ఆచారాలు |
తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలలో మీకు తెలిసిన వింత ఆచారాలు, సంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా?
ఆచారం అనేది అసలు ఎప్పుడు పుడుతుంది? అది మనిషి నమ్మకం, విశ్వాసం నుండి పుడుతుంది. అందులో కొన్ని మూఢాచారాలు ఉంటే, మరికొన్ని వారసత్వంగా వచ్చే వంశాచారాలు ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మికపరమైన మత ఆచారాలు కూడా ఉంటాయి. ఏదేమైనా, ఏ సంప్రదాయంలో చూసినా సరే ఆచారం అనేది కీలకం. అయితే ఈ ఆచారాలు అనేవి చిత్ర విచిత్రంగా ఉన్నా సరే, ఒకరికి హానీ చేయకుండా ఉంటే చాలు. ఈ వ్యాసంలో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలలో భక్తులు లేదా ప్రజలు పాటించే వివిధ వింత ఆచారాల గురించి తెలుసుకుందాం.
- తూర్పు గోదావరి కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ప్రతీ సంవత్సరం ఆ గ్రామంలో జరిగే పోలేరమ్మ జాతరలో భాగంగా భక్తులు బోర్లా పడుకొని దున్నపోతుతో తొక్కించుకుంటూ ఉంటారు. అలా తొక్కించుకుంటే వారి కోరికలు తీరుతాయని నమ్ముతారు.
- తెలంగాణలోని జోగులాంబ గద్వాల్‌లోని మానవపాడు గ్రామంలో ప్రతీ యేటా గుర్రాలకు పూజలు చేస్తుంటారు. ఇలా పూజలు చేస్తే వర్షాలు పడతాయన్నది వారి నమ్మకం. పక్కి సాయిబుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఈ గుర్రాలకు మొక్కులు కూడా మొక్కుతూ ఉంటారు.
- అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పరిధికి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతీ సంవత్సరం అరవ వంశానికి చెందిన 8 ఏళ్ల బాలికతో శ్రీవారి వివాహం జరిపిస్తారు. ఇది తరతరాలుగా ఆ ప్రాంతంలో వస్తున్న ఆచారం.
- మన తెలుగు రాష్ట్రాలలో బుడగ జంగాల తెగకు చెందిన వారిలో ఓ వింత ఆచారం ఉంది. అదే కన్యాశుల్కం. దీన్ని వీరు లగ్గసిరి అని అంటారు. లగ్గసిరి అంటే పెళ్లి కొడుకు వధువుకిచ్చే కట్నం. ఓలీగా పిలిచే ఈ ఆచారం ప్రకారం, వివాహం నిశ్చమయ్యాక వరుడు 9 రూపాయలు వధువుకి ఎదురు కట్నంగా సమర్పించుకోవాల్సిందే. ఇందులో 4 రూపాయలు వధువుకు, మిగిలిన 5 రూపాయలు భవిష్యత్‌లో సమస్య వస్తే పరిష్కరించే ఐదుగురు కుల పెద్దలకు ఇస్తారు.
- కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఉగాది పండుగ తర్వాతి రోజు పిడకల సమరం పేరుతో ఒక ఆచారాన్ని పాటించడం దశాబ్దాల కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక ఓ చిత్రమైన కథ ఉంది. భద్రకాళి, వీరభద్ర స్వామిల ప్రేమకు వారి పెద్దలు అడ్డుపడ్డారని, ఈ క్రమంలో ఇరువురి కుటుంబీకులు ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ఈ జానపద కథ చెబుతోంది. ఆ కథకు గుర్తుగా ప్రతీ యేడు ఉగాది మరుసటి రోజు కైరుప్పుల గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోతారు. ఒకరు భద్రకాళి బంధువులు, మరొకరు వీరభద్రుడి బంధువులుగా నటిస్తారు.ఈ ఘట్టంలో భాగంగా పిడకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు.
- విశాఖ జిల్లాలోని ఆనందపురం పాలవలస గ్రామంలో గ్రామదేవతను రాళ్లతో పూజిస్తారు. ఈ దేవత పేరు రాళ్ల పోలమ్మ. రాళ్లను మాత్రం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించడం అనేది ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆచారం.
- అనంతపురం జిల్లా రొల్ల మండలం గంతగొల్లహట్టి గ్రామంలో ఇప్పటికీ ఓ వింత ఆచారం ఉంది. ఈ ఊరిలోని కాడుగొల్ల అనే తెగకు చెందిన వారు ఎవరైనా తమ ఇళ్లలో మహిళలు బాలింతలైతే, వారిని ఇంట్లోకి రానివ్వరు. దాదాపు 3 నెలలు ఊరి పొలిమేర అవతల పాక వేసి, అక్కడ ఉంచుతారు. వారిని ఎవరూ ముట్టుకోకూడదట. అందుకే ఈ ప్రాంత బాలింతలు ఎవరి సహాయం లేకుండా ఒకవైపు బిడ్డను చూసుకుంటూనే, తన వంట తాము చేసుకుంటూ తింటుంటారు.
