గురు పౌర్ణమి |
Guru Purnima - ఆది గురువు ఆవిర్భవించిన రోజు
ఒక మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకొనే ప్రక్రియలో అతని వెనుక ఉండి ముందుకు నడిపించేది గురువే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ:, పితృదేవోభవ:, ఆచార్యదేవోభవ: తరువాత అంతటి మహోన్నత స్థానాన్ని పొందేది గురువే. అలాంటి గురువులను స్మరించుకునే రోజే గురు పౌర్ణమి.
'గు' అంటే అంధకారం, 'రు' అంటే తొలగించడం. అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ స్వరూపం అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలమైనది మన భారతదేశం. గురువులు దైవంతో సమానంగా, శిష్యులు బిడ్డలకంటే మిన్నగా చూసే మన హిందూ మతంలో గురు స్మరణ చేస్తే త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.
ఆది యోగి అయిన పరమేశ్వరుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేసాడని శివపురాణం చెబుతోంది. ఇదే రోజున దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ దత్త చరిత్రలో ఉంది. ఇక సత్యవతీ, శంతనులకు జన్మించిన కృష్ణ ద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, రచించి వేద వ్యాసుడయ్యాడు. మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించి మనకు ఆధ్యాత్మిక వారసత్వం అందించిన ఆది గురువు వ్యాసుడి పుట్టిన రోజిది. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాడ పౌర్ణమి రోజు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.
లౌకిక, భౌతిక విషయాల్లో కంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక, ఆదిదైవిక విషయాల్లో మన జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించే గురువులకు ఈ రోజున గురు పూజ చేస్తారు. ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేల మంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు. గ్రుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించలేడు. భగవంతుణ్ణి తెలుసుకున్న గురువు మాత్రమే, పరమాత్ముని గురించి ఇతరులకు బోధించగలడు. మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ఉపదేశకుడు లేదా గురువు ఉండాలి. నిజమైన గురువును విశ్వాసముగా అనుసరించేవాడు గురువుగానే మారిపోతాడు. ఎందుకంటే శిష్యుడిని తన స్వీయ సిద్ధి స్థాయికి పెంచడానికి గురువు సహాయం చేస్తాడు. అందుకే గురు పౌర్ణమి రోజున శంకరాచార్యుల వారు, దత్తాత్రేయుడు స్వామి, షిరిడి సాయిబాబా ల ఆలయాలను దర్శించుకోవడానికి ఎంత ప్రాధాన్యమిస్తారో తమ గురువులను సత్కరించుకోవడానికి వారి ఆశీస్సులు తీసుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు.
ఎందుకంటే దైవమైన చూపలేడు మంచి గురువుని మంచి గురువు అయితే చూపగలడు దేవదేవుని.