Sri Kanaka Durga Amma |
- ప్రఖ్యా మధు
శ్రీ కనక దుర్గ గుడి - కొండమీద రావి చెట్టు
ఆంధ్ర దేశంలో ప్రఖ్యాతి గాంచి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది భక్తులకు మార్గదర్శకంగా వున్న అమ్మవారు శ్రీ కనకదుర్గ. విజయవాడలో దేవాలయం వుందా, లేక ఆమే కొలువుందా అనిపిస్తుంది. కొన్ని లక్షల మంది భక్తుల అనుభవాలు వారి అనుభూతులు రాస్తే ఎన్నిగ్రంధాలైనా చాలవు. ఈ దేవాలయాన్ని గురించి, దేవిని గురించి కూడా అనేక గాధలు ప్రచారంలో వున్నాయి.
ఈ దుర్గను బౌద్ధులు జ్ఞాన ప్రదాయిని తారగా ఉపాసించారని కొందరంటారు. ఈమె బెజ్జమహాదేవి అనే జైన దేవతగా పూజించబడిందని కొందరు చెపుతారు. పసుపు వర్ణంతో వుంది కనక ఈమె తంత్రంలో అత్యంత శక్తి వంతమైన దశమహావిద్యల్లో ఒకటై, శత్రు సంహారిణి బగళాముఖి అని భావించి సాధనలు చేస్తారు. ఇక అలంకార రూపాలు అనేక దేవతా మూర్తులుగా ఆమెను దర్శించుకుని తరించ వచ్చు. ఈమెను స్వర్ణకవచాలంకృత దుర్గగా తీర్చి దిద్దుతారు, కనక దుర్గగా కొనియాడుతారు. ఏది ఎమైనా అమ్మవారి మూర్తిని కొంతకాలం తాంత్రికులు అర్చించినట్లు, బలులతో పూజించినట్లు తెలుస్తోంది. రాజులు యుద్ధములకు వెళ్ళేముందు ఈ విజయదుర్గను దర్శించుకుని ఆశీస్సులు పొందేవారని తెలుస్తోంది.
దుర్గ మూల విగ్రహం ఎదురుగా ఆ దేవాలయ ప్రాంగణంలోనే వున్న రావి చెట్టు దివ్యశక్తులు కలదిగా కొందరు దివ్యానుభూతులు కలిగిన యోగులు భావిస్తున్నారు. అసలు దేవి భాగవతంలో సృష్టి ఆరంభంలో మహావిష్ణువు వటపత్రం మీద శయనించి వున్నాడు కదా! అప్పుడు అనుకున్నాడుట నేనెవర్ని? నన్ను సృష్టించినదెవరు? అని. అప్పుడు అమ్మవారి దివ్య వాణి వినిపించింది,"ఖల్విదమేవాహం" అని. ఇదంతా నేనే సృష్టించాను అని. అసలు ఆ వట పత్రం ఎలావచ్చింది అని అనుమానం వస్తుంది? సృష్టి అంతా జలమయమై వుంటే వట వృక్షం (లాటిన్లో ఫికస్ రెలిజియోసా అంటారు) ఎక్కడవుంది? అందుకు భూమి లేదుకదా? అని అనుమానం వస్తుంది. దీనికి జవాబు భగవత్గీతలో వుంది.
ఊర్ధ్వ మూలం అధః శాఖం
అశ్వత్థం ప్రాహుర్ అవ్యయం
చందాంసి యస్య పర్ణని
యస్తం వేద స వేదవిత్ ||
-భగవత్గీత
నారాయణుడు పడుకున్న ఆ వటపత్రం మామూలు రావి చెట్టు ఆకు కాదు. ఏ వటవృక్షానికైతే మూలం పైన వుండి, కొమ్మలు ఇంకా ఆకులు కిందకి వున్నాయో ఆ వటవృక్షం అన్నమాట. దీని ఆధ్యాత్మిక అర్ధం ఇలా చెప్పారు. పైన దేవతాలోకాలలో ఉత్పన్నమై కిందిలోకాలలోకి వ్యాపించిన మానవ చైతన్య వృక్షం అని ఒక అర్ధం, ఊర్ధ్వస్థిత పరబ్రహ్మ మూలమై జగత్వ్యాపితమై, వేదవేదాంగములచే కొనియాడబడుతున్న 'విద్ ' అనే ధాతుమూలమైన చిత్చక్తిమయమైన బ్రహ్మ జ్ఞానం అని ఇంకో అర్ధం. ఏమైనా నారాయణుడు ఆ పత్రం మీద పడుకుని మొదటిసారి అమ్మ మాటని విన్నాడు.
వటవృక్షం ప్రశస్తమైంది. వటవృక్షం కిందే బుద్ధుడికి కూడా జ్ఞానోదయమైంది. నేటికి మహాబోధిలో ఆ వృక్షాన్ని బుద్ధజ్ఞానస్వరూపంగా అర్చిస్తారు. ఒక్క ఆకుకూడా నేల మీద పడివుండకుండా వాటిని తీసి భద్రపరుస్తారు. అలాంటి దివ్య వృక్షాలు దేవతా స్థానాలు. కొద్ది రోజులు పూర్తిగా వృక్షంకిందే వుండి జపం చేస్తే దేవతా దర్శనమో, స్వప్న దర్శనమో అవుతుందని మంత్ర శాస్త్రాలు చెపుతున్నాయి. రావి చెట్టునాశ్రయించి బ్రహ్మ రాక్షసులు వుంటారని కధల్లో అంటుంటారు. కాని తంత్రంలో రావి చెట్టు ప్రాశస్త్యం ఇంతా అంతా కాదు. ప్రత్యేకంగా యక్షిణి సాధనలు ఆ చెట్టుకిందో, ఆ చెట్టు కొమ్మమీదో కూచుని చేస్తారు. దివ్యశక్తి సంచాలితము, అతీంద్రియ జ్ఞాన ప్రదానము, సిద్ధ మంత్ర స్వరూపము అయిన విద్యుత్ జిహ్వ అని పిలవబడే వటయక్షిణి ఉపాసనని రావి చెట్టుకింద చేయవచ్చును. అది దొరకని వారు 'ఊర్ధ్వ మూలమధః శాఖమైన ' అశ్వద్ధవృక్షాన్ని స్మరిస్తూ చెయ్యవచ్చునని ఆ అమ్మవారే చెపుతున్నారు. ఇంకా ఉడ్ఢీశ తంత్రంలో కొన్ని విశేషాలున్నాయి.
వటయక్షిణి మంత్రం తంత్ర గ్రంధాల్లో వుంది. సాధకులు గురుముఖతః దీన్ని పొంది ప్రకృతిలో నిబిడీకృతమైన దివ్య ప్రచోదనాలని దర్శించగలరు, అదృశరూపులైన యోగులని దర్శించగలరని కొన్ని పురాతన గ్రంధాలలో వచించడం జరిగింది.
ఓం శ్రీం ద్రీం వటవాసిని యక్ష కుల ప్రసూతే వట యక్షిణి ఏహ్యేహి స్వాహా ||
'ద్రీం ' అన్నది వటయక్షిణి మూల బీజాక్షరం అన్నమాట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బైబిల్లో కూడా ఆడం, ఈవ్ ల కధలో ఒక వృక్షం ఉంటుంది, కాల సర్పం ఆ పండుని తినమని చెపుతుంది. అన్నిటికన్న మన వైజ్ఞానిక శాస్త్రంకూడా వృక్షాలలో ప్రాణం వుంది అంటుంది. విలువైన ఈ వైజ్ఞానిక విషయాన్ని ప్రపంచానికందించినది సర్ జగదీష్ చంద్రబోస్ కావడం ఆయన మన భారతీయుడు కావడం మనకి గర్వకారణం.
మొక్కల్లో ప్రాణం వుంది అంటే తులసికి దీపం పెట్టినప్పుడు, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసినప్పుడు, ఔదుంబరానికి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అనిపిస్తుంది ఎక్కడో, ఏ మూలనించో మనమెరుగని ఆ చెట్టు మస్తిష్కంలోంచి మనని అది ఆశీర్వదిస్తోందేమోనని!
మంత్రసిద్ధికి మూడు వస్తువులు ముఖ్యంగా సహాయం చేస్తాయని చెపుతున్నారు. మణి, మంత్రం, ఔషధం. మణి అంటే ఆ దేవతకి ఇష్టమైన రత్నాన్ని దగ్గరుంచుకోవడం. దుర్గనుపాసించేవారు సాధారణంగా గోమేధికాన్ని వాడతారు. జపమాలకు మేరువుగా గోమేధికాన్ని వుంచవచ్చు,లేదా ధరించ వచ్చును. గణపతి భక్తులు పగడాన్ని, సరస్వతి అనుగ్రహానికి పచ్చని, కాళికి నీలాన్ని, లక్ష్మికి పుష్యరాగాన్ని అదే విధంగా వాడవచ్చును. ఏదైన వృక్షాల వద్ద జపం చేయ్యడం మంచిది కనక కొందరు సన్యాసులు అరణ్యాలను ఎన్నుకొంటారు. వనదుర్గ ఉపాసనని అడవులలోనే చేస్తే శీఘ్ర ఫలప్రదం అని చెపుతున్నారు. అయితే అడవుల్లో నిజం పులులు అవీ ఉంటాయి కనుక, మన ధ్యానాన్ని భంగం చేయకలవు కనుక, ధ్యాన మందిరంలో ఏదైన రావి చెట్టు చిన్న కొమ్మనో ఆకులనో వుంచుకుని జపం చేసుకో వచ్చును అని గురువులు చెపుతున్నారు. శివానుగ్రహానికి బిల్వ పత్రాలతో పూజ, నాగమల్లి పూలతో పూజ అందుకే అత్యంత సిద్ధిప్రదమైనవి. కృష్ణునికి తులసిమాలలు, కాళికి మందారమాలలు వేయడం ఔషధరూపమైన మంత్రసిద్ధి కోసమే.
మళ్ళీ వటవృక్షం దగ్గరకొస్తే, విజయవాడలో ఇంద్రకీలాద్రిపైన రావి చెట్టుకింద అపరాజితాదేవి విగ్రహం వుంది అని ఎక్కువమంది గమనించక పోవచ్చును. ఆమె విజయస్వరూపం, సాధకులకు ఆమె దర్శనం రక్షాకరం, అనుగ్రహప్రదం అని దేవిఉపాసకులైన పీఠాధిపతులు చెప్పడం జరిగింది. ఆ దేవికి నిమ్మకాయల మాల, తమలపాకుల మాలతో అర్చిస్తారు. అనుగ్రహాన్ని పొంది దుర్గ గుడిలో అక్కడే ధ్యానం చేస్తారు. విజయవాడలో అమ్మవారి దర్శనం అయ్యాక బయటకి వచ్చేముందు 'పునర్దర్శన యోగ్యతా ప్రాప్తిరస్తు ', అని వుంటుంది. శారదాజ్ఞాన రూపిణియైన ఆ దుర్గని మళ్ళీ దర్శించగల యోగ్యతని పవిత్రమైన మనసుని, పుణ్యాన్ని సాధించ ప్రయత్నించమని దాని అర్ధం.
వటపత్రాన్ని గురించి చెప్పినప్పుడు ఒక అద్బుత దివ్యశక్తిని కూడా ప్రస్తావించవలసి ఉంది. ఆమే వటపత్ర కాళి. ప్రళయకాల హాలహలంతో సృష్టి అల్లలాడుతుంటే శివుడు తాగిన కాలకూటవిషంలోంచి ఉద్భవించిన వటపత్ర కాళిని, తమిళనాడులో కరుమారియమ్మన్ (ది మదర్ ఆఫ్ బ్లాక్ రైన్) అని పిలుస్తారు. ఆమె వటవృక్షం కింద కూచుని, కుండలినిశక్తి రూపమైన సర్పం కిరీటంగా, పాము పుట్టముందు కూర్చుని ఉంటుంది. పిల్లలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ అమ్మవారి కరుణ, శక్తి రెండు వర్ణానాతీతమే. ఒకసారి ధ్యానించినా, పూజించినా, దర్శించినా భక్తులని ఎల్లకాలం కనిపెట్టుకునే దేవతగా ఈమెను యోగులు గుర్తించారు. పెద్దైనా చిన్నైనా అనారోగ్యంతో బాధపడే పిల్లలకోసం ఈమెను పూజిస్తే త్వరగా ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. మారియమ్మన్ దేవాలయాలు భారతదేశంలోనే కాక సింగపూర్, మలేషియాలలో కూడా వుండడం గమనార్హం.
ఆమె మంత్రం ఇలా వుంది.
ఓం శ్రీం కాళి వటపత్ర కాళి ఫట్ స్వాహా |
ఈ మంత్రాన్ని నిస్స్వార్ధంగా అందరి ఆరోగ్యాన్ని ఆశించేవారు జపంచేయ వచ్చును, ఎవరికైనా మేలు జరగాలని కోరవచ్చును. ఇది అమావాస్యనాడు కాని, శనివారంగాని, పంచమి నాడు కాని ప్రారంభిస్తారు. గురు అనుగ్రహంతో చేస్తే మరీ మంచిది. ఇంద్రకీలాద్రికి, కృష్ణకి అన్నిటికి మించి అక్కడున్న కనక దుర్గాశక్తికి పాదాభివందనములు.