| వినాయక చవితిలో పత్రి ప్రాముఖ్యత, వివిధ రకాల పత్రి ఆకుల వివరణ |
వినాయకచవితి రోజు వినాయకునికి పెట్టే అనేక రకాల నైవేద్యాలతోపాటు ఆయన వద్ద ఉంచే పత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయన్ను మొత్తం 21 రకాల మొక్కలు, వృక్షాలకు చెందిన పత్రితో పూజిస్తారు. వినాయకుడికి పత్రి పెట్టి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.అందుకనే అందరూ ఆయనకు పత్రి పెడుతుంటారు.
- మాచీ పత్రం – మాచ పత్రి అన్నది తెలుగు పేరు. దీని ఆకులు చామంతి పువ్వు ఆకుల్లా ఉంటాయి. కానీ సువాసన వస్తాయి.
- దూర్వా పత్రం – గరికనే దూర్వా పత్రం అని పిలుస్తారు. ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి తెల్ల గరిక కాగా మరొకటి నల్ల గరిక. ఇవి గడ్డిజాతికి చెందిన మొక్కలు కాగా గణేషుడికి గరిక అంటే ఎంతో ఇష్టం.
- ఆపామార్గ పత్రం – దీన్నే ఉత్తరేణి అని కూడా అంటారు. ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు ముళ్లను కలిగి ఉంటాయి.
- బృహతీ పత్రం – దీన్ని ములక అని పిలుస్తారు. ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి చిన్న ములక కాగా రెండోది పెద్ద ములక. ఈ ఆకులు వంకాయ ఆకుల తరహాలో తెల్లని చారలతో గుండ్రని పండ్లతో దర్శనమిస్తాయి.
- దుత్తూర పత్రం – ఉమ్మెత్తనే దుత్తూర పత్రం అంటారు. ఇది వంకాయ జాతికి చెందిన మొక్క. ముళ్లు ఉంటాయి. వంకాయ రంగు పూలు పూస్తాయి.
- తులసి – తులసి ఆకుల గురించి చాలా మందికి తెలుసు. మహిళలు నిత్యం తులసి మొక్కకు పూజలు చేస్తారు. ఇవే మొక్క ఆకులను వినాయకుడి పత్రిలోనూ వాడుతారు.
- బిల్వ పత్రం – మారేడు ఆకునే బిల్వ పత్రం అంటారు. ఇవి మూడు ఆకులు ఒక ఆకుగానే ఉంటాయి. శివుడికి బిల్వ ఆకులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. వీటిని వినాయకుడి పూజలో వాడుతారు.
- బదరీ పత్రం – రేగు చెట్టు ఆకులనే బదరీ పత్రాలు అంటారు.
- చూత పత్రం – మామిడి చెట్టు ఆకును చూత పత్రం అంటారు. ఇండ్లకు తోరణాలు కట్టినట్లే మామిడాకును వినాయకుడి పూజకు ఉపయోగిస్తారు.
- కరవీర పత్రం – గన్నేరు ఆకులనే కరవీర పత్రాలు అంటారు. ఇవి తెలుపు, ఎరుపు, పసుపు రంగు పూలను పూస్తాయి.
- మరువక పత్రం – దీన్ని ధవనం, మరువం అని పిలుస్తారు. ఈ ఆకులు సువాసనను కలిగి ఉంటాయి. మహిళలు పూలలో అలంకరణ కోసం ఈ పత్రాలను వాడుతుంటారు.
- శమీ పత్రం – జమ్మి చెట్టు ఆకును శమీ పత్రం అంటారు. దసరా సమయంలో ఈ మొక్కలకు పూజలు చేస్తారు. ఈ మొక్క ఆకులను వినాయకుడి పత్రిలోనూ ఉంచుతారు.
- విష్ణుక్రాంత పత్రం – ఈ మొక్కకు నీలం, తెలుపు రంగు పూలు పూస్తాయి.
- సింధువార పత్రం – దీన్ని వావిలి ఆకు అని కూడా పిలుస్తారు. గణేషుడి పూజకు వాడుతారు.
- అశ్వత్థ పత్రం – రావి ఆకులను అశ్వత్థ పత్రం అని అంటారు. రావి చెట్టుకు పూజలు చేసినట్లుగానే దాని ఆకులను గణేషుడి పూజ కోసం ఉపయోగిస్తారు.
- దాడిమీ పత్రం – దానిమ్మ చెట్టు ఆకును దాడిమీ పత్రం అంటారు.
- జాజి పత్రం – మల్లె జాతికి చెందిన మొక్క సన్నజాజి. ఈ మొక్క ఆకులను వినాయకుడి పూజకు వాడుతారు.
- అర్జున పత్రం – మద్ది చెట్టు ఆకులను అర్జున పత్రం అని పిలుస్తారు. ఇవి మర్రి ఆకుల వలె ఉంటాయి. ఈ వృక్షాలు ఎక్కువగా అడవుల్లో పెరుగుతాయి.
- దేవదారు పత్రం – దేవదారు చెట్టు ఎత్తుగా పెరుగుతుంది. ఈ చెట్టు దేవతలకు ఎంతో ఇష్టం. ఆ చెట్టు ఆకులను వినాయకుడి పత్రిలో ఉపయోగిస్తారు.
- గండకీ పత్రం – ఈ మొక్క తీగ జాతికి చెందినది. గడ్డిలా ఉంటుంది. దీన్ని లతాదూర్వా మొక్క అని కూడా అంటారు. ఈ ఆకులను వినాయకుడి పూజలో వాడుతారు.
- అర్క పత్రం – జిల్లేడు మొక్క ఆకులను అర్క పత్రాలు అంటారు. తెల్లజిల్లేడు మొక్క ఆకులను వినాయకుడి పత్రిలో ఉంచుతారు.
శాస్త్రీయమైన కారణాలు : భాద్రపదమాసంలో వానలు పడుతూ, ఎక్కడికక్కడ చిత్తడిగా, బురదగా ఉంటుంది.గుంటల్లో నీళ్ళు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడంవల్ల ఇంట్లో వాతావరణం బాగుండి,సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది.
కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు. అంటే, పదిరోజులపాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం. తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో, చెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది. పత్రిలోని ఔషదగుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయి. ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు.
తొమ్మిది రోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదు! శాస్త్రీయంగా ఇది నిజమే. వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇది.