జీవితానికి చేరువ ఔతారు. నమ్మకద్రోహులు స్నేహితులుగా ఉండడము దురదృష్టముగా పరిణమిస్తుంది. స్థిరాస్థులు దక్కించుకోగలుగుతారు. ఆయుర్వేద మందులు, బియ్యము, పాల వ్యాపారము, పెట్రోలు బంకులు, బట్టల(జవుళీ)వ్యాపారము లాభిస్తాయి. అర్హులైన వారికి దానము చెస్తారు. గొడవలు తగువులు తగాదాలకు దారి తీసే సంగతుల జోలికి వీరు పోనేపోరు దూరముగా ఉంటారు. ఒడు దుడుకులు ఉండకుండ వీరి బ్రతుకు నిలకడగా ఉంటుంది.
Magha (Mukha) nakshatra |
10. మఖనక్షత్రము గుణగణాలు - Magha (Mukha) nakshatra :
మఖ కేతుగ్రహ నక్షత్రం కనుక ఈ నక్షత్రజాతకులకు మంత్రోపాసన, వైరాగ్యం , భక్తి సహజంగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికం. కేతువు ఆధిపత్యం, రాక్షస గణముల చేరిక కారణంగా పట్టుదల, ప్రతీకారం వంటివి అధికం. ప్రతి విషయంలో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం చేయలేరు. పొదుపు చేసే గుణం ఉంటుంది. జీవితంలో అబధ్రతా భావం అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడం వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణం అధికం. బ్యాంల్యంలోనే శుక్రదశ వస్తుంది కనుక విద్య కంటే సౌందర్య పోషణకు ప్రాదాన్యత ఇస్తారు. తన పరిసరాలను పరిశుభ్రంగా అందంగా ఉంచే ప్రయత్నాలు చేస్తారు. కార్యసాధన కొరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఎవరికీ తలవంచని మనస్తతత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొటారు.
అధికారిగా రాణిస్తారుకాని కింది ఉద్యోగుల నిరసనకు గురి ఔతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పొస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి ఔతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతం భద్రం చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు శ్రమిస్తారు కాని నిద్ర లేమిని సహించరు. సహన గుణం తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితం స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి బాధపదతారు. లోటు లేని జీవితం జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగం , గృహ యోగం, ఆర్ధిక యోగం, విదేశీయాన యోగం కలసి వస్తాయి. నక్షత్ర అధిపతి కేతువు కనుక భక్తి వైరాగ్యాలు, రాక్షస గణం కారణంగా పట్టుదల, రాశి అధిపతి సూర్యుడు కనుక ఆధిపత్య గుణం కలిగి ఉంటారు. దైవీక కార్య నిర్వహణ, రాజకీయ ఆధిపత్యం , వృ త్తి వ్యాపారాలలో ఆధిపత్యం వంటివి వీరికి రాణింపు తీసుకు వస్తాయి.
Purva Phalguni nakshatra |
11. పూర్వఫలుగుణి నక్షత్రము గుణగణాలు - Purva Phalguni nakshatra :
పూర్వఫల్గుణీ నక్షత్రం అధిపతి శుక్రుడు వీరికి బాల్యం కొంత వరకు సుఖమయ జీవితం గడుస్తుంది. ఆటంకం లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుంది. రాశ్యాధిపతి సూర్యుడు, నక్షత్రధిపతి శుక్రుడు, మానవగణం కారణంగా లౌక్యం , అధికారం కలగలసి ప్రవర్తిస్తారు. సౌమ్యత కలిగి ఉన్నా ఇతరులకు మనసులో అయినా తల వంచరు. సమయానుకూలంగా ప్రవర్తించే కారణంగా అధికారులుగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరులకు తల వంచలేరు కనుక పై అధికారులతో సహకరించి ముందుకు పోలేరు. సౌమ్యులే అయినా గంభీరంగా ఉంటారు. ఇతరుల అభిప్రాయాలను ఖాతరు చేయరు. ఎవరు ఎమనుకున్నా లక్ష్య పెట్టరు. సమాజానికి వ్యతిరేకులు కాదు కాని సమాజ స్పృహ ఉండదు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదాదానం చేస్తారు.
సివిలు కేసులను ఎదుర్కొంటారు.స్వయంకృతాపరాధం వలన తాను శ్రమించి సాదించిన దానిని వైరి వర్గానికి ధారపోస్తారు. స్నేహితుల ఉచ్చు నుండి కొందరు జీవితకాలం వరకు బయట పడలేరు. బయట కనిపించే జీవితం కాక రహస్య జీవితం వేరుగా ఉంటుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా వీరి లోపాలాను ఎదురుగా చెప్ప లేరు. ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతం అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నంగా సంతానాన్ని వేరు రంగాలలొ ప్రోత్సహిస్తారు. సమాజంలో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మంచి పరిచయాలు ఉంటాయి. వీరి జీవితం స్నేహానికి అంకితం. వీరవిద్యలలో రాణిస్తారు.
Uttara Phalguni nakshatra |
12. ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు - Uttara Phalguni nakshatra :
ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు, మనుష్య గణం , రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు, జంతువు గోవు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తండ్రి వలన ప్రయోజనం పొందుతారు. సహోదర వర్గం బలంగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికం. వివాహం సకాలంలో ఔతుంది, ఉద్యోగం లేక వ్యాపారం ఉంటాయి. అదృష్టానికి దగ్గరగా జీవితం సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనం అధికంగా గుప్తంగా ఉంటాయి. తనకు అంతగా పరిచయం లేని రంగంలో ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారం చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు.
సంపాదనలో బంధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు. ధనం విషయం లో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరంగా ఖర్చుపెట్టరు. ఖర్చు పెట్టిన దానికి వందరెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానం వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగ లాగా కూడబెడతారు. సంఘవ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. భార్య ఆధిపత్యం అధికం. మంచి ఆశయాలతో ముందుకు వచ్చినా వీరిని ప్రపంచం సరిగా అర్ధం చేసుకోదు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితం మీద ఉన్న భయం వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దశలు వీరికి యోగిస్తాయి.
Hasta nakshatra |
13. హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు - Hasta nakshatra :
హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం, రాశి అధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు, మహిషి(గేదె). ఈ నక్షత్రజాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధం చేసుకుంటారు. అడగకనే సహాయం చెస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితములో ప్రధాన ప్రస్తావన ఔతుంది. వ్యుహాలు రహస్యం అయినా కొందరికి మాత్రం చెప్తారు. చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా ఒప్పుకుంటారు.
దూరప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జివితంలో మంచి మలుపులు ఔతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్ధ్యాలకు గుర్తింపు కొంత కాలం వేచి ఉండాలి. న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకు పొవడం వలన వైవాహిక జివితం సజావుగా సాగుతుంది. స్వంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గం పట్ల అభిమానం కలిగి ఉంటారు. అనుకున్న ప్రదేశంలో ఇష్టమైన విద్య అభ్యసిస్తారు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారంలో ఉంటాయి. సంతానం పేరు ప్రతిష్టలు తెస్తారు.
Chitra nakshatra |
14. చిత్తానక్షత్ర జాతకుల గుణగణాలు - Chitra nakshatra :
చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, రాక్షసగణం , జంతువు పులి, వృక్షం తాటి చెట్టు, రాశ్యధిపతులు బుధుడు శుక్రుడు, అధిదేవత త్వష్ట. బాల్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దత్తు పోవుట లేక స్వజనులకు దురంగా పెరుగుటకు అవకాశం ఉంది. ఇతరుల ఆర్ధిక సాయంతో జీవితంలో ముఖ్యఘట్టాలు పూర్తి చేసుకుంటారు. తాను అనుభవించిన కష్టాలు జీవితంలో మరెవ్వరు అనుభవించ కూడదని అహర్నిశలు కష్టపడతారు. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా స్వజనులు దారి తప్పుతారు. ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదంగా భావించిన వారు జీవితంలో దూరం ఔతారు. వాదనా పఠిమ కారణంగా న్యాయస్థానాలలో, ప్రజాబాహుల్యంలో అనుకూల ఫలితాలు సాధించినా కుటుంబంలో అందుకు ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొంటారు.
సహచరులంతా ఒక్కటిగా ఈ నక్షత్ర జాతకులను దూరంగా ఉంచుతారు. పెద్దలు, ఉన్నత స్థానాలలో ఉన్న వారి నుండి ప్రతికూలమైన తీర్పులను ఎదుర్కుంటారు. విపరీతమైన కోపం, పోరుబెట్టడం, జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వలన కావలసిన వారికి అందరికి దూరం ఔతారు. ప్రయోజనం లేని చర్చలు, కోపతాపాలు జీవితంలో చేదు అనుభవాలకు దారి తీస్తాయి. సంతానం ఉన్నత స్థితికి వస్తారు. విదేశీవ్యవహారాలు ఆలస్యంగా కలసి వస్తాయి. వస్తువలను బాగు చేయడం (రిపేరు వర్క్), సాహసకృత్యాలు, సాంకెతిక పరిజ్ఞానం, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. అందరిలో ప్రత్యేకత సాధించాలన్న కోరిక వలన వివాదాస్పదమై అనుకూల ఫలితాలను ఇస్తుంది. జీవితంలో అన్నిటికీ సర్దుకు పోయే భార్య లభిస్తుంది. జీవిత మద్య భాగంలో స్థిరాస్థులు కలిసి వస్తాయి. పాడి పంట వ్యవసాయం పట్ల ప్రత్యేక అభిరుచి ఉంటుంది.
Swati nakshatra |
15. స్వాతి నక్షత్రం గుణగణాలు - Swati nakshatra :
స్వాతి నక్షత్రాధిపతి రాహువు. స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు తులారాశిలో ఉంటాయి. కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రాహుప్రభావంతో కల్పనా శక్తి శుక్రప్రభావంతో సౌందర్యారాధనా శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. స్వాతి నక్షత్రజాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతినక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్రజాతకులు చిన్న వయసులో దాదాపు 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా యుక్తవయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కష్ట కాలపరిమితి నక్షత్రపాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది.
బాల్యంలో విధ్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించ వచ్చు. యుక్తవయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్ధికంగా సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు కనుక, గోచార రీత్యా శని నాలుగు, అయిదు స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బుధుడికి ఇది మిత్రరాశి కనుక, గోచార రీత్యా బుధుడు నవమ స్థానాధిపత్యం వహించి యోగకారకుడౌతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది. శుక్ర, రాహువుల ప్రభావం చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా, సాత్విక గుణం కారణంగా ఈ రాశి వారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశాలు ఎక్కువ. బాహ్యంగానూ, గుప్తంగానూ శత్రువులు ఉంటారు. బాహ్యాకర్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగిఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఈతరుల అసూయకు లోను ఔతారు. అకారణమైన నిందకు గురి ఔతారు. ఒక వైపు వాదనలు విని ఏక పక్ష నిర్ణయాలు తీకునే కారణంగా అనేకులను దూరం చేసుకుంటారు.
దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరి అయిన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటు పడదు. దాతృత్వం ప్రోత్సహిస్తారు కాని దానగుణం తక్కువ. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జల కారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.
Vishaka nakshatra |
16. విశాఖనక్షత్రము గుణగణాలు - Vishaka nakshatra :
విశాఖ గురుగ్రహ నక్షత్రం, రాక్షస గణం, అధిదేవతలు, ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి, రాశ్యథిపతి కుజుడు. గురుదశతో జీవితం ప్రారంభం ఔతుంది కనుక బాల్యం సుఖంగా జరుగుతుంది. తల్లి తండ్రులు కుంటుంబ సభ్యుల మధ్య గారాబంగా జీవితం మొదలౌతుంది. వీరికి మొండితనం ఎక్కువ. అనుకున్నది అమలు చేస్తారు. వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడం వ్యర్ధం. వీరికి సహాయం చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దంలో చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు అయినా వారి వలన ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లేక స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించ లేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, అర్ధికపరమైన వ్యాపారాలలొ పట్టు సాధిస్తారు. రాజకియ ప్రవేశం చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశాపారంపర్య ఆస్థులు సంక్రమిస్థాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగం వారి వలన మోసానికి గురిఔతారు. అన్యభాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగంలో విజయం సాధించి ప్రముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబధం ఉండదు. ఉద్యోగంలో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.వారి వలన నష్టం ప్రయోజనం సమంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వం ఉంటుంది. విదేశీపౌరసత్వం లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు.
కుటుంబసభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయం పొదుపు, జాగ్రత్త, విజ్ఞానం జివితంలో సమపాళ్ళలో ఉంటాయి. ఏభై సంవత్సరాల అనంతరం జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యం సుఖవంతంగా జరుగుతుంది.
Anuradha nakshatra |
17. అనూరాధనక్షత్రము గుణగణాలు - Anuradha nakshatra :
అనూరాధా నక్షత్రం అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రం . అధిదేవత సూర్యుడు. జంతువు జింక, రాశ్యధిపతి కుజుడు. ఈ నక్షతరంలో జన్మించిన వారు జలక్రీడల అందు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మం , పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవం కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితంలో స్థిరపడడానికి సమయం పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయం కావాలి. ఆరంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలంలో నిరాటంకంగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగజీవితంలో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతంగా సాగి పోతారు. ప్రేమవివాహాలు చేసుకుంటారు.
గుర్తిపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పంగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రే యస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధువర్గం నుండి నమ్మకద్రోహం ఎదురౌతుంది. తండ్రి పద్దతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగం ఉంటుంది. సహోదర సహోదరీ వర్గం బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానం , దూరప్రాంత ఉద్యోగం , దూరప్రాంత విద్యా విధానం మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంత మంది ఉన్నా ఏకాంతంగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. సాహిత్య, కళారంగాలను వైరాగ్యం మిశ్రమం చేసి ప్రయోగాలు చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరిపట్ల శాశ్వత అనుబంధం ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభం సంపాదించిన రంగంలో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నికరంగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యం అన్ని విధాలుగా బాగుంటుంది.
Jyeshta nakshatra |
18. జ్యేష్టానక్షత్రము గుణగణాలు - Jyeshta nakshatra :
జ్యేష్టా నక్షత్రానికి అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రం , అధిదేవత ఇంద్రుడు, జంతువు జింక. ఈ నక్షత్ర జాతకులు తమ రహస్యములు కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలు తెలుసుకోవడనికి ప్రయత్నిస్తారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న కార్యం సాధించడనికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాని తమ హక్కులుగా వాడుకుంటారు. విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు. మిత్రబెధం కలిగించి, తప్పుడు సలహాలు ఇచ్చి ఇతరులను అపఖ్యాతి పాలు చేయడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకుంటారు. నమ్మిన స్నెహితులు కూడా వీరిని అలాగే మోసం చేస్తారు. వీరికి నచ్చని వారి మీద తీవ్రమైన ద్వేషం పెంచుకుంటారు.
విశేషమైన దైవభక్తి ఉంటుంది. తమ వరకు వచ్చే వరకు వీరికి సమస్యలు సౌందర్యంగానే కనిపిస్తాయి. భాషలకు భాష్యం వ్రాయగలిగిన పాండిత్యం కలిగి ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో ముందు ఉంటారు. సౌకర్యవంతమైన ఉద్యోగం, అన్యోన్య దాంపత్యం వీరికి సుఖంను కలిగిఉస్తుంది. సంతానం నష్టం కావచ్చు. అయినా సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి లోపం ఉండదు. అన్నమాట, ఇచ్చిన వాగ్ధానము నిలబెట్తుకో లేరు. సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నెహం ఉండదు. సాంకేతిక రంగం లో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మిద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది. బాల్యం నుండి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించ గలరు. తగిన వయసులో సంపాదన మొదలౌతుంది. సంపాదించిన ధనంను భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రం లో గ్రపరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటయీ.
Moola Nakshatra |
19. మూలానక్షత్రము గుణగణాలు - Moola Nakshatra :
మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రం, రాశ్యధిపతి గురువు, జంతువు శునకం. ఈ నక్షత్రములో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభాపాతవాలు వీరి స్వంతం. చిన్న తనంలో బంధువుల నిరాదరణకు గురి ఔతారు. జీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు వీరి స్వంతం. జీవితంలో సాధించిన ప్రతి మెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగిపోక ముందుకు సాగడమే జీవితధ్యేయంగా ముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యం. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానం లేదు. కుటుంబం కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగం చేస్తారు.
అణుకువగా ఉండి సంసారం అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయం చేయరు. తనకు తెలిసినా మంచి మార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు. రవి, చంద్ర, కుజ దశలు యోగిస్తాయి. స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువ. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చెయ్యడం కష్టతరమైన యజ్ఞం ఔతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగుణం సామాన్యంగా ఉంటాయి. స్త్రీదేవతార్చన మంచిది. అరవై సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగి పోతుంది.
Purvashada nakshatra |
20. పూర్వాషాఢ నక్షత్రము గుణగణాలు - Purvashada nakshatra :
పూర్వాషాఢ నక్షత్రముకు అధిపతి శుక్రుడు, అది దేవత గంగ, మనుష్య గణం , జంతువు వానరం, రాశి అధిపతి గురువు. వీరు విలాసమంతమైన జీవితాన్ని కోరుకుని సాధిస్తారు. స్త్రీలు జీవితంలో ఉన్నత స్థాయిని చవి చూసి తిరిగి దిగువ స్థాయికి చేరుకుంటారు. పూర్వీకుల ఆస్తులు హరించుకు పోయి కొంత భాగం మాత్రం మిగులుతుంది. చాకచక్యం, కొంటె తనం వీరి స్వంతం. బాల్యజీవితం సుఖవంతము. వివాహ జీవితం సాధారణం. పుట్తిన ప్రామ్తానికి దూరంగా రాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. జీవితంలో అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకుంటారు. స్నేహితుల సహాయ సహకారాలతో ఉన్నతస్థాయి సాధిస్తారు.
స్నేహితులతో కలసి జీవితంలో విజయాలు సాధిస్తారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాలలో ఖ్యాతి రాణింపు లభిస్తుంది. కొంత కాలం తరువాత వీరున్న రంగంలో వీరి స్నెహితులు ఉన్నతి సాధించి వీరిని దూరంగా ఉంచుతారు. వీరి ఓర్పుకు సహనానికి పరీక్షలు ఎదురౌతాయి. ఎక్కువ కాలం ఓర్పు వహించ లేరు. సమాజంలో గౌరవానికి బదులు భయం చోటు చేసుకుంటుంది. ఏ రంగంలోనైనా ఓటమిని అంగీకరించరు. సహోదరుల వలన అపఖ్యాతి లభిస్తుంది. నమ్మిన సేవకాజనం మోసం చెస్తారు. సహోదరీ వర్గం అన్ని విధాలా సహకరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి స్వామీజీల పతల సదభిప్రాయం ఉంటుంది. దైవభీతి ఉంటుంది. విదేశీయానం కలుగుతుంది. విదేశీ వ్యాపారము, వ్యవహారము లాభిస్తాయి. సంతానము మీద ఎవ్వరి నీడ పడకుండా కాపాడతారు. వ్యక్తిగతమైన వృత్తి సంబంధిత వ్యవహారాల నీడలు కుటుంబం మీద పడకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ జీవితానికి సామాజిక జీవితానికి మద్య గోడను నిర్మించి జీవించడం మంచికి దారి తీస్తుంది.
Uttarashada Nakshatra |
21. ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు - Uttarashada Nakshatra :
ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువఁగా మాట్లాడెదరు, అణకువ కలిఁగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుఁగా ప్రేమగా ఉంటారు.
క్రొత్తవారితో కలిసిమెలిసియుండఁదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నచ్చుకొనెదరు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకా నొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి , బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పేటందుకు సరి అయిన తరుణం వచ్చినా కూడా వీరు పలుమార్లు నిజం చెప్పరు. పై చదువులు వీరికి కలసి వస్తాయి.
వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మంచిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయంను చేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు అప్పు కూడా ఇవ్వరు. ఆర్ధికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.
Shravana Nakshatra |
22. శ్రవణా నక్షత్ర జాతకుల గుణగణాలు - Shravana Nakshatra :
శ్రవణానక్షత్ర అధిపతి చంద్రుడు. అధిదేవత మహా విష్ణువు, గణము దేవగణము, రాశ్యాధిపతి శని, జంతువు వానరం. ఈ నక్షత్రజాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా నీరు ధర్మం తప్పక జీవితం సాగిస్తారు. వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన, మేధస్సు ఎవరికి అర్ధం కాదు. ఓర్పు ఉంటుంది కాని దానికి హద్దులు ఉంటాయి. ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చుసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్థులు, వస్తువులు స్థిరాస్థులుగా లభించిన దాని కంటే స్వార్జితము ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలు తీసుకుంటారు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతి గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవరిని నెత్తికి ఎక్కించుకోరు.
ఊహ తెలిసిన నాటి నుండి ధనానికి లోటు ఉండదు. అంచెలు అంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఒక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజములో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగపరచుకొనుట, సందర్భాను సారము వ్యూహం చేయుట వీరి స్వంతం. అందరు వీరిని మొండి వాళ్ళు అని భావించినా విరికి విశాలహృదయం, సున్నిత మనస్తత్వం ఎవరికి అర్ధం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వలన నష్టపొయినా తరువాత మంచి లాభాలు గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా దైవం కాపాడుతాడు. వీరికి దైవాను గ్రహం ఎక్కువ. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలు ఇందుకు కారణం. సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది.
Dhanishta Nakshatra |
23. ధనిష్ఠానక్షత్రము గుణగణాలు - Dhanishta Nakshatra :
ధనిష్ఠా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, రాశ్యాధిపతి శని, జంతువు సింహము. ఈ రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి తెలివి తేటలను సరిగా ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శీఖరాలను సునాయాసంగా అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు.
వీరి అధికార వైఖరి, మెండి తనం కారణంగా విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి అడుగడుగునా ఎదురౌతుంది. అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. ధనం పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపములోనె నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు కాని ఆత్మియులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెప్తారు. అందు వలన నష్తపోతారు. మధ్యవర్తి సంతకాల వలన, కోర్టు తీర్పుల వలన నష్టపోతారు. పైసాకు చెల్లని వ్యక్తులను నెత్తికి ఎక్కించు కుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. చదువు, సంస్కారం ఉపయోగపడి మంచి అధికారిగా రాణిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉంటే పురోగమనం సాధించ వచ్చు. సంతానంను అతి గారాబం చేస్తే చేదు అనుభవాలు ఎదురౌతాయి. పెంపకంలో లోపాలు ఉన్నా సంతానం బాగుపడి కుంటుంబానికి ఖ్యాతి తెస్తారు. గురు, శని, బుధ, మహర్ధశలు, శుక్రదశ యోగిస్తాయి.
