Ekasila Shiva Temple, Kailasa Temple |
ప్రపంచంలోనే ఏకైక ఏకశిల శివాలయం "కైలాస దేవాలయం" చరిత్ర!!!
కైలాస దేవాలయం చరిత్ర! చేరుకొనే విధానం!!
శిల్పకళల్లో భారతదేశం ఎప్పుడూ ప్రపంచంలో శిఖరాగ్రాన ఉంటుంది. ఇందుకు తార్కాణం ఎల్లోరా గుహల్లోని కైలాస దేవాలయం. ఈ దేవాలయం ప్రాముఖ్యత తెలుసుకుంటే సగటు భారతీయుని హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది.
ప్రపంచంలోనే ఈకైక ఏకశిలా "కైలాస దేవాలయం"
మొదటినుండి భారతదేశం శిల్పకళలకు పుట్టినిల్లు. అయితే ఈ ప్రాముఖ్యత వెనుక శిల్పకళాకారుల శ్రమ, నైపుణ్యం దాగి ఉన్నవి. రాతిని ఉలితో చెక్కి కావాల్సిన రూపం కొరకై శిల్పి పడే కష్టం ఉహించుకున్నట్లైతే ఏకశిలా విగ్రహం చెక్కటం ఎంత కష్టమో అర్ధమవుతుంది. అలాంటిది ఏకశిలా దేవాలయం నిర్మించడం ఎంత కష్టం? ఎన్ని వ్యయప్రయాసలు చేస్తే ఇది సాధ్యమవుతుంది?
సుమారుగా ఓ కొండని దేవాలయం ఆకారంలో శిఖరాఘ్రం నుండి క్రిందికి అంటే సుమారుగా గోపురం నుండి మండపానికి రాతిని తొలగించుకుంటూ శివాలయాన్ని నిర్మించడం అనేది అద్భుతంగా చెప్పుకోవాల్సిందే!!!
ఇలాంటి ఏకశిలా శివాలయం మన భారతదేశంలో మాత్రమే ఉన్నదంటే హిందువులందరూ గర్వించాల్సిన విషయం. ఇది భారతీయ శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం. ప్రపంచానికే తలమానికమైన అద్భుత నిర్మాణం.
ఏకశిలా కైలాస దేవాలయం ఎక్కడ ఉంది?
ఈ ఏకశిలా కైలాస దేవాలయం మన భారతదేశంలో మహారాష్ట్ర రాష్ట్రంలోగల ఔరంగాబాద్ సమీపాన గల ఎల్లోరా గుహల్లో ఉన్నది. మొత్తం 34 గుహలుండే ఎల్లోరా గుహల్లో 16వ గుహలో ఈ ఏకశిలా దేవాలయమైం కైలాస దేవాలయం ఉన్నది.
కైలాస దేవాలయం చరిత్ర :
కైలాస దేవాలయాన్ని రాష్ట్రకూట రాజైన రాజకృష్ణ-1 నిర్మించినట్లు కొన్ని ఆధారాలు చెబుతున్నవి. ఈ దేవాలయం నిర్మాణంలో చోళులు మరియు పల్లవుల శిల్పకళా నైపుణ్యం స్ఫురణకు తెస్తున్నవి. ఈ దేవాలయం కొరకై ప్రత్యేక శాసనములు లేకున్నప్పటికీ గుజరాత్ రాష్ట్రకూట రాజైన కర్కరాజా-2కు చెందిన వడోదర రాగి శిలాఫలకంలో ఎల్లోరా గుహకు చెందిన శివాలయం గురుంచి పొందుపరచడమైనది. ఈ రాగి శిలాఫలకంలో రాజకృష్ణ -1ను కైలాస దేవాలయం పోషకునిగా పేర్కొనడమైనది. ఈ ఏకశిలదేవాలయం విశిష్టత గురుంచి దేవతలు మరియు శిల్పకళాకారులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పబడి ఉంది. ఈ కర్కరాజా రాగి శిలాఫలకం, రాష్ట్రకూట రాజైన రాజకృష్ణ-1 సారధ్యంలో ఆలయ నిర్మాణం పూర్తిచేయబడిందనే వాదనకు సాక్ష్యభూతమై ఉన్నది.
