Nala Damayanthi |
నల దమయంతి
పూర్వం నిషిధదేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తులలోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది.
ఒకనాడు నలుడు వానవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఆ హంస నలుది దగ్గర విదర్భదేశపు రాజు కూతురైన దమయంతి అందచందాలూ, గుణగణాలు వర్ణించింది. నలుడు దమయంతిని మోహించేటట్టు చేసింది.
ఆ తరువాత ఆ హంస విదర్భకు వెళ్లి నలుడికి చిక్కినట్టుగానే దమయంతికి చిక్కి ఆమె దగ్గర నలుడి అందచందాలు, గుణగణాలను పొగిడింది. దమయంతికి కూడా నలుడి మీద మొహం కలిగింది. ఈ హంస రాయభారం ఫలితంగా నల దమయంతులు ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఇంతలో విదర్భ దేశపురాజు తన కుమార్తె దమయంతికి స్వయంవరం చాటించాడు. ఆ చాటింపు విని నానాదేశాల రాజులు బయలుదేరి వచ్చారు. ఆఖరుకు స్వర్గం నుండి దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమా, వరుణులు కూడా రథాలెక్కి వచ్చారు. దమయంతిని చాలా రోజులుగా మోహించిన వాడు గనక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు.
దారిలో దిక్పాలకులు నలుణ్ణి కలుసుకుని అతన్ని పరీక్షించటానికి ఒక కోరిక చెల్లించమని కోరారు. దమయంతి తమలో ఎవరినైనా పెళ్లాడేందుకు నలుణ్ణి రాయబారం వెళ్లమన్నారు. మాట ఇచ్చాడు గనక నలుడు ఒప్పుకొని రహస్యంగా దమయంతి దగ్గరికి వెళ్లి దిక్పాలకులు కోరిక ఆమెకు తెలియచేశాడు. కానీ దమయంతి ఒప్పుకోలేదు. ఆమె నలుణ్ణి ప్రేమించింది.
స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకొని దమయంతి సభలోకి వచ్చింది. ఆచారం ప్రకారం ఒక చెలికత్తె ఆమెకు ప్రతి రాజును గురించి వర్ణించడం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజుని ధాటి ముందుకు రాసాగింది. ఇంతలో ఒక చోట చెలికత్తెకు వరుసగా అయిదుగురు నలమహారాజులు కనిపించాయి. అందులో నిజంగా ఒకడే నలుడు. మిగిలిన నలుగురూ ఇంద్రాగ్ని యమ వరుణులు.
ఈ అయిదుగురినీ చూడగానే దమయంతి దిగ్భ్రమ చెంది, నిజమైన నలుణ్ణి చూపమని దిక్పాలకులను ప్రార్థించింది. ఆమె అచంచల ప్రేమకు మెచ్చుకుని దిక్పాలకులు తమ యధార్థ స్వరూపాలు ధరించారు. దమయంతి పూలమాల నలుడి మెళ్లోవేసింది.
కొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు. కానీ కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయాడు. కట్టుబట్టలతో నల దమయంతులు అడవులు పట్టి పోయినారు. ఆ సమయంలో వారు అష్ట కష్టాలూ పడ్డారు. నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపోమన్నాడు. కానీ దమయంతి భర్తతో పాటు కస్టాలు పడటానికే నిశ్చయించుకున్నది. తన వెంట ఉండటంవల్ల దమయంతి కష్టాలు పడుతున్నదని, తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు ఒక రాత్రివేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయినాడు.
దమయంతి భర్త కోసం చాలా దుఃఖించింది. యీనో ప్రయాసలుపది ఆఖరుకు విదర్భ చేరుకున్నది. వెంటనే నలుణ్ణి వెతికించడానికి అన్ని వైపులా మనుషులను పంపించింది.
దమయంతిని విడిచిన తరువాత నలుడు అరణ్యంలో పోతూవుండగా ఒక పాము కరిచింది. ఆ విషయానికి అతని శరీరమంతా నల్లగా అయిపోయింది. అతను గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. ఈ అవకాశం చూసుకొని నలుడు, బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటలవాడిగా చేరాడు. నలుడు వంట చేయడంలో కూడా నేర్పరి. నలపాకం, భీమపాకం మాటలు వినేవుంటారు.
దమయంతి పంపినవారిలో ఒక బ్రాహ్మడు రుతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు. బాహుకుణ్ణి చూసాడు. అతను నలుడే అయివుంటాడని పసిగట్టాడు. ఈ వార్త తీసుకొని విదర్భ చేరాడు.
బాహుకుడు నలుడో కాదో తెలుసుకోవడం ఎలా? దమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది. నలుడికి “అశ్వ హృదయం” అనే విద్య తెలుసు. అతను గుర్రాలను వాయువేగంతో తోలగలడు. అందుచేత కాలవ్యవధి లేకుండా రుతుపర్ణుణ్ణి విదర్భకు రప్పించితే రథాన్ని తోలటానికి నలుడు పూనుకుంటాడు. ఈ ఉద్దేశంతో “దమయంతి తాను తిరిగి పెళ్లాడబోతున్నాననీ స్వయంవరానికి రావాల్సిందని రుతుపర్ణుడికి కబురు పంపింది.
మర్నాడే స్వయంవరం. రుతుపర్ణుడు ఎక్కడోవున్న విదర్భకు ఒక్క రోజులో ఎలా వెళ్తాడు? రాజు గారి విచారించడం చూసిన బాహుకుడు తాను సారధ్యం చేసి రుతుపర్ణుణ్ణి ఒక్క రోజులో విదర్భ చేరుస్తానని చెప్పాడు. తన భార్య మరొకరిని పెళ్లాడుతుందని విని నలుడికి పాపం చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి చూడటానికే అతను సారధ్యానికి ఒప్పుకున్నాడు.
బాహుకుడి సారద్యంవల్ల ఋతుపర్ణుడు సకాలానికి విదర్భ చేరుకున్నాడు. కానీ దమయంతి స్వయంవరం అబద్దమని, బాహుకుడే నలుడని రుజువు చెయ్యటానికే ఈ ఎత్తు వేశారని రుతుపర్ణుడు తెలుసుకున్నాడు.
ఇంద్రుడి దయ వాళ్ళ నలుడు తన పూర్వ రూపం సంపాదించాడు. పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించడంవల్ల అతన్ని ప్రజలు చంపేశారు. నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషధ దేశపు ప్రజలు అతని దగ్గరికి వచ్చి మళ్ళి ఎప్పటిలాగే రాజ్యం పాలించామని ప్రార్థించారు. నలుడు వారికోరిక ప్రకారం తిరిగి నిషధదేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు.