Aadi Shankaracharya |
అద్వైతమంటే?
వేదాంత ప్రతిపాదితమైన పరమాత్మ తత్వాన్ని అద్వైత సిద్దాంతం ద్వారా బోధిస్తారు. "బ్రహ్మసత్యం జగన్మిధ్య జీవోబ్రహ్మైవనాపర:” - కనిపించే ఈ సృష్టికి ఆధారభూతమైన తత్వం పరమాత్మ యని దానికన్నా వేరుగా రెండవది ఏదియును లేదని ఈ సత్యాన్ని గ్రహించే జీవుడు కూడా పరమాత్మ యొక్క స్వరూపమేనని చెప్పబడినది.
ఉదాహరణకు సముద్రంలోని అలలు సముద్రము కన్నా వేరుకాదు. రెండు పేర్లతో పిలిచినా, ఈ రెండింటికి కారణం జలమనే గ్రహించాలి. నీటియందు సముద్రము, అలలనే నామరూపాలు కల్పితములే. కనుక అవి అశాశ్వతములు.
సత్యమైనది, నాశనములేనిది జలమే. అలానే పరమాత్మ స్వరూపము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ - ఏకమేవ అద్వితీయం అని వేదాంత శాస్త్రం అద్వైత తత్వాన్నే బోధిస్తుంది. జ్ఞానమే మోక్షమునకు మూలము అనునది అద్వైత సిద్ధాంతము.