అయితే పై శిలాఫలకం కైలాస దేవాలయంలో నిక్షిప్తమై లేనందున, ఈ దేవాలయం వివిధ కాలాల్లోని రాజుల శిల్పకళా నైపుణ్యం బయటపడినందువలన, కొందరు చరిత్రకారులు మరియు పరిశోధనకారుల అభిప్రాయం ప్రకారం, ఈ దేవాలయం పలువురి రాజుల కాలాల్లో నిర్మింపబడినదని విశ్లేషణ.
ప్రముఖ పరిశోధనకారుడైన శ్రీ.హర్మాన్ గోయెట్జ్ విశ్లేషణలో ప్రకారం ఈ దేవాలయం రాజకృష్ణ మేనల్లుడైన దంతిదుర్గ కాలంలో నిర్మాణం పూర్తయినదని, రాజకృష్ణ-1 కాలంలో చిన్న దేవాలయం అంటే తొలినమూనా మాత్రమే తయారయినదని పేర్కొనడమైనది. కైలాస దేవాలయం నిర్మాణం తరాతరాలుగా సాగిందని మరికొందరి పరిశోధనకారుల వివరణ. ఇందుకు తార్కాణంగా రెండు లక్షల టన్నుల రాతిని తొలగించడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు.
చేరుకొనే విధానం :
రోడ్డు మార్గం : దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి రోడ్డు మార్గంలో ఔరంగాబాద్ నగరానికి చేరుకోవచ్చును . ఎల్లోరా గుహలోని కైలాస దేవాలయానికి ఔరంగాబాద్ పట్టణం కేవలం 30 కి.మీ.దూరంలో ఉన్నది. ఔరంగాబాద్ పట్టణం నుండి కైలాస దేవాలయానికి బస్సు, ఆటో లేదా క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నవి. మహారాష్ట్రలోని ఇతర ప్రముఖ పట్టణాలైన ముంబై, పూణే, నాసిక్, కొల్హాపూర్, అహ్మద్‌నగర్ నుండి ఔరంగాబాద్ పట్టణానికి రాష్ట్ర రవాణాశాఖ బస్సు సర్వీస్ సౌకర్యం కలదు.
రైలు మార్గం : దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ అనుసంధానించబడి ఉన్నది. అలానే మహారాష్ట్రలోని ఇతర ప్రముఖ పట్టణాలైన ముంబై, పూణే, నాసిక్, కొల్హాపూర్, అహ్మద్‌నగర్ నుండి ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ అనుసంధానింపబడి ఉన్నది. ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ నుండి కైలాస దేవాలయానికి బస్సు, ఆటో లేదా క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నవి.
వాయు మార్గం : దేశంలోని మరియు మహారాష్ట్ర లోని అన్ని విమానాశ్రయాల నుండి ఔరంగాబాద్ విమానాశ్రయానికి విమాన సౌకర్యం కలదు. ఔరంగాబాద్ విమానాశ్రయం నుండి ఎల్లోరాలోని కైలాసదేవాలయం కేవలం 15కి.మీ. దూరంలో మాత్రమే ఉన్నది. ఔరంగాబాద్ విమానాశ్రయం నుండి కైలాస దేవాలయానికి బస్సు, ఆటో లేదా క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్నవి.
ఆలయ సందర్శన సమయాలు : ప్రతి రోజు ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు తిరిగి సాయంకాలం 05:00 నుండి రాత్రి 08:00 గంటల వరకు.
వసతి సౌకర్యం : ఎల్లోరా గుహలకు సమీపంలో పలు వాణిజ్య వసతి గృహాలు (హోటళ్లు) అందుబాటులో ఉన్నవి.