- అనంతపురం జిల్లా కోడిపల్లి పొలిమేరలోని బట్ట భైరవేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు దేవుడికి నైవేద్యంగా పండ్లు, పూలతో పాటు గులకరాళ్లూ తీసుకెళ్తారు. దానికి నిదర్శనమే ఆలయ పరిధిలో పోగుబడిన పెద్ద గులకరాళ్ల కుప్ప.
- చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె మండలంలోని కురవపల్లెలోని ప్రజలు ప్రతీ యేటా సంక్రాంతి సంబరాలలో భాగంగా గొర్రెలకు, పొట్టేళ్ళకు అంగరంగ వైభవంగా వివాహాలు జరిపిస్తుంటారు. ఇలాంటి వివాహాలు జరిపిస్తే, పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం.
- కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. ఆ గ్రామ ప్రజలంతా ఉచ్చీరప్ప తాతను కులదైవంగా ఆరాధిస్తారు. దాదాపు 500 ఏళ్ల కిందట ఉచ్చీరప్ప తాత అనే యోగి ఈ గ్రామానికి వచ్చి ప్రజల కష్టాలను, సమస్యలను తీర్చారట. తర్వాత ఆయన జీవ సమాధి అయ్యారట. ఆయన గుర్తుగా గ్రామస్తులు తాతకు ఒక ఆలయం కట్టి, గౌరవ సూచకంగా ఆలయ ఆవరణలో రెండంతస్తుల మేడ నిర్మించారు. ఈ క్రమంలో గ్రామస్తులందరూ ఊరిలో డాబా ఇల్లు తప్పితే, ఇంటి మీద మరో మేడ నిర్మించుకోకూడదని తీర్మానం చేసుకున్నారు. అలా కడితే తాతను అగౌరవ పరిచినట్లు వారు భావిస్తారు. అందుకే ఆ కట్టుబాటును ఇప్పటికీ పాటిస్తుంటారు. అందుకే ఆ గ్రామంలో ఇప్పటికీ ఒక్క మేడ కూడా కనిపించదు.
- విజయనగరం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట పునికినివలస ప్రాంతంలో ఓ వింత ఆచారం ఉంది. ఈ గ్రామ ప్రజలు వర్షాలు పడి పంటలు బాగా పండాలని జాకరమ్మ తల్లికి మొక్కుకుంటారు. ఆమె కోసం మట్టికుండలో పాయసం వండి ఒక భాగం నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ భాగం భక్తులకు వడ్డిస్తారు. ఎలా వడ్డిస్తారంటే..? రాతికొండ పైనున్న రోడ్డు మీద విస్తళ్లు వేయకుండా నేల మీద పాయసాన్ని ముద్దలుగా పోసుకుంటూ పోతారు. నేల మీద పడ్డ పాయసాన్ని చేతులతో తాకకుండా భక్తులు నోటితో తినాలి.
- ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నువ్వులరేవు అనే ఊరిలో ఒక తెగకు చెందిన మత్స్యకార కుటుంబంలో ఓ వింత ఆచారం ఉంది. ఈ ఆచారం ప్రకారం వివాహ వేడుకలలో వరుడు తాళి కట్టాక, వధువు కూడా వరుడి మెడలో తాళి కడుతుంది.
- కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని ప్రజలు సంజీవరాయుడనే గ్రామదేవుడిని పూజిస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు ఆ దేవుడికి పొంగళ్లు వండి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఈ నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితులలో మహిళలు వండడం గానీ, ముట్టుకోవడం గానీ, తినడం గానీ చేయకూడదు. పురుషులు మాత్రమే నైవేద్యాన్ని వండి, స్వామి వారికి సమర్పించి, ఆ తర్వాత ప్రసాదంగా భుజించాలి.
- నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుంస గ్రామంలో ప్రతి ఏడాది హోలీ రోజును పురస్కరించుకొని గ్రామప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి, ఒకరిపై ఒకరు బలంగా పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఆ తర్వాత ఆలింగనం చేసుకుంటారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని 30 ఏళ్ల నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
- కడప జిల్లా పెందిళ్లమర్రి మండలం మాచనూరులో నివసిస్తున్న కొన్ని కుటుంబాలకు ఓ చిత్రమైన ఆచారం ఉంది. వివాహ వేడుకలో పాల్గొనే వరుడు చీర కట్టుకొని పెళ్లి కుమార్తెలా అలకరించుకొని పందిట్లోకి అడుగుపెట్టాలి. అదే వస్త్రధారణలో వధువుకి సారెను అందజేయాలి. అయితే ఈ ఆచారం ఆ ఇళ్లలో పెద్ద కుమారుడికి మాత్రమే వర్తిస్తుంది.
- కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరిలో శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. చిత్రమేంటంటే, ఆ గ్రామవాసులందరూ గిడ్డ ఆంజనేయస్వామి భక్తులే. అలా గ్రామంలో పుట్టే ప్రతి బిడ్డకు పేరు మొదట గిడ్డ ఉండాల్సిందే. గిడ్డయ్య, గిడ్డమ్మ, గిడ్డా౦జనేయ, గిడ్డరెడ్ది, గిడ్డేయ్యసామి, రామ గిడ్డయ్య, సీత గిడ్డెమ్మ.. ఇలాంటి పేర్లు ఆ గ్రామంలో సర్వసాధారణంగా వినిపిస్తాయి
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కడిమెట్ల గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. చెన్నకేశవ స్వామి వారిని కొలిచే వీరు ఆ ఊరిలో పాలు అమ్మితే దేవుడి శాపానికి గురికావాల్సి వస్తుందని బలంగా నమ్ముతారు. అందుకే ఆ ఊరిలో డైరీలు ఉండవు. ఎవరూ పాలు కూడా అమ్మరు. కానీ చిత్రమేంటంటే, వీరు పాలు కొనుక్కోవచ్చు. కానీ ఆ ఊరిలో కొనడానికి వీలులేదు. కనుక దూరమైనా సరే ఎర్రకోట, ఎమ్మిగనూరు వంటి ప్రాంతాలకు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, ఎవరికి వారు వెళ్ళి తమ కుటుంబానికి సరిపడే ఆవు లేదా గేదె పాలు కొనుగోలు చేసుకొని గ్రామానికి వస్తారు.
- ప్రకాశం జిల్లా పెద ఆరవీడు మండలం బి.చెర్లోపల్లి గ్రామంలో స్వర్ణగుమ్మా అనే ఇంటి పేరుగల కుటుంబాలకు ఓ వింత ఆచారం ఉంది. వీరు పెళ్లి వేడుకలలో వరుడికి ఆడపిల్ల మాదిరిగా చీరను అలంకరించి.. వధువుకి మగ పిల్లాడిలా పంచె, ధోవతి కట్టించి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. తర్వాత జమ్మిచెట్టు వద్దకు తీసుకెళ్లి పోలేరమ్మ, అంకాలమ్మ దేవతల ఆశీర్వాదాన్ని వధు, వరులకు అందజేస్తారు.
- అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలానికి చెందిన తలారి చెరువు అనే గ్రామంలో ఓ ఆచారం ఉంది. ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి ముందు రోజు అర్ధరాత్రి ఆ ఊరిలో కరెంట్ సరఫరా నిలిపి వేస్తారు. తర్వాత గ్రామస్తులందరూ ఇళ్లు ఖాళీ చేసేసి సమీపంలోని దర్గా వద్దకు చేరుకుంటారు.ఇలా చేరుకోవటాన్ని వారు 'అగ్గిపాడు' గా పేర్కొంటారు.అక్కడే వంటచేసుకుంటారు. మరుసటి రోజు రాత్రి 7 గం.లకు వరకూ వారు దర్గా వద్దే ఉంటారు. ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు కానీ దీపం వెలిగించరు. ఊరు మొత్తం అంధకారంలోనే ఉంటుంది. ఠంచనుగా రాత్రి 12 గంటలకు మాత్రం కరెంట్ వస్తుంది. అప్పుడు గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి అందరూ ఇండ్లలోకి ప్రవేశిస్తారు.కొన్ని వందల సంవత్సరాల నుండీ ఈ ఆచారం వస్తుంది.
- తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని కందుకూరు గ్రామంలో ఒక కొండపైన కొండమయి దేవత ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చే గ్రామస్థులు తేళ్ళని దేవతగా భావిస్తూ కొండమయి దేవతగా కొలుస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇక్కడ నాగుల పంచమి రోజున ఈ ఆలయంలో తేళ్ల ఉత్సవం జరుగుతుంది. తేళ్లకు కూడా ఈ సందర్భంగా భక్తులు నైవేద్యంగా అందిస్తారు.
___బాబు కొయిలాడ - పాత్రికేయుడు & తెలుగు పండిత్