Navadurga |
దసరా | నవదుర్గలు విశిష్టత :
ప్రకృతిలోని చైతన్యశక్తి. ప్రకృతి స్వరూపాలనన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి, ఒకే ఒక చైతన్య పర తత్త్వ శక్తియందు నిలిపితే జన్మసాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవులయందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి, చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసికొంటే దివ్యానుభూతిని పొందుతాడు.
‘‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనం
శాన్తిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్’’
సర్వ రోగములను, సర్వ ఉపద్రవములను పోగొట్టి, సర్వారిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది- నవరాత్రి వ్రతం అని పేర్కొన్నది స్కాంధ పురాణం.
‘నవ’ అంటే తొమ్మిదని, క్రొత్త అని సామాన్యార్థాలు. కానీ, నవ అంటే పరమేశ్వరుడని, ‘రాత్రి’ అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెలుపుతోంది.
కనుక, నవరాత్రి వ్రతమంటే- పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. నవరాత్రి వ్రతమంటే తొమ్మిది రాత్రులు చేయు వ్రతమని చెపుతారు. ‘‘సూయతే స్తూయతే ఇతి నవః’’ అనగా నవ శబ్దమునకు స్తుతిం పబడుచున్నవాడని అర్థము. పరమాత్మ ‘నవ’ స్వరూపుడు. శబ్దరూపమైన వేదం- ప్రకృష్టమైన ‘నవ్య స్వరూపం’. అదే ప్రణవ స్వరూపం. ‘‘నవో నవో భవతి జాయ మానః’’ పరమాత్మ నిత్య నూతనుడు. అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు. శివశక్తులకు భేదం లేదు. అం దుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉంది.
జగజ్జనని- ‘రాత్రి’ రూపిణి. పరమేశ్వరుడు-ప గలు. జగన్మాత ఆరాధనే- రాత్రి వ్రతం. రాత్రి దేవియే- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి వంటి రూపనామములతో పూజింపబడుతోంది. అందుకే మాతకు ‘కాళరాత్రి’ అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి, పగలు తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసికొని తొమ్మిది తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు.
‘పాడ్యమి’ అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. మనుష్యుల బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదా దేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. సర్వ శుభములను చేకూర్చుతుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’ అంటారు. ఇది పెద్ద ఉత్సవం- మహోత్సవం. ఇది- దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల అంతరార్థం.
పసుపు, కుంకుమ, పూలు, పరిమళ సుగంధ ద్రవ్యములు మొదలైన మంగళకరమైన వస్తువుల యందు, ఆవు నేతి యందు ప్రజ్వలిస్తూ ప్రకాశించే ‘జ్యోతి’ స్వరూపంలోనూ, గో మాత యందు, ముత్తయదువల యందు, త్యాగబుద్ధి కలవారి యందు భాసిల్లుతుంది- మంగళగౌరీ దేవి.సర్వ కార్య దిగ్విజయమునకు మంగళగౌరీ పూజ చెప్పబడింది. అందుకే వివాహంలో నూతన వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు.
త్రిపురాసుర సంహారానికి బయలుదేరే ముందు గౌరీదేవిని అర్చించి విజయాన్ని పొందాడు పరమ శివుడు. ‘గౌరీ కల్యాణం వైభోగమే’ అంటూ అనాదిగా పెద్ద ముత్తయదువలు శుభములు పల్కుతూ కల్యాణ సమయంలో గానం చేయటం మన సంప్రదాయం.
హిమాలయ పర్వత శ్రేణిలో తెల్లని కాంతితో ఆవిర్భవించిన చల్లని తల్లి గౌరీదేవి. ‘గౌరీ గిరి రాజ కుమారీ గాన వన మయూరీ గంభీర కౌమారీ...’ అంటూ ‘గౌరీ’ రాగంలో, ముత్తుస్వామి దీక్షితులు గానం చేసిన కీర్తన నవరాత్రి పూజలో మొదటి రోజు అర్చనకు స్ఫూర్తినిస్తుంది.
చలించని మనస్సు, భ్రమించని దృష్టివలన ఏకాగ్రత సాధ్యమవుతుంది. నిష్కామబుద్ధితో తోటివారికి తోడ్పడుతూ, సమస్త జీవులపట్ల దయ, ప్రేమ, కరుణలను చూపిస్తూ, విద్యుక్త్ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ విశ్వకల్యాణాన్ని కాంక్షిస్తే- ఏకాగ్రత సాధ్యమవుతుంది. అదే ‘ధ్యానం’. ధ్యానయోగాన్ని ప్రసాదించేది - జగన్మాత శరన్నవరాత్రి పూజ.
యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః ||
ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కు జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం... త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప. ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరం.
నవరాత్రులలో దేవిని నవ మూర్తులుగానూ, నవశక్తులుగానూ ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్ధిష్ట నిర్ణయంగా కనిపించదు. వరుస క్రమంలో మార్పులు ఉంటాయి. తిథి, నక్షత్రాలను బట్టి ఆనాటి రూపవిశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచరాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అంటే శృంగేరి పీఠంలో, విజయవాడ కనకదుర్గ దేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మూెత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆయా ప్రాంతాలవారీగా అమ్మవారి రూపాలు మారుతుంటాయి.
నవదుర్గలు :
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.
ధ్యానం :
యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం
యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా
యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం
నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ
ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక.
నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే ||
నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలుస్తుంది.
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది
నవదుర్గలు :
సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.
- ప్రథమం - శైల పుత్రీతి
- ద్వితీయం - బ్రహ్మచారిణీ
- తృతీయం - చంద్ర ఘంటేతి
- కూష్మాండేతి - చతుర్థకం
- పంచమం - స్కందమాతేతి
- షష్ఠం - కాత్యాయనీతి చ
- సప్తమం - కాలరాత్రీతి
- మహాగౌరీతి - చాష్టమం
- నవమం - సిద్ధిదా ప్రోక్తా
నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా... ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని వుంది.
మహా శక్తిస్వరూపిణి అయిన దుర్గా మాతని మనం అనేక రూపాలాలో కొలుచుకుంటాము. ఐతే వాటిలో ముఖ్యమైనవి 9 అవతారాలు. వారినే మనం నవదుర్గలని అంటుంటాం.
దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు. మాహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.
1. శైలపుత్రి :
నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు. కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.
2. బ్రహ్మచారిణి :
దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.
3. చంద్రఘంట :
దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.
4. కూష్మాండ :
సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.
5. స్కందమాత :
కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.
6. కాత్యాయని :
దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనిమాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.
7. కాళరాత్రి :
దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.
8. మహాగౌరి :
దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు. అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.
9. సిద్ధిదాత్రి :
దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత. ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులని సంపాదించాడని, అర్ధనారీశ్వరుడిగా పేరుపొందాడని దేవీపురాణంలో చెప్పబడింది. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.