Shatabhisha Nakshatra |
24. శతభిషానక్షత్రము గుణగణాలు - Shatabhisha Nakshatra :
ఇది రాహుగ్రహ నక్షత్రం, అధిదేవత వరుణ దేవుడు, రాక్షసగణము, జంతువు గుర్రం, రాశ్యాధిపతి శని. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గలలొ స్నెహితులు ఉంటారు కాని వీళ్ళ వలన వారు ఉపయోగాలు ఆశించరు. సహోదరీ వర్గంతో, న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయి. ఇంట్లో అనాదరణ, వ్యతిరేక వాతావరణం ఎదురౌతుంది. విద్య కొంతకాలం మందకొడిగా సాగినా క్రమంగా ఎగుమతి వ్యాపారం కలసి వస్తుంది. రవాణా వ్యాపారం కొంత కాలం కలసి వస్తుంది. సకాలంలో వివాహం జరుగుతుంది. మధ్యవర్తిగా, కమీషన్ ఏజెంటుగా, వ్యాపార వేత్తలుగా రాణిస్తారు. పురాతన ఆస్థుల వలన లాభాలు, చిక్కులు ఎదురౌతాయి. వీలునామా వలన లాభపడతారు. స్థిరమైన ఉద్యోగం, సంపాదన లేక కొంత కాలం ఇబ్బందులు ఎదురౌతాయి.
శని మహర్ధశలో స్థిరత్వం సాధిస్తారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్ధిక సహాయం చెయవలసి ఉంటుంది. జూదం వలన జీవితంలో అపశృతులు ఉంటాయి. సంతానం మంచి స్థితి సాధిస్తారు. వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను త్యాగం చెస్తారు. వివాహాది శుభకార్యాలు మొండికి పడినా పట్టుదలతో వాటిని సాధిస్తారు. కోరికలు, అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకు వస్తూనే ఉంటాయి అన్నది మీ విషయంలో సత్యం. ఆత్మియులతో అరమరికలు లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది. ఇతరుల మెప్పు కొరకు అయిన వారిని దూరం చెసుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన, నైతిక ధర్మం సదా కాపాడుతుంది. బాల్యం కొంత జరిగిన తరువాత సౌఖ్యంగా జరుగుతుంది. జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది. జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు సంభవం. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ సాధారణ ఫలితాలు మాత్రమే.
Purvabhadra Nakshatra |
25. పూర్వాభద్రనక్షత్రము గుణగణాలు - Purvabhadra Nakshatra :
పూర్వాభాద్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు. ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. తమకు అన్నీ తెలుసన్న భావన మంచి చేయదు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఆతురత వలన తగిన సమయం కొరకు ఎదురు చూసే ఓర్పు నశిస్తుంది. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి.
వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పె వరకు వీరికి తెలియదు. సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అంది వస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది. సంతానాన్ని అతిగారాబం చెస్తారు లేక పోతే విచక్షణా రహితంగా కొడతారు. ఆర్ధిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. తనకు మాలిన దానం చెయ్యరు. సామాజిక సేవలో పేరు వస్తుంది. రాజకీయంలో రాణిస్తారు. ఆధిపత్యపోరు ఇబ్బందికి గురి చేస్తుంది. వైవాహైక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.
Uttarabhadra Nakshatra |
26. ఉత్తరాభద్రానక్షత్ర,ము గుణగణాలు - Uttarabhadra Nakshatra :
ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు. ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. జివితం సాఫీగా జరిగి పోతుంది. ముప్పై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు. జాతక చక్రములో గ్రహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.
Revati Nakshatra : |
27. రేవతీనక్షత్రము గుణగణాలు - Revati Nakshatra :
రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు.
స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్ధిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపరంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉందదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలొ రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి , సాహిత్య రంగంలో అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.
.........పూర్ణ మోహన్